యుక్రెయిన్‌లో రష్యా యుద్ధ నేరాలు: చెక్‌పాయింట్ వద్ద చర్చి ఫాదర్ కాల్చివేత

ఫొటో సోర్స్, SERHII TSOMA
- రచయిత, విక్టోరియా జుహాన్
- హోదా, బీబీసీ యుక్రెయిన్
యుద్ధ నిబంధనల విషయంలో తమ క్రిమినల్ కోడ్‌కు విరుద్ధంగా ఉన్న వేలాది ఘటనలను సేకరించే పనిలో ఉన్నట్లు యుక్రెయిన్ ప్రాసిక్యూటర్ జనరల్ ఇరినా వెనెడిక్టోవా చెప్పారు.
మార్చి 24 నాటికి ఆమె కార్యాలయం 2,472 కేసులను నమోదు చేసింది. ఈ కేసుల పట్ల దేశం ఎలా వ్యవహరిస్తుందో బుధవారం మీడియాకు ఆమె తెలియజేశారు.
''యుక్రెయిన్ న్యాయపరిధిలో మేం ఎక్కడైతే విజయం సాధిస్తామో, నేరానికి పాల్పడిన వ్యక్తి భౌతికంగా యుక్రెయిన్‌లో ఉన్న చోట మేం ఒక విధమైన వ్యూహాన్ని అనుసరిస్తాం. ఒకవేళ యుక్రెయిన్‌లో మేం విజయం సాధించలేమని భావిస్తే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు వైపు దృష్టి సారిస్తాం'' అని ఆమె చెప్పారు.
యుద్ధ నేరంగా అనుమానిస్తూ నమోదైన ఘటనలలో ఒకదాని గురించి బీబీసీ తెలుసుకుంది.
యుక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభమైన వారం రోజులకే ఈ ఘటన జరిగింది. కీయెవ్ నగరానికి పశ్చిమాన 40 కి.మీ దూరంలోని చిన్న గ్రామం యస్నోహోరోడ్కా చెక్ పాయింట్ వద్ద వాలంటీర్ల బృందం గస్తీ కాస్తోంది. ఈ వాలంటీర్ల బృందంలోని వారంతా ఆ గ్రామానికి చెందిన ఇరుగుపొరుగువారు, మిత్రులే.
రష్యా, యుక్రెయిన్ దళాల మధ్య అప్పటికే పోరాటం తీవ్రంగా మారింది. దేశవ్యాప్తంగా నగరాలు, పట్టణాల ప్రవేశద్వారాల దగ్గర చెక్‌పాయింట్లు ఏర్పాటు అవుతున్నాయి. ఈ చెక్‌పాయింట్ల వద్ద ఎలాంటి మిలిటరీ శిక్షణా అనుభవం లేని స్థానికులే స్వచ్ఛందంగా విధులు నిర్వర్తిస్తున్నారు.
మార్చి 5వ తేదీ మధ్యాహ్నం, ఆ గ్రామానికి చెందిన ప్రీస్ట్ (మత బోధకుడు లేదా చర్చి ఫాదర్) రోస్టిస్లావ్ డ్యుడారెంకో, యస్నోహోరోడ్కా చెక్ పాయింట్ వద్ద ఉన్నారు. అక్కడికి వచ్చే వాహనాలను తనిఖీ చేయడం ఆయన పని. చర్చి ఫాదర్‌లా కాకుండా ఆయన సాధారణ దుస్తులు ధరించారు.
అక్కడ సరిగ్గా ఏం జరిగిందో నిర్ధారించడం సాధ్యం కాదు. కానీ ఆ రోజు ప్రాణాలతో బయటపడిన యుఖైమ్ (పేరు మార్చాం) ఆ ఘటన గురించి బీబీసీతో చెప్పారు.
''గ్రామంలోకి మూడు రష్యన్ ట్యాంకులు వచ్చాయని మాకు తెలిసినప్పుడు, డ్యుడారెంకోతో పాటు మరో 12 మందితో కలిసి నేను చెక్‌పాయింట్ వద్ద విధుల్లో ఉన్నా. అప్పుడు మేం దాక్కోవాలని అనుకున్నాం. అవసరమైతే వారితో పోరాడాలని నిర్ణయించుకున్నాం'' అని ఆయన తెలిపారు.
