యునెస్కో గుర్తింపు: లేపాక్షి ఆలయాన్ని కట్టించిన వ్యక్తి కళ్లను విజయనగర రాజు పొడిపించేశారా?

లేపాక్షి

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, రాజేశ్ పెదగాడి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అనంతపురం జిల్లాలోని లేపాక్షి గ్రామంలో చారిత్రక వీరభద్ర దేవాలయం, ఏకశిలా నంది విగ్రహాలకు యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో) ప్రపంచ వారసత్వ కట్టడాల తాత్కాలిక జాబితాలో చోటు దక్కింది.

ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చారిత్రక కట్టడానికి చోటు దొరకడం ఇదే తొలిసారి.

ప్రస్తుతం నామినేట్ అయిన ప్రపంచ వారసత్వ కట్టడాల తాత్కాలిక జాబితాను యునెస్కో కమిటీ పరిశీలిస్తుంది. అనంతరం వారసత్వ కట్టడాల తుది జాబితా విడుదల చేస్తారు.

ఇంతకీ ఏమిటీ దేవాలయం ప్రత్యేకత? దీనికి ప్రపంచ వారసత్వ కట్టడాల తాత్కాలిక జాబితాలో చోటు ఎందుకు దక్కింది?

లేపాక్షి

ఫొటో సోర్స్, Getty Images

వీరభద్రుడి గుడి..

ఆంధ్రప్రదేశ్ పర్యటక శాఖ, భారత ప్రభుత్వానికి చెందిన ఇంక్రెడిబుల్ ఇండియా వెబ్‌సైట్లలో పేర్కొన్న సమాచారం ప్రకారం.. హిందూపురం రైల్వే స్టేషన్‌కు 12 కి.మీ. దూరంలో అనంతపురం జిల్లాలో ఈ లేపాక్షి దేవాలయం ఉంది. హిందూపురం నుంచి ఇక్కడకు బస్సులు అందుబాటులో ఉంటాయి.

లేపాక్షి దేవాలయానికి చారిత్రక నేపథ్యముంది. హిందూ పౌరాణిక ఇతిహాసాల్లోని కథలు ఇక్కడ దేవాలయాల్లోని గోడలపై కనిపిస్తాయి. మనుషుల కంటే ఎత్తుండే దేవుడి విగ్రహాలను ఇక్కడ మనం చూడొచ్చు.

ఇక్కడ శివుడు, విష్ణువు, రాముడు, రఘునాథ, పాపనాథేశ్వరుడి దేవాలయాలు ప్రసిద్ధి చెందాయి. ఏకశిలా విగ్రహంపై చెక్కిన నంది, వీరభద్ర దేవాలయంలోని స్తంభాలపై అతిచిన్న శిల్పాలకు మంచి గుర్తింపు ఉంది. ప్రధాన దేవాలయంలో వీరభద్రుడి విగ్రహం ఉంటుంది.

"హిందూ పురాణాల ప్రకారం శివుడి అవతారాల్లో వీరభద్రుడి అవతారం ఒకటి. దక్షుడు ఓ మహా యజ్ఞాన్ని నిర్వహిస్తాడు. తన కుమార్తె సతి, ఆమె భర్తైన శివుడికి దీనికి ఆహ్వానం పంపకుండా అవమానిస్తాడు. దీంతో సతి ఆత్మాహుతి చేసుకుంటుంది. దీనికి ప్రతీకారం తీర్చుకునేందుకు శివుడు వీరభద్ర అవతారం ఎత్తుతాడు" అని ఏపీ టూరిజం వెబ్‌సైట్ పేర్కొంది.

లేపాక్షి

ఫొటో సోర్స్, Getty Images

అందమైన చిత్రాలతో

వీరభద్రుడితోపాటు పాపనాథేశ్వర, రఘునాథ, పార్వతి, రామలింగ, హనుమలింగ ఆలయాలు ఇక్కడ ఉన్నాయి.

