యుక్రెయిన్ యుద్ధం: ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బయలుదేరారు... దారిలోనే రష్యా సైనికుల కాల్పుల్లో చనిపోయారు

ఫొటో సోర్స్, SUPPLIED
- రచయిత, అబ్దుజలీల్ అబ్దురసులోవ్, మల్ సిరెట్
- హోదా, బీబీసీ న్యూస్ا
యుక్రెయిన్ రాజధాని కీయెవ్‌కు కాస్త దూరంలో ఖాళీగా ఉన్న మెయిన్‌రోడ్డుపై వేగంగా వెళ్తోన్న మూడు కార్లు ఒక్కసారిగా ఆగిపోయి వెనక్కి తిరిగాయి. అందులో రెండు కార్లు అంతే వేగంగా వెనక్కి వెళ్లిపోయాయి. కానీ, ఒక్కటి మాత్రం అలా చేయలేదు. ఇదంతా ఒక డ్రోన్ ఫుటేజీలో కనిపించింది.
తెలుపు రంగులోని ఆ కారు కూడా వెనక్కి తిరిగింది. కానీ, వెంటనే ఆగిపోయింది. అందులో నుంచి ఒక వ్యక్తి బయటకు వచ్చి చేతులు ఊపారు. ఆ మరుక్షణంలోనే అతడు నేల మీద పడిపోయాడు. వెంటనే కారులో నుంచి పిల్లాడిని తీసుకొని దిగిన ఒక పెద్దావిడ అక్కడి నుంచి పారిపోయారు.
కొన్ని క్షణాల తర్వాత రష్యా సైనికులు ఆ వ్యక్తి పడి ఉన్న ప్రదేశానికి వచ్చారు. నేలపై పడి ఉన్న వ్యక్తి పేరు మక్సీమ్ లోవింకో. రష్యా సైనికుల కాల్పుల్లో 31 ఏళ్ల మక్సీమ్ మరణించారు. కారులో ఉన్న ఆయన భార్య కెసినియా కూడా చనిపోయారు.
వారితో ప్రయాణిస్తున్న ఆరేళ్ల కుమారుడు, ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన పెద్ద వయస్సున్న ఒక మహిళ పారిపోయారు. గాయాల పాలైన ఆమె ఆసుపత్రిలో చేరారు. (పేర్లు చెప్పేందుకు ఈ రెండు కుటుంబాల వారు ఇష్టపడలేదు.)
''వీడియో చూడకముందు వరకు నాలో కాస్త ఆశ ఉండేది. మాక్సిమ్ ఎక్కడో బతికే ఉన్నాడని నేను అనుకున్నా'' అని బీబీసీతో మక్సీమ్ తండ్రి సెర్గీయ్ లోవెంకో చెప్పారు. ఆయన కీయెవ్‌లో నివసిస్తారు.
ఈ ఘటన మార్చి 7న జరిగింది. మక్సీమ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు, ఇతరులు మొత్తం 10 కార్లలో కీయెవ్ నగరానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. వారంతా పశ్చిమ శివారు ప్రాంతాల నుంచి కీయెవ్ చేరాలని అనుకున్నారు. కానీ, ఈ ప్రాంతాలు అప్పటికే ఘర్షణాత్మకంగా ఉన్నాయి.
డ్రోన్లతో ఏరియల్ సర్వే చేస్తోన్న యుక్రెయిన్ ప్రాదేశిక రక్షణ దళాలు ఈ ఘటనను చిత్రించాయి. ఈ వీడియా విస్తృతంగా వ్యాపించింది.

మక్సీమ్ గురించి చెప్పడానికి ఆయన స్నేహితుడు, సెర్గీయ్‌కు ఫోన్ చేశారు. అప్పుడే తనకు ఏదో జరగరానిది జరిగినట్లు అనిపించిదని సెర్గీయ్ చెప్పారు. ''నేను ఫోన్ ఎత్తగానే అవతలివైపు నిశ్శబ్ధంగా ఉంది. ఆ తర్వాత కాసేపటికి మీరు ధైర్యంగా ఉండండి. మీ కొడుకు, కోడలు చనిపోయారు'' అని మాక్సిమ్ స్నేహితుడు తనతో చెప్పినట్లు సెర్గీయ్ తెలిపారు.
మక్సీమ్ కీయెవ్ నివాసి. అక్కడే ట్రావెల్ ఏజెన్సీలో పనిచేశారు. కేసినియాతో ఆయనకు అక్కడే పరిచయమైంది. తన కొడుకు దయ గల వ్యక్తి అని, కుటుంబాన్ని చాలా ప్రేమిస్తాడని సెర్గీయ్ చెప్పారు. ''తన కొడుకు అంటే మాక్సిమ్‌కు చాలా ఇష్టం. అతన్ని ఆడించడమే మక్సీమ్ హాబీ'' అని తెలిపారు.
చాలామంది యుక్రెయిన్ల తరహాలోనే మొదట తాను కూడా రష్యా అధ్యక్షుడు పుతిన్ దాడి చేస్తారంటే నమ్మలేదని సెర్గీయ్ చెప్పారు.
