యుక్రెయిన్, రష్యా యుద్ధం: ‘ప్రభుత్వాన్ని ప్రశ్నించిన రష్యన్లను ఉద్యోగంలోంచి తీసేస్తున్నారు’

ఫొటో సోర్స్, KAMRAN MANAFLY
- రచయిత, బెన్ టోబియాస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
28 ఏళ్ల జాగ్రఫీ టీచర్ కమ్రాన్ మనాఫ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ అతడి ఉద్యోగానికే ఎసరుపెట్టింది.
"దేశ ప్రచారానికి నేను ప్రతిబింబం కావాలనుకోవడం లేదు. నాకంటూ సొంత అభిప్రాయం ఉంది. చాలా మంది ఉపాధ్యాయులకు ఒక అభిప్రాయం ఉంది. అది దేశం అభిప్రాయంలాగే ఉండదు" అని రష్యాలో ఇన్‌స్టాగ్రామ్‌ను పరిమితం చేసే ముందు ఆయన తన అకౌంట్లో పోస్ట్ చేశారు.
సెంట్రల్ మాస్కోలోని సెకండరీ స్కూల్లో పనిచేస్తున్న ఆయన అక్కడ జరిగిన ఒక స్టాఫ్ మీటింగ్ తర్వాత ఈ పోస్ట్ పెట్టాల్సొచ్చింది.
స్టాఫ్ మీటింగ్‌లో ఆయనకు, మిగతా టీచర్లకు యుక్రెయిన్‌లో పరిస్థితి గురించి విద్యార్థులకు ఎలా చెప్పాలో సూచించారు. ప్రభుత్వం చెబుతున్నదానికి భిన్నంగా వారికి ఏదీ చెప్పకూడద్నారు.
ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of Instagram ముగిసింది
దీంతో ఆయన సోషల్ మీడియాలో ఈ పోస్ట్ చేశారు. ఆ తర్వాత రెండు గంటల్లో స్కూల్ హెడ్‌మాస్టర్ ఆయనకు కాల్ చేశారు. వెంటనే దాన్ని తొలగించాలని లేదా ఉద్యోగానికి రాజీనామా చేయమని చెప్పారు.
"నేను దాన్ని డిలీట్ చేయాలనుకోలేదు. ఇక అక్కడ వారితో వాదించి లాభం లేదని నాకు అర్థమైంది. దాంతో రాజీనామా చేయడమే మంచిదనుకున్నా" అని మానఫ్లీ బీబీసీకి చెప్పారు.
తర్వాత రోజు రాజీనామా ఇచ్చి, తన వస్తువులు తెచ్చుకుందామని వెళ్లిన మానఫ్లీని స్కూలు లోపలికి రాకుండా అడ్డుకున్నారు.
"నన్ను లోపలికి రానివ్వకూడదని ఆదేశాలు ఉన్నాయని నాకు చెప్పారు. దాంతో నాకు మద్దతుగా, వీడ్కోలు చెప్పడానికి పిల్లలు బయటికి రావడం మొదలైంది. తర్వాత ఎవరో పోలీసులకు ఫోన్ చేసి నేను అనుమతి లేకుండా ర్యాలీ చేస్తున్నానని ఫిర్యాదు చేశారు" అన్నారాయన.
బీబీసీ చూసిన వీడియోల్లో పిల్లలు మానఫ్లీ చుట్టూ గుమిగూడడం, చప్పట్లు కొడుతూ ఆయనకు వీడ్కోలు పలకడం కనిపిస్తోంది.
ఆయన చివరికి తన వస్తువులు తీసుకున్నారు. తర్వాత రోజు ఆయన స్కూల్ హెడ్‌మాస్టర్‌ను కలిసినపుడు, ఆయన మీ సొంత రాజకీయ అభిప్రాయాలు సోషల్ మీడియాలో ఎందుకు పెట్టారో రాతపూర్వక వివరణ ఇవ్వాలని మానఫ్లీని కోరారు.
కానీ, దానికి ఒప్పుకోని మానఫ్లీ రాజీనామా ఇవ్వాలనుకున్నారు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిందని, మిమ్మల్ని ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తున్నామని ఆయనకు చెప్పారు.
