లాక్‌డౌన్ సమయంలో వలస కార్మికుల కష్టాలకు ఎవరు బాధ్యులు? ఫేక్ న్యూసా లేక ప్రభుత్వ ఉదాసీనతా?

ఫొటో సోర్స్, INDRANIL MUKHERJEE/Getty Images
- రచయిత, అనంత్ ప్రకాశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
"లాక్‌డౌన్ మొదలయ్యాక అనేక రకాల నకిలీ వార్తలు వెలువడ్డాయి. కూడు, గుడ్డ, నీరు, నీడ, ఆరోగ్య సదుపాయాలవంటి ప్రాథమిక అవసరాల విషయంలో ప్రజలు భయాందోళనలు చెందారు. ముఖ్యంగా వలస కార్మికులు తమ పనులు ఆగిపోవడంతో మరింత ఆందోళన చెంది తమ సొంత ఊళ్లకు ప్రయాణం కట్టారు. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వానికి చింత ఉంది. లాక్‌డౌన్ సమయంలో ప్రాథమిక అవసరాల విషయంలో ఎవరూ ఇబ్బంది పడకుండా అన్ని రకాల చర్యలూ తీసుకుంది."
అని చెప్తూ….ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా, భారతదేశ చరిత్రలో పాకిస్తాన్ విభజన తరువాత ఏర్పడిన అతి పెద్ద మానవ విషాదంగా మారడానికి 'నకిలీ వార్తలే' కారణమని హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ రెండు ముక్కల్లో తేల్చి చెప్పారు.
వలస కార్మికుల కష్టాలకు నకిలీ వార్తలే కారణమని నిందించడం కేంద్ర ప్రభుత్వానికి ఇదేమీ మొదటిసారి కాదు.
లాక్‌డౌన్ ప్రారంభమైనప్పటినుంచీ వలస కూలీల కష్టాలకు నకిలీ వార్తలు, ప్రతిపక్ష పార్టీలే కారణమని ప్రభుత్వం ఆరోపిస్తూనే ఉంది. సుప్రీం కోర్టులోనూ అదే మాట..టీవీ ఛానళ్లలోనూ అదేమాట.
ఈ నేపథ్యంలో, నిజంగా వలస కూలీల పరిస్థితికి ఫేక్ న్యూసే కారణమా అనే సందేహం రాక మానదు.
ఈ సందేహం తీరాలంటే ప్రభుత్వం మాట్లాడిన ప్రతీ మాటనూ, ఇచ్చిన ప్రతీ ప్రకటననూ మళ్లీ జాగ్రత్తగా విని, చదివి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
నాలుగు గంటల్లో దేశం మొత్తం బంద్
మార్చ్ 24 మంగళవారం నాడు సాయంత్రం 8.00 గంటలకు దేశ ప్రధాని ఒక ప్రకటన చేసారు.
"ఇవాళ అర్థరాత్రి 12.00 గంటలనుంచీ దేశవ్యాప్తంగా పూర్తి లాక్‌డౌన్ అమలుపరుస్తున్నాం. దేశాన్ని కాపాడుకోడానికి, భారత పౌరులను కాపాడుకోడానికి, మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కాపాడుకోడానికి ఇవాళ రాత్రి 12.00 గంటలనుంచీ ఎవరూ ఇళ్లు కదిలి బయటకి రాకూడదని నిబంధన విధించడమైనది."
"మీరంతా ఈ సమయంలో ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండండి. ప్రస్తుత పరిస్థితులననుసరించి ఈ లాక్‌డౌన్ నిబంధనలు 21 రోజులపాటూ కొనసాగుతాయి. ఈ మూడు వారాలపాటూ ఇంట్లోనే ఉండండి..కేవలం ఇళ్లల్లోనే ఉండండి" అని ప్రకటించారు.
ఎక్కడివాళ్లు అక్కడే ఉండండి. ఇల్లు దాటి బయటకి రాకండి అని ప్రధాని మోదీ నొక్కి చెప్పారు.
అయితే, భవన నిర్మాణాల్లో పాలుపంచుకుంటూ రోడ్డు పక్కన చాప వేసుకుని పడుకునే వలస కూలీల సంగతేంటి?
కోవిడ్ 19 మహమ్మారి ముంచుకొస్తున్న ఆ సమయంలో ఈ వలస కూలీలకు 21 రోజులు ఎలా గడుస్తాయి అనేదాని గురించి ఆలోచించడం అంత ముఖ్యమని అనిపించకపోయుండొచ్చు.
