యుక్రెయిన్‌పై రష్యా యుద్ధం: నెల రోజులుగా యుక్రేనియన్లు ‘చాలా తెలివిగా, చురుకుగా, సృజనాత్మకంగా యుద్ధం’ ఎలా చేస్తున్నారు?

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, ఫ్రాంక్ గార్డెనర్
- హోదా, బీబీసీ సెక్యూరిటీ కరస్పాండెంట్
యుక్రెయిన్‌పై రష్యా దాడి మొదలై నెల రోజులైంది. రష్యా దాడులను తట్టుకొని యుక్రెయిన్ నిలబడుతోంది.
ట్యాంకులు, దళాలు, విమానాలు.. ఇలా దాదాపు అన్నింటిలోనూ రష్యా కంటే యుక్రెయిన్ తక్కువే. మరోవైపు చాలాచోట్ల రష్యా సైన్యానికి ఎదురు నిలబడి పోరాడుతున్న వారిలో స్వచ్ఛందంగా వచ్చిన యుక్రెయిన్ పౌరులే ఉన్నారు.
యుక్రెయిన్ చాలా భూభాగాన్ని కోల్పోయింది. ముఖ్యంగా క్రైమియా చుట్టుపక్కల దక్షిణ ప్రాంతాలు రష్యా ఆధీనంలోకి వెళ్లిపోయాయి. 2014లోనే క్రైమియాను రష్యా ఆక్రమించిన సంగతి తెలిసిందే.
రాజధాని కీయెవ్‌తోపాటు యుక్రెయిన్‌లోని ప్రధాన నగరాలను ఆక్రమించి, అక్కడి ప్రభుత్వాన్ని కూలదోయాలని రష్యా ప్రభుత్వం తొలుత భావించింది. అయితే, అది సాధ్యంకాదని రష్యాకు అర్థమైంది.
ఇప్పటికీ పరిస్థితి యుక్రెయిన్‌కు వ్యతిరేకంగానే ఉంది. చాలాచోట్ల యుక్రెయిన్ బలగాల సంఖ్య ప్రమాదకర స్థాయికి తగ్గిపోయింది. పశ్చిమ దేశాలు అందిస్తున్న యాంటీ-ట్యాంక్, యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ మిసైల్స్ కూడా సరిపోవడం లేదు.
తూర్పువైపునున్న చాలా యుద్ధ క్షేత్రాలు దాదాపుగా రష్యా చుట్టుముట్టే ముప్పు అంచున ఉన్నాయి. యుక్రెయిన్ ప్రధాన భూభాగంతో వీటిని అనుసంధానించే మార్గాలు కూడా రష్యన్ల చేతుల్లోకి వెళ్లిపోయే ముప్పుంది.
మరోవైపు యుక్రెయిన్‌లో నాలుగో వంతు జనాభా తమ ఇళ్లను వదిలి వెళ్లిపోయారు. అక్కడ మిగిలిన వారిలో చాలా మంది తమ ప్రాణాలను పణంగా పెట్టి జీవిస్తున్నారు. రష్యా బాంబులు, రాకెట్లతో తమ నగరాలు నిర్వీర్యం కావడాన్ని వారు కళ్లారా చూస్తున్నారు.
ఇన్ని ప్రతికూల పరిణామాలలో కూడా ఈ యుద్ధంలో రష్యా కంటే యుక్రెయిన్ బలగాలు చక్కగా పోరాడుతున్నాయి. ఈ విషయంలో యుక్రెయిన్ బలగాలపై అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ ఇటీవల ప్రశంసలు కురిపించారు. ‘‘చాలా తెలివిగా, చురుకుగా, సృజనాత్మకంగా యుద్ధం చేస్తున్నారు’’అని పొగిడారు. ఇంతకీ యుక్రెయిన్ బలగాల విజయ రహస్యం ఏమిటి?

ఫొటో సోర్స్, EPA
1. నైతిక బలం..