''చెక్ పాయింట్ సమీపానికి చేరుకోగానే రష్యా బలగాలు అన్ని దిశల్లో కాల్పులు మొదలుపెట్టాయి. మేం గడ్డిలో దాక్కున్నామని గ్రహించిన వారు ట్యాంకులతో మమ్మల్ని తొక్కేయాలనే ఉద్దేశంతో రోడ్డువైపుకు వెళ్లారు.''
''డ్యుడారెంకో తన మెడలోని శిలువను పైకి చూపిస్తూ, తాను దాక్కున్న ప్రదేశం నుంచి బయటకు రావడం నేను చూశాను. ఆయన ఏదో అరుస్తూ వారి వైపు వెళ్తున్నారు. బహుశా వారిని ఆపాలని ఆయన అనుకున్నారేమో. నేను ఆయనను పిలిచేందుకు ప్రయత్నించా'' అని యుఖైమ్ చెప్పారు.
ఆ తర్వాత చర్చి ఫాదర్ ఉన్న దిశలోనే కాల్పులు జరిగాయని ఆయన తెలిపారు. రష్యా బలగాలు ఆ సమయంలో డ్యుడారెంకో లక్ష్యంగానే కాల్పులు జరిపినట్లు కనిపించిందని చెప్పారు. ''అంతే. ఆయన రెండు అడుగులు వేసి కుప్పకూలిపోయారు.''
ఆ దాడిలో యుఖైమ్ కూడా గాయపడ్డారు. ఒకవేళ ఆ సమయంలో యుక్రెయిన్ బలగాలు ఆ ప్రాంతానికి రాకపోయి ఉంటే అక్కడున్న అందరూ చనిపోయి ఉండేవారని యుఖైమ్ నమ్ముతున్నారు. సమయానికి వచ్చిన యుక్రెయిన్ సాయుధ బలగాలు, రష్యన్ బలగాలను ఎదుర్కొన్నాయని చెప్పారు.
వాలంటరీ గ్రూపులో చేరిన 45 ఏళ్ల డ్యుడారెంకోకు ఎలాంటి మిలిటరీ అనుభవం లేదని మరో వాలంటీర్ ఎడ్వర్డ్ (పేరు మార్చాం) తెలిపారు. ''బృందంలో కేవలం ఒక జంటకు మాత్రమే కాస్త మిలిటరీ శిక్షణలో ప్రవేశం ఉంది. కొందరికి అసలు ఇలాంటి పనుల్లో ప్రవేశమే లేదు. బృందంలో ఎక్కువ మంది 50 ఏళ్ల పైబడిన వారే'' అని ఆయన బీబీసీతో అన్నారు.
రోడ్డుపై చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలను చూడటానికి రష్యా ట్యాంకులు వెళ్తున్న సమయంలో వేరే చెక్ పాయింట్ నుంచి ఎడ్వర్డ్ అక్కడికి చేరుకున్నారు.
ఆ మృతదేహాల్లో డ్యుడారెంకో, ఆయన సహాయకునితో పాటు మరో ఇద్దరు వాలంటీర్లు, తనకు తెలియని ఇంకో వ్యక్తి ఉన్నట్లు ఎడ్వర్డ్ చెప్పారు.
''దేశ రక్షణలో తన వంతు పాత్రను పోషించాలని తన కొడుకు నిశ్చయించుకున్నట్లు'' డ్యుడారెంకో తల్లి నదియా అన్నారు. ఆమెకు ఆయన ఏకైక సంతానం.
''తను ప్రతీ ఒక్కరిని రక్షించగలడు అని అనుకున్నాడు. దీని గురించి నేను అతనితో మాట్లాడేందుకు ప్రయత్నించాను. కానీ వాదించలేకపోయాను'' ఆమె గుర్తు చేసుకున్నారు.

ఫొటో సోర్స్, TETYANA PYLYPCHUK
వాలంటీర్ల బృందం వద్ద వేట రైఫిల్స్‌తో పాటు తక్కువ సంఖ్యలో రష్యా ఆర్మీ కలాష్నికోవ్ తుపాకులు, కేవలం మూడు బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు ఉన్నాయి. ఒక మత బోధకుడిగా ఆయుధాలు చేతపట్టడానికి డ్యుడారెంకో నిరాకరించారని బీబీసీతో ఆయన స్నేహితుడు, తోటి మత బోధకుడు సెర్హీ సోమా చెప్పారు.
