‘గోల్డ్ షిప్’: 21 టన్నుల బంగారంతో సముద్రంలో మునిగిన నౌక, 100 ఏళ్లు దాటినా అందులోని ఫోటోలు చెక్కుచెదరలేదు.. ఏమిటి ఆ రహస్యం?

ఫొటో సోర్స్, CALIFORNIA GOLD MARKETING GROUP
'బంగారు నౌక'గా పిలుచుకునే ఎస్ఎస్ సెంట్రల్ అమెరికా, 1857లో అమెరికాలోని దక్షిణ కరోలినా రాష్ట్ర తీరంలో మునిగిపోయింది. కాలిఫోర్నియా గోల్డ్ రష్‌లో కనుగొన్న సంపదతో సహా ఎస్ఎస్ సెంట్రల్ పూర్తిగా సముద్ర గర్భంలోకి వెళ్లిపోయింది.
అమెరికా తూర్పు తీరానికి తిరిగివస్తుండగా సంభవించిన హరికేన్ కారణంగా నౌక మునిగిపోవడంతో అందులోని 425 మంది మరణించారు.
ఆ నౌకలో ప్రయాణిస్తోన్న పశ్చిమ తీర ధనవంతులు వద్ద 21 టన్నుల బంగారు ముద్దలు, బంగారు నాణేలు ఉన్నట్లు అంచనా. మరికొంతమంది ప్రయాణీకులు తమ వ్యక్తిగత ఫొటోలను కలిగి ఉన్నారు.
మునిగిపోయిన పడవ నుంచి 2014లో సేకరించిన సరకులో 'డగురీటైప్స్ (ఒక రకమైన ఫొటోలు)' లభించాయి. డగురీటైప్స్ అనేది ఫొటోలకు తొలి వాణిజ్య రూపం. ఇవి ఒక మెటల్ ప్లేట్‌పై అమర్చి ఉంటాయి. ఆంబ్రోటైప్ అనే ఫొటోలు ఒక రకమైన గ్లాస్ ప్లేట్ ఫొటోలు.
ఆ ఫొటోలు ఈ ఏడాది మాత్రమే ప్రచురణ అవుతున్నాయి.

ఫొటో సోర్స్, CALIFORNIA GOLD MARKETING GROUP
ఎస్ఎస్ సెంట్రల్ అమెరికా మునిగిపోయిన ప్రాంతాన్ని 1988లో కనుగొన్నారు. ఆ తర్వాత, నీటి పాలైన సంపదను తిరిగి పొందడానికి 'రికవరీ మిషన్లు' జరిగాయి.
ఈ ఫొటోలను ఒక దశాబ్ధం క్రితమే సేకరించారు. కానీ సముద్రపు అడుగు భాగంలో ఆ నౌక నుంచి సేకరించిన బంగారం విషయంలో చట్టపర యుద్ధం జరిగిందని ఎస్ఎస్ సెంట్రల్ అమెరికా ప్రాజెక్ట్ మాజీ చీఫ్ సైంటిస్టు, చరిత్రకారుడు బాబ్ ఇవాన్స్ చెప్పారు. నౌక మునక, మునిగిపోయిన నౌకలోని వస్తువుల సేకరణ మిషన్‌కు ఆయన నాయకత్వం వహించారు.
చట్టపరమైన అంశాల కారణంగానే ఆ ఫొటోలను విడుదల చేయడానికి ఇంత ఆలస్యం జరిగింది. 100 ఏళ్లకు పైగా సముద్ర గర్భంలోనే ఉన్నప్పటికీ ఆ ఫొటోలు ఇంకా చెక్కుచెదరకుండా అలాగే ఉన్నాయి.
ఇవాన్స్, 1983 నుంచి ఎస్ఎస్ సెంట్రల్ అమెరికాపై పరిశోధన చేస్తున్నారు.
''అప్పటి చిత్రాలను ఇప్పుడు చూడటం చాలా అద్భుతమైన విషయం. ఆనాటి ప్రయాణీకులకు డబ్బుతో పాటు వారి ఫొటోలు కూడా ముఖ్యం'' అని ఆయన చెప్పారు.
1850ల్లో ఫొటోగ్రఫీ చాలా ప్రాచుర్యం పొందింది. బంగారం సేకరణ కోసం కాలిఫోర్నియాకు వెళ్లిన వారు, తమ కుటుంబసభ్యులకు ఫొటోలను పంపేవారు.
''బహుశా అది ఒక వ్యామోహం అయి ఉండొచ్చు. 'నేను బావున్నానని, ఆరోగ్యంగా ఉన్నానని నా ఆత్మీయులకు చెప్పేందుకు ఒక ఆయిల్ పేయింటర్‌తో నా పేయింటింగ్ వేయించుకునేందుకు బదులుగా, స్థానిక స్టూడియోకు వెళ్లి నా ఫొటో తీయుంచుకుంటా'. ఆ సమయంలో శాన్ ఫ్రాన్సిస్కోలో డజనుకు పైగా ఫొటో స్టూడియోలు ఉండేవి'' అని ఇవాన్స్ గుర్తు చేసుకున్నారు.

