డ్రగ్స్ తీసుకుంటే ఏమవుతుంది, ఎందుకు వాటి కోసం కొందరు పిచ్చెక్కిపోతారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, పద్మ మీనాక్షి
- హోదా, బీబీసీ ప్రతినిధి
హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్ పుడింగ్ మింక్ పబ్‌లో వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం రాత్రి సోదాలు నిర్వహించారు. దాదాపు 144 మందిని అదుపులోకి తీసుకున్నారు.
పార్టీలో పాల్గొన్న కొంతమంది డ్రగ్స్ కూడా తీసుకున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో హోటల్ సీసీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు.
5 చిన్న ప్యాకెట్ల కొకైన్ వైట్ పౌడర్ తమకు లభ్యమైందని పోలీసులు వెల్లడించారు. పబ్ మేనేజర్ చేతుల్లో ప్లాస్టిక్ బ్యాగులు, స్ట్రాలు దొరికాయని పోలీసులు వివరించారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా మాదక ద్రవ్యాలు ఉన్నాయంటూ హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం 20 మందిని పైగా అరెస్టు చేసినట్లు వార్తలొచ్చాయి. జనవరి 2022లో కూడా మాదక ద్రవ్యాలతో సంబంధం ఉన్నందుకు గాను ఒక నైజీరియా జాతీయుడిని అరెస్ట్ చేశారు.
మాదకద్రవ్యాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల మార్చి నెలలో హైదరాబాద్‌కు చెందిన 23 సంవత్సరాల ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ చనిపోయినట్లు అడిషినల్ పోలీస్ కమీషనర్ (లా& ఆర్డర్) డీఎస్ చౌహాన్ తెలిపారు. ఈ కేసులో మృతుని స్నేహితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
అదుపులోకి తీసుకున్న వ్యక్తి నుంచి పోలీసులు ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్, 10 ఎక్స్టసీ పిల్స్, 100 గ్రాముల హ్యాష్ ఆయిల్ పట్టుకున్నట్లు తెలిపారు.
మాదకద్రవ్యాల డోసు పెరగడంతో చనిపోయిన యువకుడు మల్టిపుల్ స్కెలోరోసిస్, గుండెపోటుకు గురైనట్లు చెప్పారు.

ఫొటో సోర్స్, DR SUMAN KUMAR
మాదక ద్రవ్యాల వాడకం ఎలా మొదలువుతోంది?
మాదక ద్రవ్యాలను సరఫరా చేసేవారు యుక్త వయస్కులను లక్ష్యంగా చేసుకుంటారని హైదరాబాద్‌కు చెందిన అంకుర హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ సుమన్ కుమార్ చెప్పారు. ఆయన కన్సల్ట్రన్ట్ పీడియాట్రిషియన్.
మాదక ద్రవ్యాల సరఫరా ఒక చెయిన్‌లా సాగుతుందని చెప్పారు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఉండే కిళ్లీ దుకాణాలు, కాఫీ షాపుల ద్వారా కూడా వీటి సరఫరా సాగుతూ ఉంటుందని డాక్టర్ సుమన్ కుమార్ అన్నారు.
హైక్లాస్ పార్టీలకు పిలిచి ఉచితంగా మద్యం సరఫరా చేస్తామని చెబుతూ మొదలైన వ్యవహారం వారిని క్రమంగా డార్క్ వెబ్‌కు కనెక్ట్ చేసి డెలివెరీ బాయ్స్ ద్వారా నేరుగా ఇంటికే సరఫరా చేసే వరకూ చేరుతుందని అన్నారు.
మాదక ద్రవ్యాలను జొమాటో డెలివెరీ బాయ్ ముసుగులో ఇంటి దగ్గరకే సరఫరా చేయడం ఆశ్చర్యకరమైన విషయమని పోలీసులు కూడా చెప్పారు.
సాధారణంగా సిగరెట్లు,ఆల్కహాల్ ద్వారా మాదక ద్రవ్యాలను తీసుకోవడం మొదలవుతుందని సంగారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలలో సైకియాట్రీ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీ లక్ష్మి అన్నారు. వీటిని గేట్ వే డ్రగ్స్ అంటారని తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ మాదక ద్రవ్యాలలోని రకాలేంటి?
