ఆంధ్రప్రదేశ్: వెలిగొండ ప్రాజెక్టు నుంచి నీళ్లు ఇచ్చేది ఎప్పుడు, ఎందుకు ఆలస్యమవుతోంది?

- రచయిత, వడిశెట్టి శంకర్
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్‌లో సుదీర్ఘకాలంగా సాగుతున్న ప్రాజెక్టుల్లో పోలవరంతో పాటుగా వెలిగొండ ప్రాజెక్టు కూడా ఒకటి. మూడు దశాబ్దాల క్రితం శంకుస్థాపన జరిగిన వెలిగొండ నిర్మాణం నత్తనడకన సాగింది. చివరకు ఏడాది క్రితమే ఒక టన్నెల్ అందుబాటులోకి వచ్చినప్పటికీ ప్రాజెక్టుకి నీటిని విడుదల చేసే ప్రయత్నం మాత్రం జరగలేదు.
పోలవరం మాదిరిగానే ఈ ప్రాజెక్టు ద్వారా త్వరలోనే నీటిని విడుదల చేస్తామంటూ పలుమార్లు గడువు పెట్టారు. కానీ, అవన్నీ దాటిపోయాయి. ఇప్పుడు మాత్రం వచ్చే ఖరీఫ్ నాటికి నీటిని విడుదల చేస్తామని యంత్రాంగం చెబుతోంది.
ప్రధాన అడ్డంకి అదేనా..
పూల వెంకట సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పనులు దశాబ్దన్నర క్రితమే మొదలయినప్పటికీ ప్రధానంగా టన్నెల్ తవ్వాల్సి ఉన్నందున తీవ్రజాప్యం జరిగింది.
శ్రీశైలం డ్యామ్‌కి ఎగువన కొల్లాం వాగు నుంచి రెండు టన్నెల్స్ ద్వారా నీటిని తరలించి, ప్రకాశం జిల్లాలోని మెట్ట ప్రాంతాలను సశ్యశ్యామలం చేసేందుకు ఈ ప్రాజెక్ట్ సంకల్పించారు.
టన్నెల్స్ ద్వారా తరలించిన కృష్ణా జలాలను స్టోర్ చేసేందుకు మార్కాపురం రెవెన్యూ డివిజన్ పరిధిలో కట్టడం పూర్తి చేశారు. వివిధ కొండల మధ్య మూడు చోట్ల సిమెంట్ కట్టడాలతో ప్రధాన డ్యామ్ సిద్ధమయ్యింది. అయితే నీటిని తరలించేందుకు గానూ నల్లమల అడవుల్లో 18.8 కిలోమీటర్ల పొడవున రెండు టన్నెల్స్ సిద్ధం కావాల్సి ఉంటుంది.
తొలి టెన్నెల్ పనులను 2008లో అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారు. ఆ తర్వాత 2009లో నాటి జలవనరుల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య రెండో టన్నెల్ పనులకు శంకుస్థాపన చేశారు. కానీ టన్నెల్ పనులు అనేక కారణాలతో ముందుకు సాగలేదు.
చివరకు కాంట్రాక్ట్ సంస్థను మార్చిన తర్వాత జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర నాటికి మొదటి టన్నెల్ అందుబాటులోకి వచ్చింది. 2020 డిసెంబర్ నాటికే ఒక టన్నెల్ పూర్తికావడంతో 2021 ఖరీఫ్ నాటికి నీటిని విడుదల చేస్తారని చాలామంది ఆశించారు. కానీ అది జరగలేదు.
రాబోయే ఖరీఫ్ నాటికైనా నీటిని విడుదల చేస్తారా అనే సందేహాలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. దానికి ప్రధాన కారణం నిర్వాసితులకు చెల్లించాల్సిన పునరావాస ప్యాకేజ్‌కి నిధులు కేటాయించక పోవడమేనని చెప్పవచ్చు.
