క్యాన్సర్ ఆపరేషన్ల నుంచి కాస్మొటిక్ సర్జరీల దాకా విదేశీయులు భారత్‌కే ఎందుకు వస్తున్నారు?

ఫొటో సోర్స్, J PALADINES
- రచయిత, ప్రీతీ గుప్తా, బెన్ మోరిస్
- హోదా, బీబీసీ కోసం...
జువాన్ ఫ్రాన్సిస్కో పాలడైన్స్‌కు తన చూపులో ఏదో లోపం ఉన్నట్లు అనిపించింది. తాను చూసే ప్రతి వస్తువు రెండుగా కనిపిస్తున్నాయి. దీనినే మెడికల్ పరిభాషలో డబుల్ విజన్ అంటారు. బ్రెయిన్ లో ట్యూమర్ వల్ల ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయని పదేళ్ల కిందటే డాక్టర్లు ఆయనకు చెప్పారు.
''అవి నా జీవితంలో చాలా గడ్డురోజులు. అదృష్టం ఏంటంటే నా స్నేహితులు, కుటుంబం నాకు అండగా నిలబడ్డారు'' అని పాలడైన్స్ అన్నారు. ఆయన చిలీలోని శాండియాగో నివాసి.
మెదడులో ఏర్పడిన ట్యూమర్ ఆకారం భిన్నంగా ఉండటం వల్ల దానిని పూర్తిగా తొలగించడం సాధ్యం కాదని సర్జన్లు చెప్పారు. రేడియో థెరపీతో ఆయన సమస్యను పరిష్కరించగలిగారు.
తర్వాత నాలుగేళ్లపాటు ఆయన ట్యూమర్ ను నిరంతరం టెస్టుల ద్వారా పరిశీలిస్తూ వచ్చారు. అందులో ఎలాంటి పెరుగుదల లేదని తేలింది. ''అంతా సవ్యంగా జరిగింది. నా కష్టమంతా మర్చిపోయాను'' అన్నారాయన.
కానీ, 2019లో ఆయనకు మళ్లీ డబుల్ విజన్ వచ్చింది. ''సమస్య ఏంటో నాకు తెలుసు. అందుకే రేడియేషన్‌కు భిన్నమైన చికిత్స మార్గాన్ని ఎంచుకోవాలని నిర్ణయించుకున్నాను'' అని పాలడైన్స్ చెప్పారు.
కొత్తగా వచ్చిన ప్రోటాన్ బీమ్ థెరపీ అనే క్యాన్సర్ చికిత్సా విధానం ద్వారా ఈ ట్యూమర్‌ను తొలగించవచ్చు. ఎక్స్ రే విధానానికి భిన్నంగా హై ఎనర్జీ ప్రోటాన్‌లను ఈ పద్ధతిలో వాడతుంటారు.
ప్రోటాన్ బీమ్ లు శరీరం నుంచి సులభంగా ప్రసరిస్తాయి. వాటి మార్గంలో ఏదైనా ట్యూమర్ వచ్చిందంటే దాన్ని అవి ధ్వంసం చేస్తాయి. మెదడు, మెడ, వెన్నెముక లాంటి శరీరంలోని సున్నితమైన ప్రదేశాలలోకి కూడా వీటిని పంపి చికిత్సను అందించవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
కొంత పరిశోధన తర్వాత తనకు ఈ చికిత్స తనకు సెట్ అవుతుందని పాలడైన్స్ భావించారు. కానీ, చిలీలో గానీ, దాని పొరుగు దేశాలలో గానీ ఈ ట్రీట్‌మెంట్ అందుబాటులో లేదు.
''ఈ ప్రోటాన్ చికిత్స అందించే హాస్పిటల్స్ కోసం నేను రీసెర్చ్ చేశా'' అని పాలడైన్స్ చెప్పారు.
కొన్ని ఆసుపత్రులలో ఈ చికిత్స ఖరీదైనదిగా కనిపించగా, చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో ఇది తక్కువకు దొరుకుతుందని ఆయన గుర్తించారు.
''పశ్చిమ దేశాలకు దీటుగా ఇక్కడ అద్భుతమైన సౌకర్యాలు, తక్కువ ధరలో లభిస్తున్నాయి'' అన్నారు పాలడైన్స్. నవంబర్ 2021లో ఆయనకు చికిత్స జరగ్గా, ఆయనకు రవాణా, నివాస సౌకర్యాల ఏర్పాటులో ఆసుపత్రి సహకారం అందించింది.