సాధారణంగా ట్విట్టర్‌లో చురుకుగా పోస్టులు పెట్టే ప్రధాని మోదీ…వలస కూలీల విషయంపై ఒక్క మాట కూడా రాయలేదు.
మార్చ్ 24 నుంచీ 29 వరకు దాదాపు అన్ని టీవీ ఛానళ్లలోనూ, సోషల్ మీడియాలోనూ కూడా వలస కార్మికుల గురించి హోరెత్తించినప్పుడు కూడా ప్రధానమంత్రి మౌనంగానే ఉన్నారు.
కానీ ఈ ఐదు రోజుల్లో పీఎం కేర్‌కు ఫండ్స్ ఇచ్చిన ప్రముఖులందరికీ మోదీ కృతజ్ఞతలు తెలిపారు.
వలస కూలీల విషయంలో ఉదాసీనత
ప్రభుత్వం దగ్గర వలస కార్మికుల, రోజు కూలీల గణాంకాలు ఉంటాయని, లాక్‌డౌన్ ప్రకటించే ముందు అవన్నీ పరిశీలించి వారికి ముందు జాగ్రత్తగా ఏర్పాట్లు చెయ్యవచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు.
వారి విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించిందనీ, రోజూ రెక్కాడితేగానీ డొక్కాడని ప్రజలకు లాక్‌డౌన్ విధిస్తే ఎలాంటి సంక్షోభం తలెత్తుతుందో ఆలోచించకపోవడం ప్రభుత్వ వైఫల్యమని నిపుణులు అంటున్నారు.
వలస కార్మికుల గురించి ప్రభుత్వానికి చింత ఉందని కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ తన ప్రకటనలో పేర్కొన్నారు. కానీ మార్చ్ 25 న ప్రకాశ్ జావడేకర్ ఇచ్చిన ప్రకటనలో కూడా వలస కూలీల ప్రస్తావన రాలేదు.
మార్చ్ 25 న విలేకరుల సమావేశంలో...దిల్లీనుంచీ సూరత్‌తో సహా అనేక పట్టణాలలో వలస కూలీలు ఇబ్బందుల పాలయ్యారు. వారిని తమ సొంత ఊర్లకు తరలించడానికి ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటోందా అని ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు జవాబుగా...
"ఈ విషయంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. కానీ వాళ్లు (వలస కూలీలు) ఇక్కడ పనిచేస్తున్నారంటే వాళ్ల నివాసం కూడా ఇక్కడే అని మనం అర్థం చేసుకోవాలి. ఈ పరిస్థితుల్లో తమ సొంత ఊర్లకు వెళ్లడం అనే ఆలోచన మాని ఎక్కడివారక్కడే ఉండడం మేలు" అని జావడేకర్ అన్నారు.
జావడేకర్ మాటల ద్వారా వలసకూలీలను ఇళ్లకు పంపించే ఏర్పాట్లేవీ ప్రభుత్వం చెయ్యట్లేదని తెలుస్తోంది. మరి, వారి ఆందోళనలు ప్రభుత్వానికి తెలుసని నిత్యానంద్ రాయ్ అన్న మాటలకు అర్థమేమిటి అనే సందేహమొస్తుంది.
అయితే, మేలో మోదీ ప్రభుత్వం ఆత్మనిర్భర్ ప్యాకేజీ ప్రకటించింది. 8 కోట్ల మంది వలస కూలీలకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నామని ప్రకటించింది.
మరెందుకు వాళ్లంతా రోడ్లపై నడవడం ప్రారంభించారు?
నకిలీ వార్తల వల్ల వలస కూలీలు సొంత ఊళ్లకు బయలుదేరారా అన్న ప్రశ్నకు ఇంకా సమాధానం దొరకలేదు.
వలస కార్మికులతో మట్లాడితే ప్రభుత్వ వైఫల్యమే ఈ పరిస్థితికి కారణమని అర్థమవుతుంది. నకిలీ వార్తలు కాదని కూడా బోధపడుతుంది.
లాక్‌డౌన్ ప్రకటించిన మొట్టమొదటిరోజు మార్చ్ 25 న బీబీసీ ప్రతినిధి నితిన్ శ్రీవాస్తవ కొంతమంది కూలీలతో మాట్లాడారు. వారు దిల్లీనుంచి భరత్‌పూర్‌కు నడిచిపోతున్నారు.
