యుక్రెయిన్‌: బుచా నగర వీధుల్లో ఉన్నవన్నీ ఫేక్ డెడ్‌బాడీలేనా? రష్యా వాదనల్లో నిజమెంత? - BBC Reality Check

యుక్రెయిన్, రష్యా

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, బీబీసీ రియాలిటీ చెక్
    • హోదా, బీబీసీ మానిటరింగ్

రష్యా-యుక్రెయిన్ యుద్ధంలో బాగా చితికిపోయిన నగరాల్లో బుచా ఒకటి. రాజధాని కీయెవ్‌కు వెలుపల ఉన్న బుచా పట్టణంలో భీకర పోరు సాగింది. వీధుల్లో చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలు, ధ్వంసమైపోయిన యుద్ధ ట్యాంకులు, వాహనాలు, తిండి, నీరు లేక ఇబ్బందులు పడుతున్న స్థానికులు.. నగరమంతా అంధకారం అలుముకుంది.

రష్యా దళాలు బుచా నుంచి వైదొలగిన తరువాత, వీధుల్లో పడి ఉన్న మృతదేహాల చిత్రాలు బయటికొచ్చాయి. రోడ్లపై శవాలను చూసినట్టు మీడియా జర్నలిస్టులు కూడా చెబుతున్నారు.

కనీసం 20 మృతదేహాలను చూశామని ఏఎఫ్‌పీ వార్తా సంస్థ రిపోర్టర్ తెలిపారు. 280 మృతదేహాలను సామూహిక ఖననం చేశామని నగర మేయర్ చెప్పారు.

ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ "బుచాలో పౌరుల మరణాలకు సంబంధించిన ఫొటోలపై" స్వతంత్ర దర్యాప్తుకు పిలుపునిచ్చారు.

హెచ్చరిక: ఈ కథనంలో కనిపించే ఫొటోలు మిమ్మల్ని కలవరపెట్టవచ్చు.

బుచాలో రష్యా "ఉద్దేశపుర్వకంగా మారణహోమానికి" పాల్పడిందని యుక్రెయిన్ ఆరోపించింది.

అయితే, "బుచాలోని అకృత్యాలు కీయెవ్ ఆడిన నాటకం" అని చెబుతూ తమపై వచ్చిన ఆరోపణలను ఖండించింది రష్యా. బుచాలో మరణాలకు సంబంధించిన ఫుటేజీల గురించి నిరాధారమైన వాదనలు చేసింది.

వాటిల్లో నిజమెంతో బీబీసీ పరిశీలించింది.

వీడియో క్యాప్షన్, రష్యాకు లొంగేదేలే: యుక్రెయిన్ అధ్యక్షుడు

వాదన: 'నకిలీ శవాలు'

రష్యా సైన్యం వెనక్కు మరలిన తరువాత, ఒక కారులో వెళుతూ తీసిన వీడియోలో రోడ్డుకు ఇరువైపులా మృతదేహాలు కనిపించాయి.

అయితే, ఇదే వీడియోను స్లో చేసి రష్యా అనుకూల అకౌంట్లు సోషల్ మీడియాలో షేర్ చేశాయి. రోడ్లపై కనిపించిన మృతదేహాల్లో ఒక దాని చేయి కదిలిందని పేర్కొన్నాయి.

కెనడాలోని రష్యా రాయబార కార్యాలయం ఈ వీడియోను ట్వీట్ చేస్తూ "బుచాలో ఫేక్ శవాలను చూపిస్తూ తీసిన బూటకపు వీడియో" అని రాసింది.

ఈ వీడియో అంత స్పష్టంగా లేదు కానీ, నిశితంగా పరిశీలిస్తే, కదులుతున్నట్టు కనిపించినది నిజానికి చేయి కాదు. కారు ముందు అద్దాలకు దిగువున కుడివైపున ఒక చిన్న మార్కు లాంటిది ఉంది. అదే కదులుతున్న చేయిగా కనిపిస్తోంది. అది వర్షపు నీరు లేదా మట్టి కావొచ్చు.

అలాంటి ముద్రలు అద్దాల మీద ఉన్నట్టు ఈ వీడియోలో మరొక పాయింట్‌లో కూడా కనిపించాయి.

ఇదే వీడియోలో మరొకచోట, ఎరుపు, పసుపు పలకలతో కట్టిన పేవ్‌మెంట్‌ పక్కనే ఒక మృతదేహం కనిపిస్తోంది. కారు వెళుతున్నప్పుడు కుడివైపు అద్దంలో ఇది కనిపిస్తోంది.

అయితే, ఆ మృతదేహం లేచి కూర్చున్నట్టు కనిపిస్తోందని రష్యా అనుకూల అకౌంట్లు పేర్కొన్నాయి.

