మందుల ధరలు ఏప్రిల్ 1 నుంచి ఎందుకు పెరుగుతున్నాయి... జనరిక్ ఔషధాలతో పరిష్కారం దొరుకుతుందా?

మందులు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సురేఖ అబ్బూరి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

''ఇంట్లో సరకులు కొన్నట్లే ప్రతి నెలా అమ్మానాన్నలకు మందులు కొనాలి. అమ్మకు షుగర్, థైరాయిడ్. నాన్న హార్ట్ పేషెంట్. ఇద్దరికీ కలిపి సుమారు ఏడున్నరవేల రూపాయలు మందులకే ఖర్చవుతాయి. అప్పటికీ నేను కోఠీలో 30శాతం డిస్కౌంట్ ఇచ్చే షాపుల్లో కొనుక్కొస్తుంటాను. 2007లో నా జీతం ఎంతో, ఇప్పుడు మా ఇంట్లో మెడిసిన్స్ ఖర్చు కూడా దాదాపు అంతే'' అని హైదరాబాదుకు చెందిన కిశోర్ అన్నారు.

ఔషధాల ఖర్చు ఇంటి బడ్జెట్‌లో భాగంగా మారిన కిశోర్ లాంటి కిశోర్ లాంటి ఏ నగరంలో, పట్టణంలో చూసినా కనిపిస్తారు.

పెట్రోలు, డీజిల్, కూరగాయలు, వంట నూనెలు ధరల్లాగే ఔషధాల ధరలు కూడా పెరుగుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్ అమ్ముతున్న ధరలకంటే 10 శాతానికి పైగా ధరలు పెరుగుతాయని ప్రభుత్వ అధికారులు చెప్పారు.

ఏప్రిల్ 1 నుంచి ప్రజలు తరచూ వాడే పారాసెటమాల్ సహా సుమారు 867 రకాలకు పైగా మందులు ధరలు పెరుగుతున్నాయి. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ(ఎన్‌పీపీఏ), హోల్‌సేల్ పర్చేజ్ ఇండెక్స్ ఆధారంగా నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్ ( ఎన్‌ఎల్‌ఈఎం) రేట్లు పెంచుతున్నట్టు ప్రకటించింది.

అయితే, ఇప్పటికే తయారైన మందుల ధరల్లో మార్పు ఉండదు. ఏప్రిల్ 1 తరువాత తయారయ్యే మందుల ధరలు మాత్రమే పెరుగుతాయి.

మెడికల్ షాప్

ఏయే మందుల రేట్లు పెరుగుతాయి

ప్రధానంగా, మధుమేహం ఉన్న వాళ్లు వాడే ఇన్సులిన్ రేట్లు పెరుగుతాయి. దీంతోపాటు జ్వరం, ఇన్ఫెక్షన్లు, గుండె వ్యాధులు, బీపీ, చర్మ వ్యాధులు, ఎనీమియా మందులు, పారాసెటమాల్, ఇన్ఫెక్షన్లకు వాడే అజిత్రోమైసిన్ లాంటి యాంటీ బయాటిక్స్, ఫోలిక్ యాసిడ్, విటమిన్, మినరల్ టాబ్లెట్ల రేట్లు కూడా పెరుగుతాయి.

అంతేకాదు, కోవిడ్ కారణంగా తలెత్తిన కొన్ని ఇబ్బందులకు వాడుతున్న మందులు, స్టెరాయిడ్ల ధరలు కూడా పెరుగుతున్నాయి. ఇవే కాకుండా ఓరల్ రీ హైడ్రేషన్, గ్లూకోస్ ఇంజెక్షన్లు రేట్లు కూడా పెరిగే మందుల జాబితాలో ఉన్నాయి.

మందులు

మందులు రేట్లు ఎందుకు పెరుగుతున్నాయి?

ప్రతి మూడు నుంచి ఐదేళ్లకోసారి ఔషధాల రేట్లు పెరుగుతుంటాయి. ఇప్పుడు కూడా అలాగే పెరుగుతున్నాయి. కాకపోతే ఈసారి పెంచిన రేట్ల శాతం ఎక్కువ. సాధారణంగా 2 నుంచి 3 శాతం వరకు పెరిగితే, ఈసారి అత్యధికంగా 10.75% వరకు రేట్లు పెరుగుతున్నాయి .

