ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు 'ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన' కింద కేంద్రం నుంచి వచ్చింది ఎంత? వలస కార్మికులకు ఇచ్చింది ఎంత?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, శంకర్ .వి
- హోదా, బీబీసీ కోసం
లాక్ డౌన్ సమయంలో సతమతమవుతున్న వలస కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్బర్ భారత్ ప్యాకేజీ-ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజనలో భాగంగా కొత్త మొత్తాన్ని ప్రకటించింది. వివిధ వర్గాలకు చేసిన కేటాయింపుల్లో భాగంగా వలస కార్మికులకు ఉచితంగా ఆహారధాన్యాలు అందించాలని నిర్ణయించింది. అందులో భాగంగా మే, జూన్ నెలల్లో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు కలిపి 8 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు పంపిణీ చేయాలని భావించింది. కేటాయింపులు కూడా చేసింది. కానీ కేంద్రం లెక్కల ప్రకారమే అందులో కేవలం 13శాతం మాత్రమే వినియోగించారు.
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విషయానికి వస్తే వినియోగం మరింత స్వల్పస్థాయిలో ఉంది. కేవలం ఒక్క శాతం ఆహార ధాన్యాలు మాత్రమే వలస కూలీలకు చేరాయి. వివిధ రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారు సొంత ప్రాంతాలకు వెళ్లిపోవడంతోనే తక్కువ వినియోగం జరిగిందని ఉభయ రాష్ట్రాలు చెబుతున్నాయి.
ఈ ప్యాకేజీ ఎవరి కోసం?
మార్చి 24 వ తేదీ అర్థరాత్రి నుంచి లాక్ డౌన్ అమలులోకి రావడంతో అనేక వర్గాలు తీవ్ర ఇక్కట్లు పాలయ్యాయి. అందులో ప్రధానంగా వలస కార్మికులు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉన్న ఊళ్లో ఉపాధి లేక, సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు దారి లేక అల్లాడిపోయారు.
ఈ నేపథ్యంలో అనేక మంది కాలినడకన బయలుదేరి మార్గం మధ్యలో ప్రాణాలు వదిలిన ఘటనలు అందరినీ కలచివేశాయి. చివరకు కేంద్రం స్పందించి వలస కూలీల కోసం శ్రామిక్ రైళ్లను ఏర్పాటు చేసి కొంత మందిని ఆయా రాష్ట్రాలకు తరలించింది.
అందుకు తోడుగా ఆత్మనిర్భర్ ప్యాకేజీ పేరుతో వారిని అదుకుంటామని మే 12న జాతినుద్దేశించి మాట్లాడిన సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు.
మొత్తం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో కలిపి 8 కోట్ల మంది వలస కూలీలు ఉంటారని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. వారికి రెండు నెలల పాటు నెలకు 5 కిలోల ఆహార ధాన్యాలు , కిలో శనగలు ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించి, వాటిని రాష్ట్రాలకు విడుదల చేసింది. సొంత ప్రాంతంలో గానీ, ఆయా రాష్ట్రాల్లో గానీ రేషన్ కార్డ్ లేని వారిని మాత్రమే ఈ ఆహార పదార్థాలను తీసుకునేందుకు అర్హులుగా పేర్కొంది.

ఆంధ్రప్రదేశ్ లో ఎంత మందికి ఇచ్చారు?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నెలకు 13,411 టన్నుల చొప్పున రెండు నెలలకు కలిపి 26,823 టన్నుల బియ్యాన్ని కేంద్రం కేటాయించింది. 1793 మెట్రిక్ టన్నుల శనగలు కూడా అందించింది. ఏపీలో 48,137 కుటుంబాలకు చెందిన 64,144 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు ఉన్నట్టు వివిధ జిల్లాల కలెక్టర్లు అందించిన నివేదికల ఆధారంగా నిర్ధారించారు.
