రష్యా నుంచి ఇండియా ఆయిల్ కొనుగోళ్లు ఎందుకు పెంచింది - బీబీసీ ఫ్యాక్ట్ చెక్

ప్రపంచ వ్యాప్తంగా ఆయిల్ ధరలు పెరుగడం భారత్ ను కలవర పెడుతోంది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రపంచ వ్యాప్తంగా ఆయిల్ ధరలు పెరుగడం భారత్ ను కలవర పెడుతోంది
    • రచయిత, శ్రుతి మేనన్
    • హోదా, బీబీసీ రియాల్టీ చెక్

చమురు దిగుమతుల మీద ప్రపంచ దేశాలు ఆంక్షలు విధించడంతో రష్యా కొత్త మార్కెట్‌ల కోసం వెతుకుతోంది. భారత్ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని చవక ధరల్లో రష్యా నుంచి ఇంధనాన్ని దిగుమతి చేసుకునే పనిలో పడింది.

అయితే, ఇలా చమురు దిగుమతి చేసుకోవడం ఆంక్షలను ఉల్లంఘించడం కాకపోయినా, ఇది పరోక్షంగా యుక్రెయిన్ ఆక్రమణ విషయంలో రష్యాను సమర్ధించడమేనని అమెరికా అంటోంది.

ఇండియాకు ఆయిల్ ఎక్కడి నుంచి వస్తుంది

అమెరికా, చైనాల తర్వాత భారతదేశం ప్రపంచంలో మూడో అతిపెద్ద ఇంధన వినియోగదారు. తన చమురు వినియోగంలో 80 శాతానికి పైగా భారత్ దిగుమతి చేసుకుంటుంది. 2021లో భారతదేశం రష్యా నుండి దాదాపు కోటీ 20 లక్షల బ్యారెళ్ల చమురును కొనుగోలు చేసింది. అయితే, ఇది ఇండియా మొత్తం దిగుమతుల్లో కేవలం 2% మాత్రమే.

గత సంవత్సరం మధ్యప్రాచ్యం నుండి పెద్ద ఎత్తున దిగుమతులు జరిగాయి. అమెరికా, నైజీరియాల నుంచి పెద్ద మొత్తంలో భారత్ దిగుమతి చేసుకుంది.

ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో భారతదేశం రష్యా నుండి చమురును దిగుమతి చేసుకోలేదు. కమోడిటీస్ రీసెర్చ్ గ్రూప్ కెప్లర్ ప్రకటించిన డేటా ప్రకారం, మార్చి, ఏప్రిల్‌లో ఒప్పందాలు ఇప్పటికే 60 లక్షల బ్యారెళ్లకు చేరుకున్నాయి.

వీడియో క్యాప్షన్, రష్యా, యుక్రెయిన్‌లకు మరియుపోల్‌ ఎందుకంత కీలకం?

షిప్పింగ్ డేటాను పరిశీలిస్తే ఒక్క ఏప్రిల్‌లోనే 58 లక్షల బ్యారెళ్లకు పెరగవచ్చని రిఫినిటివ్ ఆయిల్ రీసెర్చ్‌లో సీనియర్ క్రూడ్ అనలిస్ట్ గా పని చేస్తున్న షు ఝాంగ్ చెప్పారు.

రష్యా నుండి ఎక్కువ చమురును కొనుగోలు చేసినప్పటికీ, అది ప్రపంచవ్యాప్తంగా భారతీయ చమురు దిగుమతులతో పోలిస్తే, పెద్ద బకెట్‌లో ఒక ఆయిల్ బొట్టులాంటిదని భారత ప్రభుత్వం చెబుతోంది.

భారతీయ ఆయిల్ వినియోగంలో 80శాతం దిగుమతులే

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారతీయ ఆయిల్ వినియోగంలో 80శాతం దిగుమతులే

ఇండియా చేసుకున్న ఒప్పందాలు ఏంటి ?

యుక్రెయిన్ పై దాడి తర్వాత రష్యా నుంచి చమురును కొనే వారు తక్కువయ్యారు. దీంతో ధర పడిపోయింది. ''భారతదేశం చెల్లిస్తున్న ఖచ్చితమైన ధర మాకు తెలియదు'' అని కెప్లర్ సంస్థలో విశ్లేషకుడు మాట్ స్మిత్ చెప్పారు.