రష్యా ట్యాంకులను ఎదురించాలని డ్యుడారెంకో నిర్ణయించుకున్నప్పుడు, ఆయన దగ్గర ఆయుధం లేకపోవడంతో బలగాలకు తేలికైన లక్ష్యంగా మారాడని యుఖైమ్ చెప్పారు.
''రోస్టిస్లావ్, ఒక దయగల ఆశావాదం ఉన్న వ్యక్తి. అందుకే ఆయన రష్యా బలగాలను ఆపేందుకు ప్రయత్నించి ఉంటారని నేను భావిస్తున్నా'' అని ఆయన అన్నారు.
ఇతరులకు సహాయం చేసేందుకు ఎల్లప్పుడూ ముందుండే వ్యక్తిగా యస్నోహోరోడ్కాలో అందరికీ ఆయన సుపరిచితుడు. ప్రతీ ఆదివారం మాస్‌కు ముందు కాంగ్రగేషన్ సభ్యులందరినీ పోగు చేసేందుకు గ్రామం మొత్తం తిరిగేవారని ఆయన స్నేహితుడు సోమా చెప్పారు.
ఆయన సేవలు స్వీయ త్యాగాలతో కూడుకున్నవని కాంగ్రగేషన్ సభ్యుల్లో ఒకరైన టెట్యానా పిలిప్చుక్ అన్నారు.
యుక్రెనియన్ ఆర్థోడాక్స్ చర్చిలో డ్యుడారెంకో మత బోధకుడు. 2019లో ఈ చర్చి, రష్యన్ ఆర్థోడాక్స్ చర్చి నుంచి స్వాతంత్ర్యాన్ని సంపాదించుకుంది.
అధికారిక విభజనకు ముందు ఈ చర్చిలో రెండు వర్గాలు ఉండేవి. అందులో ఒకటి మాస్కోకు విశ్వాసమైనది కాగా, రెండోది కీయెవ్‌కు విధేయమైనది.
2010లో యుక్రెయిన్‌లో విక్టర్ యానుకోవిచ్ అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఆయన రష్యా అనుకూలవాది. ఆ సమయంలో డ్యుడారెంకో కీయెవ్ అనుబంధ చర్చిలో పనిచేసేవారు. విక్టర్ అధికారంలోకి వచ్చాక మాస్కో అనుకూల వాదులు, కీయెవ్ అనుబంధ చర్చిలను స్వాధీనం చేసుకోవడం మొదలు పెట్టారు. అందులో డ్యుడారెంకో పనిచేస్తోన్న చర్చి కూడా ఉంది.
తాను నమ్మిన సూత్రాలను కట్టుబడిన డ్యుడారెంకో మాస్కోకు అనుకూలంగా పనిచేయలేక ఆ చర్చి నుంచి బయటకు వచ్చేసినట్లు ఆయన మిత్రులు చెబుతారు. ఆ తర్వాత బహిరంగ ప్రదేశాల్లో, ఆఖరికి వానలో కూడా తన సేవలు కొనసాగించేవారని అన్నారు. విరాళాలు సేకరించి స్వయంగా ఒక తాత్కాలిక చర్చిని ఏర్పాటు చేశారని తెలిపారు.

ఫొటో సోర్స్, facebook
''ఫాదర్, మీరు లేకుండా మన చర్చి అనాథలా మారింది'' అని తన ఫేస్‌బుక్ పేజీలో టెట్యానా రాశారు.
గత కొన్ని వారాలుగా దేశవ్యాప్తంగా ఇటువంటి వేలాది సంఘటనలు ఎంత వేగంగా జరిగాయో... అంతే వేగంగా ఈ హత్యలకు సంబంధించిన కేసులను పోలీసులతో పాటు స్థానిక, జాతీయ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల కార్యాలయాలు నమోదు చేసుకుంటన్నాయి. వాటి వివరాలను ఆయా ఫేస్‌బుక్ పేజీల్లో ప్రచురించాయి.
