అస్సాం: అంతుచిక్కని భారీ రాయి పాత్రలు వెలుగులోకి.. దేని కోసం ఇంత పెద్ద రాళ్లను తయారుచేశారు?

ఫొటో సోర్స్, TILOK THAKURIA
పూర్వకాలంలో చనిపోయిన మనిషిని సమాధి చేసే ప్రక్రియలో వాడినట్లుగా భావిస్తున్న పెద్ద పెద్ద 'అంతుచిక్కని' పాత్రలు వెలుగులోకి వచ్చాయి.
అస్సాంలోని నాలుగు ప్రాంతాల్లో మొత్తంగా ఇలాంటి 65 ఇసుకరాతి (sandstone) పాత్రలు బయటపడ్డాయి.
వీటి పరిమాణం ఒక్కోటి ఒక్కోలా ఉన్నాయి. కొన్ని పొడుగ్గా, సిలిండర్ ఆకారంలో ఉంటే మరికొన్ని గుండ్రంగా ఉన్నాయి. వీటిలో కొన్నింటిని భూమిలో సగం పాతిపెట్టారు.
ఈ పరిశోధనలో భారత్, ఆస్ట్రేలియాలకు చెందిన మూడు యూనివర్సిటీల పరిశోధకులు పాలుపంచుకున్నారు. ఈ పరిశోధన వివరాలను ఆసియన్ ఆర్కియాలజీ జర్నల్‌లో ప్రచురించారు.
నార్త్-ఈస్టర్న్ హిల్ యూనివర్సిటీకి చెందిన తిలోక్ ఠాకురియా, గువాహటి యూనివర్శిటీకి చెందిన ఉత్తమ్ బఠారీ ఈ పరిశోధనకు నేతృత్వం వహించారు.
‘‘ఈ భారీ రాయి పాత్రలను ఎవరు తయారుచేశారో, వీటిని తయారుచేసినవారు ఎక్కడ జీవించారో అంతుచిక్కడం లేదు’’అని ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుడు నికోలస్ స్కోపల్ వివరించారు.

ఫొటో సోర్స్, TILOK THAKURIA
ఈ భారీ పాత్రలను ఎందుకు ఉపయోగించారో స్పష్టంగా తెలియకపోయినప్పటికీ, బహుశా వీటిని సమాధుల కోసం ఉపయోగించి ఉండొచ్చని పరిశోధకులు అనుమానిస్తున్నారు.
‘‘ఇలాంటి అస్సాం పాత్రల్లో మృతదేహ అవశేషాలు, పూసలు, ఆభరణాలను తాము ఇదివరకు కూడా చూశామని ఈశాన్య భారత దేశానికి చెందిన నాగ ప్రజలు కథలుగా చెప్పుకుంటారు’’అని స్కోపల్ వివరించారు.
‘‘ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన ఈ పాత్రలు ఖాళీగానే కనిపిస్తున్నాయి. బహుశా వీటికి ఒకప్పుడు మూతలు కూడా ఉండి ఉండొచ్చు’’అని డాక్టర్ ఠాకురియా చెప్పారు.
‘‘ఈ పాత్రలు దొరికిన చుట్టుపక్కల ప్రాంతాల్లో మరింత లోతుగా అధ్యయనం చేపట్టి, వీటి గురించిన వివరాలను నమోదు చేయడంపై ప్రస్తుతం దృష్టి సారిస్తున్నాం’’అని ఆయన చెప్పారు.
అస్సాంలోని భిన్న ప్రాంతాలతోపాటు పొరుగునున్న మేఘాలయలోనూ ఇలాంటి ప్రాంతాలను ఇదివరకు గుర్తించినట్లు పరిశోధకులు వెల్లడించారు.
అస్సాంలో ఇప్పటివరకు పది ప్రాంతాల్లో 700కుపైగా రాతి పాత్రలను గుర్తించినట్లు డాక్టర్ ఠాకురియా చెప్పారు. ఈ పాత్రలు క్రీ.పూ. 400 ఏళ్లనాటివిగా భావిస్తున్నట్లు చెప్పారు.
‘‘ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పరిశోధన చేపట్టాం. మిగతా ప్రాంతాల్లోనూ పరిశోధన చేపడితే, ఇలాంటివి మరిన్ని బయటపడే అవకాశముంది’’అని పరిశోధకులు చెబుతున్నారు.
‘‘పరిశోధన చేపట్టడం ఆలస్యమయ్యేకొద్దీ ఇవి మరింత దెబ్బతినే ముప్పుంది. ఈ ప్రాంతాల్లో అడవులను ధ్వంసం చేసి మొక్కలను పెంచుతున్నారు. ఆ క్రమంలో వీటిని కూడా ధ్వంసం చేసే ముప్పుంది’’అని స్కోపల్ వివరించారు.
మరోవైపు ఇలాంటి రాయి పాత్రలే 2016లో లావోస్‌లో వెలుగుచూశాయి. వీటిని 2,000 ఏళ్ల క్రితం లావోస్‌లోని షీనెగ్ ప్రావిన్స్‌లో పూడ్చిపెట్టారు.
ఆ తర్వాత ఇలాంటి భిన్న పాత్రలను పరిశోధకులు కనుగొన్నారు. వీటిలో కొన్నింటిలో ఎముకలు కూడా లభించాయి.
‘‘అస్సాం, లావోస్‌లలో వెలుగుచూసిన రాయి పాత్రలు చూడటానికి ఒకేలా కనిపిస్తున్నాయి. అయితే, వీటి పరిమాణంలో తేడాలున్నాయి. అస్సాంలో కనిపించినవి కాస్త గుండ్రంగా ఉంటే, లావోస్‌లో వెలుగుచూసినవి సిలిండర్ ఆకారంలో ఉన్నాయి’’అని స్కోపల్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్: ఇమ్రాన్ ఖాన్‌కు ప్రతిపక్షానికీ మధ్య జరుగుతున్న యుద్ధంలో సైన్యం ఎటు వైపు?
- యుక్రెయిన్ మీద యుద్ధానికి రష్యాకు ఎంత ఖర్చవుతోంది?
- లేపాక్షి ఆలయాన్ని కట్టించిన వ్యక్తి కళ్లను విజయనగర రాజు పొడిపించేశారా?
- చైనా: పగలంతా ఆఫీసులో పని.. రాత్రి అక్కడే స్లీపింగ్ బ్యాగ్‌లో నిద్ర
- ఒక అనాథ ప్రపంచ కుబేరుడు ఎలా అయ్యారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













