కోవిడ్-19: కరోనావైరస్ నాలుగో వేవ్‌కు భారత్ సిద్ధంగా ఉండాలా?

కరోనా కేసులు

ఫొటో సోర్స్, Reuters

    • రచయిత, సౌతిక్ బిశ్వాస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. యూకే, యూరప్ దేశాల్లోని కొన్ని భాగాల్లో ఇన్ఫెక్షన్లు నెమ్మదిగా పెరుగుతుండగా, చైనా, హాంకాంగ్ దేశాల్లో ఈ పెరుగుదల గణనీయంగా ఉంటోంది.

కరోనా కేసుల విషయంలో అమెరికా తర్వాత 4 కోట్లకు పైగా ధ్రువీకరించిన కేసులతో భారత్ రెండో స్థానంలో ఉంది. భారత్‌లో 5 లక్షలకు పైగా కరోనా మరణాలు నమోదైనట్లు అధికారిక లెక్కలు సూచిస్తున్నాయి. ప్రపంచ కోవిడ్ మరణాల సంఖ్యలో ఇది మూడో స్థానం.

కరోనా నాలుగో వేవ్ కోసం భారత్ సిద్ధమవ్వాలి అని నమ్మడానికి కారణాలు ఉన్నాయా?

ప్రస్తుతం భారత్ పరిస్థితి ఏంటి?

భారత్‌లో రోజువారీ నమోదయ్యే కేసుల సంఖ్య రెండేళ్ల కనిష్ట స్థాయికి పడిపోవడం చెప్పుకోదగ్గ అంశం.

50 జన్యుపరివర్తనాలను కలిగి ఉన్న ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో తాజా ఇన్ఫెక్షన్లను కలిగిస్తోంది. కానీ భారత్‌లో ఈ వేరియంట్ కేసులు తగ్గిపోయాయి.

కరోనా రెండో వేవ్‌లో భారత్ దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంది

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, కరోనా రెండో వేవ్‌లో భారత్ దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంది

ఈ ఏడాది జనవరి 21న భారత్‌లో అత్యధికంగా 3,47,000 కేసులు నమోదు కాగా... మార్చి 21 నాటికి వీటి సంఖ్య 1410కి పడిపోయింది. చాలా వేగంగా కేసుల సంఖ్య క్షీణించింది. మిగతా వేవ్‌లతో పోలిస్తే ఈసారి తీవ్రంగా అనారోగ్యానికి గురయ్యే వారి సంఖ్య, ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య చాలా తక్కువగా నమోదైంది.

భారత్‌, ఇప్పటివరకు 1.8 బిలియన్లకు పైగా వ్యాక్సిన్ డోసులను అందించింది. 80 శాతానికిపైగా వయోజనులు పూర్తి స్థాయి డోసులను తీసుకోగా, 94శాతం మంది మొదటి డోసును అందుకున్నారు. దీంతో కరోనా నిబంధనలను కూడా ఎత్తివేశారు. చాలావరకు వ్యాపారాలు మునుపటి స్థితికి చేరుకున్నాయి.

''భారత్ సులభంగా శ్వాస తీసుకుంటోంది'' అని పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ కె. శ్రీనాథ్ రెడ్డి అన్నారు.

తాజా వేవ్ గురించి భారత్ ఆందోళన చెందాలా?

భారత అగ్రశ్రేణి సాంకేతిక విద్యా సంస్థ అయిన ఐఐటీలోని శాస్త్రవేత్తలు చేసిన వివాదాస్పద అధ్యయనంలో కరోనా నాలుగో వేవ్ జూన్‌లో ప్రారంభమై ఆగస్టులో తారా స్థాయికి చేరుకుంటుందని అంచనా వేశారు.

కానీ చాలామంది అంటువ్యాధుల నిపుణులు ఈ అధ్యయనంపై తీవ్ర సందేహం వ్యక్తం చేస్తున్నరు. వారు భవిష్యత్తు పట్ల ఆశాజనకంగా ఉన్నారు.

దీనికి వారు చెప్పే మొదటి కారణం ఏంటంటే... భారతీయుల్లో చాలామంది వైరస్‌కు వ్యతిరేకంగా ఇమ్యూనిటీని కలిగి ఉన్నారు. అంతేకాకుండా జనాభాలో ఎక్కువ భాగం వ్యాక్సిన్ తీసుకున్నారు.