''గత వారంలో బ్రెంట్ క్రూడ్‌తో పోలిస్తే, యురల్స్ తగ్గింపు బ్యారెల్‌కు సుమారు రూ.2238కి చేరుకుందని ఆయన చెప్పారు. ఈ రెండు రకాల క్రూడ్‌లు సాధారణంగా ఒకే ధరకు అమ్ముడవుతాయి.

కానీ మార్చిలో వీటి మధ్య వ్యత్యాసం ఆల్-టైమ్ రికార్డుకు చేరుకుందని మాట్ స్మిత్ అన్నారు. ''ఇండియా, చైనా ఈ రష్యన్ క్రూడ్‌లో కొంత భాగాన్ని గణనీయమైన తగ్గింపుతో కొనుగోలు చేసే అవకాశం ఉంది'' అని ఆయన చెప్పారు.

ఆయిల్ దిగమతి చేసే ఓడ (ఫైల్ ఫోటో)

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆయిల్ దిగమతి చేసే ఓడ (ఫైల్ ఫోటో)

ఆంక్షల ప్రభావం ఎంత?

రష్యా బ్యాంకులపై ఆంక్షలు విధించినందున ఈ తగ్గింపుతో కూడిన కొనుగోళ్లకు నిధులు సేకరించడం కోసం పెద్దపెద్ద భారతీయ చమురు శుద్ధి కంపెనీలు కూడా ఇబ్బందులు పడుతున్నాయి. ఈ సమస్య రెండువైపుల నుంచి ఉంది.

బ్లూమ్‌బెర్గ్ ఆర్థిక విశ్లేషకులు అంచనా ప్రకారం రష్యాకు ఎగుమతి చేసే భారతీయ ఎగుమతిదారులు ప్రస్తుతం సుమారు 38 వేల కోట్లకు సమానమైన చెల్లింపుల కోసం ఎదురుచూస్తున్నారు.

స్థానిక కరెన్సీల ఆధారంగా లావాదేవీ వ్యవస్థ జరపడం భారత్‌కు ఉన్న ఆప్షన్లలో ఒకటి. ఎందుకంటే భారత్ నుంచి రష్యాకు ఎగుమతులు చేసే సంస్థలు డాలర్లు లేదా యూరోలకు బదులుగా రూబుళ్లలో చెల్లింపులు తీసుకుంటాయి.

రష్యా ఆయిల్ ధర క్రమంగా తగ్గుతోంది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రష్యా ఆయిల్ ధర క్రమంగా తగ్గుతోంది

భారత్ ఇంకా ఎక్కడి నుంచి ఆయిల్‌ను కొనాలని చూస్తోంది?

రిఫినిటివ్‌లోని విశ్లేషకుల అంచనా ప్రకారం ఫిబ్రవరి నుండి భారతదేశపు చమురు దిగుమతులు గణనీయంగా పెరిగాయి. అయితే, రష్యా నుంచి దిగుమతులు ఆపేసి తన సొంత ఆయిల్ ఉత్పత్తిని వాడుకోవాలని అమెరికా నిర్ణయించుకోవడంతో భవిష్యత్తులో భారత్ అక్కడి నుంచి మరిన్ని దిగుమతులను కొనసాగించలేదని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇరాన్ చమురును కొనుగోలు చేయడానికి భారతీయ చమురు శుద్ధి సంస్థలు గతంలో మాదిరిగా బార్టర్ మెకానిజం ( మార్పిడి) కింద ఆ దేశంతో వాణిజ్యాన్ని భారత్ తిరిగి ప్రారంభించే సూచనలు కనిపిస్తున్నాయి. మూడేళ్ల క్రితం ఇరాన్‌ పై అమెరికా మళ్లీ ఆంక్షలు విధించడంతో గతంలో ఈ ఏర్పాటు ఆగిపోయింది.

అయితే, అణుకార్యక్రమంపై ఇరాన్‌తో అంతర్జాతీయ చర్చల్లో విస్తృత ఒప్పందం కుదరకుండా ఇది ప్రారంభమయ్యే అవకాశం లేదు.

వీడియో క్యాప్షన్, యుక్రెయిన్-రష్యా యుద్ధం: నెల రోజుల్లో ఏం జరిగింది?
రియాల్టీ చెక్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)