Budget 2022-23: ఎన్నికల ముందు వస్తున్న ఈ బడ్జెట్ నుంచి ఎవరు ఏం కోరుకుంటున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అలోక్ జోషి
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఏ బడ్జెట్ కథయినా ప్రజల అంచనాలు, ఆకాంక్షల నుంచే మొదలవుతుంది. అయితే, ఈసారి అంచనాలు, ఆకాంక్షల కన్నా డిమాండ్‌లు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ప్రజలు తమ నుంచి చాలా కోరుకుంటున్నారన్న విషయం ప్రభుత్వానికి కూడా తెలుసు. ఇతరులకు ఇవ్వగల శక్తి ఉన్నవారు కూడా ప్రభుత్వం తమకు ఏమిస్తుందోనంటూ ఎదురు చూస్తున్నారు.
అందరి ఆకాంక్షలు నెరవేర్చాలి. అలా చేయలేని పక్షంలో తాము వాటిని ఎందుకు నెరవేర్చలేకపోయామో చెప్పగలగాలి. కానీ, ఎన్నికలు జరగబోయే ఐదు రాష్ట్రాల ప్రజలకు వివరించే ప్రయత్నం చాలా ఖరీదైన వ్యవహారం.
లోక్‌సభ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ, ఈ ఐదు రాష్ట్రాలు, ముఖ్యంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎన్నికలకు ముందు వచ్చే ఈ బడ్జెట్, ఎన్నికల పద్దులాగా ఉండాల్సిన అవసరముందని బడ్జెట్‌కు, రాజకీయాల మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకున్న పండితులు భావిస్తున్నారు.
ఎన్నికల బడ్జెట్‌కు మరో పేరే ఆకర్షక బడ్జెట్. అంటే ఇందులో ప్రకటించే పథకాలు, ప్రకటనలు, వరాలు వినే వారి హృదయాలను సంతోషపరుస్తాయి.

ఫొటో సోర్స్, ALEXLMX
ప్రభుత్వం సహజంగానే అందరినీ సంతోషపెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా ఆగ్రహంతో ఉన్న వర్గాలను సంతృప్తిపరిచే ప్రయత్నం కచ్చితంగా చేస్తుంది.
రైతులు, గ్రామీణులు, యువత, పేదలు, మహిళలు, దళితులు, వెనకబడినవారు, బాగా వెనకబడిన వారు, ప్రభుత్వ ఉద్యోగులు, చిన్న,పెద్ద వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు ఇలా సమాజంలో అనేక వర్గాలున్నాయి.
వీరుగాక, ఓటు బ్యాంకుగా కనిపించే ఇంకా అనేక వర్గాలు ఉంటాయి. వీరందరినీ సంతోష పెట్టేందుకు ప్రభుత్వం శాయాశక్తులా ప్రయత్నిచడం సహజం. ఇలా చూసినప్పుడు ఇలాంటి ఎన్నికల ముందు బడ్జెట్ నుంచి అభివృద్ధి ప్రణాళికలకు కేటాయింపులను ఎక్కువగా ఆశించలేం.
ఇలాంటి బడ్జెట్‌పై ఆర్థికవేత్తలు ఎందుకు ఆందోళన వ్యక్తం చేస్తారంటే, ఆయా వర్గాలను ప్రసన్నం చేసుకునే క్రమంలో ప్రభుత్వం వారి నుంచి రాబట్టే ఆదాయాన్ని తగ్గించుకునేందుకు సిద్ధపడుతుంది.
అంటే పన్ను మినహాయింపులు ఇవ్వడం, వారికి నేరుగా పంపిణీ చేయడం లాంటి చర్యలు చేపడుతుంది. ఈ రెండు సందర్భాల్లో ప్రభుత్వ ఖజానాపై భారం పడుతుంది. అందుకే ఆర్థికవేత్తలు ఇలాంటి బడ్జెట్‌లను అంతగా హర్షించరు.