పుతిన్ యుద్ధం ప్రకటించాక, తొలుత దాడి జరిగే ప్రాంతాల్లో కీయెవ్ కూడా ఉంటుందని మక్సీమ్ భావించారు.
అందుకే కీయెవ్ పరిస్థితి గురించి తనతో పాటు స్కూలులో చదువుకున్న మిత్రునితో చర్చించి... వారంతా నగరాన్ని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నారు.
కీయెవ్‌కు పశ్చిమ శివారు ప్రాంతం 'డాచా'లో ఉన్న తన మిత్రుని మరో ఇంటికి మాక్సిమ్ కుటుంబంతో సహా వెళ్లారు. ప్రస్తుతం కాల్పులు జరిగిన ఇ-40 హైవేకు ఇది దగ్గరలోనే ఉంటుంది. కీయెవ్ నగరంలో కంటే శివార్లలో పరిస్థితులు కాస్త ప్రశాంతంగా ఉంటాయని మక్సీమ్ తన తండ్రితో చెప్పారు.
''కానీ, మక్సీమ్ భావించిన దానికి పూర్తి భిన్నంగా అక్కడ పరిస్థితులు మారిపోయాయి'' అని సెర్గీయ్ అన్నారు.
యుక్రెయిన్ తూర్పు, దక్షిణ భాగాలపైనే రష్యా ప్రధానంగా దృష్టి సారించినట్లు కనిపించిన సమయంలోనే... కీయెవ్ నగరానికి పశ్చిమాన ఉన్న ఇర్పిన్, బుచా, హోస్టోమెల్ వంటి పట్టణాలపై కూడా రష్యా బాంబు దాడులు ప్రారంభించింది. మక్సీమ్ కుటుంబం తలదాచుకుంటోన్న ప్రాంతానికి హోస్టోమెల్ చాలా దగ్గరగా ఉంటుంది.
కీయెవ్‌లోని తన ఇంట్లో నుంచి తరచుగా బాంబుల శబ్ధాలు వినేవాడినని సెర్గీయ్ చెప్పారు.
''డాచాలోని పరిస్థితుల గురించి మాక్సిమ్ ఎక్కువగా చెప్పేవాడు కాదు. ఇక్కడ ప్రశాంతంగానే ఉంది. అంతా బాగానే ఉంది అనేవాడు'' అని సెర్గీయ్ తెలిపారు.
''విద్యుత్ కోతలు, ఫోన్ సిగ్నల్ సరిగా లేకపోవడం వల్ల తరచుగా ఫోన్ చేయడం కుదరకపోయేది. బాంబు దాడులు నిరంతరం జరుగుతుండటం వల్ల వారు బేస్‌మెంట్‌లోకి వెళ్లిపోయారు. కేవలం ఆహారం కోసం మాత్రమే బయటకు వచ్చేవారు'' అని సెర్గీయ్ చెప్పారు.

మార్చి 7 నుంచి అక్కడ పూర్తిగా విద్యుత్ నిలిపేశారు. కరెంటు లేకపోవడంతో పాటు పరిస్థితులు అనుకూలించకపోవడంతో మాక్సిమ్, కేసినియాలతో పాటు అక్కడ నివసిస్తోన్న ఇతర కుటుంబాల వారు కూడా కీయెవ్‌కు తిరిగి వచ్చేయాలని నిర్ణయించుకున్నారు.
రష్యా బలగాలు మోహరించి ఉన్న హైవే గుండా ప్రయాణించడం చాలా ప్రమాదకరమనే సంగతి వారికి తెలుసు. కానీ, ఎలాగైనా సురక్షితంగా బయటపడగలమని వారు అనుకున్నారు.
పిల్లలతో కలిపి మొత్తం 50 మంది 10 కార్ల కాన్వాయ్‌లో కీయెవ్‌కు బయల్దేరారు. మాక్సిమ్ ప్రయాణిస్తోన్న కారు కాన్వాయ్‌లో మూడోది. ఆయన కారు విండోలకు తెల్లటి పేపర్‌పై 'పిల్లలు ఉన్నారు' అనే సంకేతాన్ని అతికించారు. మక్సీమ్ మిత్రుని కారు కూడా అదే కాన్వాయ్‌లో ఉంది. మాక్సిమ్, కేసినియా కారులోనే ఆయన మిత్రుని తల్లి కూడా ఉన్నారు. దారిలో జరిగిన ఘటన గురించి మాక్సిమ్ స్నేహితుడు సెర్గీయ్‌కు చెప్పారు.
రష్యా సైనికులు కాల్పులు ప్రారంభించగానే మాక్సిమ్ కారుకు బుల్లెట్లు తగిలాయి. కారు ఇంజిన్ ఆగిపోయింది. ''నా కొడుకు కారు నుంచి బయటకు వచ్చి చేతులు పైకెత్తాడు. కారులో చిన్నపిల్లలు ఉన్నారు అని అరవడం ప్రారంభించారు. అలా చేస్తే కనీసం తన కొడుకైనా ప్రాణాలతో బయట పడతాడు అని అనుకున్నాడు'' అని సెర్గీయ్ చెప్పారు.