టన్నెల్ అందుబాటులోకి వచ్చింది. ఫీడర్ చానెళ్లు సిద్ధమయ్యాయి. డ్యామ్ కూడా రెడీగా ఉంది. కానీ నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ మాత్రం అందించకపోవడంతోనే నీటిని నిల్వ చేసే అవకాశం లేకుండా పోయింది.

నిర్వాసితులు ఎంతమంది, ఖర్చు ఎంత?
వెలిగొండ ప్రాజెక్టులో అధికారిక లెక్కల ప్రకారం పునరావాసం కల్పించాల్సిన ఆవాసాలు 11 ఉన్నాయి. ప్రాజెక్టులో నీటిని విడుదల చేస్తే ఆయా గ్రామాలు జలమయం అవుతాయి. కాబట్టి వారికి ప్యాకేజ్ ఇచ్చిన తర్వాతే నీటిని విడుదల చేయాల్సి ఉంటుంది.
వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి హయంలోనే నిర్వాసిత గ్రామాల రైతులకు పరిహారం అందించారు. 2009కి ముందే నష్ట పరిహారం అందుకున్నప్పటికీ నేటి వరకూ ఆయా భూములు రైతుల చేతుల్లోనే కొనసాగాయి. వారంతా సాగు చేసుకుంటూ వచ్చారు.
ఇక వారి కోసం 8 కాలనీల నిర్మాణాలకు ఏర్పాట్లు చేశారు. భూములు చదును చేసి, మౌలిక సదుపాయాలు కల్పించారు. విద్యుత్, మంచినీరు, డ్రెయిన్లు, రోడ్లు వంటివి పూర్తి చేశారు. ఇళ్లను కోల్పోతున్న వారికి ఒక్కో కుటుంబానికి సగటున రూ. 11.5 లక్షల చొప్పున ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. వారిలో ఎస్సీ, ఎస్టీలకు రూ. 12.5 లక్షలు చొప్పున ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ అందించాల్సిన వారి సంఖ్య 3,728 మందిగా ప్రారంభంలో గుర్తించారు. దశాబ్దంన్నర కాలం పూర్తవుతున్న తరుణంలో కొత్తగా మరో 3590 మందిని ఈ జాబితాలో చేర్చాల్సి వచ్చింది. దాంతో 7318 మందికి పరిహారం అందించాలి. దానికోసం సుమారుగా వెయ్యి కోట్ల రూపాయాలు వెచ్చించాల్సి ఉంటుంది.
2022-23 రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌లో వెలిగొండ ప్రాజెక్టు నిమిత్తం రూ.856.15 కోట్లు కేటాయించారు. దాంతో ఈ నిధులన్నీ విడుదలయితే నష్ట పరిహారం చెల్లించి, పునరావాసం కల్పించడానికి వీలవుతుందని అంతా భావిస్తున్నారు. ఇప్పటికే ఆర్ అండ్ ఆర్ అమలు విషయంలో ప్రభుత్వం దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆధ్వర్యంలోని బృందాలు గ్రామాల్లో పర్యటిస్తూ ఈ విషయంపై చర్చిస్తున్నాయి.

‘ప్యాకేజ్ ఇచ్చేస్తే ఖాళీ చేస్తాం’
''పునరావాసం కోసం డబ్బులు ఇస్తామని చెబుతున్నారు. చాలాకాలంగా తిప్పుతున్నారు. కొందరి పేర్లు కూడా లిస్టులో మిస్సవుతున్నాయి. ఒక్కొక్కరూ ఒక్కో లిస్టు పెడుతూ మమ్మల్ని కంగారు పెడుతున్నారు. మాకిస్తామన్న డబ్బులు ఇచ్చేస్తే ఖాళీ చేసి వెళ్లిపోతాం. ఇంటి స్థలాలు కేటాయించారు కాబట్టి అక్కడే సర్దుకుంటాం'' అని వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుడు పెద రంగయ్య అన్నారు.
తమ గ్రామంలో కొత్తగా పెళ్లయిన వారిని కూడా కుటుంబాలుగా పరిగణనలోకి తీసుకుని అందరికీ ప్యాకేజీ చెల్లించాలని కోరుకుంటున్నట్టు ఆయన బీబీసీతో అన్నారు.