రెండు దేశాల నైతిక బలంలో చాలా తేడా ఉంది. యుక్రెయిన్ పౌరులు తమ దేశ మనుగడ కోసం పోరాడుతున్నారు. యుద్ధాన్ని ప్రారంభించే సమయంలో యుక్రెయిన్‌ను తాము సృష్టించిన ఓ ‘‘కృత్రిమ దేశం’’గా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అభివర్ణించారు.
తమ ప్రభుత్వం, అధ్యక్షుడి ఆదేశాలకు అనుగుణంగా యుక్రెయిన్ పౌరులు ముందుకు వెళ్తున్నారు. కొన్నిచోట్ల ముందెన్నడూ సైన్యంలో పాల్గొన్న అనుభవం లేనివారు కూడా ఆయుధాలు చేతుల్లో పట్టుకుని తమ నగరాలను కాపాడుకునేందుకు ముందుకు వస్తున్నారు.
‘‘తమ జీవితం ప్రశ్నార్థకమైనప్పుడు ప్రజలు ఇలానే పోరాడతారు’’అని బ్రిగేడియర్ టామ్ ఫోక్స్ అన్నారు. ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో 35ఏళ్ల పాటు టామ్.. జర్మనీలోని బ్రిటిష్ సైన్యాధికారిగా పనిచేశారు.
‘‘వారు తమ దేశం కోసం, తమ కుటుంబాల కోసం యుద్ధం చేస్తున్నారు. వారి ధైర్యాన్ని చూస్తే అద్భుతంగా అనిపిస్తోంది’’అని ఆయన అన్నారు.
ప్రజలు ముందుకు రావడంతో యుక్రెయిన్ సైనికులు కీలకమైన విధులకు పరిమితమై తమ నగరాలు రష్యన్ల చేతుల్లోకి వెళ్లకుండా అడ్డునిలుస్తున్నారు.
దీనికి విరుద్ధమైన పరిస్థితుల్లో రష్యా సైనికుల్లో కనిపిస్తోంది. యుద్ధ భూమిలో వారు గందరగోళానికి గురవుతున్నట్లు కనిపిస్తున్నారు. తప్పనిసరి శిక్షణలో భాగంగా సైనిక శిక్షణకు వచ్చిన వారిని కూడా యుద్ధానికి పంపిస్తున్నారు. కొందరైతే విన్యాసాలకు వెళ్తున్నామని భావించి వచ్చారు.
చాలా మంది రష్యా సైనికులకు యుద్ధానికి సంబంధించి ఎలాంటి శిక్షణా ఇవ్వలేదు. యుద్ధ క్షేత్రంలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో వారికి అవగాహన కూడా లేదు.
కొందరు సైనికులు యుద్ధ భూమిని వదిలి పారిపోవడం, ఆహారపు సరఫరాల కొరత, దొంగతనాలు కూడా జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఫొటో సోర్స్, EPA
2. కమాండ్, కంట్రోల్
యుక్రెయిన్ కమ్యూనికేషన్ వ్యవస్థలను దెబ్బతీసేలా రష్యా సైబర్ దాడులు ఉంటాయని మొదట అంతా భావించారు. కానీ అలా జరగలేదు.
యుక్రెయిన్ చాలా చోట్ల సమన్వయంతో ముందుకు వెళ్లగలుగుతోంది. పట్టుకోల్పోయిన ప్రాంతాల్లోనూ సమన్వయం కోల్పోవడం లేదు.
కీయెవ్ కేంద్రంగా నడుస్తున్న యుక్రెయిన్ ప్రభుత్వం ప్రజలకు సలహాలు, సూచనలు ఇస్తూ మార్గనిర్దేశం చేస్తోంది. డిప్యూటీ ప్రధాన మంత్రి ఖాకీ టీ-షర్టు వేసుకొని ప్రజల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు.
దీనికి విరుద్ధంగా రష్యా సైన్యంలో నాయకత్వం లోపించింది. భిన్న యుద్ధ భూముల మధ్య సమన్వయం కూడా లేనట్లు కనిపిస్తోంది.