వాళ్లేమన్నారంటే.."మేము దిల్లీలో పశ్చిమ విహార్ నుంచీ వస్తున్నాం. అక్కడ రాళ్లు ఎత్తే పని చేస్తాం. నాలుగైదు రోజులుగా మా పని ఆగిపోయింది. డబ్బుల్లేవు. తినడానికేమీ లేదు. ఇలాగే ఉంటే మేము ఆకలితోనే చనిపోతాం. అందుకే మా సొంతూరికి బయలుదేరాం" అని చెప్పారు.
భయంకరమైన మానవ విషాదానికి ఇదే ప్రారంభం. దీని తరువాత అన్ని పట్టణాలనుంచీ, నగరాలనుంచీ కాలినడకన సొంతూర్లకు బయలుదేరేవారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతూ వచ్చింది.
ముంబై, దిల్లీలాంటి పెద్ద పెద్ద నగరాలనుంచీ లెక్కించలేనంతమంది వలసకూలీలు నడక ప్రారంభించారు. కొన్ని వందల కిలోమీటర్లు నడవడానికి సిద్ధపడిపోయారు.
ఎంతోమంది దారిలోనే ప్రాణాలు విడిచారు. కొందరు తల్లులు తమ బిడ్డలకు రోడ్డు మీద జన్మనిచ్చారు. కొందరు పిల్లలు తల్లుల ఒడిలోనే ప్రాణాలు వదిలారు.
ఐదురోజుల మౌనం తరువాత ప్రధాని తమ మన్ కీ బాత్‌లో లాక్‌డౌన్ సమయంలో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులకు క్షమాణలు చెప్పారు.
అయితే వలస కార్మికులకు ఈ మాటలు సేద తీరుస్తాయా? వారి ఇబ్బందుల పట్ల ప్రభుత్వం చూపించాల్సిన సహానుభూతి ఇదేనా అనే సందేహం తలెత్తుంది.
నగరాలను, పట్టణాలను విడిచివెళ్లిన వలస కార్మికులు రాష్ట్ర సరిహద్దుల వద్ద పోలీసుల చేతిలో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వీరి పట్ల సహానుభూతితో ఉంటే సరిహద్దులవద్ద వారిని ఇబ్బంది పెట్టొద్దని ఆజ్ఞలు ఎందుకు జారీ చేయలేదు?
బీబీసీ ప్రతినిధి సల్మాన్ రావి దిల్లీలో, అంబాలానుంచి పిల్లాపాపలతో, కాలికిచెప్పులు కూడా లేకుండా ఆకలితో నడిచి వస్తున్న వలస కార్మికులతో మాట్లాడారు.
"మోదీజీ మాకు చాలా మంచి పని చేసి పెట్టారు. ఆయనకేం కూర్చున్న చోటినుంచీ కదలక్కర్లేదు. మేము ఆకలితో మాడి చస్తాం. మా ఇబ్బందులు ఎవరికీ అక్కర్లేదు" అంటూ వారు తమ ఆవేదన వ్యక్తం చేసారు.
వస్తున్న దారిలో పోలీసులు పెట్టిన ఇబ్బందుల గురించి వారు వివరించారు. పోలీసులు వారిని తరిమి కొడుతున్నారని, లాఠీలతో కొట్టి చంపేస్తున్నారని చెప్పారు. రోజుకు 280 రూపాయిలు సంపాదించే వీళ్లు అంబాలానుంచీ మధ్య ప్రదేశలోని ఛతర్‌పూర్‌కు నడిచి వెళ్తున్నారు.
లాక్‌డౌన్ సమయంలో పోలీసుల అమానుష ప్రవర్తన గురించి అనేక కథనాలు బయటికొచ్చాయి. పశువుల్లా అందరినీ కూర్చోబెట్టి వారిపై పిచికారీ కొట్టడం, తిండీ, నీరు ఇవ్వకుండా వారిని చీకటి గదుల్లో బంధించి ఉంచడంలాంటి సంఘటనలెన్నో బయటికొచ్చాయి.

ఫొటో సోర్స్, Reuters
ప్రభుత్వ సహాయం వలస కూలీల వరకూ వెళ్లిందా?
మేలో మూడో విడత లాక్‌డౌన్ ప్రకటించిన తరువాత వలస కూలీలకు ఆహర సరఫరా ప్యాకేజీని ప్రకటించింది. ప్రతీ కుటుంబానికీ 5 కేజీల బియ్యం, ఒక కేజీ పప్పు ఇస్తున్నట్టు ప్రకటించింది.
కానీ కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం సెప్టెంబర్ నాటికి ప్రకటించిన 8 లక్షల కిలోల ఆహార ధాన్యాలలో 33 శాతం మాత్రమే పంపిణీ చేయగలిగారని తేలింది.