వెలిగొండ ముంపు ప్రాంతంలో ఉన్న అన్ని గ్రామాల్లోనూ దాదాపు ఇదే అభిప్రాయం వినిపిస్తోంది. నిర్వాసితులందరికీ న్యాయం చేయాలనే వారంతా కోరుతున్నారు.
గత సీజన్లోనే టన్నెల్ నుంచి నీళ్లు
వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతిపై బీబీసీ గడిచిన ఏడాదిన్నరగా మూడుసార్లు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసింది. 2021 జనవరిలో వెళ్లినప్పుడు మొదటి టన్నెల్ పూర్తికావడం, రెండో టన్నెల్ పనులు సాగుతుండడం గమనించింది.
మొదటి టన్నెల్ ద్వారా 10.7 టీఎంసీల నీటిని తరలించేలా నిర్మాణం చేశారు. 7 మీటర్ల వ్యాసం గల ఈ టన్నెల్ ద్వారా 45 రోజుల పాటు నీటిని తరలించేందుకు అవకాశం ఉంటుందని నీటిపారుదల శాఖ అంచనా వేస్తోంది. మొదటి టన్నెల్‌కి దాదాపుగా రెండు రెట్లు సామర్థ్యంతో రెండో టన్నుల్ పనులు జరుగుతున్నాయి. 9.2 మీ. వ్యాసం గల ఈ టన్నెల్‌ను సుమారు 33 టీఎంసీల నీటిని తరలించేందుకు అనుగుణంగా సిద్ధం చేస్తామని అంటున్నారు.
టన్నెల్ తవ్వకం పూర్తికావడం, కొల్లం వాగు నుంచి శ్రీశైలం బ్యాక్ వాటర్ వెలిగొండ టన్నెల్‌లోకి ప్రవేశించే రెగ్యులేటర్ సజావుగా పని చేయక పోవడంతో 2021 జూలైలో కృష్ణా నది వరదల సమయంలో నీరు నేరుగా వెలిగొండ టన్నెల్లోకి ప్రవేశించింది. మొదటి టన్నెల్ ద్వారా తొలిసారిగా కృష్ణా జలాల ప్రవాహం పూర్తయిపోయింది.
నీటిని వెలిగొండకు చేర్చాల్సి ఉండగా ఆనాటికి ఫీడర్ చానెళ్లు సిద్ధం కాకపోవడం, నిర్వాసితులు ప్రాజెక్టు నీటిని నిల్వ చేయాల్సిన ప్రాంతంలోనే నివసిస్తుండడంతో అది తాత్కాలికంగానే సాగింది.
18.8 కిలోమీటర్ల పొడవున్న టన్నెల్ ద్వారా ప్రవహించిన తర్వాత మరో 20 కిలోమీటర్ల దూరం వరద కాలువల ద్వారా నీరు వెలిగొండ ప్రాజెక్టులోకి చేరాల్సి ఉంది.
అక్కడి నుంచి మూడు సాగునీటి కాలువల ద్వారా పొలాలకు నీటిని మళ్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తద్వారా ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు చెందిన 30 మండలాలకు ప్రయోజనం దక్కుతుందని, ఈ ప్రాంతంలోని సుమారు 16 లక్షల మందికి తాగునీటి సమస్య తీరిపోతుందని అధికారులు లెక్కలేస్తున్నారు

'ఆగస్టు నాటికి నీళ్లిస్తాం'
వెలిగొండ పనుల జాప్యం కారణంగా ప్రాజెక్టు నిర్మాణ వ్యయం, ఆర్ అండ్ ఆర్ కోసం కూడా అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. సకాలంలో పూర్తయి ఉంటే ప్రస్తుతం ఆర్ అండ్ ఆర్ కోసం వెచ్చిస్తున్న మొత్తమే మొత్తం ప్రాజెక్టు పూర్తయ్యేందుకు సరిపోయేది. కానీ రెండో టన్నెల్ పనులు ఇంకా సాగుతుండగా తొలి అంచనా మొత్తాన్ని ప్రస్తుతం కేవలం ఆర్ అండ్ ఆర్ కే వెచ్చించాల్సి రావడం విశేషం.