ధరలు ఎందుకు పెరుగుతున్నాయన్న అంశంపై ఓ ఫార్మా కంపెనీకి చెందిన సీనియర్ రీసెర్చ్ సైంటిస్ట్‌తో బీబీసీ మాట్లాడింది. ఆయన తన పేరును ప్రచురించడానికి అంగీకరించలేదు.

''ముడి సరుకు మీద ఖర్చులు పెరగడం ప్రధాన కారణం. ఫార్మా భాషలో చెప్పాలంటే యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్(ఏపీఐ) రేట్లు పెరిగాయి. మనకు చపాతీ చేయడానికి గోధుమ పిండి ఎలా అవసరమో, మందులు తయారీకి కూడా ముడి సరుకు అవసరం. ఇవి మనదేశంలో దొరకవు. ఎక్కువగా చైనా మీద ఆధారపడాలి. వీటి దిగుమతులు ఛార్జీలు పెరిగాయి. ఫార్ములేషన్ కోసం వాడే విద్యుత్ మీద ఛార్జీలు, ట్యాక్సులు, సిబ్బందిపై పెట్టే ఖర్చు, మాన్యుఫాక్చరింగ్ లైసెన్సు, ప్యాకింగ్ తదితర ఖర్చులు పెరిగాయి. చివరకు రవాణ ఛార్జీలు కూడా పెరిగిపోయాయి. అందుకే మందులు రేట్లు కూడా పెరుగుతున్నాయి'' అని ఆయన వివరించారు.

వీడియో క్యాప్షన్, శరీరానికి తగినంత విటమిన్-డి అందాలంటే ఏ సమయంలో ఎంతసేపు ఎండలో ఉండాలి?

''ఫార్ములేషన్ కోసం ఉపయోగించే కాలమ్స్ వంటివి కూడా జపాన్ లాంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. వీటి ధరలు పెరగడం కూడా మందుల ధరలు పెరగడానికి కారణాలలో ఒకటి'' అని ఆ సైంటిస్ట్ వివరించారు .

అయితే, ఆత్మనిర్భర్ భారత్ పథకం కింద ముడి సరుకు తయారీపై దృష్టి పెట్టినట్లు ప్రభుత్వం చెబుతోంది. 2021 లో ఔషధాల తయారీకి కావాల్సిన 56 రకాల ముడి సరుకును తయారు చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఏపీఐ కోసం చైనా తర్వాత జర్మనీ, అమెరికా, ఇటలీ, సింగపూర్ లాంటి దేశాలపై ఇండియా ఆధారపడుతోంది.

మందుల దుకాణం

జనరిక్ మెడిసిన్ ప్రత్యామ్నాయం అవుతాయా, జనరిక్ మెడిసిన్ అంటే ఏంటి ?

జనరిక్ డ్రగ్స్ అంటే ఒక మెడిసిన్ పై దాన్ని మొట్టమొదట తయారు చేసిన కంపెనీ పేటెంట్ సమయం ముగిసిన తర్వాత, అవే కెమికల్స్‌ను ఉపయోగించి, అదే ఫార్ములాతో, అదే మందును ఏ కంపెనీ అయినా తయారు చేసి, మార్కెట్‌ లోకి విడుదల చేయొచ్చు. అలా తయారు చేసిన మందులను 'జనరిక్ డ్రగ్స్' అంటారు.

స్టాండర్డ్ డ్రగ్ తయారు చేసే ఫార్మా కంపెనీలకు పేటెంట్ 20 ఏళ్ల దాకా ఉంటుంది. పేటెంట్ ఖర్చులు లేకపోవడంతో స్టాండర్డ్ డ్రగ్స్‌తో పోలిస్తే జనరిక్ డ్రగ్స్ చాలా తక్కువ ధరకు దొరుకుతాయి.