''నేను ఇంటికి కొన్ని వేలమైళ్ల దూరం వచ్చాను. పూర్తిగా కొత్త దేశం, కొత్త సంస్కృతి ఉన్న ప్రాంతం. అలాంటి సమయంలో ఇలాంటి సహకారం మానసికంగా రిలీఫ్‌ను ఇస్తుంది'' అన్నారు పాలడైన్స్
వివిధ రకాల చికిత్సల కోసం ఇండియాకు ఏటా వచ్చే వేలమంది విదేశీయులలో పాలడైన్స్ ఒకరు.
2016 నుంచి 2019 మధ్య భారత దేశానికి చికిత్స కోసం వచ్చే విదేశీయుల సంఖ్య 4.3 లక్షల నుంచి 7 లక్షలకు పెరిగింది. దీనివల్ల 2019 నాటికి భారతదేశం సుమారు రూ. 68,592 కోట్లు ఆదాయం సంపాదించింది.
అయితే, కరోనా కారణంగా విధించిన ప్రయాణ నిబంధనలు ఈ రంగంపై ప్రభావం చూపాయి. 2021లో సుమారు 183,000 మంది వైద్యం కోసం భారతదేశానికి వచ్చారని, 2019తో పోలిస్తే ఈ సంఖ్య 73% తక్కువని పర్యాటక మంత్రిత్వ శాఖ రికార్డులను బట్టి తెలుస్తోంది.
మెడికల్ టూరిజమే కాదు, సాధారణ టూరిజం మీద ఆధారపడిన దేశాలపై కూడా ప్రయాణ నిబంధనల ప్రభావం దాదాపు ఇదే స్థాయిలో పడింది.
''దక్షిణాసియాలో అత్యధిక సంఖ్యలో వైద్యులున్న దేశం ఇండియా''అని ఇంటర్నేషనల్ అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజెస్ లో గ్రూప్ ఆంకాలజీ ప్రెసిడెంట్ గా పని చేస్తున్న దినేశ్ మాధవన్ అన్నారు.
''ఇక్కడి ఆతిథ్య సంస్కృతికి ఆధునికతను అద్ది వైవిధ్యంగా సేవలు అందిస్తున్నాం'' అన్నారాయన.

ఫొటో సోర్స్, S BHATIA
క్యాన్సర్ లాంటి తీవ్ర వ్యాధులతోపాటు లైపోసక్షన్ (శరీరంలో కొవ్వును తొలగించే చికిత్స), బట్టతల లాంటి కాస్మెటిక్ సర్జరీల కోసం వచ్చే వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది.
''మాకు అమెరికా, ఆఫ్రికా, గల్ఫ్ దేశాల నుంచి పేషెంట్లు వస్తుంటారు'' అని ముంబైలో డెర్మటాలజిస్ట్‌గా పని చేస్తున్న డాక్టర్ సతీశ్ భాటియా తెలిపారు. ఎయిర్ హోస్టెస్‌ల లాంటి వారు త్వరగా పూర్తికావాల్సిన చికిత్సల కోసం తమ దగ్గరకు వస్తుంటారని ఆయన తెలిపారు.
కాస్మెటిక్ చికిత్సలకు అమెరికా, యూరప్, మిడిల్ ఈస్ట్ దేశాలలో ఫీజులు భారత్ కంటే 50% అధికంగా ఉంటాయని భాటియా వెల్లడించారు.
కరోనా మహమ్మారి టైమ్‌లో కొంత తగ్గినా, ఈ చికిత్సలు ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నాయని భాటియా తెలిపారు.
అయితే, విదేశాల నుంచి తమ దగ్గరికి వచ్చే వారి సంఖ్య కొంత తగ్గిందని, దీనికి కారణం దేశంలో విపరీతంగా పెరిగిన క్లినిక్ లేనని భాటియా చెప్పారు.
''క్లినిక్‌లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. వాళ్ల దగ్గర అర్హులైన, శిక్షణ పొందిన డాక్టర్లు ఉండరు. సులభంగా డబ్బు సంపాదించడమే లక్ష్యంగా పని చేస్తారు'' అన్నారు భాటియా
ఒక డాక్టర్ దగ్గర అపాయింట్‌మెంట్ తీసుకునే ముందు ఆ వైద్యుడి అర్హత, అనుభవాలను చూసి తీసుకోవాలని ఆయన సలహా ఇచ్చారు.
చికిత్స అనంతర సర్వీసులకు కూడా సరైన డాక్టర్లను ఎంచుకోవాలని అపోలో క్యాన్సర్ హాస్పిటల్ లో రేడియేషన్ ఆంకాలజిస్టుగా పని చేస్తున్న డాక్టర్ శంకర్ వంగిపురం అన్నారు.
