Alopecia-విల్ స్మిత్ భార్య జెడా పింకెట్‌: జుట్టు విపరీతంగా రాలిపోయే ఈ అలపీషియా జబ్బు ఏంటి?

విల్ స్మిత్, జెడా పింకెట్

ఫొటో సోర్స్, Lionel Hahn/Getty

ఫొటో క్యాప్షన్, విల్ స్మిత్, జెడా పింకెట్
    • రచయిత, షాలిని కుమారి
    • హోదా, బీబీసీ కోసం

హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ భార్య జెడా పింకెట్ ఒక జబ్బు కారణంగా గత రెండు రోజులుగా వార్తల్లో ఉన్నారు.

ఆస్కార్ అవార్డుల వేదికపై స్టాండ్ అప్ కమెడియన్ క్రిస్ రాక్‌ ఆమెపై జోక్ చేయడంతో స్మిత్ వేదికపైకి వెళ్లి రాక్ చెంపపై కొట్టారు. దీంతో, ఇది వార్తగా మారిపోయింది.

రాక్ జెడా పింకెట్ గుండును జీఐ జేన్ సినిమాలో నటించిన డెమీ మూర్ తో పోల్చారు. ఆమె సినిమా కోసం గుండు చేయించుకున్నారు.

జెడా పింకెట్ కున్న పొట్టి జుట్టు వల్ల రాక్ డెమీ మూర్ గుండుతో పోల్చారు. ఆయన "ఐ లవ్ యూ జీ. నిన్ను జీఐ జెన్ 2 లో ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఎదురు చూస్తున్నాను" అని అన్నారు.

అమెరికన్ నటి జెడా పింకెట్ 'ది మ్యాట్రిక్స్ ఫ్రాంచైస్', గోథామ్' సినిమాల్లో నటనకు బాగా పేరు తెచ్చుకున్నారు. గతంలో ఆమె చాలా ఇంటర్వ్యూలలో ఆమె జుట్టు ఎందుకలా ఉందో చెప్పారు. ఆమె జుట్టు విపరీతంగా ఊడిపోతుండటంతో గుండు చేయించుకున్నట్లు చెప్పారు.

విపరీతంగా జుట్టు రాలే పరిస్థితిని వైద్య పరిభాషలో అలపీషియా అంటారు.

జెడా పింకెట్ ఫేస్ బుక్ వాచ్ సిరీస్ లో భాగంగా మే 2018లో ప్రచురించిన ఎపిసోడ్‌లో ఆమెకు అలోపీషియా ఉన్నట్లు చెప్పారు.

వీడియో క్యాప్షన్, విల్ స్మిత్: తన పెళ్లాంపై కుళ్లు జోకు వేసిన కమెడియన్‌‌ చెంప పగలగొట్టిన హాలీవుడ్ హీరో

"దీని గురించి మాట్లాడటం చాలా కష్టం" అని అన్నారు.

"నేను తలకొక వస్త్రం ఎందుకు చుట్టుకుంటానని చాలా మంది అడిగేవారు. నా జుట్టు రాలిపోతూ ఉండేది. నాకు మొదటిసారి జుట్టు రాలిపోవడం చూసినప్పుడు చాలా భయం వేసింది. ఒక రోజు స్నానం చేస్తుండగా నా చేతిలోకి చాలా జుట్టు ఊడి వచ్చేసింది. నాకు బట్ట తల వస్తుందేమోనని భయపడ్డాను" అని చెప్పారు.

"నేను భయంతో వణికిపోయిన క్షణాలవి. దాంతో నేను నా జుట్టును కత్తిరించుకోవడం మొదలుపెట్టాను. నాకు నా జుట్టు చాలా ముఖ్యం" అని అన్నారు.

"జుట్టు ఉంచుకోవాలా వద్దా అనేది నాకు చాలా ముఖ్యమైన విషయం. కానీ, ఒక రోజు నాకా విషయంలో ఛాయస్ లేకుండా అయిపోయింది" అని అన్నారు.

ఆమె అలోపీషియాతో పోరాడుతున్నట్లు డిసెంబరు 2021లో ఆమె ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన వీడియోలో చెప్పారు.

అలపీషియా అంటే ఏంటి?

జుట్టు విపరీతంగా రాలిపోయే ఇన్‌ఫ్లమేటరీ లక్షణాన్ని అలపీషియా అంటారని యూకే నేషనల్ హెల్త్ సర్వీస్ చెబుతోంది.

కొన్ని సార్లు ఇది చేతి గోళ్లకు కూడా పాకుతుంది. ఈ జబ్బున్న చాలా మందికి ఒకేసారి చేతిలోకి జుట్టు ఊడి వచ్చేస్తుంది. ఇది ఏ వయసు వారికైనా, ఎవరికైనా జరగవచ్చు.

బట్టతల ఏర్పడే పరిస్థితిని వైద్య పరిభాషలో అలోపీషియా అని అంటారని డాక్టర్ సోనాలి చౌదరి వివరించారు. ఆమె దిల్లీలో గత 11 సంవత్సరాలుగా డెర్మటాలజిస్ట్ గా పని చేస్తున్నారు. అయితే, దీనికి పురుషులకు, మహిళలకు చేసే చికిత్స భిన్నంగా ఉంటుందని తెలిపారు.

డాక్టర్ సోనాలి చౌదరి
ఫొటో క్యాప్షన్, డాక్టర్ సోనాలి చౌదరి

అలపీషియాలో రకాలేంటి?