1996లో చంద్రబాబు హయాంలో శంకుస్థాపన చేసినప్పుడు ఐదేళ్లలో పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2004 అక్టోబరు 27న వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి రెండోసారి ఈ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేశారు.
తొలుత శంకుస్థాపన చేసినప్పుడు రూ.980 కోట్లు అంచనా కాగా, ఆ తర్వాత ప్రాజెక్టు వ్యయం రూ.5,500 కోట్లకు చేరింది. 2014 నాటికే 5 ప్రధాన కాలువలు 80% పూర్తి చేసి, 3 ఆనకట్టల నిర్మాణం చేశారు. అయితే తాజా అంచనాల ప్రకారం ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం రూ. 8వేల కోట్లు దాటుతుందని అధికారులు అంటున్నారు.
''వచ్చే ఆగస్టు నాటికి నీటిని విడుదల చేసే లక్ష్యంతో సాగుతున్నాం. ప్రభుత్వం కూడా అందుకు అన్ని రకాలుగానూ ప్రయత్నిస్తోంది. ఇటీవల పెండింగు బిల్లుల చెల్లింపు కూడా అయిపోయింది. దాంతో వెలిగొండ పూర్తి చేసేందుకు అన్ని రకాలుగా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు భావిస్తున్నాం. వచ్చే ఖరీఫ్‌లో వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ అందుబాటులోకి వస్తుంది'' అని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆలీ తెలిపారు.
ఈ ప్రాజెక్టు రెండు దశలు పూర్తయితే ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు తాగు, సాగు నీటి సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయని భావిస్తున్నారు.
ప్రకాశం జిల్లాలో 3.36 లక్షల ఎకరాలు, నెల్లూరు జిల్లాలో 84 వేల ఎకరాలు, కడప జిల్లాలో 27.2 వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని అధికారులు చెబుతున్నారు.
వాటితో పాటుగా ప్రస్తుతం తాగునీటి కోసం కూడా అవస్థలు పడుతున్న వందల గ్రామాలకు సమస్య తీరుతుంది. భూగర్భ జలాలు కూడా అందుబాటులోకి వస్తాయి. ప్రకాశం జిల్లా మెట్ట ప్రాంతానికి మేలు జరుగుతుంది. అందుకే అనేక మంది ప్రకాశం జిల్లా వాసులు వెలిగొండ కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారు.
మరోవైపు ఈ ప్రాజెక్టు గెజిట్‌లో చేర్చాల్సి ఉన్నందున దానికి అనుగుణంగా కేంద్ర జలశక్తి శాఖ వద్ద ప్రయత్నాలు జరుగుతున్నాయని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- రష్యా ఆక్రమణలో యుక్రేనియన్లు: ‘మమ్మల్ని చీల్చి చెండాడేందుకు ఒక రాక్షసుడికి అప్పగించినట్లు ఉంది’
- లైంగికంగా వేధించే భర్త నుంచి భార్యకు ఇకపై న్యాయం లభిస్తుందా... కర్ణాటక హైకోర్టు తీర్పు ఏం చెబుతోంది?
- RRR చుట్టూ ఇంత సందడి ఎందుకు? ఎవరి నోటా విన్నా ఆ సినిమా మాటే వినిపించేలా ఎలా చేస్తారు?
- కిలో బియ్యం 200, ఉల్లిపాయలు 250, గోధుమ పిండి 220, పాలపొడి 1345.. అక్కడ బతకలేక భారత్‌కు వస్తున్న ప్రజలు
- చైనా: 132 మందితో వెళ్తున్న ఆ విమానం ఎలా కుప్పకూలింది... సాంకేతిక లోపమా, విద్రోహ చర్యా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