ఫొటో సోర్స్, Reuters
ఇది రష్యా సైనికుల నైతిక బలంపై ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే రష్యాకు చెందిన ఐదుగురు ప్రధాన సైనిక జనరల్స్ మరణించినట్లు వార్తలు వచ్చాయి. వీరు తమ సైనికులను కాపాడే క్రమంలో నేరుగా పోరాటంలోకి దిగి ప్రాణాలు కోల్పోయారు.
యుద్ధ క్షేత్రంలోని రష్యా సైన్యంలోని నాన్ కమిషన్డ్ ఆఫీసర్ (ఎన్‌సీవో) స్థాయి అధికారులు పైనుంచి వచ్చే ఆదేశాల కోసం ఎదురుచూస్తూనే ఉంటున్నారు. వీరు నేరుగా ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు.
రష్యన్ ఎన్‌సీవోల్లో అవినీతి, అసమర్థత ఎక్కువగా కనిపిస్తుంటుందని కింగ్స్ కాలేజీ లండన్‌లోని సైనిక వ్యవహారాల నిపుణుడు ప్రొఫెసర్ మైకెల్ క్లార్క్ చెప్పారు.
3. వ్యూహాలు
రష్యాతో పోలిస్తే యుక్రెయిన్ బలగాల సంఖ్య చాలా తక్కువ. అయితే, వారు యుద్ధ క్షేత్రాన్ని, తమ దగ్గరున్న ఆయుధాలను మెరుగ్గా ఉపయోగించుకుంటున్నారు.
రష్యా బలగాలు భారీ ఆయుధాలతో నెమ్మదిగా ముందుకు వెళ్తున్నాయి. చాలాచోట్ల రష్యా సాయుధ వాహనాలు వరుస భారీగా కనిపిస్తోంది. అయితే, యుక్రెయిన్ దళాలు మాత్రం దాడిచేసి అక్కడి నుంచి తప్పించుకుంటున్నాయి. యాంటీ-ట్యాంక్ క్షిపణులను ప్రయోగించి, రష్యా దళాలు స్పందించేలోపే అక్కడి నుంచి వెళ్లిపోతున్నాయి.
యుద్ధానికి ముందు అమెరికా, బ్రిటన్, కెనడాలకు చెందిన నాటో విభాగాలకు శిక్షణ ఇచ్చే నాయకులు ఇక్కడి దళాలకు శిక్షణ ఇచ్చారు. తమ దగ్గరున్న జావెలిన్ లాంటి అధునాతన క్షిపణి వ్యవస్థలను ఎలా ఉపయోగించాలి? లాంటి అంశాలపై వీరికి అవగాహన కల్పించారు.
‘‘రష్యన్ల కంటే యుక్రెయిన్ పౌరులు చాలా తెలివైనవారు’’అని ప్రొఫెసర్ క్లార్క్ అన్నారు. ‘‘ఎందుకంటే తమ దగ్గరున్న ఆయుధ సంపత్తిని మెరుగ్గా ఎలా ఉపయోగించాలో వారికి తెలుసు.’’ అంటే డ్రోన్లు, ట్యాంకులు, ఎలక్ర్టానిక్ ఆయుధాలు లాంటివి కలిపి ఎలా ఉపయోగించాలో వారికి తెలిసు. ఇలా అన్ని కలిపి ఉపయోగించడంతో శక్తిమంతంగా పనిచేయొచ్చు.
రష్యా సైనికులపై దాడికి అనువైన ప్రాంతాలను గుర్తించి, గట్టి దెబ్బ తీయడంలో యుక్రెయిన్ పౌరులు విజయం సాధిస్తున్నారని సైనిక వ్యూహకర్త జస్టిన్ క్రంప్ వవరించారు. ఇంటెలిజెన్స్ కన్సల్టెన్నీ సంస్థ సీబైలన్‌ను ఆయన నడిపిస్తున్నారు.
