పెట్రో డాలర్‌ పెత్తనానికి కాలం చెల్లిందా... భారత్, చైనా, సౌదీ దేశాలు మరో కరెన్సీ కోసం చూస్తున్నాయా?

పెట్రోడాలర్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అనీస్ అల్‌ఖదైహీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కొన్నిరోజుల కిందట వాల్‌స్ట్రీట్ జర్నల్‌ ఒక వార్త రాసింది. చైనాకు చమురు అమ్మకాలలో చెల్లింపులకు సంబంధించి యువాన్‌లను కూడా అంగీకరించడానికి సౌదీ అరేబియా సుముఖంగా ఉన్నట్లు ఆ వార్త తెలిపింది.

దీంతో ఇంధనం అమ్మకాలు, కొనుగోళ్లలో పెట్రో డాలర్ శకం ముగిసిపోతోందా అన్న అనుమానాలు కూడా ఊపందుకున్నాయి.

'పెట్రోడాలర్' అనే పదం 70లలోవాడుకలోకి వచ్చింది. అప్పటి నుంచి ప్రపంచ వ్యాపారంలో అంతర్జాతీయ లావాదేవీలకు ప్రాధాన్యం కలిగిన కరెన్సీగా డాలర్ స్థానం బలోపేతం అవుతూనే ఉంది.

చైనా కరెన్సీ యువాన్ గురించి వచ్చిన వార్తలు సౌదీ వర్గాలను ఉటంకిస్తూ వచ్చాయని ఇంధన రంగంలోని పబ్లిషింగ్ కంపెనీ ఎనర్జీ ఇంటెలిజెన్స్ సీనియర్ ఎడిటర్ రఫీక్ లట్టా వెల్లడించారు. అయితే, దీనిని సౌదీ అరేబియా అధికారికంగా ధ్రువీకరించకపోయినా, దీనిపై చర్చ మాత్రం కొనసాగుతూనే ఉంది.

ఈ ఏడాది ప్రపంచ చమురు వ్యాపారం 2.6 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఇంధన నిపుణుడు డాక్టర్ అనస్ అల్హాజీ చెప్పారు. ఇది చాలా పెద్ద మొత్తం.

చమురు కొనుగోలు, అమ్మకాలకు పెద్ద మొత్తంలో కరెన్సీ లిక్విడిటీ అవసరం ఉంటుంది. ఈ లావాదేవీలన్నింటిని డాలర్ కరెన్సీ ద్వారా నిర్వహించడం సులభమైన మార్గం.

డాలర్ అత్యధిక లిక్విడిటీని కలిగి ఉంది. దీని మారకం రేటు ఇతర కరెన్సీల కంటే స్థిరంగా ఉంటుంది. ప్రపంచంలో లావాదేవీలకు ఎక్కువమంది ఆమోదించిన కరెన్సీ డాలర్‌.

పెట్రోడాలర్

ఫొటో సోర్స్, NURPHOTO

‘పెట్రో డాలర్’ ఎలా మొదలైంది?

ప్రపంచ చమురు సంక్షోభం తర్వాత, 1974లో సౌదీ అరేబియా ప్రభుత్వం అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్‌తో ఒప్పందం చేసుకుంది. దాని ప్రకారం సౌదీ అరేబియా చమురు ఎగుమతులు డాలర్లలో ఉండాలని నిర్ణయించారు.

ఈ ఒప్పందం ప్రకారం, సౌదీ అరేబియా తన డబ్బును అమెరికా ట్రెజరీ బాండ్లలో పెట్టుబడి పెట్టింది. అయితే, సౌదీ అరేబియా, అమెరికాల మధ్య ఈ ఒప్పందం విస్తృతమైన ప్రభావం చూపిందని చెప్పవచ్చు. చాలా దేశాలు సౌదీ అరేబియా అడుగుజాడల్లో నడిచాయి. ప్రపంచ వ్యాప్తంగా చమురు ధర డాలర్లలో నిర్ణయించడం మొదలైంది.

ఈ కారణంగానే ప్రపంచవ్యాప్తంగా పలుదేశాలు చమురుతోపాటు ట్రెజరీ బాండ్లను కొనడం, విదేశీ సరుకులను కొనడానికి, సర్వీసులను వినియోగించుకోవడానికి విదేశీ మారక నిల్వలను డాలర్లలోకి మార్చడం ప్రారంభించాయి.

వీడియో క్యాప్షన్, మీ బడ్జెట్‌పై యుక్రెయిన్ యుద్ధం ఎఫెక్ట్ ఇది

ఈనాటి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఈ స్థాయికి తీసుకురావడంలో డాలర్ వాణిజ్యం కీలక పాత్ర పోషించిందని రఫీక్ లట్టా చెప్పారు. "విదేశీ మారక నిల్వలను పెట్టుకునే దేశాలలో 60 శాతం కంటే ఎక్కువ నిల్వలు డాలర్లలో ఉంటాయి" అని లట్టా వెల్లడించారు.

"అమెరికా ప్రపంచ శక్తిగా ఏర్పడటానికి పెట్రోడాలర్ ఆర్థిక వ్యవస్థ దోహదపడింది. ఈ పరిస్థితిలో ఏదైనా ఒక మార్పు ఏర్పడటం ఆర్థిక అంశానికి మాత్రమే పరిమితం కాదు. ఇది ప్రపంచ రాజకీయాలు, అంతర్జాతీయ సంబంధాలు, సమీకరణాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది" అని లట్టా అభిప్రాయపడ్డారు.