వాటిలో మే నెలలో కేవలం 522 మందికి మాత్రం ఉచితంగా ఆహార ధాన్యాల పంపిణీ జరిగింది. అంటే మొత్తం వలస కార్మికులలో ఒక్క శాతం కన్నా తక్కువ మందికి మాత్రమే ఆత్మనిర్భర్ ప్యాకేజీ చేరింది. వారికి గానూ 2,600 కిలోల బియ్యం, 169 కిలోల శనగలు మాత్రమే ఖర్చయ్యాయి.
ఇక జూన్ నెలలో మొత్తం 836 మంది వలస కార్మికులకు 4,200 కిలోల బియ్యం, 802 కిలోల శనగలు అందించారు. మొత్తంగా రెండు నెలలకు కలిపి ఈ పథకం ద్వారా సుమారు ఒక్క శాతం వలస కార్మికులకు మాత్రమే ప్రయోజనం చేకూరినట్టు ప్రభుత్వ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
తెలంగాణాలో పరిస్థితి అంతే
తెలంగాణాలో కూడా అదే తీరున ఉంది. మొత్తం కేటాయింపుల్లో కేవలం 1 శాతం మాత్రమే తెలంగాణాలో వినియోగించారు. అందుకు ప్రధాన కారణం కేంద్రం నుంచి వచ్చిన ఆహార ధాన్యాలు రాష్ట్రాలకు చేరేనాటికి వలస కార్మికులంతా సొంత రాష్ట్రాలకు చేరుకోవడమేనని తెలంగాణా పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అంటున్నారు.
ఆయన బీబీసీతో మాట్లాడుతూ, “కేంద్రం నుంచి ఆత్మనిర్భర్ ప్యాకేజీ వచ్చే నాటికే రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆహార ధాన్యాలు పంపిణీ చేశాం. ఆ తర్వాత మే నెలాఖరు నాటికి అంటే వాటిని రాష్ట్రాలకు అందించే సమయానికే వలస కార్మికులు సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయారు. దాంతో ఎక్కువ మందికి ఈ పథకం ద్వారా ప్రయోజనం దక్కలేదు. ఇప్పుడిప్పుడే మళ్లీ వలస కూలీలు రాష్ట్రానికి చేరుతున్నారు. వారు వచ్చిన వెంటనే అర్హులందరికీ కేంద్రం కేటాయించిన వాటిని అందిస్తాం. దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేశాం. కేంద్రం కేటాయింపులను లబ్దిదారులందరికీ పూర్తిగా చేరుస్తాం” అని వివరించారు.
తమ రాష్ట్రంలో వలస కూలీలు సొంత ప్రాంతాలకు వెళ్లిపోయినందును ఈ పథకంలో లబ్దిదారులకు పూర్తిగా పంపిణీ చేయలేకపోయినట్టు తెలంగాణా ప్రభుత్వం కేంద్ర ఆహార, పౌర సరఫరాల మంత్రిత్వ శాఖకు లేఖ కూడా రాసింది.

ఫొటో సోర్స్, Samiratmaj Mishra/BBC
దేశంలోని ఇతర రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉంది?
దేశవ్యాప్తంగా 8 కోట్ల మందికి ఈ పథకంలో లబ్ది చేకూర్చాల్సి ఉండగా అందులో మే నెలలో కేవలం 1.21 కోట్ల మందికి , జూన్ లో 92.44 లక్షల మందికి ఆహార ధాన్యాలు సరఫరా చేసినట్టు కేంద్ర ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.
దేశంలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కలిపి మే 14న ఆర్థిక మంత్రి ప్రకటించిన లెక్కల ప్రకారం 8లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు అందించాల్సి ఉండగా అందులో 6.38 లక్షల మెట్రిక్ టన్నులు కేటాయించారు.