యుక్రెయిన్, రష్యా

ఫొటో సోర్స్, UKRAINE DEFENCE MINISTRY

కానీ, వీడియోను స్లో చేసి చూస్తే అసలు విషయం అర్థమవుతుంది. కారుకు రెండు వైపులా ఉండే అద్దాలలో (రియర్ వ్యూ మిర్రర్స్) దగ్గరవుతున్న కొద్దీ దృశ్యాలు వంగినట్టు లేదా రూపం మార్చుకున్నట్టు కనిపిస్తాయి.

కారు ఆ మృతదేహాన్ని సమీపించినప్పుడు, ఆ శరీరం, వెనుక ఉన్న ఇళ్లు కూడా వంగినట్టు కనిపిస్తున్నాయి. దాన్నే వీళ్లు 'లేచి కూర్చుంది' అని చెబుతున్నారు.

ఇంటర్నెట్‌లో ఇలాంటి వీడియోలు చాలా ఉన్నాయి. రియర్ వ్యూ మిర్రర్‌లో దృశ్యాలు వంగినట్టు కనిపించే వీడియోలు యూట్యూబ్‌లో చూడవచ్చు.

ఏప్రిల్ 2న సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియోలోని ఈ రెండు మృతదేహాలను, ఏప్రిల్ 3న గెట్టీ ఇమేజెస్, ఏఎఫ్‌పీ అందించిన హై రిజల్యూషన్ ఫొటోలను పోల్చి చూసింది బీబీసీ.

మొదటి మృతదేహం రోడ్డు పక్కన వెల్లకిలా పడి ఉంది. పక్కనే ఉన్న పేవ్‌మెంట్‌పై కొంత మేర తారు రోడ్డు, మరికొంత మేర గడ్డి ఉంది.

ఓ వారగా గోడ పక్కన సిల్వర్ రంగు కారు, డిక్కీ తెరిచి ఉంది. అదే కారు, పేవ్‌మెంట్, ఫెన్స్ అన్నీ గెట్టీ/ఏఎఫ్‌పీ అందించిన ఫొటోల్లో కూడా కనిపిస్తున్నాయి.

రెండవ మృతదేహం బ్లాక్ జాకెట్ వేసుకుని ఉంది. కుడి భుజానికి రక్తంతో తడిసిన టోర్నికీట్ లేదా బ్యాండేజీ లాంటిది ఉంది.

మృతదేహం ఓ పక్కకు తిరిగి ఉంది. ఎరుపు, పసుపు పలకలు ఉన్న పేవ్‌మెంట్‌కు పక్కనే ఉంది. అక్కడే కాఫీ రంగు ఫెన్స్ ఒకటి సగం విరిగి ఉంది. గెట్టీ/ఏఎఫ్‌పీ పబ్లిష్ చేసిన ఫొటోల్లో కూడా ఇవన్నీ కనిపిస్తున్నాయి.

యుక్రెయిన్, రష్యా

ఫొటో సోర్స్, Empics

యుక్రెయిన్, రష్యా

ఫొటో సోర్స్, BBC/GETTY

వాదన: శరీరాలు 'బిగుసుకుపోలేదు'

"యుక్రెయిన్ ప్రభుత్వం చూపిస్తున్న ఫొటోల్లో మృతదేహాలు నాలుగురోజులైనా బిగుసుకుపోకుండా ఉండడం చాలా ఆందోళన కలిగించే విషయం" అంటూ రష్యా విదేశాంగ శాఖ ట్వీట్ చేసింది.

యుక్రెయిన్ ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం, మార్చి 31 తెల్లవారుజామున రష్యా దళాలు బుచా నుంచి వైదొలిగాయి.

కానీ, మార్చి 30నే వెనక్కు మరలినట్టు రష్యా చెబుతోంది.

సాధారణంగా చనిపోయిన తరువాత కొన్ని గంటలకు మనిషి శరీరం బిగుసుకుపోతుంది.

అయితే, కొన్ని గంటల్లో కాకుండా నాలుగు రోజుల తరువాత శరీరం బిగుసుకుపోయే అవకాశం ఉందా అని ఒక ఫోరెన్సిక్ పాథాలజిస్ట్‌ని మేం అడిగాం.

కొసావో, రువాండాతో సహా పలు ప్రాంతాల్లో యుద్ధ నేరాల పరిశోధనలపై ఈ పాథాలజిస్ట్‌ పనిచేశారు. తన పేరు బయటపెట్టవద్దని ఆ వ్యక్తి కోరారు.

నిజానికి నాలుగురోజుల తరువాత శరీరాలు బిగుసుకుపోవడం తగ్గుతుందని పాథాలజిస్ట్ తెలిపారు.