పెట్రోడాలర్

ఫొటో సోర్స్, Getty Images

వ్యవస్థాగత మార్పులు

2020 సంవత్సరపు గణాంకాల ప్రకారం, చైనా ప్రస్తుతం ప్రతిరోజూ కోటి బ్యారెళ్ల ముడి చమురును దిగుమతి చేసుకుంటుంది. ఇందులో సౌదీ అరేబియా నుంచి 17 లక్షల బ్యారెళ్ల చమురు దిగుమతి అవుతోంది. చైనా చమురు దిగుమతుల్లో ఇది దాదాపు 17 శాతం. సౌదీ అరేబియా మొత్తం చమురు ఎగుమతుల్లో ఇది 26 శాతం.

రష్యా నుంచి చైనా ప్రతిరోజూ 15 లక్షల బ్యారెళ్ల చమురును దిగుమతి చేసుకుంటోంది. ప్రస్తుతం, చైనా ప్రపంచ వ్యాప్తంగా ఇంధన వినియోగంలో ప్రధాన వినియోగదారుగా మారింది.

ఈ వాస్తవం ప్రపంచ చమురు మార్కెట్ నిర్మాణాన్ని మార్చింది. ఇండియా, జపాన్, దక్షిణ కొరియా వంటి ఆసియా దేశాలు కూడా ముడి చమురుకు భారీ కస్టమర్లుగా ఆవిర్భవించాయి.

యూఎస్‌ ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ 2020 డేటా ప్రకారం, సౌదీ అరేబియా చమురు ఎగుమతుల్లో 77 శాతం ఆసియా మార్కెట్లకు వెళుతుంది. యూరప్‌కు కేవలం 10 శాతం మాత్రమే వెళ్తుంది. ప్రతిరోజూ కేవలం ఐదు లక్షల మిలియన్ బ్యారెళ్ల చమురు మాత్రమే అమెరికాకు వెళుతుంది. యూఎస్‌ తమ దేశంలో వెలికితీసే చమురుపైనే ఎక్కువగా ఆధారపడుతుంది.

ఈ వాస్తవికతను దృష్టిలో ఉంచుకుని, సౌదీ అరేబియా, రష్యా, ఇతర చమురు ఎగుమతి దేశాలు చైనాతోపాటు, ఇతర ఆసియా దేశాలతో వ్యూహాత్మక సంబంధాలను నిర్మించుకోవాలని చూస్తున్నాయి. తద్వారా తమ చమురును ఈ ముఖ్యమైన మార్కెట్‌లకు చేర్చాలని కోరుకుంటున్నాయి.

ఇందుకోసం చైనా, ఇండియా, దక్షిణ కొరియా, జపాన్‌లలో రిఫైనరీలను నిర్మించాలని చమురు ఎగుమతి దేశాలు భావిస్తున్నాయి. వీటివల్ల చమురు కొనుగోలు చేసే దేశాలు దీర్ఘకాలిక కొనుగోలు ఒప్పందాలను చేసుకోగలుగుతాయి.

సౌదీ కంపెనీ అరాంకో ఇటీవలే చైనాతో పెట్రోల్ కెమికల్ కాంప్లెక్స్ అండ్‌ రిఫైనరీని నిర్మించడానికి ఒప్పందంపై సంతకం చేసింది. దీంతో ఇంధన రంగంలో రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలు ఏర్పడినట్లయింది.

సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్

యువాన్‌ చెల్లింపులు ఎందుకు?

డాలర్‌కు బదులుగా వేరే కరెన్సీని ఉపయోగించడం గురించి చర్చ 50 సంవత్సరాల నుంచి జరుగుతోందని డాక్టర్ అల్హాజీ చెప్పారు. గత కొన్నేళ్లుగా చైనా కరెన్సీ యువాన్‌లో కొనుగోలు చేయడంపై చర్చ కూడా తీవ్రమైంది.

"ఈ విషయం ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. ఇది సౌదీ అరేబియా, అమెరికా మధ్య సంబంధాలపై ప్రభావం చూపుతుంది" అన్నారు రఫీక్ లట్టా

ప్రపంచ చమురు మార్కెట్ గత కొంతకాలంగా అనేక మార్పులను చూస్తోంది. యుక్రెయిన్‌ పై రష్యా దాడితో మారిన భౌగోళిక రాజకీయ వాతావరణాన్ని కూడా ఇది ప్రతిబింబిస్తోంది.

సౌదీ అరేబియా నుండి కొనుగోలు చేసిన చమురు బిల్లులను యువాన్‌‌లలో చెల్లించే ఏర్పాటు సౌదీ అరేబియా, చైనా లకు బీమా పాలసీ లాగా ఉంటుందని చాలామంది నిపుణులు భావిస్తున్నారు.

భవిష్యత్తులో ఏవైనా పరిమితుల కారణంగా, డాలర్లలో చమురు ఒప్పందాలపై నిషేధాలు ఎదురైతే అప్పుడు యువాన్ ఒక బెస్ట్‌ ఆప్షన్‌గా ఉంటుంది.

వీడియో క్యాప్షన్, పుతిన్ ఇంత శక్తిమంతంగా ఎలా మారారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)