జూన్ నెలాఖరు నాటికి లబ్దిదారులకు చేరింది కేవలం 1.07 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే. అంటే దేశం మొత్తం మీద ఈ పథకంలో వలస కార్మికులకు చేరిన లబ్ది 13 శాతం మాత్రమేనని అధికారిక లెక్కలు చాటుతున్నాయి.
26 రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలు మొత్తం తమ కేటాయింపుల్లో 100శాతం దిగుమతి చేసుకున్నాయి. కానీ లబ్దిదారులకు మాత్రం చేర్చిన దాఖలాలు కనిపించడం లేదు. అందులో అత్యధికంగా ఉత్తర ప్రదేశ్‌కి 1,42,033 మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు కేటాయించారు.
అక్కడ మే నెలలో సుమారు 4.39 లక్షల మంది లబ్దిదారులకు కేవలం 3,324 మెట్రిక్ టన్నులు (2.03 శాతం), జూన్‌లో మరింత తక్కువగా 2.25 లక్షల మంది లబ్దిదారులకు మాత్రమే పంపిణీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వ నివేదిక చాటుతోంది.
86,450 మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు బీహార్‌కి తరలించగా మే నెలకు గానూ కేవలం 3.68 లక్షల మంది లబ్దిదారులకు 1.842 మెట్రిక్ టన్నులు (2.13%) మాత్రమే పంపిణీ చేశారంటే కేటాయింపులకు, పంపిణీకి ఉన్న వైరుధ్యం స్పష్టమవుతోంది.
కేవలం ఒక్క శాతం మాత్రమే పంపిణీ చేసిన రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణాతో పాటుగా గోవా, గుజరాత్, జార్ఖండ్, మహారాష్ట్ర, మేఘాలయ, సిక్కిం, తమిళనాడు, త్రిపుర సహా కేంద్ర పాలిత ప్రాంతమైన లద్ధాఖ్ కూడా ఉంది.
ఇక, ఒడిశా, ఛత్తీస్ ఘడ్, మధ్య ప్రదేశ్ వంటి రాష్ట్రాలలో కేంద్రం కేటాయింపుల్ని పూర్తిగా తీసుకోవడానికి కూడా ముందుకు రాలేదంటే ఆశ్చర్యమే. ఉదాహరణకు 32,360 మెట్రిక్ టన్నుల కేటాయింపులకు గానూ ఒడిశా ప్రభుత్వం ఎఫ్‌సీఐ నుంచి 388 మెట్రిక్ టన్నులు మాత్రమే తీసుకుంది. 54,642 మెట్రిక్ టన్నుల కేటాయింపుల్లో మధ్యప్రదేశ్ 1,963 మెట్రిక్ టన్నులు (4%) తీసుకోగా, ఛత్తీస్ ఘడ్ కూడా తమకు కేటాయించిన 20,077 మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలలో 944 టన్నులు (5%) మాత్రమే తీసుకుంది.
గోవా సహా మరో ఐదు ప్రభుత్వాలు తమ రాష్ట్రాల నుంచి వలస కూలీలు తరలిపోయినందున పంపిణీ చేయలేమంటూ కేంద్రానికి తెలియజేయడం మరో విశేషం.

ఫొటో సోర్స్, GETTY IMAGES
కొన్ని రాష్ట్రాల్లో లబ్దిదారులకు చేరిన ప్రయోజనం
అదే సమయంలో రాజస్థాన్, హర్యానా ప్రభుత్వాలు తమకు కేటాయించిన ఆహార ధాన్యాలను లబ్దిదారులకు చేర్చేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించినట్టు ప్రకటించాయి.
రాజస్థాన్‌కి కేటాయించిన 44,662 మెట్రిక్ టన్నుల కోటాలో దాదాపు 95 శాతం పైగా పంపిణీ చేసింది. 42,478 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 42.47 లక్షల మంది లబ్దిదారులకు పంపిణీ చేసింది. హర్యానా హిమాచల్ ప్రదేశ్, అస్సాం మరియు కర్ణాటక రాష్ట్రాల్లో కూడా పంపిణీ విషయంలో బాగానే వ్యవహరించినట్టు కేంద్ర గణాంకాలు చెబుతున్నాయి.