తాబేలు ఆకారంలో కనిపించే తక్కువ ఎత్తుండే చిన్న కొండపై ప్రధాన ఆలయం ఉంటుంది. ఈ కొండను కుమారశైలం అని పిలుస్తారు.

దేవాలయానికి రెండు వైపులా పెద్ద గోడలు ఉంటాయి. ఈ గుడిలో మూడు భాగాలున్నాయి. వీటిలో మొదటిది నాట్య మండపం. రెండో అర్ధ మండపం. మూడోది కల్యాణ మండపం.

నాట్య, అర్ధ మండపాల పైకప్పులపై రామాయణం, మహాభారతం, పురాణాల కథలను కుడ్య చిత్రాలుగా చెక్కారు.

"ఒక పెయింటింగ్‌లో శిశువుగా ఉన్న కృష్ణుడు బొటన వేలు నోటిలో పెట్టుకొని కనిపిస్తాడు. మరో చిత్రంలో శివ, పార్వతీల పెళ్లి కనిపిస్తుంది. దీనిలో హిమవత్, విష్ణు, ఇతర దేవతలు వారిని దీవిస్తూ కనిపిస్తుంటారు" అని ఏపీ టూరిజం వెబ్‌సైట్‌లో ఉంది.

లేపాక్షి

ఫొటో సోర్స్, Getty Images

వేలాడే స్తంభం..

ప్రధాన దేవాలయం పైకప్పుపై వీరభద్రుడి చిత్రం కనిపిస్తుంది. 23 అడుగుల పొడవు, 13 అడుగుల వెడల్పుతో ఇది ఆసియాలోనే అతిపెద్ద కుడ్య చిత్రమని (మ్యూరల్ పెయింటింగ్) ఆంధ్రప్రదేశ్ పర్యటక శాఖ తమ వెబ్‌సైట్‌లో పేర్కొంది.

దేవాలయంలో గాల్లో వేలాడుతున్నట్లు కనిపించే స్తంభం ప్రధాన ఆకర్షణగా కనిపిస్తుంటుంది. దేవాలయంలోని ఇతర 70 స్తంభాల్లానే ఇది కనిపిస్తుంది. కానీ ఇది కింద నేలను తాకదు. దీని కింద నుంచి మనం పేపర్లను అటూఇటూ కదిలించొచ్చు.

ఈ స్తంభం కాస్త పక్కకు ఒరిగినట్లుగా కనిపిస్తుంది. దీన్ని కదిలించేందుకు ఓ బ్రిటిష్ ఇంజినీర్ విఫల యత్నం చేశారు.

మరోవైపు ఇక్కడ ఒక పెద్ద పాద ముద్ర కనిపిస్తుంది. ఇది సీతాదేవి పాద ముద్రగా స్థానికులు చెబుతుంటారు.

లేపాక్షి

ఫొటో సోర్స్, aptourism

సగం నిర్మించిన కల్యాణ మండపం..

భారత ప్రభుత్వానికి చెందిన ఇంక్రెడిబుల్ ఇండియా వెబ్‌సైట్‌‌లోని సమాచారం ప్రకారం.. ఇక్కడ కల్యాణ మండపం ఒకటి కనిపిస్తుంది. శివ, పార్వతీల కల్యాణ మండపంగా పిలుస్తున్న దీన్ని సగం కట్టి మధ్యలో ఆపేశారు. దీనికి వెనుక ఓ కథ కూడా ఉంది.

‘‘ఈ దేవాలయాన్ని రాజు అనుమతి లేకుండానే ప్రభుత్వ ఖజానాతో విరూపన్న, వీరన్న నిర్మించేందుకు ప్రయత్నించారు. ఈ విషయం రాజుకు తెలియడంతో వీరు మధ్యలోనే దేవాలయ నిర్మాణాన్ని వదిలిపెట్టేశారు’’

"దేవాలయానికి దక్షిణాన నాగలింగం ఉంటుంది. దీనిపై ఏడు తలల నాగదేవత విగ్రహం ఉంటుంది"

"ఇక్కడ పాము, సాలీడు, ఏనుగు కలిసి లింగాన్ని పూజిస్తున్న విగ్రహం కూడా కనిపిస్తుంది" అని ఇంక్రెడిబుల్ ఇండియా వెబ్‌సైట్ పేర్కొంది.

