యుక్రెయిన్: ‘నా శరీరంలో ఎన్ని బుల్లెట్లు ఉన్నాయో వాళ్లు చెప్పరు’

నటాలియా మైకోలైవ్నా

ఫొటో సోర్స్, BBC News

ఫొటో క్యాప్షన్, నటాలియా మైకోలైవ్నా
    • రచయిత, వయర్ డేవిస్
    • హోదా, బీబీసీ న్యూస్

యుక్రెయిన్‌లోని నివాస స్థలాలు, కార్యాలయాలు, పౌరులపై దాడులు చేయడం లేదని రష్యా చెబుతోంది. కానీ రష్యా మాటలు నిజం కాదని యుక్రెయిన్‌లోని జాపోరిజియాకు చెందిన నటాలియా మైకోలైవ్నా అంటున్నారు.

కానీ, ఆస్పత్రి బెడ్‌పై పడుకుని ఆమె బీబీసీతో మాట్లాడారు.

యుక్రెయిన్‌లోని నివాస స్థలాలను లక్ష్యంగా చేసుకుని రష్యా దాడి చేసినట్లయితే అవి యుద్ధ నేరాలవుతాయని మార్చి రెండవ వారంలో ఐక్యరాజ్య సమితి ప్రకటించింది.

అప్పటి నుంచి యుక్రెయిన్‌లో చోటు చేసుకున్న దాడుల్లో అనేక మంది పౌరులు మరణించారు. నివాస స్థలాలపై విచక్షణా రహితంగా, భారీగా షెల్లింగ్ జరగడం వల్లే ఈ మరణాలు చోటు చేసుకున్నాయి.

45 సంవత్సరాల నటాలియాపై జరిగిన కాల్పులు ఉద్దేశపూర్వకంగా జరిపినవే. ఆ కాల్పులను రష్యా సమర్ధించుకోలేదు. ఆమె ఇంకా సజీవంగా ఉండటం మిరాకిల్ అని చెప్పొచ్చు.

రష్యా సేనలు ఆమె సొంతూరు పోలోహిలోకి అడుగు పెట్టినప్పుడు అక్కడ జరిగిన విషయాలను కొడుకు చేతిని గట్టిగా పట్టుకుని ఆమె బీబీసీకి వివరించారు.

"నేను ఇంట్లోంచి బయటకు వచ్చాను. మా అమ్మ గురించి నేను టెన్షన్ పడుతున్నాను. నేనామెను చూసేందుకు వెళ్లాను. ఆమె మా ఇంటికి పక్క వీధిలోనే ఉంటారు" అని నటాలియా చెప్పారు.

వీడియో క్యాప్షన్, యుక్రెయిన్: యుద్ధం మొదలై నెల రోజులు దాటినా వెనక్కి తగ్గేదే లేదంటున్న సైన్యం

ఆమె రష్యన్ సైనిక చెక్ పాయింట్‌ను దాటుకుని వెళ్లాల్సి వచ్చింది.

"మా అమ్మను చూసేందుకు వెళ్లేందుకు అనుమతి ఉందని అరుస్తూ చేతులను గాలిలోకి ఊపుతూ వెళుతుండగా, ఒక రష్యన్ సైనికుడు నా నడుం కింది భాగం మొత్తం దెబ్బ తినేలా మెషీన్ గన్‌తో నా కాళ్లపై కాల్చాడు" అని చెప్పారు.

నటాలియాపై కాల్పులు జరిపిన రష్యన్ సైనికుడి గొంతు కానీ, ముఖం కానీ ఆమె చూడలేదు.

"అతనొక్క మాట కూడా మాట్లాడలేదు. వాళ్ళు 'Z' అనే అక్షరం ముద్రించిన ట్యాంకు పక్కనే నిల్చుని ఉన్నారు. వాళ్లంతా ముఖానికి మాస్కులు వేసుకున్నారు" అని చెప్పారు.

వెంటనే పొరుగువారు, కుటుంబీకులు నటాలియాను చికిత్స కోసం జాపోరిజియాలోని ఆస్పత్రికి తరలించారు.

ఆమె తృటిలో మరణాన్ని తప్పించుకున్నారని డాక్టర్లు చెప్పినట్లు చెప్పారు.

"నా శరీరంలో ఎన్ని బుల్లెట్లు దిగాయో డాక్టర్లు చెప్పలేదు. నా కడుపు నుంచి పాదాల వరకు కాల్పులు జరిపారు" అంటూ పొట్టలో తగిలిన బుల్లెట్ గాయాలను ఆమె చూపించారు. "ఇక్కడొకటి ఉంది, ఇక్కడ మరొకటి, ఇక్కడ కూడా. నా శరీరమంతా ధ్వంసమయింది. నా జననాంగాలు కూడా దెబ్బతిన్నాయి" అని అన్నారు.

ఆరిఖివ్

ఫొటో సోర్స్, BBC News

ఫొటో క్యాప్షన్, ఆరిఖివ్

నటాలియా కుడి కాలు వంగిపోయి, విరిగింది. దానిని ఒక ఇనుప ఫ్రేమ్‌తో కట్టి ఉంచారు. ఆమె మోకాలు పూర్తిగా ముక్కలయింది. ఆమె ఇక ఎప్పటికీ మునుపటిలా నడవలేరు.

నటాలియా సొంత ఊరు పోలోహీని రష్యా ఆక్రమించింది. ఈ గ్రామం మరియుపూల్‌కి వెళ్లే దారిలో ఉంది. ఇదొక చిన్న వ్యవసాయ గ్రామం.