ఉచితంగా ఇచ్చినా పంపిణీ చేయకపోవడం ఏమిటి?
అత్యధిక రాష్ట్రాలలో ఆత్మనిర్బర్ భారత్ పథకం- ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన అంతంత మాత్రం ప్రయోజనం కల్పించడం పట్ల కేంద్ర ప్రభుత్వం కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. “కొన్ని రాష్ట్రాలు పేదలకు ఆహార ధాన్యాన్ని పంపిణీ చేయడం లేదు. ఇది ఆందోళన కలిగించే విషయం… వారు పేదల సమస్యను అర్థం చేసుకుని వ్యవహరించాలి.
రాష్ట్రాలకు అవసరమైనంత మేరకు ఆహార ధాన్యం అందించడంలో మాకు ఎటువంటి సమస్య లేదు. ఇది ఉచితంగా ఇచ్చినప్పుడు, పంపిణీలో సమస్య ఏమిటన్నది అర్థం కావడం లేదు. మేం ఈ సమస్యను తీవ్రంగా పరిగణిస్తున్నాం” అని కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ వ్యాఖ్యానించారు.
వినియోగించని ఆహార ధాన్యాలను పీడీఎస్ లో మళ్లించేశారు
దేశంలో ఎక్కడా ఎటువంటి రేషన్ కార్డు లేని వారిని మాత్రమే ఈ పథకంలో లబ్దిదారులుగా చేర్చాలని చెప్పడం, పంపిణీ చేసే సమయానికి అత్యధికులు సొంత ప్రాంతాలకు తరలిపోవడంతోనే కేంద్రం కేటాయింపులు పూర్తిగా వినియోగించలేని పరిస్థితి ఏర్పడిందని ఏపీ సివిల్ సప్లయిస్ కార్పోరేషన్ డిప్యూటీ డైరెక్టర్ చిట్టిబాబు తెలిపారు.
ఆయన బీబీసీతో మాట్లాడుతూ “మే నెలలో కేంద్రం ఆత్మనిర్భర్ పథకం కింద కేటాయింపులు చేసింది. వాటిని వినియోగించిన మేరకు తగ్గించి మిగిలిన వాటిని పీడీఎస్ కేటాయింపులలో జమ చేసింది. ఆమేరకు రాష్ట్రానికి కేటాయింపులలో కోత పెట్టింది. ఇక జూన్ లో వినియోగం మేరకు జులై కేటాయింపుల్లో కూడా తగ్గుదల ఉంటుందని అధికారులు తెలిపారు” అని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- చైనా న్యూ సిల్క్ రోడ్: పాకిస్తాన్‌తో కలసి పూర్తి చేయాలనుకున్న ప్రాజెక్టే ఇప్పుడు డ్రాగన్ మెడకు చుట్టుకుంది...
- ఆంధ్రప్రదేశ్: పార్లమెంట్ నియోజకవర్గాల ఆధారంగా జిల్లాల విభజన లాభమా? నష్టమా?
- ‘ఉపాధి లేదు.. చేతిలో డబ్బు లేదు’.. మహిళలను టార్గెట్ చేస్తున్న అక్రమ రవాణా ముఠాలు
- అణ్వస్త్రాలు: ''మేం మొదట ఉపయోగించం'' అన్న హామీని ఇండియా ఇప్పుడు ఎందుకు సమీక్షిస్తోంది
- రైతుబంధు సాయంలో సగం పెద్ద రైతులకేనా
- హైదరాబాద్, విజయవాడల మధ్య హైస్పీడ్ రైలు సాధ్యమేనా
- చైనా దూకుడుకు బ్రేకులు పడ్డట్లేనా? ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగాలన్న కల నెరవేరేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








