PM CARES: ఈ ఫండ్ మీద కేంద్ర ప్రభుత్వం ఏం చెబుతోంది, అనుమానాలు ఎందుకు వస్తున్నాయి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సల్మాన్ రావి
- హోదా, బీబీసీ ప్రతినిధి
కరోనా వైరస్ తొలి వేవ్ సమయంలో మార్చి 29న ప్రధానమంత్రి పీఎం కేర్స్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిధులను కరోనా వ్యాధి కారణంగా ఏర్పడే అత్యవసర పరిస్థితుల్లో వాడుకోవడానికి ఉపయోగ పడుతుందని వెల్లడించారు.
ఇటీవల ‘పీఎం కేర్స్ ఫండ్' వెబ్‌సైట్‌లో రెండేళ్ల ఆడిట్ వివరాలను ప్రకటించారు.
అందులో ఉన్న సమాచారం ప్రకారం, ఈ ఫండ్ ద్వారా మొత్తం రూ.10,990 కోట్లు నిధులు సమకూరాయి. ఈ వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారం గత ఆర్థిక సంవత్సరం వరకు అంటే మార్చి 31, 2021 వరకు జరిపిన లావాదేవీల వివరాలు మాత్రమే ఇచ్చారు.
మార్చి 2021 వరకు ఈ నిధుల నుంచి రూ.3,976 కోట్లు ఖర్చు చేశారని, ఇది మొత్తం డిపాజిట్లలో మూడో వంతు అని ఆడిట్ నివేదిక చెబుతోంది.
అయితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేనికి ఎంత ఖర్చు చేశారన్న సమాచారం వెబ్‌సైట్‌లో అందుబాటులో లేదు.
ఆడిట్ నివేదిక ప్రకారం, వలస కార్మికుల దృష్టిలో ఉంచుకుని, ఖర్చు చేసిన మొత్తంలో, రూ.1,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చారు.
అలాగే దేశంలోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రులలో సుమారు 50 వేల వెంటిలేటర్లు అందించారు. వీటి కోసం రూ.1,131 కోట్లు ఖర్చు చేశారు. దీనితో పాటు, మార్చి 2021 వరకు, 6.6 కోట్ల వ్యాక్సీన్ల కోసం రూ.1392 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు.

ఫొటో సోర్స్, HINDUSTAN TIMES
ప్రతిపక్షం ఏమంటోంది?
పీఎం కేర్స్ నిధులతో కొన్ని వెంటిలేటర్లు చాలా నాసిరకంగా ఉన్నాయని, దీంతో రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ కొనాల్సి వచ్చిందని ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ జాయింట్ సెక్రటరీ అంకుర్ నారంగ్ బీబీసీతో అన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఈ తరహా ఫిర్యాదులు అందాయి.
వలస కార్మికుల కోసం దిల్లీ ప్రభుత్వానికి ఎలాంటి సొమ్ము అందలేదని నారంగ్ ఆరోపించారు.
వెంటిలేటర్లను ఎలా ఆపరేట్ చేయాలో ఆరోగ్య శాఖ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వకపోవడంతో చాలా వెంటిలేటర్లు పనికి రాకుండా పోయాయని ఛత్తీస్‌గఢ్ ఆరోగ్య శాఖకు చెందిన ఒక అధికారి అన్నారు.
దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆర్‌టీపీసీఆర్ పరీక్షల కోసం 16 ల్యాబ్‌లను ఏర్పాటు చేయడానికి రూ. 50 కోట్లు వెచ్చించగా, కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే ఉన్న ల్యాబ్‌లను ఆధునీకరించడానికి రూ.20 కోట్ల మొత్తాన్ని ఉపయోగించారు.
ఇవి కాకుండా దేశవ్యాప్తంగా 160 ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు రూ.200 కోట్లకు పైగా ఖర్చు చేశారు. అదే సమయంలో, బిహార్‌లోని ముజఫర్‌పూర్, పట్నాలలో కోవిడ్ ఆసుపత్రులను నిర్మించడానికి రూ.50 కోట్లు ఖర్చు చేశారు.
పీఎంకేర్స్ ఫండ్ వెబ్‌సైట్‌లో కనిపించిన ఆడిట్ రిపోర్ట్‌ను సార్క్ అసోసియేట్స్ అనే ఆడిట్ సంస్థ తయారు చేసింది. ఈ ఫండ్‌కు నిధులు ఎక్కడి నుంచి ఎంత మొత్తం వచ్చాయో కూడా ఇందులో పేర్కొన్నారు.
దేశంలో స్వచ్ఛందంగా వచ్చిన విరాళాలు రూ. 7,183 కోట్లు కాగా, విదేశాల నుంచి వచ్చిన గ్రాంట్లు దాదాపు రూ.494 కోట్లుగా రిపోర్ట్ పేర్కొంది.
ఆసుపత్రులకు వచ్చిన వెంటిలేటర్లు సెకండ్ వేవ్ ముగిసిన తర్వాత మాత్రమే వచ్చాయని, ప్రజలు వెంటిలేటర్ల కోసం చాలా ఇబ్బందులు పడ్డారని 'ప్రోగ్రెసివ్ మెడికోస్ అండ్ సైంటిస్ట్స్ ఫోరమ్' జనరల్ సెక్రటరీ సిద్ధార్థ్ తారా బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అనేక ప్రశ్నలు
ఈ ఫండ్‌లో జమ అయిన డబ్బులో కేవలం 30 శాతం మాత్రమే ఖర్చు చేయడంపై అనేక అనుమానాలు కలుగుతున్నాయని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగతా రాయ్ అన్నారు.
''ఈ మొత్తాన్ని సమాచార హక్కు పరిధి నుంచి తీసేశారు. ఆరోగ్యానికి సంబంధించి అంశాన్ని ఇలా చేయడం అనూహ్యం. దేశంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితి ఏర్పడింది. గత రెండేళ్లుగా మారుమూల ప్రాంతాల్లో ఆరోగ్య వ్యవస్థ బాగుపడలేదు. ఆరోగ్య మౌలిక సదుపాయాలు పెంచలేదు. ఉచిత వైద్యం అందక ప్రజలు ఇప్పటికీ కరోనా మహమ్మారితో పోరాడుతున్నారు'' అని సౌగతా రాయ్ బీబీసీతో అన్నారు.
ఈ నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించగానే, ఈ నిర్ణయంపై విపక్షాలు అనేక ప్రశ్నలు లేవనెత్తాయి. ప్రధానమంత్రి సహాయ నిధి ఇప్పటికే ఉన్న తరుణంలో ఈ కొత్త నిధి అవసరం ఏంటని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ సహా ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి.
ముఖ్యమంత్రి సహాయనిధి రాష్ట్ర స్థాయిలో పని చేస్తోందని, అందులో ఈ డబ్బు జమ చేసి ఉండాల్సిందని ప్రతిపక్షం పేర్కొంది.
2020 మే లో ఈ ఫండ్‌ను ఒక ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థాపించారు. దీనికి ప్రధానమంత్రి ఛైర్మన్‌గా, ఆర్థికమంత్రి, హోంమంత్రి, రక్షణ మంత్రులను ధర్మకర్తలుగా చేర్చారు.