అయితే ఈసారి పరిస్థితి కాస్త భిన్నంగా ఉంది. సమాజంలో చాలా పెద్ద వర్గానికి ప్రభుత్వం నుంచి మద్దతు అవసరమని, దానికి ఆ సహకారం అందించకపోతే ఆర్థిక వ్యవస్థ వేగాన్ని అందుకోవడం కష్టమని చాలామంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అదే సమయంలో ప్రభుత్వం తనకు రావాల్సిన ఆదాయం గురించి ఆందోళన చెందకపోవచ్చన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. అంతేకాదు, తన ఖర్చును పెంచాలని కూడా చూస్తోంది.
ఎందుకంటే, ప్రభుత్వం ఎక్కువ ఖర్చు పెట్టడం వల్ల ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యం మెరుగుపడటంతోపాటు ప్రభుత్వం మీద ప్రజలకు విశ్వసనీయత పెరగుతుంది. అందుకే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం ఎక్కువ ఖర్చు చేయడానికి ప్రాధాన్యత ఇవ్వవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రభుత్వ ఆదాయంలో పెరుగుదల
ఆదాయం పరంగా కూడా ఈ ఏడాది అనుకున్నదానికంటే మెరుగ్గా ఉండబోతోందని తెలుస్తోంది. అన్ని వనరుల ద్వారా ప్రభుత్వానికి వచ్చే మొత్తం ఆదాయం గత బడ్జెట్ అంచనాతో పోలిస్తే, దాదాపు రూ.2.25 లక్షల కోట్లు అదనంగా రాబోతున్నట్లు తెలుస్తోంది.
పన్నుల వసూళ్లలో వేగం పెరగడమే ఇందుకు ప్రధాన కారణం.
గత ఆరు నెలల్లో జీఎస్టీ ద్వారానే సగటున ప్రతి నెలా రూ.1.20 లక్షల కోట్లు వచ్చాయి. అంటే వ్యాపారం ఊపందుకుంటోందని దీని అర్థం. మరోవైపు దేశంలోని అతిపెద్ద కంపెనీల ఫలితాలు చూస్తుంటే ప్రభుత్వ ఆదాయానికి వచ్చిన ఇబ్బందేమీ లేదనిపిస్తోంది.
కరోనా కాలం నుంచి వారి లాభాలలో రికార్డు స్థాయి పెరుగుదల కనిపించిది. ఇప్పటికీ అది కొనసాగుతోంది. తత్ఫలితంగా ప్రభుత్వం మొత్తం ఆదాయం బడ్జెట్ అంచనాకంటే దాదాపు 30 శాతం ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు.
ఇందులో ప్రధాన భాగం కార్పొరేట్ పన్నులో 60%, ఆదాయపు పన్నులో 32% పెరుగుదల నుంచి వస్తుంది. ప్రత్యక్ష పన్నుల వసూళ్లు మొత్తం రూ. 13.5 లక్షల కోట్లని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇది బడ్జెట్‌లో ఇచ్చిన అంచనాకంటే దాదాపు 46% ఎక్కువ.
ప్రస్తుతం కరోనా మూడో వేవ్ భయం కొనసాగుతోంది. ఇది ఆర్థిక వ్యవస్థకు ఎంత ఎక్కువ షాక్ ఇస్తుందోనన్న ఆందోళన కూడా కనిపిస్తోంది.
కానీ, ఆదాయం 69.8% పెరగడం వల్ల ప్రభుత్వం చేతులు పూర్తిగా కట్టేసిన పరిస్థితేమీ లేదని, ఆశాజనకంగా ఉందని భావించవచ్చు. అంటే, ప్రభుత్వం కోరుకుంటే, నిర్భయంగా ఖర్చు చేయవచ్చు లేదా ఖర్చులను పెంచవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ అవసరం కూడా కనిపిస్తోంది.
ఈ ఏడాది ప్రభుత్వం ఖర్చు చేయాల్సిన రూ. 34.8 లక్షల కోట్లలో 60 శాతం కూడా ఖర్చు చేయకపోవడంతోపాటు, ఆదాయంలో దాదాపు 70 శాతం పెరుగుదల కనిపిస్తోంది.