మాదక ద్రవ్యాలను తీసుకోవడం వల్ల కేంద్ర నాడీ వ్యవస్థ పై పని చేసి శరీర అవయవాలతో పాటు మెదడు పై ప్రభావం చూపిస్తాయని డాక్టర్ సుమన్ కుమార్ చెప్పారు. వీటిలో చాలా రకాలున్నాయి.
ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ చీఫ్స్ ఆఫ్ పోలీస్ మాదక ద్రవ్యాలను ప్రధానంగా సీఎన్‌ఎస్ డిప్రెస్సంట్లు, సీఎన్‌ఎస్ స్టిమ్యులంట్‌లు, హాలుక్యినోజెన్‌లు, డిస్అస్సోసియేటివ్ అనస్థెటిక్స్, నార్కోటిక్ అనాల్జెసిక్స్ , ఇన్‌హేలంట్స్ అనే ఏడు రకాలుగా వర్గీకరించింది.
సీఎన్‌ఎస్ డిప్రెస్సంట్స్: సీఎన్‌ఎస్ డిప్రెస్సంట్స్ మెదడు, శరీరం పని తీరును మందగించేలా చేస్తాయి అని డాక్టర్ శ్రీలక్ష్మి చెప్పారు.
సీఎన్‌ఎస్ స్టిమ్యులంట్‌లు గుండె కొట్టుకునే వేగాన్ని పెంచి రక్త పోటు పెరిగేలా చేస్తాయి. లేదా శరీరానికి ఉద్రేకాన్ని కలిగిస్తాయి.
కొకైన్, ఆంఫెటామైన్లను, మేథాఫెటామైన్లను ఇందుకు ఉదాహరణలుగా చెప్పవచ్చు.

ఫొటో సోర్స్, DR SRILAKSHMI
హాలుక్యినోజెన్‌లు తీసుకున్నప్పుడు మనిషి వాస్తవ పరిస్థితికి భిన్నంగా ఆలోచించాలా చేస్తాయి. డెలీరియం అనే దశకు దారి తీసిన తర్వాత రాత్రికి, పగటికి తేడా తెలియదు.
ఉదాహరణకు చేతిలో ఫోన్ లేకపోయినా ఫోన్ ఉన్నట్లు ఊహించుకోవడం, కిటికీలను ద్వారాలని భావించడం, లేని మనుషులను ఉన్నట్లుగా ఊహించుకోవడం లాంటివి జరుగుతూ ఉంటాయని డాక్టర్ శ్రీలక్ష్మి చెప్పారు.
డిస్‌అస్సోసియేటివ్ అనస్థెటిక్స్ లాంటివి తీసుకోవడం వల్ల నొప్పి తెలియకుండా చేస్తాయి.
నార్కోటిక్ అనాల్జెసిక్స్ వాడటం వల్ల నొప్పి తగ్గి ఉద్రేకాన్ని కలిగిస్తాయి. ఇవి తీసుకునే వారి భావోద్వేగాలు మారిపోతూ ఉంటాయి.
ఓపియం (నల్ల మందు), కొకైన్, హెరాయిన్, డెమెరాల్, డార్వోన్, మార్ఫిన్, మేథాడోన్, వికోడిన్, ఆక్సీకోన్టిన్ ఈ తరహా మాదక ద్రవ్యాల కిందకు వస్తాయి.
మాదకద్రవ్యాలను ముక్కు ద్వారా పీల్చి తీసుకునే వాటిని ఇన్‌హేలంట్స్ అంటారు. ఇవి మనసును, మెదడును ఉద్రేకపరుస్తాయి. టోలీన్, ప్లాస్టిక్ సిమెంట్, పెయింట్, గాసోలీన్, పెయింట్ తిన్నర్లు, హెయిర్ స్ప్రేలు, ఇతర మత్తు కలిగించే గ్యాస్‌లు ఉదాహరణగా చెప్పవచ్చు.
గంజాయికి శాస్త్రీయ నామం కేనబీస్. ఇందులో డెల్టా 9 టెట్రాహైడ్రో కెనాబినోల్ అనే పదార్ధం ఎక్కువగా ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
మాదక ద్రవ్యాల ప్రభావం ఎలా ఉంటుంది?