ఫొటో సోర్స్, Getty Images
కోర్టుకు చేరిన వ్యవహారం
సమాచార హక్కు ఉద్యమకారులు కొందరు ఈ నిధికి సంబంధించి గత రెండేళ్లుగా కోర్టులో పిటిషన్‌లు వేస్తూనే ఉన్నారు. ఈ ఫండ్‌ను 'సమాచార హక్కు' పరిధిలోకి తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు.
కానీ, గత ఏడాది సెప్టెంబర్‌లో, దిల్లీ హైకోర్టులో ప్రభుత్వం తన పిటిషన్‌లో 'పీఎం కేర్స్ ఫండ్' ప్రభుత్వానికి చెందిన సంస్థ కాదని, స్వచ్ఛంద సంస్థ లేదా 'ఛారిటబుల్ ట్రస్ట్' అని స్పష్టం చేసింది. ట్రస్టీల ఆధ్వర్యంలో నడిచే ఈ సంస్థ సమాచార హక్కు చట్టం పరిధిలోకి రాదని తేల్చి చెప్పింది.
ఈ నిధిని పర్యవేక్షించలేకపోతే పారదర్శకత ఎక్కడి నుండి వస్తుందని తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన సౌగతా రాయ్ అన్నారు.
"ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ శాఖలు, ప్రైవేట్ సంస్థలు ఈ నిధికి విరాళాలు ఇచ్చాయి. కాబట్టి దాని కార్యకలాపాలలో పారదర్శకత ఉండాలి. కరోనాతో మరణించిన వారి కుటుంబాలను ఆదుకోవడానికి ఈ డబ్బును ఉపయోగించకపోవడం ఆందోళన కలిగించే అంశం'' అన్నారు సౌగతారాయ్.

ఇవి కూడా చదవండి:
- గోంగూరకు రుచి ఇచ్చే పచ్చిమిర్చి తెలుగు నేలది కాదా... సమోసాలో బంగాళాదుంప ఏ దేశం నుంచి వచ్చింది?
- ఉత్తరప్రదేశ్‌లో 2017 తరువాత 'అల్లర్లు జరగలేద'న్న యోగి ఆదిత్యనాథ్ మాటల్లో నిజమెంత - BBC RealityCheck
- చనిపోయిన తమ కుమారుడి వీర్యం కావాలని ఆ తల్లితండ్రులు ఎందుకు కోర్టుకు వెళ్లారు?
- ‘హీరోయిన్లు అందంగా, సన్నగా ఉండాలి, పొట్ట ఉండకూడదు అనేవి ఎప్పటి నుంచి వచ్చాయి?’
- ఎవరికీ తెలియని రహస్య ప్రాంతాల్లో దాక్కున్నా వెంటాడి చంపేసే ఆయుధాలు
- ఒమిక్రాన్: కేసులు పెరుగుతున్నప్పుడు ఇంట్లోనే కరోనా టెస్ట్ చేసుకోవడం మంచిదేనా?
- ముఖానికి నల్ల రంగు వేసుకుని ముస్లిం వరుడు, స్నేహితుల సంబరాలు - కర్ణాటకలో మరో వర్గం నుంచి అభ్యంతరం
- బలవంతపు మతమార్పిడికి 10 ఏళ్ల జైలు: కర్ణాటకలో తమపై దాడులు పెరుగుతున్నాయంటూ క్రైస్తవుల ఆందోళన
- ముస్లింలు, మహిళలు లక్ష్యంగా సోషల్ మీడియాలో విద్వేషం ఎలా వ్యాపిస్తోంది?- బీబీసీ పరిశోధన
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













