లబ్..డబ్బు: ఫిఫా ప్రపంచకప్‌తో ఎవరెవరికి ఎంతెంత లాభమో తెలుసా

ప్రపంచవ్యాప్తంగా 32 జట్లు సాకర్ మహా సమరంలో ఢీ అంటే ఢీ అంటూ పోరాడుతున్నాయి. రష్యా లో జరుగుతోన్న వరల్డ్ కప్‌లో ప్రతి క్షణమూ కీలకమే. ప్రతి గోల్ అమూల్యమే.
ఇదొక క్రీడా పండుగ మాత్రమే అని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఈ మహా సమరం ఆర్థిక వ్యవస్థతో ముడిపడి ఉంది. ప్లేయర్స్‌కు లాభాలుంటాయి, ఇందులో పాల్గొన్న జట్లకూ లాభాలు ఉంటాయి, ఆతిథ్య దేశమైన రష్యాకు, నిర్వాహకులకు, స్పాన్సరర్లకు ఇలా అనేక మందికి అనేక ఆర్ధిక ప్రయోజనాలుంటాయి. అవేంటో తెలుసుకుందాం రండి.
ఆతిథ్య దేశమైన రష్యాకు ఇదొక పెద్ద పరీక్షే. ఎందుకంటే ఈ క్రీడా సమరం పేరుతో తమ దేశంలో అనేక పెట్టుబడులు కూడా కోరుకుంటోంది ఆ దేశం. నిర్వాహకుల అంచనా ప్రకారం ఈ ఫుట్ బాల్ వరల్డ్ కప్ కోసం ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు ఆరు లక్షల మంది రష్యా చేరుకున్నారు. రష్యాలోని పదకొండు నగరాలలో జరుగుతోన్న మ్యాచ్‌లను వీక్షించడానికి వచ్చిన అభిమానులతో ఆ ప్రాంతాల్లోని హోటళ్లు కిటకిటలాడుతున్నాయి.
ఆతిథ్యం ఇచ్చే నగరాలకు ఏంటి లాభం?
అయితే ఒక మెగా టోర్నమెంట్ నిర్వహిస్తే అనేక ఇతర లాభాలు కూడా ఉంటాయి. అందులో ముఖ్యమైనది మౌలిక సదుపాయాల అభివృద్ధి. అంటే గ్రౌండ్‌లు, స్టేడియాలు అభివృద్ధి చేయడంతో పాటు అనేక ప్రకటనలు కూడా వస్తాయి. అలాగే ఇటువంటి భారీ ఈవెంట్‌లు నిర్వహిస్తే ఆతిథ్య నగరాలలోని రవాణా వ్యవస్థ, కమ్యూనికేషన్ వ్యవస్థ, భద్రతా వ్యవస్థ మరింత అభివృద్ధి చెందుతాయని ఒక విశ్లేషణ.
ఆతిథ్య దేశాలకు ఏంటి లాభం?
ఇంతకు ముందు ప్రపంచ కప్ ఫుట్ బాల్ టోర్నమెంట్ నిర్వహించిన దేశాలు ఎటువంటి లాభాలు ఆర్జించాయో ఒక సారి చూస్తే..
2002లో సంయుక్తంగా వరల్డ్ కప్ నిర్వహించిన జపాన్, సౌత్ కొరియాలు దాదాపు 900 కోట్ల డాలర్ల లాభాలు పొందాయి. 2006లో ఆతిథ్య దేశమైన జర్మనీ దాదాపు 1200 కోట్ల డాలర్ల లాభాలు గడిస్తే, 2010లో ప్రపంచ కప్ పోటీలు నిర్వహించిన దక్షిణాఫ్రికా దాదాపు 500 కోట్ల డాలర్ల లాభాలు పొందింది.