'విధుల్లో అనైతిక ప్రవర్తన'కు మిమ్మల్ని తొలగిస్తున్నామని ఆయనకు సమాచారం వచ్చింది.
"వ్యక్తిగత అభిప్రాయాన్ని వ్యక్తం చేయడాన్ని అనైతికంగా భావించడం చూసి నాకు విచిత్రంగా అనిపించింది" అన్నారు మానఫ్లీ.
దీనిపై స్పందన కోరినప్పుడు మాట్లాడ్డానికి స్కూల్ హెడ్‌మాస్టర్ నిరాకరించారు. కానీ, సోషల్ మీడియాలో మానఫ్లీ పోస్టుల వల్ల స్కూల్లో ఆయన వర్కింగ్ అగ్రిమెంట్ రద్దయ్యిందని స్కూల్ దగ్గర తల్లిదండ్రులతో యాజమాన్యం చెప్పినట్లు బీబీసీకి అందిన సందేశాల్లో ఉంది. దానిని మానఫ్లీ ఖండించారు.

ఫొటో సోర్స్, Getty Images
నకిలీ సమాచారం అణచివేత
ఫిబ్రవరి 24న యుక్రెయిన్ మీద రష్యా దాడికి దిగిన తర్వాత, వేల మంది రష్యన్లు ముఖ్యంగా మాస్కో, సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని రష్యన్లు 'స్పెషల్ మిలిటరీ ఆపరేషన్'కు వ్యతిరేకంగా అభిప్రాయాలు వ్యక్తం చేయడం, ప్లకార్డులు ప్రదర్శించడం, సోషల్ మీడియాలో పోస్టులు చేయడం, యుద్ధ వ్యతిరేక ప్రదర్శనల్లో పాల్గొనడం చేశారు.
దీంతో రష్యా ప్రభుత్వం వారిపై కఠిన చర్యలకు దిగింది. వేలాది నిరసనకారులను అదుపులోకి తీసుకోవడంతోపాటూ, రష్యా సైన్యం గురించి ఫేక్ న్యూస్ వ్యాప్తి చేసేవారి కోసం ఒక కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ చట్టం ప్రకారం నిందితులకు 15 ఏళ్ల జైలు శిక్ష విధిస్తారు.
అయితే, 'మానఫ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్, ఆ చట్టాలను ఉల్లంఘించదు' అని రష్యా వార్తా పత్రిక నొవాయా గజెటా చెప్పింది.
కాత్యా డొలినీనాది మరో కథ.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం వల్ల ముప్పు ఉన్నప్పటికీ యుక్రెయిన్ మీద రష్యా దాడి గురించి ఆమె ఎక్కువ రోజులు మౌనంగా ఉండలేకపోయారు.
మోస్కినో సినిమా చెయిన్‌లో రెండు థియేటర్లకు ఆమె మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఆమె మొదట్లో తన రాజకీయ అభిప్రాయాలు తన వరకే ఉండాలనుకునేవారు. కానీ, యుక్రెయిన్ మీద రష్యా దాడి తర్వాత ఆమె ఆలోచన మారింది.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇంతకు ముందు జరిగిన నిరసనల్లో ఎందుకు పాల్గొనలేదని బీబీసీ ఆమెను ప్రశ్నించింది.
"నాకు నా ఉద్యోగం అంటే ఇష్టం. నేను దాన్ని ఎంజాయ్ చేసేదాన్ని. అందుకే దాన్ని పోగొట్టుకోవాలనుకోలేదు" అన్నారు.
కానీ, ఈ యుద్ధం మొదలవగానే, అది మారిపోయింది. స్నేహితులు ఆమెకు రష్యా ప్రత్యేక సైనిక చర్యకు వ్యతిరేకంగా సాంస్కృతిక రంగంలో పనిచేసే వారంతా సంతకాలు పెట్టిన ఒక బహిరంగ లేఖ పంపించారు. అందులో తన పేరు కూడా చేర్చడానికి ఆమె ఏమాత్రం వెనకాడలేదు.
"రష్యా ఆ చర్యలను తక్షణం ఆపేయాలనే వారి అభిప్రాయంతో నేను ఏకీభవించాను. అది సరికాదు" అంటారు డొలినీనా.