''అర్హులైన నిపుణులు, సరైన వైద్య సదుపాయాలు లేకపోవడంతో చికిత్స అనంతర సర్వీసులు సరిగా ఉండటం లేదు. ఒక్కోసారి ప్రమాదకరంగా మారుతున్నాయి'' అన్నారు డాక్టర్ శంకర్.

ఫొటో సోర్స్, Getty Images
ఈ రంగంలో నిబంధనలను కఠినతరం చేయాలని ప్రభుత్వం కూడా భావిస్తోంది. ''ఇండియన్ మెడికల్ టూరిజంను పర్యవేక్షించే విభాగాలుగానీ, నిబంధనలు సరిగ్గాలేవు'' అని భారత పర్యాటక శాఖ అదనపు కార్యదర్శి రాకేశ్ కుమార్ వర్మ అన్నారు.
''వైద్యులు కాలేజీల్లో సంవత్సరాల పాటు చదివి నేర్చుకుంటారు. వారికి సర్టిఫికెట్ ఉంటుంది. కానీ, విదేశీ పేషెంట్లను వైద్యుల దగ్గరకు తీసుకొచ్చే మధ్యవర్తులకు ఎలాంటి సర్టిఫికెట్లు ఉండటం లేదు'' అని వర్మ అన్నారు.
ఈ రంగంలో పని చేసే ఏజెంట్లకు ఎలాంటి నిబంధనలు లేవని, ఆసుపత్రులలో ధరలు కూడా భిన్నంగా ఉన్నాయని, దీనిని ఉపయోగించుకుని ఏజెంట్లు అధిక రేట్లతో పేషెంట్లను మోసం చేస్తున్నారని ఆయన వెల్లడించారు.
''ప్రభుత్వం నిబంధనలు పెట్టడం మంచిదే. మెడికల్ వ్యాల్యూ టూరిజంలో ప్రొఫెషనలిజం తీసుకురావాల్సిన అవసరం ఉంది'' అని మెడికల్ ట్రావెల్ ఏజెన్సీ కి డైరెక్టర్‌గా పని చేస్తున్న గరిమా మాగు అన్నారు.
ఆసుపత్రులలో లోపాల కారణంగా కొంతమంది పేషెంట్లు ఇండియాకు వచ్చిన తర్వాత ఆసుపత్రులను మార్చుకోవాల్సి వస్తోందని, దీనివల్ల వారికి చాలా డబ్బు, సమయం వృథా అవుతోందని ఈ రంగంలో పని చేస్తున్న వారు చెబుతున్నారు. నిబంధనలు కఠినతరం చేయడం వల్ల ప్రయోజనం ఉంటుందని గరిమా మాగు అభిప్రాయపడ్డారు.
ఇక శాంటియాగో నుంచి వచ్చిన పేషెంట్ పాలడైన్స్ విషయానికి వస్తే, తనకు అందిన సర్వీసులకు ఆయన చాలా సంతృప్తిగా ఉన్నారు. చెన్నై నుంచి డాక్టర్ ఆయనను పర్యవేక్షిస్తున్నారు. ''ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను. ఇంతకు ముందుకంటే నా ఆరోగ్యం మెరుగ్గా ఉంది'' అన్నారు పాలడైన్స్
ఇవి కూడా చదవండి:
- వయాగ్రా ప్రభావం ఎక్కువగా ఉంటే ఏం చేయాలి... సైడ్ ఎఫెక్టులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- లైంగికంగా వేధించే భర్త నుంచి భార్యకు ఇకపై న్యాయం లభిస్తుందా... కర్ణాటక హైకోర్టు తీర్పు ఏం చెబుతోంది?
- RRR చుట్టూ ఇంత సందడి ఎందుకు? ఎవరి నోటా విన్నా ఆ సినిమా మాటే వినిపించేలా ఎలా చేస్తారు?
- కిలో బియ్యం 200, ఉల్లిపాయలు 250, గోధుమ పిండి 220, పాలపొడి 1345.. అక్కడ బతకలేక భారత్‌కు వస్తున్న ప్రజలు
- కుమ్రం భీము: ఈ ఆదివాసీల దేవుడ్ని నిజాం పోలీసులు నేరుగా ఎదుర్కోలేక వెనక నుంచి వెళ్లి చంపారు
- నాణ్యమైన కాఫీ కోసం ఎంతైనా ఖర్చు పెడతామంటున్న భారతీయులు..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