రష్యాకు 1500 కోట్ల డాలర్ల లాభం!?
ఈ ప్రపంచ కప్ పోటీలు నిర్వహించడానికి రష్యా దాదాపు 1100 కోట్ల డాలర్లు ఖర్చు చేస్తోంది. ప్రపంచ కప్ ముగిసేలోగా దాదాపు 3000 కోట్ల డాలర్ల లాభాలు రావాలని కోరుకుంటోంది. మెకెన్జీ కన్సల్టెన్సీ నివేదిక ప్రకారం ఈ ప్రపంచ కప్ ద్వారా రష్యా జీడీపీకి దాదాపు 1500 కోట్ల డాలర్ల లాభం ఉంటుంది. అయితే రష్యా ఆర్థిక వ్యవస్థ ఏడాది విలువ లక్షా ముప్పై కోట్ల డాలర్లుగా ఉన్నప్ప్పుడు ఈ పదిహేను వందల కోట్ల డాలర్లు కేవలం 0.2% మాత్రమే.
పాల్గొనే జట్లు, క్రీడాకారులకు ఏంటి లాభం?
ఇదంతా ఒకెత్తు అయితే అసలు ఈ ఫుట్ బాల్ టోర్నమెంట్ ప్రధాన నిర్వాహకులు అయిన ఫిఫాకు వచ్చే లాభాలు మరొకెత్తు. ఫిఫాకు దాదాపు 5300 కోట్ల రూపాయల లాభాలు వస్తాయి. కానీ ఈ లాభాల్లో చాలా భాగం విజేతలకు ప్రైజ్ మనీ రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది.
ఈసారి విజేతకు 256 కోట్ల రూపాయలు ఇవ్వాలని ఫిఫా నిర్ణయించినట్టు తెలుస్తోంది. రెండు, మూడు, నాలుగో స్థానాల్లో నిలిచే జట్లకు కూడా ప్రైజ్ మనీ ఇస్తుంది ఫిఫా. ఇక క్వార్టర్ ఫైనల్, ప్రీ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకునే జట్లలోని ప్లేయర్ల జేబుల్లోకి కూడా ప్రైజ్ మనీ వచ్చి చేరుతుంది. ఇంకా చెప్పాలంటే 32 జట్లకుకు కూడా ఎంతోకొంత ఆర్థిక ప్రయోజనాలుంటాయని ఫిఫా ప్రకటించింది.

మరి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది?
అయితే ఫిఫాకు ఇంత ఆర్థిక లాభాలు ఎక్కడి నుంచి వస్తాయి అని అనుకుంటున్నారా.. సింపుల్.. ఈ ఏడాది 86 శాతం లాభాలు సాకర్ వరల్డ్ కప్ ప్రసార హక్కుల్ని అమ్మడంతోనే వచ్చేశాయి. ఇక మిగతాది ప్రకటనలు, ప్రచారాలు, స్పాన్సర్ల ద్వారా వస్తుంది. ప్రచార హక్కుల కోసం ఒక యుద్ధమే జరుగుతుంది. ఎందుకంటే ఏ నెట్‌వర్క్ అయితే ఆ ప్రసార హక్కులు సొంతం చేసుకుంటుందో ఆ సంస్థకు ఊహించనంత లాభాలు వస్తాయి.
ఫుట్ బాల్ వరల్డ్ కప్ క్రేజ్ ఆకాశాన్ని తాకుతుంది. దానికొక ఉదాహరణ.. బ్రెజిల్‌లో జరిగిన గత వరల్డ్ కప్ పోటీలను ప్రపంచవ్యాప్తంగా 320 కోట్లమంది వీక్షించారు. అలాగే ఫైనల్ మ్యాచ్‌ను దాదాపు వంద కోట్ల కన్నా ఎక్కువ మంది చూశారు. అది ఫుట్ బాల్ వరల్డ్ కప్ పవర్.
వరల్డ్ కప్ ఎకానమీకి సంబంధించిన అంశాలు ఇవి . సో వరల్డ్ కప్ మొదలైపోయింది.. జోష్ పెరిగిపోతోంది. జట్లు అన్నీ నువ్వా నేనా అన్నట్టు పోటీ పడుతున్నాయి. చూద్దాం ఎవరు గోల్డ్‌ను ఎగరేసుకుపోతారో!! మీ అంచనా ఏంటో ఈ లింక్ క్లిక్ చేసి చెప్పండి. మీ అంచనా ఫలితాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయొచ్చు కూడా.
ఇవి కూడా చదవండి:
- పంజాబ్ మత్తుకు.. ఫుట్‌బాల్ మందు
- రూ.150 కోట్ల జరిమానా కట్టేందుకు అంగీకరించిన రొనాల్డో
- అమెరికా ఆంక్షలు ఎత్తివేస్తే ఉత్తర కొరియాలో సామాన్యుడికి ఏంటి ప్రయోజనం?
- తాగునీరు అందని గ్రామాలు.. ఆంధ్రాలో మూడొంతులు, తెలంగాణలో సగం
- రాషిద్ ఖాన్: పాకిస్తాన్లో క్రికెట్ నేర్చుకున్నా.. భారతీయుల ద్వారా ప్రేమించటం నేర్చుకున్నా
- దివ్య సూర్యదేవర: ఒకప్పుడు డబ్బుల్లేక ఇబ్బందులు పడ్డారు.. నేడు రూ.లక్షల కోట్ల కంపెనీని చక్కబెడుతున్నారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









