శ్రీలంక ఆర్థిక సంక్షోభం: నాలుగు నెలల పసిబిడ్డతో సముద్రం దాటిన దంపతులు

- రచయిత, ప్రభురావ్ ఆనందన్
- హోదా, బీబీసీ కోసం
దేశంలో రోజురోజుకు పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఆర్ధిక సంక్షోభం నుంచి తప్పించుకునేందుకు అనేకమంది శ్రీలంక ప్రజలు భారతదేశానికి శరణార్ధులుగా వస్తున్నారు. అలాంటి వారిలో నాలుగు నెలల చిన్నారిని తీసుకుని దేశం విడిచి వచ్చిన ఓ జంట కూడా ఉంది. ఆ జంట మంగళవారం నాడు భారత్‌లో ప్రవేశించింది.
అయితే, వారిని దేశం దాటిస్తామని చెప్పిన వ్యక్తులు నడి సముద్రంలో వదిలేసి వెళ్లిపోయారు. దీంతో వారు 8 గంటల పాటు సముద్రంలోనే గడపాల్సి వచ్చింది. చివరకు కోస్ట్‌గార్డ్ సాయంతో ఈ జంట భారత్ చేరుకుంది.
జాఫ్నాకు చెందిన గజేంద్రన్ పెయింటింగ్ పనులు చేస్తుంటారు. మన్నార్ ప్రాంతానికి చెందిన మేరీని గత ఏడాది వివాహం చేసుకున్నారు. వారికి నాలుగు నెలల చిన్నారి ఉన్నాడు.
2006 నాటి శ్రీలంక సివిల్ వార్ సందర్భంగా గజేంద్రన్ తమిళనాడుకు శరణార్ధిగా వచ్చారు. ఈరోడ్ లోని క్యాంప్‌లో గడిపారు. 2021లో ఆయన చట్ట విరుద్ధంగా సముద్రం దాటి, శ్రీలంకలో ప్రవేశించారు. అక్కడే మేరీని వివాహం చేసుకున్నారు. గత కొన్నేళ్లుగా వారిద్దరూ ప్రేమించుకున్నారు.
ప్రస్తుతం శ్రీలంకలో ఆర్ధిక సంక్షోభం నెలకొని ఉండటంతో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. అక్కడ సామాన్యులు జీవించలేని పరిస్థితి ఏర్పడింది.
అక్కడే ఉంటే ఆకలితో చనిపోతామన్న భయంతో గజేంద్రన్ మళ్లీ భారత్ బాట పట్టారు. ఈసారి తన భార్యా పిల్లలలతో సహా వచ్చారు. కానీ, వాళ్ల ప్రయాణం అంత సులభంగా సాగలేదు.

‘నడి సముద్రంలో వదిలేశారు’
సముద్రం దాటించేందుకు ఒక మధ్యవర్తికి డబ్బులు ఇచ్చినట్లు గజేంద్రన్ వెల్లడించారు. ''ఆ వ్యక్తి మమ్మల్ని ఒక ఫైబర్ బోట్ ఎక్కించాడు. ధనుష్కోటి దగ్గర్లోని ఒక ఇసుక దీవి దగ్గర మమ్మల్ని దింపాడు. మరో బోటు వచ్చి మిమ్మల్ని తీసుకెళుతుందని చెప్పి వెళ్లిపోయాడు'' గజేంద్రన్ వెల్లడించారు.
ఎంతసేపు ఎదురు చూసినా మరో బోటు రాలేదు. ''చివరకు కోస్ట్‌గార్డ్ సిబ్బంది మమ్మల్ని మెరైన్ పోలీసులకు అప్పగించారు'' అని గజేంద్రన్ వెల్లడించారు.
తన ఆరోగ్యం బాగా లేదని, ఎక్కువగా పని చేయలేకపోతున్నానని గజేంద్రన్ తెలిపారు. దేశంలో ఆర్ధిక సంక్షోభం తలెత్తడంతో అక్కడ బతకలేక దేశం విడిచి బయటకు రావాల్సి వచ్చిందని తెలిపారు.
''మొదటిసారి యుద్ధం కారణంగా బయటకు వచ్చాం. ఈసారి ఆకలి భయంతో వచ్చాం'' అన్నారు గజేంద్రన్