యుక్రెయిన్ ఆర్టికల్ 438 ఉల్లంఘన జరిగినట్లు అనుమానిస్తోన్న ఈ కేసులను యుక్రెయిన్ ప్రభుత్వ సంస్థలు ఉపయోగించే కేంద్రీకృత వైబ్‌సైట్‌లో కూడా అప్‌లోడ్ చేశారు. ఆర్టికల్ 438, యుద్ధ నేరాల ఉల్లంఘన గురించి తెలుపుతుంది.
''సాక్ష్యాలకు సంబంధించిన ఇలాంటి డాక్యుమెంటేషన్ చాలా క్లిష్టమైనది'' అని గత వారం బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెనెడిక్టోవా చెప్పారు.
''ప్రాసిక్యూటర్ జనరల్ కార్యాలయంలో యుద్ధ సంబంధిత ప్రత్యేక విభాగం ఉంది. యుద్ధ నేరాల దర్యాప్తులో చట్టాల అమలుకు సంబంధించిన అన్ని శాఖలు మాకు సహకరిస్తాయి. ఇదే మా తొలి ప్రాధాన్య అంశం.''
''తగిన సంఖ్యలో మాకు విచారణ అధికారులు లేరనేది నిజమే. అందుకే మేం ఒక ఉమ్మడి వెబ్‌సైట్‌ను తయారు చేశాం. ఈ వెబ్‌సైట్‌ను కేవలం ప్రాసిక్యూటర్ కార్యాలయమే కాకుండా యుక్రెయిన్ ప్రభుత్వ విభాగాలైన విదేశాంగ మంత్రిత్వ శాఖ, న్యాయశాఖ కూడా ఉపయోగించుకుంటుంది. సాక్ష్యాలను పొందుపరుస్తాయి'' అని ఆమె చెప్పారు.
''ఇది మాకు చాలా ముఖ్యం. యుక్రెయిన్ కోర్టుల్లో, ఐసీసీలో, ఇతర న్యాయాధికార పరిధిలో ఈ సాక్ష్యాలు ఆమోద యోగ్యంగా ఉండాలి'' అని ఆమె వివరించారు.
''యస్నోహోరోడ్కాలో మార్చి 5న జరిగిన ఘటన విషయానికొస్తే ఒకసారి కాల్పులపై విచారణ ముగిసిన తర్వాత నేరారోపణ అభియోగాలు జారీ అవుతాయి'' అని కీయెవ్ ఒబ్లాస్ట్ జిల్లా ప్రాసిక్యూటర్ కార్యాలయం తెలిపింది.
''ప్రతీ యుద్ధ నేరానికి సంబంధించిన సాక్ష్యాలను రుజువు చేయడానికి ప్రాసిక్యూషన్ అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. ఈ యుద్ధ నేరాల్లో నేరస్థులుగా ఉండే సైనికుడి నుంచి జనరల్, ఉన్నత సైనిక అధికారులను కూడా వదిలిపెట్టడం జరగదు'' అని ఒక ప్రకటనలో పేర్కొంది.
ఇప్పటికే కొంతమంది రష్యా సైనికులు యుక్రెయిన్ ప్రాసిక్యూషన్‌ల మొదటి దశ విచారణను ఎదుర్కొంటున్నారని తెలిపిపంది. యుక్రెయిన్ చట్టాల ప్రకారం ప్రతీ యుద్ధ నేరస్థునికి శిక్షలు విధిస్తామని వ్యాఖ్యానించింది.
ఇవి కూడా చదవండి:
- శ్రీలంక ఆర్థిక సంక్షోభం: నాలుగు నెలల పసిబిడ్డతో సముద్రం దాటిన దంపతులు
- దానిశ్ ఆజాద్ అన్సారీ: యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలోని ఏకైక ముస్లిం మంత్రి ఎవరు?
- జొరాస్ట్రియనిజం: మృతదేహాలను పక్షులకు ఆహారంగా వదిలిపెట్టే ఈ మతం ఏంటి?
- వాంగ్ యీ: చైనా విదేశాంగ మంత్రి భారత్‌లో ఎందుకు పర్యటిస్తున్నారు? రెండు దేశాలూ మళ్లీ దగ్గరవుతున్నాయా?
- యుక్రెయిన్: భారత అలీన విధానం ఒత్తిడిని ఎదుర్కొంటోందా? తటస్థ వైఖరి భారత్‌కు ఇబ్బందికరంగా మారిందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












