యుక్రెయిన్ యుద్ధంలో రష్యా ఓడిపోయిందా? లేక వ్యూహం మార్చుకుంటోందా?

యుక్రెయిన్

ఫొటో సోర్స్, Reuters

    • రచయిత, పాల్ ఆడమ్స్
    • హోదా, బీబీసీ న్యూస్

రష్యా సైన్యం తన వ్యూహాలను మార్చుకుంటోందా? యుక్రెయిన్ విషయంలో తాము పెట్టుకున్న లక్ష్యాలను తగ్గించుకుంటోందా?

ఈ ప్రశ్నలకు ఇప్పుడే సమాధానాలు చెప్పడం కాస్త తొందరపాటే అవుతుంది. అయితే, వారి వ్యూహాల్లో మార్పు ఉందనేది మాత్రం సుస్పష్టం.

యుక్రెయిన్‌పై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించిన ‘‘ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్’’ మొదట దశ దాదాపు విజయవంతమైందని రష్యా ప్రధాన జనరల్ సెర్జీ రూడ్స్‌కోయ్ ఇటీవల వెల్లడించారు. ఇప్పుడు రష్యన్ దళాలు దోన్బస్ ప్రాంతానికి పూర్తిగా విముక్తి కల్పించడంపై దృష్టి సారిస్తామని ఆయన చెప్పారు.

అంటే తూర్పు యుక్రెయిన్‌లో రష్యా మద్దతున్న పీపుల్స్ రిపబ్లిక్స్ ఆఫ్ దోన్యస్క్, లూహాన్స్క్‌లకు మిగతా యుక్రెయిన్ భాగాలకు మధ్యనున్న ‘‘లైన్ ఆఫ్ కాంటాక్ట్’’పై ఎక్కువ దృష్టి పెట్టే అవకాశమున్నట్లు రష్యా సంకేతాలు ఇచ్చింది.

యుక్రెయిన్‌లోని మిగతా భాగాల్లో రష్యా సైన్యం సాధిస్తున్న పురోగతి మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. రాజధాని కీయెవ్‌తోపాటు చాలా భాగాల్లో రష్యా దళాలను యుక్రెయిన్ సైన్యం వెనక్కి నెట్టగలుగుతోంది. కొన్నిచోట్ల రష్యా సైన్యం తన ఆత్మరక్షణ కోసం ప్రయత్నిస్తుంటే.. మరికొన్ని చోట్ల కాస్త విరామం తీసుకుంటోంది.

యుక్రెయిన్

ఫొటో సోర్స్, Reuters

కీయెవ్‌ను అదుపులోకి తీసుకోవాలనే రష్యా లక్ష్యం నిరుగారిపోయినట్లేనని ఇప్పుడే చెప్పలేం. అయితే, రష్యా దళాలకు దెబ్బ మీద దెబ్బ తగిలే అవకాశముందని పశ్చిమ దేశాల నిఘా సంస్థలు అంచనా వేస్తున్నాయి.

మరో సైనిక జనరల్‌ను శుక్రవారం రష్యా కోల్పోయిందని పశ్చిమ దేశాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు ఏడుగురు రష్యా ప్రధాన సైనిక జనరల్స్ ప్రాణాలు కోల్పోయారు. ఇది రష్యా దళాల ఆత్మస్థైర్యంపై ప్రభావం చూపుతోంది.

రష్యా సైనిక జనరల్ సెర్జీ రూడ్స్‌కోయ్ ప్రకటనను చూస్తుంటే, యుద్ధానికి ముందుగా వారు నిర్దేశించిన వ్యూహాలు విఫలమయ్యాయని స్పష్టం అవుతోంది.

‘‘ఒకేసారి భిన్న ప్రాంతాల్లో యుద్ధం చేయడం కష్టమని రష్యా గుర్తించింది’’అని పశ్చిమ దేశాలకు చెందిన ఓ అధికారి వ్యాఖ్యానించారు.

దాదాపు 10 కొత్త రష్యన్ బెటాలియన్‌లను సమీకరించి దోన్బస్ ప్రాంతం వైపుగా పంపిస్తున్నారని అధికారులు చెబుతున్నారు.

గత నెలలో యుద్ధం మొదలుకావడానికి ముందే, లైన్ ఆఫ్ కాంటాక్ట్‌ సరిహద్దుల్లో మోహరించిన యుక్రెయిన్‌లో దీటుగా పోరాడే విభాగాలను రష్యాన్ దళాలు చుట్టుముడతాయని ఆందోళనలు వ్యక్తం అయ్యాయి.

యుక్రెయిన్

ఫొటో సోర్స్, Reuters

ఇప్పటివరకు దోన్యస్క్, లూహాన్స్క్‌లోని తమ ఆధీనంలోకి రాని ప్రాంతాల నుంచి రష్యా దళాలు వెనక్కి వచ్చేసి దక్షిణానవున్న ఖార్కియెవ్, ఇజియుమ్ లాంటి ప్రాంతాలపై దృష్టి సారించే అవకాశముంది.

అజోవ్ తీరంలోనున్న మరియుపోల్ పోర్టును రష్యా పూర్తిగా ఆధీనంలోకి తీసుకుంటే, ఉత్తరంగా ప్రయాణించి లైన్ ఆఫ్ కాంటాక్ట్‌ వద్ద గస్తీ కాస్తున్న యుక్రెయిన్‌కు చెందిన జాయింట్ ఫోర్సెస్ ఆపరేషన్ (జేఎఫ్‌వో) బలగాలను చుట్టుముట్టే అవకాశముంది.

అయితే, ఇప్పటికీ రష్యా లక్ష్యాలు అంత తేలిగ్గా పూర్తయ్యే సూచనలు కానిపించడం లేదు. మరియుపోల్‌లో యుక్రేనియన్లు రష్యన్ దళాలకు గట్టిగానే ప్రతిఘటిస్తున్నారు. క్రైమియా పీఠభూమి నుంచి దోన్బస్ ప్రాంతానికి వంతెన నిర్మించాలనే రష్యా లక్ష్యం కూడా నెరవేరకుండా వారు అడ్డుకుంటున్నారు.

వీడియో క్యాప్షన్, రష్యా, యుక్రెయిన్‌లకు మరియుపోల్‌ ఎందుకంత కీలకం?

ప్రస్తుతం ఒకే లక్ష్యంపై దృష్టి పెడదామని రష్యా భావిస్తే, వైమానిక దాడులతో ఆ లక్ష్యంపై విరుచుకుపడే అవకాశముంది.

అదే జరిగితే, రష్యా ఒత్తిడిని తట్టుకునేందుకు యుక్రెయిన్ సైన్యం మరింత శ్రమించాల్సి ఉంటుంది.

‘‘పశ్చిమ దేశాలు అందిస్తున్న ఆయుధాలతో యుక్రెయిన్ బలగాలు రష్యాను నిలువరించగలవని మేం భావిస్తున్నాం’’అని పశ్చిమ దేశాలకు చెందిన ఓ అధికారి వ్యాఖ్యానించారు.

రానున్న రోజుల్లో రష్యా దృష్టి మొత్తం దోన్బస్ వైపు కేంద్రీకరిస్తే, మిగతా లక్ష్యాలను వదిలిపెట్టేసినట్లు అనుకోకూడదు.

‘‘రష్యా తమ మొత్తం వ్యూహాన్ని మారుస్తుందని మేం భావించడం లేదు’’అని అమెరికా రక్షణ విభాగానికి చెందిన ఓ అధికారి వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)