కాన్వాయ్‌లోని మొదటి మూడు కార్లు తప్ప మిగతా కార్లు ఎందుకు వెనుకబడిపోయాయో స్పష్టంగా తెలియదు. తుపాకుల మోత వినబడటం, ముందు వెళ్లిన కార్లు వెనక్కి తిరిగి రావడం చూసి మిగతా వారు కూడా వెనక్కి వెళ్లిపోయి ఉంటారని సెర్గీయ్ భావిస్తున్నారు.
కాల్పుల తర్వాత మాక్సిమ్ మృతదేహం హైవేపై, కేసినియా బాడీ కారులోనే ఉండిపోయింది. కారు దగ్గరకు వచ్చిన రష్యా సైనికులు, రోడ్డు వెంట నడిచి వెళ్లిపోవాలని మాక్సిమ్ కొడుకుతో పాటు, అందులోని పెద్దావిడకు చెప్పారు.
రష్యా సైనికుల నుంచి దూరంగా వచ్చిన తర్వాత ఆమె తన భర్తకు ఫోన్ చేశారు. ఆయన వారిద్దరిని సురక్షితంగా డాచాకు తీసుకెళ్లారు. ఆ మరుసటిరోజు వారు భద్రంగా కీయెవ్‌కు చేరుకున్నారు.

ఫొటో సోర్స్, JEREMY BOWEN
మక్సీమ్ కొడుకు ఇప్పుడు తన నానమ్మ దగ్గర ఉన్నారు. కీయెవ్‌కు దూరంగా సురక్షితమైన ప్రాంతంలో సెర్గీయ్‌తో పాటు వారిద్దరూ ఉంటున్నారు.
శుక్రవారం సెర్గీయ్‌కు ఒక ఫోన్ వచ్చింది. ఆ ప్రాంతం మళ్లీ యుక్రెయిన్ బలగాల చేతుల్లోకి వచ్చిందంటూ ఆయనకు ఫోన్‌లో చెప్పారు. దానితో పాటు ఆయన చెడు వార్తలు కూడా విన్నారు.
''వారు అందరినీ తగులబెట్టారు. కార్లను కూడా తగులబెట్టారు'' అని సెర్గీయ్ చెప్పారు.
బీబీసీ జర్నలిస్టుల బృందం అదే దారి గుండా ప్రయాణిస్తూ కాలిపోయిన చాలా కార్లను, మృతదేహాలను చూసింది. అందులో మాక్సిమ్ కారు కూడా ఉంది. అది మొత్తం తగలబడిపోయింది. అందులో పూర్తిగా కాలిపోయిన దేహం తాలూకూ అవశేషాలు ఉన్నాయి. మరొకటి రోడ్డు పక్కన కాలిపోయినట్లు ఉంది. తగలబడిపోయిన బాడీ చేతికి వివాహపు ఉంగరం కనిపించింది.
జరిగిన సంఘటనతో తన గుండె బద్ధలైపోయిందని, తన మనవడు ఇదంతా చూడాల్సి వచ్చిందని సెర్గీయ్ ఆవేదన వ్యక్తం చేశారు.
రష్యా సైనికులను ఆయుధాలతో చూశానని తన మనవడు గుర్తు చేస్తుంటాడని చెప్పారు. బాబుకు కుటుంబ సభ్యులతోపాటు ప్రత్యేక నిపుణుల మద్దతును అందిస్తున్నామని తెలిపారు.
''సురక్షిత ప్రదేశంలో తన అమ్మమ్మ, నాన్నమ్మలను కలిశాక బాబు ఒక మాట అన్నాడు. 'ఇక మనం బేస్‌మెంట్‌లో పడుకోవద్దు. పడుకోం కదా? అక్కడ బూచాళ్లు ఎవరు ఉండరు కదా?''
ఇవి కూడా చదవండి:
- ఇమ్రాన్ ఖాన్ చేసిన తప్పులేంటి... అందుకే ఆయనకు మిత్రులు దూరమయ్యారా?
- ప్రసవంలో తల్లి చనిపోతే డాక్టర్ మీద మర్డర్ కేసు పెట్టారు, ఆ లేడీ డాక్టర్ ఆత్మహత్య చేసుకున్నారు
- శ్రీలంకలో ఎమర్జెన్సీ... ప్రజల భద్రత కోసమేనన్న అధ్యక్షుడు గొటాబయ రాజపక్స
- మందుల ధరలు ఏప్రిల్ 1 నుంచి ఎందుకు పెరుగుతున్నాయి... జనరిక్ ఔషధాలతో పరిష్కారం దొరుకుతుందా?
- రష్యా ప్రభుత్వ ఆంక్షలున్నా యుక్రెయిన్ యుద్ధ వార్తలను రష్యన్లు ఎలా తెలుసుకుంటున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