ఒక్కసారి మాదక ద్రవ్యాలకు అలవాటుపడిన తర్వాత జీవన శైలి మారిపోయి, వారు నిర్వర్తించాల్సిన బాధ్యతలను మర్చిపోతారని శ్రీ లక్ష్మి వివరించారు.
సాధారణంగా సిగరెట్‌తో కలిపి తీసుకునే కొకైన్, గంజాయిలాంటివి తీసుకోగానే ఉద్రేకానికి లోనవుతారు. ఆగకుండా నవ్వడం, ఆనందపు అంచుల్లో ఉన్నట్లు ఊహించుకుంటూ ఉంటారని డాక్టర్ సుమన్ కుమార్ చెప్పారు.
కూల్ డ్రింక్‌లో కలిపి తీసుకునే టాబ్లెట్లు కూడా ఆడ్రెనలిన్‌ను ఉత్తేజపరుస్తాయి.ద్రవ రూపంలో కూడా దొరికే ఎల్‌ఎస్‌డీ (లైసెర్జిక్ యాసిడ్ డైథ్లమైడ్ ట్యాబ్‌లెట్లను మూడ్ మార్చే రసాయనాలని చెబుతారు. ఎండీఎంఏ మిథలీన్ డైఆక్సీమేథామ్ఫెటామైన్ పార్టీలలో వాడే మత్తుమందుగా చెబుతారు.
మాదక ద్రవ్యాలు తీసుకుంటున్న వారిని గుర్తించడమెలా?
యుక్త వయస్కులు, చిన్న పిల్లలు మాదక ద్రవ్యాల బారిన పడటం ఆందోళన కలిగించే విషయమని డాక్టర్ సుమన్ కుమార్ అన్నారు.
మాదకద్రవ్యాలు తీసుకునే వారి లక్షణాలెలా ఉంటాయో బీబీసీకి వివరించారు.
మాదకద్రవ్యాలకు అలవాటు పడటం వల్ల ఆకలి తగ్గిపోతుంది. నిద్ర పట్టదు. అల్సర్లు, క్రామ్ప్స్ వస్తాయి. జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది.
నిద్రలో సమస్యలు, మానసిక ఒత్తిడి, మూడ్ స్వింగ్స్, అందరితో పోట్లాటలు చేస్తారు.
చేతులు, కాళ్ళు వణకడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
జుట్టు ఎండిపోతుంది, వయసు మీరిపోయినట్లు కనిపిస్తారు.మాటలో తడబాటు కలుగుతుంది. కళ్ల కింద నల్లని వలయాలు ఏర్పడతాయి.
కొంత మంది డ్రగ్స్ కొనుక్కోవడం కోసం దొంగతనాలు చేయడం కూడా మొదలుపెడతారని డాక్టర్ సుమన్ కుమార్ అన్నారు.
మాదకద్రవ్యాలు తీసుకోవడం వల్ల నిజమైన ఆనందాన్ని కోల్పోవడం, వాటిని సంపాదించడం కోసం సమయాన్ని వినియోగించడం, కోపంగా, దురుసుగా ప్రవర్తించడం, వాటి ప్రభావంలో ప్రమాదాలకు గురి కావడం లాంటివి కూడా జరుగుతూ ఉంటుంది. కొంత మందికి ఫిట్స్ కూడా వస్తాయని డాక్టర్ శ్రీలక్ష్మి చెప్పారు.
మాదకద్రవ్యాలు తీసుకునే వారికి ఆత్మహత్య చేసుకునే ముప్పు కూడా ఉంటుందని తెలిపారు. ఇంజెక్షన్లు ద్వారా తీసుకోవడం వల్ల హెచ్ ఐ వి లాంటి వి వచ్చే ముప్పు కూడా ఉందని చెప్పారు.
గంజాయి లాంటివి తీసుకునేటప్పుడు స్కిజోపెర్నియాలాంటి తీవ్రమైన మానసిక సమస్యలు కనిపించడంతో పాటు మూడ్‌లో మార్పులు, మానసిక ఒత్తిడి, ఆందోళన కలుగుతాయి.
