కార్మికుల వేధింపులు, అవినీతి ఆరోపణలు సహా ఎన్నో వివాదాలు ఉన్నా ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఖతార్‌లో ఎందుకు జరుగుతోంది?

కార్మికుడు

ఫొటో సోర్స్, Getty Images

ఈ ఏడాది ఫుట్‌బాల్ ప్రపంచ కప్ ఫైనల్స్ ఖతార్‌లో జరగనున్నాయి.

ఇప్పటి వరకు చోటు చేసుకున్న ప్రపంచ కప్‌లలోకెల్లా ఈ ఏడాది జరగబోయే ప్రపంచ కప్ అత్యంత వివాదాస్పదంగా మారింది.

ప్రపంచ కప్‌ను నిర్వహించేందుకు ఖతార్ హక్కులనెలా సంపాదించిందనే అంశం నుంచి స్టేడియంలను నిర్మిస్తున్న కార్మికుల పట్ల ఆ దేశం ప్రవర్తిస్తున్న తీరు వరకు వివాదాస్పద అంశాలుగా మారాయి. ప్రపంచ కప్ నిర్వహించేందుకు ఖతార్ సరైన దేశమేనా అనే ప్రశ్న కూడా తలెత్తింది.

వీడియో క్యాప్షన్, ఫిఫా ప్రపంచకప్: ఎవరెవరికి ఎంతెంత లాభమో తెలుసా

విదేశీ కార్మికుల పట్ల వ్యవహరించిన తీరు

వరల్డ్ కప్ ఫైనల్స్ నిర్వహణ కోసం ఖతార్‌‌లో 7 స్టేడియంలు, ఒక కొత్త ఎయిర్ పోర్ట్, కొత్త మెట్రో, కొత్త రోడ్లను నిర్మిస్తోంది.

ఫైనల్స్ ఆడే స్టేడియంలో మరో 9 మ్యాచ్‌లు కూడా జరుగుతాయి. ఇది నగరంలో కేంద్ర ఆకర్షణగా నిలుస్తోంది.

అయితే, ఈ ప్రాజెక్టులలో పని చేస్తున్న 30,000 మంది వలస కార్మికుల పట్ల ఖతార్ వ్యవహరిస్తున్న తీరు చాలా విమర్శలను ఎదుర్కొంది.

ఖతార్ కార్మికులతో వెట్టి చాకిరీ చేయిస్తోందని 2016లో అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆరోపించింది. చాలా మంది పని వాళ్ళు హీనమైన వసతిలోఉంటూ, ఉద్యోగం పొందడం కోసం భారీగా చెల్లింపులు చెల్లిస్తున్నట్లు పేర్కొంది. అంతే కాకుండా, యాజమాన్యాలు కార్మికుల వేతనాలను ఇవ్వకుండా, పాస్‌పోర్టులను కూడా స్వాధీనం చేసుకుని ఉంచుతున్నట్లు తెలిపింది.

ఖతార్‌లో కార్మిక శిబిరాలు

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, ఖతార్‌లో కార్మిక శిబిరాలు

ప్రభుత్వం 2017 నుంచి వలస కార్మికుల కోసం పని గంటలను తగ్గించి, కార్మికుల శిబిరాల్లో పరిస్థితులను మెరుగుపరిచేందుకు కొన్ని చర్యలను ప్రవేశపెట్టింది.

కానీ, అన్యాయంగా వేతనాలను తగ్గించడంతో చాలా మంది వలస కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని హ్యూమన్ రైట్స్ వాచ్ 2021లో విడుదల చేసిన నివేదికలో తెలిపింది. సుదీర్ఘమైన పని గంటలు, వెట్టి చాకిరీ చేసిన తర్వాత కూడా కొన్ని నెలల పాటు వేతనాలు ఇవ్వడం లేదని పేర్కొంది.

కొన్ని నెలల పాటు జీతం ఇవ్వటం లేదని ఫిర్యాదు చేసినందుకు యజమాని నుంచి బెదిరింపులు ఎదుర్కొన్నట్లు భారతదేశానికి చెందిన ఒక మెటల్ కార్మికుడు అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌కు చెప్పారు. ఆయన ఖలీఫా స్టేడియం పునరుద్ధరణ పనుల్లో పని చేశారు.

ఉద్యోగులను స్పాన్సర్ చేసే కఫాలా విధానాన్ని నిషేధించినప్పటికీ ఉద్యోగులపై ఒత్తిడి కొనసాగుతూనే ఉందని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ పేర్కొంది. కఫాలా విధానంలో యాజమాన్యం అనుమతి లేకుండా వలస కార్మికులు ఉద్యోగం వదిలి పెట్టేందుకు లేదు.

"ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంస్కరణలను అమలు చేసేందుకు గణనీయమైన అభివృద్ధిజరిగింది" అని ఒక ప్రభుత్వ ప్రతినిధి బీబీసీకి చెప్పారు. ఈ చర్యలను అమలు చేయడం మొదలయిన తర్వాత నియమాలను ఉల్లంఘించే సంస్థల సంఖ్య కూడా తగ్గుతోందని అన్నారు.

వీడియో క్యాప్షన్, ఫిఫా ప్రపంచకప్: రష్యన్లకు నవ్వడం ఎలాగో నేర్పిస్తున్నారు

ఎంత మంది కార్మికులు మరణించారు?

ఖతార్ ప్రపంచ కప్ బిడ్‌ను గెలుచుకున్నప్పటి నుంచి భారతదేశం, పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంకకు చెందిన మొత్తం 6500 మంది వలస కార్మికులు చనిపోయినట్లు ఫిబ్రవరి 2021లో గార్డియన్ కథనం ప్రచురించింది.

అయితే, ఈ అయిదు దేశాల్లో అధికారులు ఈ మరణాలను మృతులు చనిపోయిన ప్రదేశం లేదా వృత్తి కనుగుణంగా వర్గీకరించలేదు. కానీ, వరల్డ్ కప్ కోసం చేస్తున్న మౌలిక సదుపాయాల నిర్మాణంలో భాగంగానే ఈ మరణాలు చోటు చేసుకుని ఉంటాయని లేబర్ రైట్స్ గ్రూప్ ఫెయిర్ స్క్వేర్ తెలిపింది.

అయితే, ఈ మరణాలను అతిగా లెక్కించారని ఖతార్ ప్రభుత్వం చెబుతోంది. అక్కడే కొన్నేళ్లుగా ఉంటూ, చనిపోయిన విదేశీయుల సంఖ్యను కూడా ఈ లెక్కల్లో చేర్చారని అంటున్నారు. అందులో చాలా మంది నిర్మాణ రంగంలో పని చేస్తూ ఉండి ఉండకపోవచ్చని అంటోంది.

2014-2020 మధ్యలో ప్రపంచ కప్ స్టేడియంల నిర్మాణంలో పని చేస్తున్న 37 మంది కార్మికులు చనిపోయారని ఖతార్ చెబుతోంది. అందులో 34 మరణాలు పనికి సంబంధించినవి కాదని అంటోంది.

దోహాలో వరల్డ్ కప్ కౌంట్ డౌన్ గడియారం

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, దోహాలో వరల్డ్ కప్ కౌంట్ డౌన్ గడియారం

అకస్మాత్తుగా చనిపోయిన కార్మికుల సంఖ్యను ఖతార్ లెక్కించలేదని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్‌ఓ) అంటోంది. గుండె పోటు, గుండె పోటు వల్ల శ్వాస ఆగిపోయి ఏర్పడిన మరణాలను సహజమైన మరణాలుగా చూపించిందని అంది.

ఐఎల్‌ఓ కూడా ఖతార్‌లోని ప్రభుత్వ ఆసుపత్రులు, అంబులెన్సు సంస్థల నుంచి వరల్డ్ కప్‌కు సంబంధించిన అన్ని ప్రాజెక్టుల్లోనూ చోటు చేసుకున్న మరణాల గణాంకాలను సేకరించింది.

ఒక్క 2021లోనే ఖతార్ లో 50 మంది కార్మికులు మరణించగా, 500 మందికి తీవ్రంగా గాయాలయ్యాయని చెబుతోంది. మరో 37,600 మందికి తేలికపాటి నుంచి ఒక మోస్తరు గాయాలయ్యాయని తెలిపింది.

ఎత్తైన ప్రదేశాల నుంచి పడిపోవడం, రోడ్డు ప్రమాదాలు, లేదా ఏదైనా వస్తువు పై నుంచి పడటం వల్ల ఈ మరణాలకు ముఖ్య కారణాలని పేర్కొంది.

ఖతార్ ఎల్జీబీటీలకు సురక్షితమేనా?

ఖతార్ సంప్రదాయ ముస్లిం దేశం. ఈ దేశంలో స్వలింగ సంపర్క సంబంధాలు చట్ట విరుద్ధం. ప్రపంచ కప్ టోర్నమెంట్ మొదలవ్వక ముందే ఈ విషయంలో కొన్ని మార్పులు చేయమని ఎల్‌జీబీటీల హక్కులను సమర్ధించే కొన్ని గ్రూపులు ప్రపంచ ఫుట్ బాల్ కార్య నిర్వాహక సంస్థ ఫిఫా, ఖతార్ ప్రపంచ కప్ నిర్వాహక కమిటీని అడుగుతున్నాయి.