ఫొటో సోర్స్, CALIFORNIA GOLD MARKETING GROUP
అప్పటి కాలంలోని ఫొటోగ్రఫీ విధానాలే ఆ ఫొటోలు ఇంకా చెక్కు చెదరకుండా ఉండటానికి కారణం. ఒకవేళ నీటిలో పడినా పాడవ్వకుండా ఉండే విధంగా వాటిని అమర్చారు. ప్రత్యేకమైన మెటీరియల్స్‌తో తయారు చేశారు. వాటి నాణ్యతతో పాటు పాటు చాలా అంశాలు అవి పాడవకుండా కాపాడాయి.
''ఫొటో కేసులు ఎంత బాగా తయారు చేశారు? అందులో ఫొటోలను ఎంత బాగా అమర్చారు? అనే అంశంపై ఇది ఆధారపడి ఉంటుంది'' అని ఇవాన్స్ అన్నారు.
సముద్ర అడుగు భాగంలో అధిక ఒత్తిడి పరిస్థితులు, ఉప్పు నీటిలో ఉన్నప్పటికీ ఆ ఫొటోలు పాడవ్వకపోవడానికి మరో కారణం అట్లాంటిక్ సముద్రపు జలాలు చల్లగా ఉండటం.
19వ శతాబ్దం మధ్య కాలంలో సముద్ర మార్గాన సెంట్రల్ అమెరికా గుండా కాలిఫోర్నియా నుంచి న్యూయార్క్‌కు వెళ్లాలంటే కనీసం 24 రోజుల సమయం తీసుకునేంది. రోడ్డు మార్గాన అయితే ఈ ప్రయాణం 5 నెలల పాటు పడుతుంది.
280 అడుగుల పొడవైన ఎస్ఎస్ సెంట్రల్ అమెరికా వంటి స్టీమ్‌షిప్‌ల ఆవిష్కరణ, సముద్ర ప్రయాణాన్ని చాలా సులభతరం చేసింది. కానీ సముద్ర వాతావరణాన్ని పరిగణలోకి తీసుకుంటే ఈ రకమైన నౌకలు ప్రమాదకారులుగా ఉంటాయని ఇవాన్స్ అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, CALIFORNIA GOLD MARKETING GROUP
''ఇప్పటి నౌకలకు ఇంజిన్లు ఉన్నాయి. అందువల్ల గాలులు, అలల వంటి వాటికి మనం ఆందోళన చెందాల్సిన పని లేదు. ఎందుకంటే గాలులు, అలల వల్ల ఇబ్బందులు తలెత్తినప్పుడు వాటిని నియంత్రించడానికి ఇంజిన్ నౌకల్లో తగిన ఏర్పాట్లు ఉంటాయి.''
''కానీ అప్పుడు, తుఫానుతో పాటు నౌక కూడా సులభంగానే ముందుకు సాగుతుందని నమ్మేవారు'' అని ఇవాన్స్ అభిప్రాయపడ్డారు.
పనామా నుంచి న్యూయార్క్ వైపు ప్రయాణిస్తుండగా రెండో కేటగిరీ హరికేన్ వల్ల ఆ నౌక మునిగిపోయిందని అందరూ నమ్ముతారు. ఈ ప్రమాదం నుంచి 150 మంది బయపడగా, కెప్టెన్‌తో సహా 400 మంది మునిగిపోయారు.
చరిత్రను అభిమానించే వ్యక్తిగా, చరిత్రకు సంబంధించిన ఏదైనా పాత పత్రం కూడా తనలో ఉత్సాహం కలిగిస్తుందని ఇవాన్స్ చెప్పారు. కానీ ఈ ఫొటోలు తనలో మరో కోణాన్ని జోడించాయని చెప్పారు.
''1850 దశకానికి ప్రాతినిధ్యం వహించే వ్యక్తుల ఫొటోలను ఇప్పుడు చూడగలిగే అవకాశం రావడం చాలా అద్భుతమైన విషయం" అని ఇవాన్స్ హర్షం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి:
- ఎలక్ట్రిక్ బైక్ పేలి తండ్రి, కూతురు మృతి.. ఎలక్ట్రిక్ బైక్‌లు ఎలా పేలతాయి? ప్రమాదాన్ని ముందే గుర్తించడం ఎలా?
- కిమ్ జోంగ్ ఉన్ యాక్షన్ హీరోలా ఎందుకు మారారు? ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగానికి హాలీవుడ్ ఎఫెక్ట్స్ ఎందుకు పెట్టారు?
- యుక్రెయిన్ యుద్ధంలో రష్యా ఓడిపోయిందా? లేక వ్యూహం మార్చుకుంటోందా?
- అల్లూరి సీతారామరాజు: బ్రిటిష్ ప్రభుత్వాన్ని బెంబేలెత్తించిన మన్యం వీరుడు, 27 ఏళ్లకే ఎలా కన్నుమూశారో తెలుసా?
- శ్రీలంక ఆర్థిక సంక్షోభం: నాలుగు నెలల పసిబిడ్డతో సముద్రం దాటిన దంపతులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