లెటర్లో సంతకం చేసిన కాసేపటికే, డొలీనీనాకు ఆమె బాస్ నుంచి కాల్ వచ్చింది. నీ పేరును వెంటనే తీసేయాలి, లేదంటే ఉద్యోగానికి రాజీనామా చేయాలని ఆయన చెప్పారు.
"దానికి కూడా కాదంటే, నిన్ను ఉద్యోగంలోంచి తీసేస్తామన్నారు" అని ఆమె చెప్పారు.
బీబీసీ దీనిపై మోస్కినో సినిమా చెయిన్‌ను వివరణ కోరింది, కానీ ఆ వైపు నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.
"అదసలు పెద్ద విషయమే కాదనుకున్నా. వాళ్లు నన్ను రాజీనామా చేయమని చెప్పకపోయినా అక్కడ నేను అసలు ఎలా పనిచేయగలనో నాకు అర్థం కాలేదు. ఆ సైనిక చర్య మొదలైన తర్వాత నాకు ఆ ఉద్యోగం చేయాలనిపించలేదు" అన్నారు డొలినీనా.
ఎలాంటి సంకోచం లేకుండా ఆమె తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. లేదంటే యాజమాన్యం తనను తీసేయడానికి ఏవైనా సాకులు వెతుకుతుందని, వాటివల్ల తనకు భవిష్యత్తులో మరిన్ని సమస్యలు వస్తాయని ఆమె భయపడ్డారు.
కొన్ని గంటల్లోనే ఆమె ఉద్యోగం పోయింది. తర్వాత మేనజర్లతో ఆమె చివరి మీటింగ్ బాగానే జరిగింది. 'మీరు ఉద్యోగం వదిలి వెళ్లిపోవడం చూస్తుంటే బాధగా ఉందని' వాళ్లు ఆమెతో అన్నారు. అయితే, తాను మేనేజ్‌మెంట్‌తో గొడవకు దిగకుండా ఉండడానికే వారు అలా అనుంటారని ఆమెకు ఇప్పుడు అనిపిస్తోంది.

ఫొటో సోర్స్, ANNA LEVADNAYA
బహిరంగ అవమానమే
ఇన్‌స్టాగ్రామ్‌లో 20 లక్షల మందికి పైగా ఫాలోయర్లు ఉన్న అనా లెవద్నయకు మాత్రం తన యాజమాన్యం నుంచి చేదు అనుభవం ఎదురైంది.
ఇన్‌ఫ్లుయెన్సర్, పీడియాట్రీషియన్ అయిన అనా లెవద్నయ తన ఉద్యోగానికి రాజీనామా ఇచ్చిన తర్వాత జరిగిన మీటింగ్ అంత స్నేహపూర్వకంగా జరగలేదు.
యుక్రెయిన్ మీద దాడి మొదలైనప్పుడు, ఆమె విదేశాల్లో సెలవులో ఉన్నారు. అదే రోజు ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో విమానం కిటికీలోంచి శాంతి పావురం కనిపిస్తున్నట్టు ఒక ఫొటో పోస్ట్ చేశారు.
"నేను దూకుడు ఎంచుకోను. నేను మనందరికోసం భయపడుతున్నా" అని ఆమె అందులో పోస్ట్ చేశారు.
తన కుటుంబం మూలాలు యుక్రెయిన్‌లో ఉన్నాయన్న ఆమె, ఈ నరకం వీలైనంత త్వరగా ముగియాలని పిలుపునిచ్చారు.
లెవద్నయ పోస్ట్ గురించి మాస్కోలో ఆమె పని చేస్తున్న మెడికల్ సెంటర్ యాజమాన్యానికి కూడా తెలిసింది. అది ప్రభుత్వ నిర్వహణలో నడుస్తోంది.
కొన్ని రోజుల తర్వాత లెవద్నయ ఇంకా విదేశాల్లోనే ఉన్న సమయంలో, తమ మెడికల్ సెంటర్ డైరెక్టర్ ఉదయం మీటింగ్‌లో ఇన్‌స్టాలో పెట్టిన యుద్ధం వ్యాఖ్యల గురించి వంద మంది కొలీగ్స్ ముందు తనను తీవ్రంగా తిట్టారని ఆమెకు స్నేహితుల ద్వారా తెలిసింది. దానికి సంబంధించిన ఒక వీడియో కూడా అందింది.