ఎల్ జీబీటీలకు భద్రత కల్పించడంతో పాటు, ఖతార్‌లోకి సురక్షితంగా ప్రవేశించేందుకు అవకాశం కల్పిస్తూ, ఎల్‌జీబీటీ సమస్యల పై జరిగే చర్చలను సెన్సార్ చేయకుండా ఉండాలని ఈ గ్రూపులు కోరుతున్నాయి.

గతంలో ప్రపంచ కప్ నిర్వాహకులు అందరూ ఆహ్వానితులే అని ప్రకటించారు. కానీ, బహిరంగంగా ప్రేమను ప్రదర్శించడం మా దేశ సంస్కృతి కాదని చెబుతోంది.

ప్రపంచ కప్‌కు ఆతిధ్యమిచ్చే అవకాశం ఖతార్‌కు ఎలా వచ్చింది?

2022 ప్రపంచ కప్ ఖతార్‌లో జరుగుతుందని ఫిఫా 2010లో ప్రకటించినప్పటి నుంచి ఈ విషయం వివాదాస్పదంగా మారింది.

అమెరికా, ఆస్ట్రేలియా, సౌత్ కొరియా, జపాన్ నుంచి పోటీ తట్టుకుని అతి తక్కువ ఫుట్‌బాల్ చరిత్ర కలిగి, ప్రపంచ కప్‌లో ఆడేందుకు ఎన్నడూ అర్హత సాధించని చిన్న, ధనిక దేశం, ఖతార్‌కు అవకాశం రావడం చాలా మందికి దిగ్భ్రాంతిని కలిగించింది.

వరల్డ్ కప్‌ను దక్కించుకునేందుకు ఖతార్ ఫిఫాకు లంచం ఇచ్చిందనే ఆరోపణలు కూడా తలెత్తాయి. అయితే, ఫిఫా నియమించిన స్వతంత్ర కమీషన్ ఈ ఆరోపణల పై విచారణ జరిపి ఈ అభియోగాలను నిరూపించేందుకుఎటువంటి ఆధారాలు లేవని చెప్పింది.

ప్రతినిధుల ఓట్లను కొనుక్కుందనే ఆరోపణలను ఖతార్ ఖండించింది. కానీ, ఫ్రెంచ్ అధికారులు నిర్వహిస్తున్న విచారణ ఇంకా కొనసాగుతోంది. 2020లో ఫిఫాలో ముగ్గురు అధికారులు లంచాలు తీసుకున్నట్లు అమెరికా ఆరోపించింది.

ఫిఫా అధినేత సెప్ బ్లాటర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఫిఫా అధినేత సెప్ బ్లాటర్

ఖతార్ వరల్డ్ కప్ శీతాకాలంలో ఎందుకు జరుగుతోంది?

వరల్డ్ కప్ టోర్నమెంట్ సాధారణంగా జూన్ - జులై మధ్యలో జరుగుతుంది. కానీ, ఖతార్‌లో ఆ సమయంలో సగటు ఉష్ణోగ్రతలు సుమారు 41 సెంటీగ్రేడ్ ఉంటాయి. అవి ఒక్కొక్కసారి 50 సెంటీగ్రేడ్ వరకు వెళతాయి. 90 నిమిషాల సేపు సాగే ఫుట్ బాల్ ఆడటాన్ని పక్కన పెడితే, ఆ సమయంలో కనీసం బయటకు అడుగు పెట్టడం కూడా చాలా వేడిగా ఉంటుంది.

ఫుట్ బాల్ కోసం బిడ్ చేసేటప్పుడు స్టేడియంలను చల్లగా ఉంచేందుకు ఎయిర్ కండీషనింగ్, ట్రైనింగ్ పిచ్‌లు, 23 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉండే ఫ్యాన్ జోన్‌లను ఏర్పాటు చేస్తామని ఖతార్ హామీ ఇచ్చింది. కానీ, ఈ టోర్నమెంటును శీతాకాలంలో నిర్వహించాలని 2015లో ఖతార్ నిర్ణయించింది.

ఈ ఏడాది నవంబరు 21న టోర్నమెంటు మొదలయి డిసెంబరు 18న ముగుస్తుంది. ఇది చాలా దేశాల్లో జరిగే క్లబ్ ఫుట్ బాల్ సీజన్‌కు ఆటంకం కలిగిస్తుంది.

దీంతో, నవంబరు 13 నుంచి డిసెంబరు 26 మధ్యలో జరిగే ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లు జరిగే అవకాశం లేదు.

ఈ సమయాన్ని పూరించుకునేందుకు 2022/2023 సీజన్‌ను సాధారణంగా మొదలయ్యే సమయం కంటే ఒక వారం ముందు మొదలుపెట్టి ఒక వారం తర్వాత ముగిస్తారు.

వీడియో క్యాప్షన్, గడువులోగా ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఏర్పాట్లు పూర్తయ్యేనా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)