లేపాక్షి

ఫొటో సోర్స్, aptourism

బసవన్న ప్రత్యేకం

భారీ నంది విగ్రహం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. దీన్ని బసవన్నగా పిలుస్తారు. ఇది ప్రధాన ఆలయానికి 200 మీటర్ల దూరంలో ఉంటుంది.

నాగలింగేశ్వర ఆలయానికి అభిముఖంగా ఈ నంది కూర్చుని ఉంటుంది. నంది మెడలో గంటల దండ ఉంటుంది.

15 అడుగుల ఎత్తు, 27 అడుగుల వెడల్పుతో ఇది దేశంలోనే అతిపెద్ద ఏకశిలా నంది విగ్రహమని ద ఇంక్రెడిబుల్ ఇండియా వెబ్‌సైట్ పేర్కొంది.

నంది ఆభరణాలు చక్కగా చెక్కినట్లు కనిపిస్తాయి.

లేపాక్షి

ఫొటో సోర్స్, aptourism

చరిత్ర ఇదీ

‘‘లేపాక్షి గురించి స్కంద పురాణంలో ప్రస్తావించారు. ‘లేపాక్షాయ-పాపనాశాయ’అని స్కంద పురాణంలో పేర్కొన్నారు. దీన్ని 108 దివ్య క్షేత్రాల్లో ఒకటిగా చెప్పారు’’ అని ఆంధ్రప్రదేశ్ పర్యటక శాఖ తమ వెబ్‌సైట్‌లో పేర్కొంది.

‘‘లేపాక్షి గురించి చాలా కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. వీటిలో ఒకటి రామాయణంలోనూ ప్రస్తావించారు. అదే జటాయువు కథ".

"రావణుడు సీతను అపహరించుకుని వెళ్లినప్పుడు ఓ పక్షి కాపాడేందుకు ప్రయత్నించింది. అయితే, రావణుడితో పోరాటంలో ఆ పక్షి తీవ్రంగా గాయపడింది. అక్కడకు వచ్చి రాముడు దాన్ని చూసి ప్రేమతో ‘‘లే పక్షి’’అని పిలిచారు. మిగతా కథలతో పోలిస్తే, ఈ కథ కాస్త ఎక్కువ ప్రాచుర్యంలో పొందింది"

‘‘ఆగస్త్య ముని ఈ ఆలయాన్ని నిర్మించినట్లు పురాణాల్లో ఉంది. కానీ, రాజు అచ్యుతదేవరాయ కాలంలో అధికారిగా పనిచేసిన విరూపన్న, ఆయన సోదరుడు వీరన్న ఈ ఆలయాన్ని నిర్మించి ఉండొచ్చు. ఈ దేవాలయంలో 20 వరకు శాసనాలు ఉన్నాయి. వీటిలో కొన్ని 1583 నాటివి కూడా ఉన్నట్లు పురాతత్వ శాస్త్రవేత్తలు గుర్తించారు’’ అని ఆంధ్రప్రదేశ్ పర్యటక శాఖ తమ వెబ్‌సైట్‌లో పేర్కొంది.

వీడియో క్యాప్షన్, రామప్పగుడి: ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందిన ఈ ఆలయం ప్రత్యేకతలేంటి?

మరోవైపు వీరూపన్న ఆధ్వర్యంలో ఈ ఆలయ నిర్మాణం జరిగిందని లేపాక్షిపై పరిశోధన చేపట్టిన హిందూపూరంలోని ఎస్‌డీజీఎస్ కాలేజీలోని చరిత్ర విభాగం అధిపతి, అసోసియేట్ ప్రొఫెసర్ డా. ఈ శ్రీధర్ కూడా వివరించారు.

లేపాక్షికి సంబంధించి భారత పురావస్తు విభాగం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ సేకరించిన ఆధారాలు, పత్రాలపై ఆయన అధ్యయనం చేపట్టారు.