అద్దెలు అడగవద్దని, ఉద్యోగాలనుంచీ తొలగించవద్దని ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి కూడా ఏమీ సహాయపడలేదు.
సెంటర్ ఫర్ ఇండియన్ ఎకానమీ గణాంకాల ప్రకారం లాక్‌డౌన్ విధించిన ఒక నెల తరువాత సుమారు 12 కోట్లమంది ఉద్యోగాలు కోల్పోయారు. వీరిలో అధిక శాతం అనార్గనైజ్డ్ సెక్టర్లకు చెందినవారు, గ్రామీణ ప్రాంతాలవారు ఉన్నారు.
ఆహార, పానీయాల కొరత
వలస కార్మికుల ప్రాథమిక అవసరాలకు అన్ని ఏర్పాట్లు చేసామని నిత్యానంద్ రాయ్ అన్నారు. దిల్లీనుంచి బీహార్ వెళ్లే రైళ్లల్లో తాగడానికి చుక్క నీళ్లు దొరకక ప్రజలు నానా అవస్థలు పడ్డారు. వీటిని సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఉత్తరప్రదేశలోని కాన్పూర్ రైలే స్టేషన్‌లో ఆహార పొట్లాల విషయంలో గొడవలు జరిగాయి.
ఎన్‌డీటీవీ అందించిన సమాచారం ప్రకారం రైల్లో మరుగుదొడ్లలో నీళ్లు లేవని ఫిర్యాదులొచ్చాయి.
శ్రామిక రైళ్లల్లో నీళ్ల బాటిళ్ల కోసం పోరాటం గురించి, ఇతర ఇబ్బందుల గురించి వలస కూలీలు బీబీసీ, ఇతర మీడియా సంస్థలతో పంచుకున్నారు.
ముజఫర్‌పూర్ స్టేషన్‌లో మరణించిన ఒక స్త్రీ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే, ఆమె ఇతర అనారోగ్య కారణాల వల్ల మృతి చెందిందనీ, ఆహార, పానీయాల కొరత వల్ల కాదని ముజాఫర్‌పూర్ జిల్లా అధికారి చంద్రశేఖర్ సింగ్ స్పష్టం చేసారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎంతమంది చనిపోయారు?
లాక్‌డౌన్ సమయంలో సొంతూర్లకు బయలుదేరినవారిలో ఇంటికి చేరినవారెంతమంది? దారిలో ప్రాణాలు కోల్పోయినవారెంతమంది? ఈ ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం దగ్గర జవాబు లేదు.
ఈ వివరాలను భద్రపరచలేమని నిత్యానంద రాయ్ అన్నారు.
చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ఏదైనా ఆర్థిక సహాయం చేసిందా అని కేంద్ర కార్మిక మంత్రి సంతోష్ గంగ్వార్‌ను అడిగినప్పుడు అలాంటి గణాంకాలను భద్రపరచలేమని జవాబిచ్చారు.
అయితే వైర్ హిందీ వెబ్‌సైట్ గణాంకాల ప్రకారం రైలు ప్రయాణంలో మొత్తం 80 మంది చనిపోయారని తేలింది.
బీబీసీ వివిధ స్థాయిల్లో సేకరించిన డాటా ప్రకారం మార్చ్ 24 నుంచీ జూన్ 1 వరకూ 304 మంది మృతి చెందినట్టు తెలిసింది. వీరిలో 33 మంది అలసటతోనూ, 23 మంది రైలు ప్రయాణంలోనూ, 14 మంది ఇతర కారణాల వల్ల, 80 మంది శ్రామిక రైళ్లల్లో ప్రయాణాల వల్ల చనిపోయినట్టు గణాంకాలు చెబుతున్నాయి.
వలస కూలీల కష్టాలకు ఎవరు బాధ్యత వహిస్తారు?
నకిలీ వార్తల వల్లే అంటూ కేంద్ర ప్రభుత్వం తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే ప్రయత్నాలు చేస్తోంది.
కానీ ఈ దేశంలో లాక్‌డౌన్ ప్రస్తావన్ వచ్చినప్పుడల్లా ఈ ప్రశ్న మళ్లీ మళ్లీ ఉత్పన్నమవుతూనే ఉంటుంది. వేలాది వలస కూలీలను ఇబ్బందుల పాలు చేసిన ప్రభుత్వాన్ని వేలెత్తి చూపిస్తూనే ఉంటారు.












