యుక్రెయిన్‌పై రష్యా యుద్ధం: పుతిన్‌కు తెలియకుండా యుద్ధ వార్తలను రష్యన్లు ఎలా తెలుసుకుంటున్నారు

యుక్రెయిన్, రష్యా

ఫొటో సోర్స్, Reuters

రష్యా మీడియా ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఇక్కడ ప్రసారమయ్యే వార్తలపై ఆంక్షలు నానాటికీ తీవ్రం అవుతున్నాయి.

స్వతంత్రంగా నడిచే వార్తా సంస్థలపై నిషేధం విధించారు. మరికొన్నింటిపై ఆంక్షలు అమలులో ఉన్నాయి.

అయితే, ప్రభుత్వానికి తెలియకుండా యుద్ధానికి సంబంధించిన సమాచారాన్ని రష్యన్లు తెలుసుకునే మార్గాలు కూడా ఉన్నాయి.

చాలా మంది రష్యన్లకు వార్తలు చూడాలంటే టీవీలే ఆధారం. అయితే, ఈ టీవీ ఛానెళ్లు రష్యా ప్రభుత్వ ఆధీనంలో నడుస్తుంటాయి. ప్రభుత్వం చెప్పిందే ఈ ఛానెళ్లలో ప్రసారం అవుతుంది.

ఈ ఛానెళ్లలో యుక్రెయిన్ ప్రజలను కాపాడేందుకు రష్యా సైనికులు శ్రమిస్తున్నారని చెబుతుంటారు. యుక్రెయిన్ సైన్యమే వారి నగరాలపై దాడులు చేస్తోందని చెబుతుంటారు.

చాలా మంది రష్యన్లు ఈ టీవీల్లో చూపించే వార్తలే చూడటంతో.. ప్రభుత్వం చెప్పిందే నిజమని నమ్ముతుంటారు.

మీడియాలో భిన్నమైన వాదన కూడా ఉంటుంది. కాకపోతే అది కూడా రష్యా ప్రభుత్వం చెప్పేదానికి అనుగుణంగానే ఉంటుంది.

నొవయా గెజెటా వెబ్‌సైట్

ఫొటో సోర్స్, Novaya Gazeta

ఫొటో క్యాప్షన్, నొవయా గెజెటా వెబ్‌సైట్

29ఏళ్లుగా స్వతంత్రంగా రిపోర్టింగ్ చేస్తున్న నొవయా గెజెటా పత్రికపై మార్చి 28న ఆంక్షలు విధించారు. రష్యా మీడియాను నియంత్రించే రాస్‌కోమ్నాజోర్ నుంచి మొదట నొవయాకు హెచ్చరికలు అందాయి. ఆ తర్వాత సంస్థ ఆపరేషన్లను నిలిపివేయించారు.

స్వతంత్రంగా పనిచేసే చాలా వెబ్‌సైట్ల పరిస్థితి ఇదే. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌ల పరిస్థితి కూడా దీనికి మినహాయింపు ఏమీకాదు.

అయితే, ఈ ఆంక్షలను దాటుకొని యుక్రెయిన్‌లో అసలేం జరుగుతుందో తెలుసుకోవచ్చు.

దీని కోసం కంప్యూటర్ లేదా స్మార్ట్‌ఫోన్‌లు చేతిలో ఉండి వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ (వీపీఎన్)పై అవగాహన ఉంటే చాలు. రష్యా ప్రభుత్వ ఆంక్షలను తోసిరాజని ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు.

రష్యాలో వీపీఎన్‌లపై ఆంక్షలు లేవు. వీటి సాయంతో వేల మంది రష్యన్లు ప్రభుత్వ నియంత్రణలోలేని సమాచారాన్ని తెలుసుకుంటున్నారు.

వీడియో క్యాప్షన్, యుక్రెయిన్: యుద్ధం మొదలై నెల రోజులు దాటినా వెనక్కి తగ్గేదే లేదంటున్న సైన్యం

15ఏళ్ల జైలు శిక్ష..

యుక్రెయిన్‌లో సైనిక చర్యకు సంబంధించిన ఏదైనా ‘‘తప్పుడు సమాచారం’’ ప్రచురిస్తే 15ఏళ్ల వరకూ జైలు శిక్ష విధించేలా కొత్త చట్టాన్ని మార్చిలో రష్యా తీసుకొచ్చింది.

అంటే రష్యా ప్రభుత్వ వాదనతో విభేదించే విధంగా ఏం రాసినా దీని కింద కేసులు నమోదు చేస్తారు. ముఖ్యంగా యుక్రెయిన్‌లో యుద్ధాన్ని ఇక్కడ యుద్ధంగా పేర్కొనకూడదు. దీన్ని ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్‌గానే చెప్పాలి.

దీంతో స్వతంత్రంగా పనిచేసే కొన్ని మీడియా సంస్థలు కూడా ఇదే విధానాలను అనుసరించడం మొదలుపెట్టాయి.

అయితే, కొన్ని మీడియా సంస్థలు ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా స్వతంత్రంగా రిపోర్టింగ్ చేస్తున్నాయి.

అలా స్వతంత్రంగా పనిచేస్తున్న వార్తా సంస్థల్లో మెడూజా, మీడియాజోనా లాంటి వెబ్‌సైట్లు ఉన్నాయి.

ఈ రెండింటిపైనా రష్యా నిషేధం విధించింది. వీటిని విదేశీ ఏజెంట్లుగా రష్యా ప్రభుత్వం చెబుతోంది.

రష్యాలో నిషేధం విధించడంతో ఈ రెండు వెబ్‌సైట్‌లు విదేశాల నుంచి పనిచేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)