‘‘యుక్రెయిన్ వ్యూహాలు చాలా మెరుగ్గా ఉన్నాయి. ముఖ్యంగా రష్యాకు సరఫరాలు అందించే వాహన శ్రేణులను వారు లక్ష్యంగా చేసుకుంటున్నారు. మరోవైపు నాటో అందిస్తున్న ఆయుధాలతో కచ్చితత్వంతో దాడులు చేయగలుగుతున్నారు.’’
ఇప్పటివరకు ఎంతమంది మరణించారో కచ్చితంగా అంచనా వేయడం కష్టమే. అయితే, రష్యా వైపు మృతులు 7,000కుపైనే ఉంటాయని పెంటగాన్ అంచనా వేసింది. అఫ్గానిస్తాన్‌లో పదేళ్లలో మరణించిన సోవియట్ సైనికుల్లో ఇది దాదాపుగా సగం.
4. సమాచార యుద్ధం
ఇక్కడ సమాచార యుద్ధం కూడా నడుస్తోంది. ప్రపంచంలో చాలాచోట్ల మీడియాలో నడుస్తున్న ఈ పోరాటంలో చాలాచోట్ల యుక్రెయిన్‌దే పైచేయి. రష్యాలో చాలా వరకు మీడియా ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. ఇక్కడ మాత్రం రష్యాదే పైచేయి.
‘‘మీడియాలో సమాచారాన్ని యుక్రెయిన్ తమకు అనుకూలంగా మలచుకుంటోంది. మరోవైపు అంతర్జాతీయంగానూ యుక్రెయిన్‌కు అనుకూలంగా వార్తలు వస్తున్నాయి’’అని జస్టిన్ క్రంప్ వ్యాఖ్యానించారు.
‘‘యుద్ధానికి సంబంధించి వార్తలను తమకు అనుకూలంగా వచ్చేటట్లు చూడటంలో యుక్రెయిన్ విజయవంతమైంది’’అని కింగ్స్ కాలేజీ లండన్‌లో సీనియర్ లెక్చరర్ డాక్టర్ రూత్ డెయెర్‌మండ్ వివరించారు. ‘‘యుద్ధం వల్ల అంతర్జాతీయ స్థాయిలో యుక్రెయిన్ గడించిన ఖ్యాతి అద్భుతమైనది’’అని ఆమె వ్యాఖ్యానించారు.
యుద్ధం మొదలై నెల రోజులు గడుస్తున్నా, ఇప్పటికీ రష్యా బలగాలతో యుక్రెయిన్ పోరాడుతూనే ఉంది.
బలగాల సంఖ్య విషయంలో రష్యాకు యుక్రెయిన్ సరితూగలేదు. ఒకవేళ పశ్చిమ దేశాల నుంచి వచ్చే ఆయుధాలు నిలిచిపోతే యుక్రెయిన్ పోరాటం అక్కడితో ఆగిపోతుంది.
ఇవి కూడా చదవండి:
- వాంగ్ యీ: చైనా విదేశాంగ మంత్రి భారత్‌లో ఎందుకు పర్యటిస్తున్నారు? రెండు దేశాలూ మళ్లీ దగ్గరవుతున్నాయా?
- లైంగికంగా వేధించే భర్త నుంచి భార్యకు ఇకపై న్యాయం లభిస్తుందా... కర్ణాటక హైకోర్టు తీర్పు ఏం చెబుతోంది?
- RRR చుట్టూ ఇంత సందడి ఎందుకు? ఎవరి నోటా విన్నా ఆ సినిమా మాటే వినిపించేలా ఎలా చేస్తారు?
- కిలో బియ్యం 200, ఉల్లిపాయలు 250, గోధుమ పిండి 220, పాలపొడి 1345.. అక్కడ బతకలేక భారత్‌కు వస్తున్న ప్రజలు
- చైనా: 132 మందితో వెళ్తున్న ఆ విమానం ఎలా కుప్పకూలింది... సాంకేతిక లోపమా, విద్రోహ చర్యా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