ఈనెలలో భారతీయులు హోలీ పండగను ఘనంగా జరుపుకున్నారు. మళ్లీ సాధారణ జీవనాన్ని అనుభవిస్తున్నారు

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, ఈనెలలో భారతీయులు హోలీ పండగను ఘనంగా జరుపుకున్నారు. మళ్లీ సాధారణ జీవనాన్ని అనుభవిస్తున్నారు

''మనం మంచి స్థితిలో ఉన్నాం. అత్యున్నత స్థాయి వ్యాక్సినేషన్‌ ప్రజలకు అందుతోంది. అందుకు ప్రభుత్వాన్ని ప్రశంసించాలి. ఇప్పటివరకు వచ్చిన వేవ్‌ల కారణంగా చాలామంది వైరస్ బారిన పడ్డారు. ఆ తర్వాత ఇమ్యూనిటీని కూడా సాధించారు'' అని భారత అగ్రశ్రేణి వైరాలజిస్టుల్లో ఒకరైన డాక్టర్ గగన్‌దీప్ కంగ్ అన్నారు.

రెండవది... సులభంగా వ్యాపించే గుణమున్న ఒమిక్రాన్ ఉత్పరివర్తనం బీఏ.2 కారణంగా యూరప్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఫిబ్రవరిలో బీఏ.2 వేరియంట్ శాంపుళ్లను భారత శాస్త్రవేత్తలు పరీక్షించారు. ఈ వేరియంట్ వ్యాక్సిన్ సైతం నుంచి తప్పించుకోగలదని చెప్పారు. భారత్‌లో ఒమిక్రాన్ కేసుల పెరుగుదలకు ఈ వేరియంటే ప్రధాన కారణమని నివేదించారు.

మరో మాటలో చెప్పాలంటే బీఏ.2 కారణంగా సంభవించే వేవ్ భారత్‌లో ముగిసినట్లే కనిపిస్తోంది. ''సమీప భవిష్యత్‌లో జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే కరోనా వేవ్ వచ్చే అవకాశం చాలా తక్కువే'' అని ఒక ఫిజీషియన్ ఎపిడెమాలజిస్ట్, డాక్టర్ చంద్రకాంత్ లహరియా అన్నారు.

కాలక్రమేణా రోగ నిరోధక శక్తి క్షీణిస్తుందా?

కాలం గడిచిన కొద్ది రోగనిరోధక శక్తి నశిస్తుంది. మూడో డోసు వ్యాక్సిన్ చాలా కాలం పాటు తీవ్ర అనారోగ్యం, మరణాల నుంచి ప్రజలను రక్షిస్తుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

బూస్టర్ డోసు వల్ల మన శరీరం మరిన్ని యాంటీ బాడీలను తయారు చేసుకుంటుంది. రోగ నిరోధక వ్యవస్థలో యాంటీ బాడీలు కీలక భాగాలు.

భారత్ ఇప్పటివరకు 20 మిలియన్లకు పైగా బూస్టర్ డోసులను అందించింది.

ఫ్రంట్ లైన్ వర్కర్లు, ఆరోగ్య రంగంలో సేవలు అందించేవారు, దీర్ఘకాల అనారోగ్యాలతో బాధపడుతోన్న 60 ఏళ్ల పైబడిన వారు ప్రస్తుతం బూస్టర్ డోస్ తీసుకునేందుకు అర్హులు.

ముంబైలో బూస్టర్ డోస్ తీసుకుంటోన్న పోలీసు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ముంబైలో బూస్టర్ డోస్ తీసుకుంటోన్న పోలీసు

60 ఏళ్ల కంటే తక్కువ వారికి బూస్టర్ డోసులు అందించేందుకు భారత ప్రభుత్వం ఇంకా ఎలాంటి విధానాన్ని తీసుకురాలేదు. దీనికి కారణం తగినంత బూస్టర్ డోసులు అందుబాటులో లేకపోవడం ఏమాత్రం కాదు.

భారత్‌లోని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ సంస్థ ప్రపంచంలోనే అత్యధికంగా వ్యాక్సిన్ తయారు చేస్తోంది. 200 మిలియన్ల కోవిషీల్డ్ డోసులను ఉత్పత్తి చేసే పనిలోనే తాము ఉన్నట్లు ఆ సంస్థ చెప్పింది. భారత్‌లో అధికంగా కోవిషీల్డ్‌నే పంపిణీ చేశారు. మొత్తం డోసుల్లో 80 శాతం ఇవే ఉన్నాయి.