ఎక్కువ సంపాదించడం, తక్కువ ఖర్చు చేయడం అంటే నష్టాలను తగ్గించుకోవడమే. కానీ ఈ సమయంలో, లోటు కంటే పెద్ద సమస్య ఆర్థిక వ్యవస్థను వేగవంతం చేయడం. అందుకే ఇప్పుడు ఆర్థిక మంత్రి ముందున్న సవాల్ ఏంటంటే, ఖర్చును ఎలా పెంచాలి, ఎక్కడ పెంచాలి? అన్నదే.

ఫొటో సోర్స్, Reuters
అన్ని రంగాలలో సమాన అభివృద్ధి లేదు
ప్రభుత్వం ఎన్ని వాదనలు, వివరణలు ఇచ్చినప్పటికీ, కరోనా తర్వాత ఆర్థిక వ్యవస్థలో వస్తున్న అభివృద్ధిలో అందరికీ సమాన వాటా లేదన్న ఆర్థికవేత్తల మాట నిజం కావడం ఆందోళన కలిగించే విషయం.
కొన్నివర్గాలు వేగంగా పైకి వెళుతుండగా, మరికొన్ని నేటికీ వెనకబడే ఉన్నాయి. దీన్నే 'K ఆకారపు రికవరీ' అంటారు. ఆంగ్ల అక్షరం K లో రెండు గీతల మాదిరిగా కొన్ని వర్గాలు వేగంగా ముందుకు దూసుకుపోతుండగా, కొన్ని వర్గాలు అంతే వేగంగా పడిపోతున్నాయి.
ఎదిగేవారి వేగాన్ని కంట్రోల్ చేయకుండానే, పడిపోయే వారిని ఎలా ఆదుకోవాలన్న దానిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. అదే ప్రభుత్వం ముందున్న అతి పెద్ద సవాల్.
తమకేం కావాలో పరిశ్రమలు, వాణిజ్య వర్గాలతోపాటు, ఇతర వర్గాలు ఇప్పటికే తమ జాబితాలను ప్రభుత్వానికి పంపాయి. పారిశ్రామిక, వ్యాపారవేత్తలు, ఆర్థిక నిపుణులు బడ్జెట్ ముందే కొన్ని సూచనలు, సలహాలు తమదైన సొంత విశ్లేషణలు ఇచ్చారు.
డిమాండ్లు, సూచనల జాబితా ఒకట్రెండు కాదు, అలాగని చిన్నవి కాదు. చాలా పెద్దవి కూడా. వీటన్నింటి సారాంశం ఏంటంటే, ప్రభుత్వం తన ఖజానాను తెరవాల్సి ఉంది.
సమాజంలో K ఆకారంలో పడిపోతున్న వర్గాలకు ప్రభుత్వం చేయూత అందించాల్సి ఉంది. అవసరమైతే వ్యాపారంలో లాభాలు పెరిగిన వర్గాల నుంచి కొంత సహాయం పొందడానికి కూడా ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
- కోవిడ్ సెకండ్ వేవ్ ఆర్థిక వ్యవస్థను బాధించలేదు - ఈ ఏడాది జీడీపీ వృద్ధి రేటు 9.2 శాతంగా ఆర్థిక సర్వే అంచనా
- విజయవాడ బాలిక ఆత్మహత్య కేసు: ఎవరీ వినోద్ జైన్, టీడీపీ, వైసీపీల వాదనలేంటి, సూసైడ్ లెటర్లో ఏముంది?
- దిశ హత్యకేసు నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టుకు ఎంక్వైరీ కమిషన్ నివేదిక
- మీ దగ్గర స్టార్టప్ పెట్టే టాలెంట్ ఉంటే 50 లక్షల వరకూ నిధులు.. రూ. 5 కోట్ల వరకూ గ్రాంటు పొందండి ఇలా..
- RRB: ఇరుకు గదులు.. ఖాళీ జేబులు.. కళ్లల్లో కొలువుల కలలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