‘‘విజయనగర రాజైన అచ్యుతదేవరాయలు దగ్గర పెనుకొండ విరూపన్న అధికారిగా పనిచేశారు. అయితే, రాజు అనుమతి లేకుండానే విరూపన్న ఈ ఆలయ నిర్మాణానికి నిధులు కేటాయించినట్లు కొన్ని కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. విరూపన్నతోపాటు ఆయన సోదరుడు వీరన్న కళ్లను అచ్యుతదేవరాయలు తీయించేశారని కూడా స్థానికులు చెబుతుంటారు. కానీ, ఆ కథల్లో నిజం లేదు. విరూపన్న, అచ్యుతదేవరాయలు మధ్య మంచి సంబంధాలుండేవని ఆధారాలు చెబుతున్నాయి’’ అని అసోసియేట్ ప్రొఫెసర్ డా. ఈ శ్రీధర్ చెప్పారు.

‘‘లేపాక్షి ఆలయం కోసం రాజే స్వయంగా చెల్వవిందాల, హంబన హల్లి, కౌసువారి పళ్లి, తిమ్మంగన హల్లి తదితర గ్రామాలను 1531 నుంచి 1535 మధ్య దానం చేసినట్లు ఆధారాలున్నాయి’’అని చెప్పారు.

‘‘కల్యాణ మండపం మధ్యలో నిలిపివేసిన విషయం గురించి ప్రస్తావిస్తూ.. అచ్యుతదేవరాయలు చాలా యుద్ధాలకు వెళ్లారు. దీని వల్ల ఆర్థిక పరిస్థితి దిగజారి ఉండొచ్చు. ఫలితంగా దేవాలయాలకు నిధులు కేటాయించకపోయుండొచ్చు. అందుకే ఆ నిర్మాణాన్ని మధ్యలోనే ఆపేయొచ్చు’’ అని ఎస్‌డీజీఎస్ కాలేజీలోని చరిత్ర విభాగం అధిపతి, అసోసియేట్ ప్రొఫెసర్ డా. ఈ శ్రీధర్ అన్నారు.

వీడియో క్యాప్షన్, గుడిమల్లం: విశిష్ట లింగాకారంతో పూజలందుకుంటున్న ప్రాచీన ఆలయం

‘ఆంధ్రప్రదేశ్ అజంతా’

మరోవైపు ఈ దేవాలయం విజయనగర పాలనా (14-17వ శతాబ్దాల మధ్య కాలం)నాటిదని చరిత్రకారుడు సాయినాథ్ రెడ్డప్ప చెప్పారు. ‘‘ఆర్కిటెక్చురల్ వండర్ లేపాక్షి’’అనే పుస్తకాన్ని ఆయన రాశారు.

‘‘విజయనగర కుడ్య చిత్రాలకు ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. అందుకే దీన్ని ‘ఆంధ్రప్రదేశ్ అజంతా’గా పిలుస్తుంటారు. ఆనాటి కాలంనాటి ప్రజల జీవిత విశేషాలను ఈ చిత్రాలు మనకు కళ్లకు కడతాయి’’అని ఆయన చెప్పారు.

‘‘గుడిలోని చాలా విగ్రహాలు నాట్యం చేస్తూ, సంగీత పరికరాలు వాయిస్తూ కనిపిస్తాయి. ఆ కాలంలో కళలకు ఇచ్చే ప్రాముఖ్యతను ఇవి కళ్లకు కడుతున్నాయి. ఇక్కడ పెయింటింగ్స్‌ను లేపాక్షి శైలి లేదా లేపాక్షి స్టైల్ పెయింటింగ్స్ అని పిలుస్తారు’’ అని ఆయన వివరించారు.

''గత ఏడాది తెలంగాణకు చెందిన రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ గుర్తింపు లభించినప్పుడే లేపాక్షి పేరు కూడా వార్తల్లో నిలిచింది. దీన్ని ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చేర్చాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది'' చరిత్రకారుడు సాయినాథ్ రెడ్డప్ప అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)