యుక్రెయిన్ ఫ్రంట్ లైన్ సేనల చేతిలో ఉన్న ఆఖరి గ్రామం ఆరిఖివ్. ఇటీవల వారాల్లో ఇక్కడ కూడా రష్యా షెల్స్, బాంబుల దాడి పెంచింది.

చాలా కుటుంబాలు భద్రత కోసం జాపోరిజియా లేదా ఇతర నగరాలకు వెళ్లిపోయారు.

డాక్టర్లు, సివిల్ డిఫెన్స్ ఉద్యోగులు మాత్రం ఊర్లో ఉండిపోయారు.

లిడా వాసిలివ్నా

ఫొటో సోర్స్, BBC News

ఫొటో క్యాప్షన్, లిడా వాసిలివ్నా

లిడా వాసిలివ్నా పొలం ఆరిఖివ్ సరిహద్దుల్లో ఉంది. దాడులకు గురయ్యే ప్రమాదకరమైన ప్రాంతంలో ఇది ఉంది.

ఆమెను బీబీసీ కలిసే సమయానికి ఆమె పొలంలో బంగాళదుంపలను నాటుతూ కనిపించారు.

ఆమె పొలం పనిలో ఉండగా, దూరం నుంచి రష్యా సేనలు చేస్తున్న షెల్లింగ్ శబ్దాలు వినిపించాయి.

లిడా భర్త ఇప్పటికే రెండుసార్లు గుండె పోటుకు గురయ్యారు. ఆమె భర్త, పిల్లలు కొన్ని మైళ్ళ దూరంలో ఉన్న కమ్యూనిటీ షెల్టర్‌లో సురక్షితంగా ఉన్నారు. కానీ, ఆమె పొలం, పశువులు, గొర్రెలు, కుందేళ్ళను చూసుకునేందుకు ఆమె ఊర్లోనే ఉండిపోయారు. సరిపడేంత ఆహార నిల్వలు ఉన్నాయని ఆమె ధైర్యంగా ఉన్నారు. నిర్మించుకున్న సామ్రాజ్యాన్ని కోల్పోకూడదనే దృఢ నిశ్చయంతో ఆమె ఉన్నారు.

లిడా ఒక బంగ్లాలో ఉంటారు. కానీ, ఆమె అక్కడ నిద్రపోరు. అక్కడ పడుకోవడం చాలా ప్రమాదకరం.

దాంతో, ఆమె సాధారణంగా శీతాకాలంలో బంగాళా దుంపలు, పచ్చళ్ళు నిల్వ ఉంచే తేమగా ఉన్న సెల్లార్‌లో పడుకుంటారు.

పండిన పంట, పొలం సామాన్ల మధ్యలో ఒక చాప, దుప్పటి పెట్టుకుని పడుకున్నారు. రష్యన్ షెల్ దాడుల నుంచి తప్పించుకునేందుకు ఇదొక మార్గం.

"రష్యన్లు అన్ని వైపుల నుంచి దాడులు చేస్తుండటంతో నేనీ బంకర్‌లో దాక్కుని ఉంటున్నాను" అని కన్నీరు పెట్టుకుంటూ చెప్పారు.

"నేను వారిని ద్వేషిస్తున్నాను. నేను వారిని ద్వేషిస్తున్నాను. మేము శాంతిగా బతికేవాళ్ళం. మేము సంతోషంగా ఉండేవాళ్ళం" అని చెప్పారు.

ఆస్పత్రిలో శిక్షణ పొందుతున్న స్థానికులు

ఫొటో సోర్స్, BBC News

ఫొటో క్యాప్షన్, ఆస్పత్రిలో శిక్షణ పొందుతున్న స్థానికులు

ఊహించకుండా వచ్చిన యుద్ధం వల్ల ఈ ఊర్లో అందరూ ఇక్కడి పరిస్థితులకు తొందరగా అలవాటు పడటం నేర్చుకుంటున్నారు.

ఆరిఖివ్‌లోని చిన్న ఆస్పత్రిలో నర్సులు, ఫస్ట్ ఎయిడ్ చేసే సిబ్బందికి యుద్ధ రంగంలో చేసే వైద్యం గురించి క్రాష్ కోర్స్ నిర్వహించారు.

అందరూ యుద్ధాన్ని సీరియస్‌గా తీసుకుని నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

"అత్యవసర పరిస్థితి తలెత్తినపుడు వైద్య సిబ్బంది వ్యవహరించాల్సిన తీరు ఇది" అని శిక్షణ ఇస్తున్న గిలోమీ బారియు చెప్పారు.

"ఈ వైద్యులు ఒక్కొక్కసారి వైద్యం చేసే క్రమంలో కొన్ని కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకోవలసి ఉంటుంది" అని అన్నారు.

"రక్షించగలమనుకున్న రోగులకు వైద్యం చేసే విధానం గురించి తెలుసుకుని ఉండాలి. ఏ క్షణమైనా ఏదైనా జరగవచ్చని అందరికీ తెలుసు" అని చెప్పారు.

మేము ఆరిఖివ్ దాటి వచ్చేసరికి లిడా కాల్ చేసి ఆ ఊర్లో ఒక పెద్ద దాడి జరిగినట్లు చెప్పారు. ఆమె పొలంలో కూడా ఒక బాంబు పడింది. నగరంలో చాలా చోట్ల దాడులు జరిగాయని చెప్పారు. అయితే, ఈ దాడుల్లో మరణించిన వారి గురించి వివరాలేమీ లేవు.

ఇవన్నీ ఆమెను భయపెడుతున్నప్పటికీ, ఆ రాత్రి షెల్టర్‌లోనే ఉండేందుకు లిడా కృత నిశ్చయంతో ఉన్నారు.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)