మొదటి రెండు డోసులు ఏ వ్యాక్సిన్‌ను తీసుకున్నారో బూస్టర్ డోసుగా కూడా అదే వ్యాక్సిన్‌ను తీసుకోవాలని ప్రభుత్వం చెప్పింది. అందుకే థర్డ్ డోసుగా కూడా కోవిషీల్డ్‌ను ఎక్కువగా వినియోగిస్తున్నారు.

అక్కడే సమస్య ఉంది. బూస్టర్ డోసుల వెనకున్న శాస్త్రీయతను భారత్ విస్మరిస్తోందని వైరాలజిస్టు షహీద్ జమీల్ అభిప్రాయపడ్డారు.

''ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్లు రోగ నిరోధక ప్రతిస్పందనలను కలిగించడానికి జనెటిక్ కోడ్స్‌ను ఉపయోగిస్తాయి. ఫైజర్-బయోఎన్‌టెక్ లేదా మోడెర్నా, నోవావాక్స్ వంటివి అందుబాటులో ఉన్న ఉత్తమ బూస్టర్ డోసులు.''

''ఎంఆర్‌ఎన్ఏ వ్యాక్సిన్లు భారత్‌లో ఇంకా అందుబాటులోకి రాలేదు. కానీ సీరమ్ ఇన్‌స్టిట్యూట్, నోవావ్యాక్స్‌కు ప్రతిగా దేశీయంగా కోవావ్యాక్స్‌ను తయారు చేస్తోంది. ఇప్పటికే 40 మిలియన్ల కోవావ్యాక్స్ డోసులను ఎగుమతి కూడా చేశారు.''

''భారత్‌లో బూస్టర్ డోస్‌గా కోవావ్యాక్స్‌ను ఎందుకు ఆమోదించట్లేదు? భారతీయులకు ఉత్తమమైనది ఎందుకు అందకూడదు?'' అని జమీల్ ప్రశ్నించారు.

11 నుంచి 14 ఏళ్ల మధ్య ఉన్న పిల్లలకు భారత్ వ్యాక్సిన్ ఇవ్వడం ప్రారంభించింది

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, 11 నుంచి 14 ఏళ్ల మధ్య ఉన్న పిల్లలకు భారత్ వ్యాక్సిన్ ఇవ్వడం ప్రారంభించింది

వివిధ వయస్సు గ్రూపుల్లో వ్యాక్సిన్ అందించే రక్షణ క్షీణించడం ప్రారంభమైనప్పుడు, ఆ ప్రక్రియను పర్యవేక్షించే డేటా ఆధారంగా బూస్టర్ వ్యూహాన్ని రచించాలి.

ఉదాహరణకు అమెరికా ఈ విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలను పాటిస్తోంది. ఎవరు బూస్టర్ డోసును తీసుకోవాలి? ఏ వ్యాక్సిన్‌ను బూస్టర్‌గా ఎప్పుడు వినియోగించాలనే అంశంపై సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తగిన మార్గదర్శకాలను రూపొందించింది.

భారత్ 9 కరోనా వ్యాక్సిన్లను ఆమోదించింది. అందులో అయిదు భారత్‌లో తయారు చేసేవి కాగా కేవలం రెండింటిని మాత్రమే ప్రధానంగా ఉపయోగిస్తున్నారు.

''ప్రజలు గతంలో తీసుకున్న టీకానే బూస్టర్‌ డోస్‌గా మళ్లీ ఇచ్చేందుకు బదులుగా... బూస్టర్ డోస్ ఇవ్వడానికి సరైన సమయం ఏంటి?బూస్టర్ డోస్‌గా ఏ వ్యాక్సిన్‌ను ఇవ్వాలి? అనే దానిపై భారత్ ఆలోచించాలి'' అని కంగ్ అన్నారు.

60 ఏళ్ల కంటే తక్కువ వారికి కూడా బూస్టర్ డోస్ ఇచ్చే కార్యక్రమాన్ని త్వరలోనే అమలు చేసేందుకు భారత్ యోచిస్తోందని ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన ఒక అధికారి బీబీసీతో చెప్పారు.

కొత్తగా వచ్చే వేరియంట్ మనం సాధారణ పరిస్థితులకు వెళ్లకుండా అడ్డుకోగలదా?

దీనికి అవుననే అంటున్నారు ఎపిడెమాలజిస్టులు. కానీ ఇక్కడ కొన్ని షరతులు ఉన్నాయి.