హైదరాబాద్‌కు చెందిన గృహిణి జయ ఇంట్లోకి అవసరమైన మందులు జనరిక్ డ్రగ్స్ స్టోర్లలో కొంటుంటారు. ''మా వారికి షుగర్, బీపీ, గుండె సమస్య, యూరిన్ ఇన్ఫెక్షన్‌కు సంబంధించిన మందులు రెగ్యులర్‌గా వాడుతుంటాను. నెలకు రూ.10,000-రూ.15,000 వేల దాక ఖర్చు అవుతుంది’’ అని జయ వివరించారు.

‘‘షుగర్, బీపీ మందులకు బయట అయితే సుమారు రూ. 5,000 దాక అవుతుంది. కానీ అవే మందులు జనరిక్ షాపుల్లో కొంటే వెయ్యి రూపాయల్లో వస్తాయి. కానీ, అవి ఎంత వరకు పని చేస్తాయన్నది ఇప్పటికీ సందేహమే. డాక్టర్లు కూడా స్టాండర్డ్ మందులే మేలని అంటుంటారు. అంత ఖర్చు భరించలేక జనరిక్ మెడిసిన్స్ వాడుతున్నాం'' అని వెల్లడించారు జయ.

ఈ విషయం పై ఫార్మా రీసెర్చ్ సైంటిస్ట్ తో మాట్లాడగా ''వీటికి క్లినికల్ ట్రయల్స్ ఉండవు. అందువల్ల ఖర్చు భారీగా తగ్గుతుంది. ఇక అవి ఎంత బాగా పని చేస్తాయి అన్నది సందేహమే. రూ.100కు దొరికే మందు రూపాయికే దొరుకుతుంది. కానీ, అతి పని చేయక వ్యాధి ముదిరి ప్రాణం మీదకు వస్తే ప్రమాదం కదా'' అని ఆయన అన్నారు.

జనరిక్ డ్రగ్స్ స్టోర్

ఫొటో సోర్స్, Getty Images

ప్రభుత్వాల ప్రయత్నాలు

జనరిక్ మెడిసిన్స్‌ను ప్రోత్సహించడానికి అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ప్రయత్నించారు. కేంద్ర ప్రభుత్వం కూడా నవంబర్ 2008లో ప్రధానమంత్రి భారతీయ జన్ఔషధీ యోజన కింద జనరిక్ మందులను ప్రోత్సహిస్తూ కొన్ని కేంద్రాలను ఏర్పాటు చేసింది .

జనరిక్ డ్రగ్స్ కేంద్రాలలో 2021 ఆగష్టు నాటికీ వీటి సంఖ్య 8021కి చేరిందని, అందులో 1451 మందులు 240 సర్జికల్ సంబంధ వస్తువులు ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి. అయితే, భారతీయ జనాభా అవసరాలతో పోలిస్తే, ఈ సంఖ్య ఏ మాత్రం సరిపోదని అర్ధమవుతుంది.

జనరిక్ డ్రగ్స్ తయారీని పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నా, దానికి తగ్గ ప్రచారపు పనులు వేగంగా సాగడం లేదు. దీనికి తోడు 250 ఫార్మా కంపెనీల చేతుల్లో 70 % భారత్ మార్కెట్ ఉందని ఒక సర్వే ప్రకటించిన గణాంకాలు, మార్కెట్ లో అత్యవసర, నిత్యావసర మందుల ధరల హెచ్చు తగ్గులకు కారణమేంటో చెప్పకనే చెబుతోంది.

అయితే, ఈ పెరిగిన ధరల గురించి తమకు సమాచారం ఉన్నా, ఇంకా ఎలాంటి ఆదేశాలు రాలేదని మందుల షాపుల యజమానులు చెబుతున్నారు. ప్రస్తుతానికి దుకాణములో ఉన్న మందులను వాటి పై ముద్రించి ఉన్న రేట్ల ప్రకారమే అమ్ముతామని వెల్లడించారు.

వీడియో క్యాప్షన్, కోవిడ్-19: చైనాలో చాలా ప్రాంతాల్లో మళ్లీ లాక్‌డౌన్, మనకూ మరో వేవ్ తప్పదా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)