సముద్రంలో ఒంటరిగా
బోటులో మమ్మల్ని దేశం దాటిస్తానని చెప్పి వ్యక్తి తమను తప్పుదోవ పట్టించాడని మేరీ అన్నారు.
''మమ్మల్ని ఒకచోట దింపి, ఇది మండపం(రామేశ్వరంలోని ఒక ప్రాంతం పేరు) సమీపంలోని శ్రీలంక శరణార్థి శిబిరం దగ్గరే ఉందని, తెల్లవారితే అక్కడికి వెళ్లిపోవచ్చని చెప్పాడు'' అని మేరీ వివరించారు.
తెల్లవారి చూస్తే మేం సముద్రం మధ్యలో ఒక ఇసుక దిబ్బ మీద ఉన్నట్లు గుర్తించాం.
''కనుచూపు మేరలో ఒక్క మనిషి కనిపించలేదు. సాయం అడగానికి ఎవరూ లేరు. విపరీతమైన గాలి, ఎండలో 8 గంటలపాటు ఎదురు చూశాం'' అని మేరీ వెల్లడించారు.
''అన్నం లేదు, నీరు లేదు. చిన్నారికి పాలు కూడా పట్టలేకపోయాను'' అని మేరీ వాపోయారు.
అటుగా వచ్చిన మత్స్యకారుల దగ్గర ఫోన్ తీసుకుని, మండపం శరణార్ధి శిబిరంలో ఉన్న తమ బంధువులకు ఈ దంపతులు ఫోన్ చేశారు. బంధువులు ఈ విషయాన్ని కోస్ట్‌గార్డ్ కు చెప్పడంతో వారిని అక్కడి నుంచి రెఫ్యూజీ క్యాంప్‌కు చేర్చారు.
''ఈ క్యాంప్‌కు వచ్చిన తర్వాతే మాలో భయం పోయింది'' అన్నారు మేరీ

ఫొటో సోర్స్, Getty Images
ఎదురు చూస్తున్న బాధితులు
''చిన్నారికి పట్టేందుకు పాలు కొందామంటే వాటి ధరలు రోజురోజుకు పెరిగాయి. ఇంకా పెరుగతాయని షాపుల వాళ్లు చెప్పారు'' అని మేరీ వెల్లడించారు.
గతంలో జరిగిన సివిల్ వార్ సందర్భంగా అనేక కుటుంబాలు ప్రాణ భయంతో దేశం విడిచి భారత్‌లో ప్రవేశించాయి. ఇప్పుడు అదే విధంగా అనేక కుటుంబాలు ఇక్కడికి రావడానికి ఎదురు చూస్తున్నాయని మేరీ తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- వాంగ్ యీ: చైనా విదేశాంగ మంత్రి భారత్‌లో ఎందుకు పర్యటిస్తున్నారు? రెండు దేశాలూ మళ్లీ దగ్గరవుతున్నాయా?
- యుక్రెయిన్: భారత అలీన విధానం ఒత్తిడిని ఎదుర్కొంటోందా? తటస్థ వైఖరి భారత్‌కు ఇబ్బందికరంగా మారిందా?
- వయాగ్రా ప్రభావం ఎక్కువగా ఉంటే ఏం చేయాలి... సైడ్ ఎఫెక్టులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- లైంగికంగా వేధించే భర్త నుంచి భార్యకు ఇకపై న్యాయం లభిస్తుందా... కర్ణాటక హైకోర్టు తీర్పు ఏం చెబుతోంది?
- RRR చుట్టూ ఇంత సందడి ఎందుకు? ఎవరి నోటా విన్నా ఆ సినిమా మాటే వినిపించేలా ఎలా చేస్తారు?
- కిలో బియ్యం 200, ఉల్లిపాయలు 250, గోధుమ పిండి 220, పాలపొడి 1345.. అక్కడ బతకలేక భారత్‌కు వస్తున్న ప్రజలు
- కుమ్రం భీము: ఈ ఆదివాసీల దేవుడ్ని నిజాం పోలీసులు నేరుగా ఎదుర్కోలేక వెనక నుంచి వెళ్లి చంపారు
- నాణ్యమైన కాఫీ కోసం ఎంతైనా ఖర్చు పెడతామంటున్న భారతీయులు..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