''కొత్తగా వచ్చే వేరియంట్‌కు చాలా ప్రత్యేకమైన లక్షణాలు ఉండాలి. గతంలో కరోనా బారిన పడినవారిని, వ్యాక్సిన్లు తీసుకున్న వారికి సోకగలిగే సామర్థ్యం దానికి ఉండాలి.''

''ఇది చాలా కష్టం. కానీ దాన్ని తోసిపుచ్చలేం. వైరస్ వ్యాప్తి అధికమవుతుంటే, అది అధిక పరివర్తనాలు చెందకడానికి అవకాశం లభిస్తుంది. ఇలా పరివర్తనం చెందే రకాల్లో ఏదైనా అధిక తీవ్ర అనారోగ్యాన్ని కలిగించేది ఉండొచ్చు'' అని కంగ్ వివరించారు.

''కొత్త వేరియంట్ల పట్ల భారత్‌తో పాటు ప్రపంచం అంతా జాగరూకతతో వ్యవహరించాలి'' అని లూసియానా స్టేట్ యూనివర్సిటీ హెల్త్ సైన్సెస్ సెంటర్ వైరాలజిస్టు డాక్టర్ జెరెమీ కమీల్ హెచ్చరించారు.

ఒమిక్రాన్ గురించి ఆరంభంలోనే ప్రపంచానికి చెప్పి దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు గొప్ప మేలు చేశారని ఆయన అన్నారు.

కరోనా వ్యాక్సినేషన్

ఫొటో సోర్స్, EPA

సమీప భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?

అత్యధిక జనసాంద్రత ఉండే భారత్ లాంటి దేశాల్లో వైరస్‌తో సహజీవనం చేయాలంటే జనాభాలో ఎక్కువమంది ప్రజలు వైరస్‌ను ఎదుర్కోగల నిరోధకతను కలిగి ఉండాలి. వ్యాక్సిన్లు తీసుకోవడం వల్ల ఇప్పటికే చాలామంది భారతీయులు ఈ నిరోధకతను కలిగి ఉన్నట్లే కనిపిస్తున్నారు.

''కాబట్టి మనం అప్పుడప్పుడు కేసుల పెరుగుదలను చూడొచ్చు. కానీ అవి చాలా పెద్ద స్థాయిలో, ఆందోళన కలిగించే విధంగా ఉండకపోవచ్చు'' అని డాక్టర్ కమీల్ చెప్పారు.

ఇమ్యూనిటీ క్షీణించే అవకాశం ఉన్న నేపథ్యంలో వయస్సు పైబడినవారు, వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ తరచుగా వైరస్ బారిన పడేవారు జాగ్రత్తగా ఉండాలి. డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతోన్న యువ జనాభా కూడా భారత్‌లో ఎక్కువగా ఉంది. కాబట్టి వారు కూడా బూస్టర్ డోస్ తీసుకోవాలి.

''భారత్ తగినంతగా శాంపుళ్లను సీక్వెన్సింగ్ చేయడం లేదు. ఇదే మనకు ముప్పు కలిగించవచ్చు'' అని కంగ్ అన్నారు.

''బహిరంగ ప్రదేశాలతో పోలిస్తే మూసి ఉన్న ప్రాంతాల్లో వైరస్ వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉండటంతో కార్యాలయాలు హైబ్రిడ్ వర్కింగ్ విధానాన్ని అనుసరించాలి. ఉద్యోగులు మాస్కులు ధరించేలా చూసుకోవాలి. బూస్టర్ డోస్‌లు ప్రైవేటుగా అందుబాటులో ఉంటే సంస్థల యాజమాన్యాలు వాటికి డబ్బులు ఇవ్వాలి'' అని డాక్టర్ రెడ్డి చెప్పారు.

''ప్రతిదీ మన నియంత్రణలోనే ఉండాలి. కరోనా కేసులు పెరిగిపోయినప్పుడు కదలకుండా ఒకే ప్రదేశంలో ఉండిపోయే పరిస్థితులను మనం సృష్టించుకోకూడదు. మాస్క్‌లు ధరిస్తూ, అవసరం లేని కార్యక్రమాలను తగ్గించుకుంటే సరిపోతుంది'' అని ఆయన జోడించారు.

వీడియో క్యాప్షన్, ‘నాకు కరోనా వచ్చింది.. నన్ను ఉద్యోగంలోంచి తీసేశారు’

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)