రష్యా చేసిన మరో వాదన ఏమిటంటే, మృతదేహాలపై "చావుకు సంబంధించిన గుర్తులు లేవు" అని అదే ట్వీట్‌లో పేర్కొంది.

వారి ఉద్దేశమేమిటో బోధపడలేదు కానీ, పాథాలజిస్ట్ చెప్పిన వివరాల ప్రకారం, తుపాకీ గుళ్లకు లేదా మరే ఇతర హింసాత్మక చర్యల వలన చనిపోయిన వారి మృతదేహాలు అన్నీ ఒకేలా కనిపించవు. ఎంత దూరం నుంచి కాల్చారు, హింస ఎలా జరిగింది లాంటి అనేక అంశాలపై మృతదేహం కనిపించే విధానం మారుతుంది.

అన్నిసార్లూ రక్తం మడుగులో ఉన్నట్టు కనిపించకపోవచ్చు. రక్తం శరీరం కింద అంటుకుపోయి ఉండొచ్చు లేదా బట్టల్లో ఇంకిపోయి ఉండొచ్చు, ముఖ్యంగా చలికాలంలో ఎక్కువ దుస్తులు ధరించి ఉన్నప్పుడు.

చనిపోయిన తరువాత రక్త ప్రసరణ ఆగిపోయి శరీరం ఎరుపు లేదా ఊదా రంగులోకి మారుతుందన్నది ఆ ట్వీట్ ఉద్దేశం కావొచ్చు.

అయితే, కింద పడి ఉన్న మృతదేహంలో రంగు మారడం లేదా రక్తం మడుగు ఒక ఫొటోలో కనిపించకపోవచ్చు.

యుక్రెయిన్, రష్యా

ఫొటో సోర్స్, Getty Images

వాదన: 'స్థానికులెవరూ ఎలాంటి హింసకూ గురి కాలేదు'

బుచా నగరాన్ని రష్యా ఆక్రమించుకున్న సమయంలో 'స్థానికుల్లో ఏ ఒక్క వ్యక్తీ హింసకు గురి కాలేదని' రష్యా రక్షణ శాఖ పేర్కొంది.

అయితే, ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న కథనాలను, ఈ వాదనకు పొంతన కుదరట్లేదు.

రష్యా దళాలు అయిదుగురు వ్యక్తులను చుట్టుముట్టి, ఒకరిని చంపేశాయని ఒక స్థానిక టీచరు మార్చి 4న హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్థకు తెలిపారు.

రష్యన్ ఇన్వెస్టిగేటివ్ వెబ్‌సైట్ 'ది ఇన్‌సైడర్‌'తో మాట్లాడిన స్థానికులు కూడా ఇలాంటి విషయాలే చెప్పారు.

"ఇవి భయంకరమైన రోజులు. మీ ఇళ్లు, వాకిళ్లు, మీ జీవితాలు మీవి కాని రోజులు. కరంట్, గ్యాస్, నీళ్లు లేవు. ఇళ్ల నుంచి బయటకు రావడం అసాధ్యం. వస్తే తుపాకీ తూటాకు బలైపోవడమే" అని బుచా నివాసి క్రిస్టీనా 'ది ఇన్‌సైడర్‌'తో చెప్పారు.

రషా సైనికులు ఒక క్రమపద్ధతిలో ఇళ్ల తలుపులు బద్దలుగొట్టుకుని లోపలికి చొరబడ్డారని, ఆహారం, విలువైన వస్తువులు దోచుకున్నారని, నివాసితులను బలవంతంగా సెల్లార్లలోకి నెట్టారని స్థానికులు బీబీసీతో చెప్పారు.

బుచా నుంచి తమ దళాలు మార్చి 30నే వెనక్కు మరలాయి కానీ, రోడ్ల పక్కన మృతదేహాలను చూపిస్తున్న "వీడియో యుక్రెయిన్ భద్రతాదళాలు, మీడియా ప్రతినిధులు అక్కడకు చేరిన నాల్గవ రోజు వరకు బయటపడలేదని" రష్యా రక్షణ శాఖ ఆరోపించింది.

అయితే, ఏఎఫ్‌పీ లాంటి మీడియా సంస్థలు ఏప్రిల్ 2వ తేదీనే మృతదేహాల ఫొటోలను పబ్లిష్ చేశాయి.

ఏప్రిల్ 1 నుంచి ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం మేం గమనించాం.

రిపోర్టింగ్: జాక్ హార్టన్, షాయన్ సర్దారిజాదే, రేచల్ ష్రాయెర్, ఓల్గా రాబిన్సన్, అలిస్టెయిర్ కోల్‌మన్, డేనియేలే పలుంబో.

వీడియో క్యాప్షన్, యుక్రెయిన్: యుద్ధం మొదలై నెల రోజులు దాటినా వెనక్కి తగ్గేదే లేదంటున్న సైన్యం

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)