అలపీషియాలో చాలా రకాలు, దశలు ఉన్నాయి.

అలపీషియాలో మొదట్లో జుట్టు పలుచన అవ్వడం మొదలవుతుంది. ఒక్కసారి పలచగా అయిన తర్వాత జుట్టు మొత్తం కుదుళ్ళ లోంచి ఊడిపోయి బట్టతల ఏర్పడుతుందని చెప్పారు.

"అలపీషియా ఒక ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అని డాక్టర్ సోనాలి చెప్పారు.

జన్యుపరమైన కారణాలతో పాటు, పోషకాహార లోపం కూడా అలపీషియాకు కారణమవ్వచ్చని అన్నారు.

"రోగ నిరోధక శక్తి శరీరం పై వ్యతిరేకంగా పని చేసినప్పుడు కూడా అలపీషియా వచ్చే అవకాశముందని చెప్పారు. రోగంతో పోరాడేందుకు బదులు జుట్టు మూలాల పై దాడి చేస్తుంది. కానీ, అందరికీ ఇలా జరగాలని లేదు" అని అన్నారు.

జడా పింకెట్ స్మిత్

ఫొటో సోర్స్, facebook/jada

చికిత్స ఏంటి?

చాలా సార్లు శరీరంలో ఉన్న హార్మోన్లలో కలిగే మార్పుల వల్ల ముందు భాగంలో ఉన్న జుట్టు రాలిపోతుంది.

దీనికి చికిత్స చేసేందుకు శరీరంలో పోషకాల స్థాయిని పరిశీలిస్తామని చెప్పారు.

"శరీరంలో ఐరన్, బీ12 లోపం ఉండటం వల్ల కూడా జుట్టు రాలుతుంది. డి3, థైరాయిడ్, పీసీఓ ఎస్ పరీక్షలు కూడా చేసి జుట్టు రాలడానికి మూలకారణాలను తెలుసుకుంటాం"

"ఈ పరీక్షల ద్వారా మూల కారణం అర్ధం కాకపొతే తల మాడు భాగాన్ని పరిశీలించి ఇన్ఫెక్షన్ ఏదైనా ఉందేమో చూస్తాం" అని అన్నారు.

"ఇది జరిగిన తర్వాతే, ఆటో ఇమ్మ్యూన్ పరిస్థితి ఏర్పడుతుందని చెప్పారు. హార్మోన్లకు సంబంధించిన సమస్యలు కూడా ఉంటాయి. అవి సరిచేయడం కష్టం" అని చెప్పారు.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Alamy

జుట్టు పలచబడటం మొదలవ్వడాన్ని గమనించాలి.

పురుషుల్లో ఈ లక్షణం వచ్చినప్పుడు, తల ముందు భాగంలో జుట్టు ఊడటం మొదలైపోతుంది. నుదుటి భాగం పెరిగిపోతుంది.

చెంపల దగ్గర కూడా బట్టతల వచ్చే చాయలు కనిపిస్తాయి.

మహిళల్లో కూడా దూరం నుంచి మాడు కనిపిస్తుంటే ఆ పరిస్థితిని గమనించాలి.

యుక్త వయసున్న అమ్మాయిల్లో ఎక్కువగా మొటిమలు, లేదా శరీరం పైన ఎక్కువ రోమాలు వస్తున్నాయేమో గమనించాలి అని అన్నారు.

అలా జరిగితే, హార్మోన్లలో మార్పులు వస్తున్నట్లు అర్ధం" అని తెలిపారు.

ప్రతీకాత్మక చిత్రం

మానసిక ప్రభావం

ఈ సమస్య వల్ల మానసిక ఒత్తిడి కూడా కలిగే అవకాశముందని ఎన్‌హెచ్‌ఎస్ చెబుతోంది.

కొంత మందికి ఈ జబ్బు గురించి మాట్లాడటం, చికిత్స తీసుకోవడం, చికిత్సకు పట్టే సమయం కూడా ఒత్తిడిని కలుగచేస్తుందని చెప్పారు.

"కొన్ని కేసుల్లో చికిత్స పూర్తయిన తర్వాత కూడా జుట్టు ఊడడం మొదలు కావచ్చు. పిల్లల విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవాలి".

కానీ, కొంత మందికి ఫలితాలు ఏమైనప్పటికీ చికిత్స కోసం ప్రయత్నించామనే సంతోషం ఉంటుంది.

అయితే, అలపీషియా వల్ల శారీరక ఆరోగ్యంపై పెద్దగా ప్రభావం ఉండదు. అన్ని పనులు చేసుకోవచ్చు. విశ్రాంతి కూడా తీసుకోవల్సిన అవసరం లేదు. కానీ, మానసిక ఒత్తిడి మాత్రం ఉంటుంది.

"ఈ రోజుల్లో చాలా మంది జుట్టు పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ముఖ్యంగా యువత అందంగా కనిపించాలని కోరుకుంటారు".

కొంత మంది అయితే, కనీసం పెళ్లి అయ్యే వరకైనా జుట్టు బాగా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటారని చెప్పారు.

ఈ లక్షణాలతో బాధపడే ఇతరులతో మాట్లాడేందుకు ప్రోత్సహించడం ద్వారా కొంత వరకు చికాకు తగ్గుతుందని అన్నారు.

వీడియో క్యాప్షన్, శరీరానికి తగినంత విటమిన్-డి అందాలంటే ఏ సమయంలో ఎంతసేపు ఎండలో ఉండాలి?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)