ప్రసవంలో తల్లి చనిపోతే డాక్టర్ మీద మర్డర్ కేసు పెట్టారు, ఆ లేడీ డాక్టర్ ఆత్మహత్య చేసుకున్నారు

ఆత్మహత్య చేసుకున్న డాక్టర్ అర్చనా శర్మ

ఫొటో సోర్స్, MOHAR SINGH MEENA/BBC

ఫొటో క్యాప్షన్, ఆత్మహత్య చేసుకున్న డాక్టర్ అర్చనా శర్మ
    • రచయిత, మొహర్ సింగ్ మీణా
    • హోదా, బీబీసీ కోసం

రాజస్థాన్‌ లోని దౌసాలో మహిళా డాక్టర్ ఆత్మహత్య ఉదంతం కలకలం రేపింది. ఈ ఘటనపై వైద్య వర్గాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. డాక్టర్ ఆత్మహత్యకు దారి తీసిన పరిస్తితులపై విచారణ జరపాలని వైద్య సిబ్బంది ఆందోళనకు దిగారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు ఒక బీజేపీ నేతను అరెస్టు చేశారు. ఈ ఘటనపై బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్.

అసలేం జరిగింది?

దౌసా జిల్లాలోని లాల్‌సోట్ ఓ గర్భవతి బిడ్డకు జన్మనిచ్చి చనిపోయారు. దాంతో, ఆపరేషన్‌ చేసిన మహిళా వైద్యురాలిపై హత్యానేరం కింద కేసు నమోదు చేయాలని స్థానికులు, బీజేపీ నేతల నుంచి డిమాండ్‌ వినిపించింది.

పోలీసులు ఆ మహిళా డాక్టర్‌పై ఐపీసీ సెక్షన్ 302 కింద హత్య కేసు నమోదు చేశారు. ఈ అభియోగంతో కలత చెందిన లేడీ డాక్టర్ అర్చన శర్మ తమ ఆసుపత్రిలోనే ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.

ఆనంద్ హాస్పిటల్ లో మరణించిన ఆశా దేవి భైర్వా

ఫొటో సోర్స్, MOHAR SINGH MEENA/BBC

ఫొటో క్యాప్షన్, ఆనంద్ హాస్పిటల్ లో మరణించిన ఆశా దేవి భైర్వా

డాక్టర్ కుటుంబ సభ్యులు ఏం చెప్పారు?

జైపూర్‌కు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న లాల్‌సోట్‌లోని కోతున్ రోడ్‌లో ఆనంద్ హాస్పిటల్ ఉంది. ఈ హాస్పిటల్ డాక్టర్ అర్చన శర్మ , ఆమె భర్త సునీత్ ఉపాధ్యాయ కలిసి నిర్వహిస్తున్నారు. మార్చి 29న డాక్టర్ అర్చన శర్మ ఇదే హాస్పిటల్‌లో ఆత్మహత్య చేసుకున్నారు.

అర్చనా శర్మ ఇల్లు ఆసుపత్రికి కూతవేటు దూరంలో ఉంది. ''ఆమె ఆత్మహత్య చేసుకుంటుందని మేం అనుకోలేదు. మాకు ఎలాంటి సిగ్నల్ కూడా ఇవ్వలేదు. తనకు విశ్రాంతి కావాలని చెప్పింది. ఫోన్ తీయడం లేదని ఆమె సోదరుడు చెప్పాడు. నేను పైకి వెళ్లి తలుపు కొట్టాను. అది తెరుచుకోలేదు. తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లగా ఆమె ఉరితాడుకు వేలాడుతూ కనిపించింది'' అని భర్త సునీత్ ఉపాధ్యాయ తెలిపారు.

వీడియో క్యాప్షన్, తెలంగాణ: యూట్యూబర్స్ వెంకీ-స్వాతిలకు ఏమైంది?

తమ ఆస్పత్రిలో పేషెంట్ మరణించడం గురించి ఆయన వివరించారు. "ఆశాదేవి బైర్వా అనే పేషెంట్ మార్చి 27వ తేదీ రాత్రి 11 గంటల ప్రాంతంలో ఆసుపత్రికి వచ్చారు. ఆమె మొదట లాల్‌సోట్‌ లోని ప్రభుత్వ ఆసుపత్రికి, తరువాత దౌసాలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడి నుంచి ఆమెను జైపూర్‌కు రెఫర్ చేశారు. మార్చి 28న ఉదయం తొమ్మిది గంటలకు ఆపరేషన్‌ ద్వారా మగబిడ్డకు జన్మనిచ్చారు. అప్పటికి అంతా బాగానే ఉంది. పది గంటలకు ఆపరేషన్‌ థియేటర్‌ నుంచి వార్డుకు మార్చాం. 11 గంటలకు రక్తస్రావం అవుతున్నట్లు గమనించాం. ఆమెను కాపాడేందుకు రెండు గంటలపాటు మేం కష్టపడటం ఆమె కుటుంబ సభ్యులు కూడా చూశారు. రెండు యూనిట్ల రక్తం ఎక్కించినా, ఫలితం లేదు. ఆమె ఒంటి గంటకు చనిపోయారు. ఆ రోజే ఆమెను అంబులెన్స్‌లో ఇంటికి తీసుకెళ్లారు'' అని సునీత్ తెలిపారు.

''మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఆసుపత్రి ఎదుట ఆందోళనలు మొదలయ్యాయి. డాక్టర్‌ను అరెస్టు చేయాలని, హత్య కేసు నమోదు చేయాలని, లైసెన్స్ రద్దు చేయాలని కొందరు ఆందోళనకు దిగారు. ఆసుపత్రి లోపల ఉన్న సీసీటీవీలో ఆమె ఇవన్నీ చూశారు. తీవ్ర నిరాశకు లోనయ్యారు'' అని డాక్టర్ సునీత్ ఉపాధ్యాయ తెలిపారు.

డాక్టర్ అర్చనా శర్మ

ఫొటో సోర్స్, anandhospitallalsot.in

ఆత్మహత్యకు ముందు డాక్టర్ అర్చన శర్మ రాసిన లేఖ కూడా దొరికింది. ఇది డాక్టర్ అర్చన రాసిన సూసైడ్ నోట్‌గా ఆమె కుటుంబ సభ్యులు చెప్పగా, రాజస్థాన్ పోలీసు అదనపు డైరెక్టర్ గోవింద్ పారిఖ్ మాత్రం ''ఆ నోట్ ఆమె రాసిందా కాదా అన్నదానిపై విచారణ జరుగుతోంది'' అని వెల్లడించారు.

ఈ నోట్‌లో, ''నాకు నా భర్త, పిల్లలంటే చాలా ఇష్టం. నేను చనిపోయిన తర్వాత దయచేసి వారిని డిస్టర్బ్ చేయకండి. నేను ఏ తప్పు చేయలేదు, ఎవరినీ చంపలేదు. డాక్టర్లను హింసించడం ఆపండి. నా మరణం నేను నిర్దోషి అని నిరూపించవచ్చు. దయచేసి అమాయక వైద్యులకు హాని చేయకండి'' అని ఉంది.

ఆనంద్ హాస్పిటల్ నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో గంగాపూర్ రహదారికి సమీపంలో ఖేమావాస్ గ్రామం ఉంది. ఇది ఆసుపత్రిలో మృతి చెందిన ఆశాదేవి బైర్వా నివసించే ఊరు. బీబీసీ బృందం ఆమె ఇంటికి వెళ్లింది. కుర్చీ మీద ఆశాదేవి ఫొటో పెట్టి, ఆమె భర్త లాలూ రాం తన ముగ్గురు కూతుళ్లతో పక్కనే కూర్చున్నారు. పదో తరగతి వరకు చదివిన లాలూ రాం కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

"ఇంతకు ముందు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. ఇప్పుడు నాలుగో ప్రసవం. స్టెరిలైజేషన్ (కుటుంబ నియంత్రణ ఆపరేషన్) చేయించుకుంటేనే ఆమెకు డెలివరీ చేస్తామని ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది చెప్పారు. నా భార్య నిరాకరించింది. తర్వాత నేను డాక్టర్ అర్చన మేడమ్‌ని సంప్రదించాను. జైపూర్ నుంచి వచ్చిన నా భార్యను డాక్టర్ అర్చన పరీక్షించారు. ఆమెకు రక్తస్రావం అవుతుందని చెప్పారు. ఆపరేషన్ చేయాలన్నారు. నేను చేయమన్నాను. పిల్లవాడు పుట్టిన గంట తర్వాత రక్తస్రావం అవుతోందని, గర్భాశయానికి ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్పారు. చేయండని చెప్పి నేను బయటకు వచ్చాను. తర్వాత నేను స్పృహ తప్పి పడిపోయాను. స్పృహలోకి వచ్చేసరికి ఇంట్లో అందరూ ఏడుస్తూ కనిపించారు. డెడ్ బాడీతో పాటు రెండు గంటల క్రితం పుట్టిన బిడ్డను కూడా వెంట పంపించారు'' అని లాలూ రాం వివరించారు.