"అది బహిరంగంగా అవమానించడమే. ప్రభుత్వం లక్ష్యాలను సమర్థించని వాళ్లెవరూ ప్రభుత్వం నడిపే సంస్థల్లో ఉండకూడదు అనేది వాళ్లు స్పష్టంగా చెప్పారు" అంటారు లెవద్నయ.
ప్రపంచంలో జరిగే ఘటనల గురించి లెవద్నయకు చెబితే, ఆమె ఈ స్పెషల్ ఆపరేషన్‌ను సమర్థిస్తుందని డైరెక్టర్ తన సుదీర్ఘ ప్రసంగంలో మాట్లాడారు. తర్వాత కాసేపటికే రాజీనామా ఇవ్వాలని ఆమెకు సూచించారు. ఇవ్వకపోతే ఉద్యోగం నుంచి తొలగిస్తామన్నారు.
లెవద్నయ ఇచ్చిన రాజీనామా లేఖలో "నా పని కొనసాగించడం అసాధ్యంగా ఉంది" అని ఒకే వాక్యం ఉంది.
ఆమె తన సోషల్ మీడియా పోస్టుల్లో ప్రస్తుత వైద్య సమస్యల గురించి ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా ఆకట్టుకునేలా వివరిస్తుంటారు.
ఇంటర్నెట్ ట్రోల్స్, ఆగ్రహంతో పెట్టే కామెంట్లతో కలిసి జీవించడం ఆమె నేర్చుకున్నారు. కానీ యుక్రెయిన్ మీద దాడి ఆమెకు మరో విషయం నేర్పింది.
యుక్రెయిన్‌లో యుద్ధంతో రెండుగా విడిపోయిన రష్యన్లలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్లిన చాలా మంది తమ జీవితాలను తలకిందులు చేసుకున్నారు.
కొంతమంది ఉద్యోగాలు పోగొట్టుకోగా, మరికొందరు యాజమాన్యం తీరుకు నిరసనగా రాజీనామాలు చేశారు. తరతరాల కుటుంబ సంబంధాలు కూడా దెబ్బతిన్నాయి.
మిగతా వేలాది రష్యన్ల లాగే కమ్రాన్ మానఫ్లీకి ముందు కూడా ఇప్పుడు దేశం వదిలి వెళ్లాల్సిన ఒకే ఒక దారి ఉంది. కానీ దేశంలో అలా కోరుకునే ప్రతి ఒక్కరూ ఆ పని చేయలేరు.
"రష్యా ప్రచారాన్ని వ్యతిరేకించే ప్రతి రష్యా పౌరుడు దేశం వదిలి వెళ్లాలనేం లేదు. మేం ఇంకా ఇక్కడే ఉన్నాం. మాకు ఇంకా ఆశ ఉంది. మేం వెనకడుగు వేయకుండా ఉండాలనే ప్రయత్నిస్తాం" అంటారు డొలినీనా.
ఇవి కూడా చదవండి:
- రష్యా-యుక్రెయిన్ యుద్ధంలో 'డీప్‌ఫేక్' ప్రెసిడెంట్స్ ఎవరు, వారు ఏమంటున్నారు?
- నా కొడుకుని వెనక్కు తీసుకురావాలంటే నేనెవరి తలుపు తట్టాలి?: రష్యా సైనికుడి తల్లి ఆవేదన
- డాలర్ల గ్రామంలోని తండ్రీకొడుకులు కోట్ల రూపాయలు ఎలా కొల్లగొట్టారంటే...
- పాకిస్తాన్లోకి భారత్ మిస్సైల్: జర్మనీతో మాట్లాడిన పాకిస్తాన్.. అమెరికా, చైనాల రియాక్షన్
- నాటోకు రష్యా భయపడుతుందా, యుక్రెయిన్‌ను ఎందుకు చేర్చుకోవద్దంటోంది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