ఇవి నరాలను ఉద్రేకపరిచి గుండె కొట్టుకునే వేగాన్ని పెంచుతాయి. దీని వల్ల గుండె పోటు వచ్చే అవకాశముంది అని డాక్టర్ సుమన్ కుమార్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
చికిత్స ఉందా?
15- 25 ఏళ్ల వయసులో ఉన్న వారు ఎక్కువగా మాదకద్రవ్యాల బారిన పడే అవకాశముంది అని డాక్టర్ సుమన్ కుమార్ అన్నారు.
పిల్లల ప్రవర్తనలో అసాధారణ రీతిలో మార్పులు కనిపిస్తున్నా, సాధారణ స్థాయిని మించి డబ్బులు ఖర్చు పెడుతున్నా, ఆ పిల్లల పై తల్లితండ్రులు దృష్టి పెట్టాల్సి ఉంటుందని డాక్టర్ సుమన్ కుమార్ చెప్పారు.
ఇటువంటి లక్షణాలు కనిపించగానే డీఅడిక్షన్ సెంటర్లను సంప్రదించి, చికిత్సతో పాటు మానసిక కౌన్సెలింగ్ కూడా అందించాలని చెప్పారు.
"మాదక ద్రవ్యాలు తీసుకునే వారిని నేరస్థుల్లా చూడటం మానేసి, వారిని డీఅడిక్ట్ చేసేందుకు సహకారం అందించాల్సిన అవసరముంది. దీనికి తల్లి తండ్రులు, డాక్టర్లు, సమాజం, మీడియా కూడా సహకారం అందించాలి".
"టెక్నాలజీ వల్ల మాదక ద్రవ్యాల సరఫరా సులభంగా మారిపోయింది. పోలీసులు మాదక ద్రవ్యాలు తీసుకుంటున్న వారిని కాకుండా సరఫరా చేస్తున్న వారిని శిక్షించడం పట్ల దృష్టి సారించాలి" అని డాక్టర్ సుమన్ కుమార్ అన్నారు.
బార్లు, పబ్‌లు తెల్లవార్లూ తెరిచి ఉంచవచ్చా?
బార్లు, పబ్‌లు ఎంత సమయం వరకు తెరిచి ఉంచాలనేది ఆయా రాష్ట్రాల ఎక్సైజ్ శాఖ నిబంధనలకనుగుణంగా పాటించాల్సి ఉంటుంది.
బార్లు తెరిచి ఉంచినప్పుడు అక్కడ ఎంత సేపు ఉండాలనేది ఆయా వ్యక్తుల ఇష్టాలను బట్టీ ఉంటుంది.
అక్టోబరు3న బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను కూడా క్రూయిజ్ నౌకలో రేవ్ పార్టీ కేసుకు సంబంధించి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అరెస్టు చేసింది.
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో డ్రగ్స్ సమస్య తీవ్రంగా ఉంది. అంతర్జాతీయ నార్కోటిక్ కంట్రోల్ బోర్డు-2018 నివేదిక ప్రకారం భారత్‌లో అత్యధికంగా దొరికే మాదక ద్రవ్యం గంజాయి. దేశంలో మాదక ద్రవ్యాల వాడకం పెరుగుతోందని నివేదిక చెబుతోంది.
ఇవి కూడా చదవండి:
- ఉల్కాపాతమా? ఉపగ్రహం ముక్కలా? రాకెట్ అవశేషాలా? తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఆకాశంలో కనిపించిన వింతకు కారణమేంటి?
- యుక్రెయిన్ యుద్ధం: ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బయలుదేరారు... దారిలోనే రష్యా సైనికుల కాల్పుల్లో చనిపోయారు
- ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 4 నుంచి 26 జిల్లాలు... పునర్విభజనలో 5 ఆసక్తికర అంశాలు
- పాకిస్తాన్: ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని ఆసిఫ్ అలీ జర్దారీ ఫార్ములా కాపాడగలదా?
- కార్మికుల వేధింపులు, అవినీతి ఆరోపణలు సహా ఎన్నో వివాదాలు ఉన్నా ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఖతార్‌లో ఎందుకు జరుగుతోంది?
- మత విశ్వాసాలకు ప్రతీకలుగా నిలిచిన ఏడు మొక్కలు... వీటిని పవిత్రంగా ఎందుకు చూస్తారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