ఆసుపత్రి ముందు ఆందోళన చేసింది ఎవరో తనకు అర్ధం కాలేదని, సెక్షన్ 302 అంటే కూడా తనకు తెలియదని లాలూ రాం అన్నారు. ''నేను పోలీసులకు ఫిర్యాదు చేయలేదు'' అని ఆయన వెల్లడించారు.

డాక్టర్ అర్చన శర్మ ఆత్మహత్య చేసుకున్నారని మీకు తెలుసా అని అడిగినప్పుడు ‘‘మేడమ్ ఆత్మహత్య చేసుకున్నారని వార్తల్లో చూశాను'' అన్నారాయన.

పిల్లలతో లాలూ రాం భైర్వా

ఫొటో సోర్స్, MOHAR SINGH MEENA/BBC

ఫొటో క్యాప్షన్, పిల్లలతో లాలూ రాం భైర్వా

బీజేపీ నేత సహా ఇద్దరి అరెస్ట్

డాక్టర్ అర్చన శర్మ ఆత్మహత్య కేసులో, బీజేపీ మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గోత్వాల్‌ను గురువారం ఉదయం జైపూర్‌లో పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకు 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. డాక్టర్ అర్చనా శర్మను ఆత్మహత్యకు పురికొల్పారన్నది ఆయనపై ఉన్న ఆరోపణ.

''జితేంద్ర గోత్వాల్‌‌తో సహా ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశాం. మిగిలిన వారిని అరెస్టు చేయడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి'' అని రాజస్థాన్ డీజీపీ ఎంఎల్ లాఠర్ వెల్లడించారు.

ఆందోళనకు దిగిన వైద్య ఆరోగ్య సిబ్బంది

ఫొటో సోర్స్, MOHAR SINGH MEENA/BBC

ఫొటో క్యాప్షన్, ఆందోళనకు దిగిన వైద్య ఆరోగ్య సిబ్బంది

డాక్టర్ ఆత్మహత్యపై సోషల్ మీడియాలో నిరసనలు

వైద్యురాలి ఆత్మహత్యపై రాజస్థాన్ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని వైద్యుల సంఘాలు ఏకతాటిపైకి వచ్చి మార్చి 30న రాజస్థాన్‌లోని అన్ని ప్రైవేట్ ఆసుపత్రులలో విధులను బహిష్కరించాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైద్యులు వీధుల్లోకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. పలు పార్టీలు, విపక్షాల నేతలు కూడా ఈ ఘటనపై స్పందించారు.

డాక్టర్ అర్చనా శర్మ ఆత్మహత్య ఘటన దురదృష్టకరమని ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ట్వీట్ చేశారు. ''మనం డాక్టర్లను దేవుడితో సమానంగా చూస్తాం. ఏదైనా దురదృష్టకర సంఘటన జరిగిన వెంటనే వారిపై ఆరోపణలు, దాడులు సరికాదు'' అని గహ్లోత్ పేర్కొన్నారు.

ఆనంద్ హాస్పిటల్

ఫొటో సోర్స్, anandhospitallalsot.in

ఫొటో క్యాప్షన్, ఆనంద్ హాస్పిటల్

తర్వాత ఏం జరిగింది?

ఈ ఘటన తర్వాత దౌసా జిల్లాకు చెందిన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) అనిల్ బెనివాల్ బదిలీ అయ్యారు. ఎస్‌హెచ్‌వో అంకేశ్ చౌధరిని సస్పెండ్‌ చేశారు. సీఎం అశోక్ గహ్లోత్ డాక్టర్ అర్చన శర్మ భర్తతో ఫోన్‌లో మాట్లాడి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఆత్మహత్య అనంతరం పోలీసులు డాక్టర్ అర్చనపై మోపిన సెక్షన్ 302ను తొలగించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకుంటే ఆందోళనకు దిగుతామని రాష్ట్రంలోని వైద్య సంఘాలు హెచ్చరించాయి.

''నా భార్య మరణానికి కారణమైన వారిని అరెస్టు చేయాలి. పోలీసులపై హత్యా నేరం మోపాలి. వారే నా భార్య మరణానికి కారకులు. వారిపై హత్యా నేరం మోపితేనే నా భార్యకు న్యాయం జరుగుతుంది'' అని డాక్టర్ అర్చన శర్మ భర్త సునీత్ ఉపాధ్యాయ్ డిమాండ్ చేశారు.

వీడియో క్యాప్షన్, 75 ఏళ్లలో ఒక్క పాకిస్తాన్‌ ప్రధాని కూడా ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకోలేదు, ఎందుకు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)