పాకిస్తాన్: ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని ఆసిఫ్ అలీ జర్దారీ ఫార్ములా కాపాడగలదా?

ఆసిఫ్ అలీ జర్దారీ

ఫొటో సోర్స్, Getty Images

బేనజీర్ భుట్టో హత్య తర్వాత పాకిస్తాన్‌లో రాజకీయంగా గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్పుడే పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) సారథ్య బాధ్యతలను తీసుకొని ఆసిఫ్ అలీ జర్దారీ తెరపైకి వచ్చారు.

నేరుగా పనులు చేసినా, ఎత్తుగడలతో ముందుకు వెళ్లినా.. జర్దారీ రాజకీయ వ్యూహాలు విజయవంతం అయ్యాయని చెప్పుకుంటారు. జర్దారీ రాజకీయాలకు ప్రజలు మద్దతు తెలపకపోవచ్చు. కానీ, వాటిని మెచ్చుకుంటారు.

2008 సార్వత్రిక ఎన్నికల్లో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధించింది. అయితే, ప్రధానమంత్రి పదవికి బదులుగా అధ్యక్ష పదవిని ఎంచుకుని జర్దారీ అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.

బీబీసీ వరల్డ్ సర్వీస్‌కు చెందిన ఓవెన్ బెన్నెట్ జోన్స్‌కు 2010లో జర్దారీని కలిసే అవకాశం వచ్చింది. ఆ సమావేశం చాలా ప్రత్యేకమైనదని జోన్స్ చెబుతుంటారు.

ఈ సమావేశం జర్దారీ అధ్యక్ష భవనంలో జరిగింది. ఆ సమయంలో భద్రతా కారణాల దృష్ట్యా ఆయన కేవలం అధ్యక్ష భవనంలోని తన కార్యాలయానికి మాత్రమే పరిమితం అయ్యేవారు.

ఆసిఫ్ అలీ జర్దారీ

ఫొటో సోర్స్, Getty Images

అయిదేళ్ల పదవీ కాలం...

ఆ కార్యాలయంలోని ఓ గుండ్రని, చిన్న టేబుల్‌ వద్ద ఇద్దరూ కలిసి మధ్యాహ్నం భోజనానికి కూర్చున్నారు. ఆ రోజు జర్దారీకి ఇష్టమైన బెండకాయ కూరని వడ్డించారు.

‘‘ఎక్ దిన్ జర్దారీ కే సాత్’’ లాంటి కార్యక్రమం చేద్దామనే ఆలోచనను వెంటనే జర్దారీ తిరస్కరించారు.

‘‘మొదట నా పదవీ కాలాన్ని పూర్తిచేయనివ్వండి. రాజకీయ అస్థిరత్వాన్ని కలిగించే చర్యలేమీ నేను తీసుకోవాలని అనుకోవడం లేదు’’అని ఆయన వ్యాఖ్యానించారు.

ఎలాగోలా జర్దారీ తన అయిదేళ్ల పదవీ కాలాన్ని పూర్తిచేశారు. అయితే, అబోటాబాద్‌లో అమెరికా చేతిలో అల్‌ఖైదా అధిపతి ఒసామా బిన్ లాడెన్ హత్య లాంటి పరిణామాలు ఆయన హయాంలోనే చోటు చేసుకున్నాయి. మరోవైపు సైన్యం సామర్థ్యాన్ని తగ్గించే కార్యక్రమాలు కూడా జరిగాయి. తొలిసారి విజయవంతంగా ఓ సైన్యాధిపతిని కూడా ప్రభుత్వం మార్చగలిగింది.

ఆయన చెప్పుకోదగిన రాజకీయ కార్యక్రమాలు లేదా చర్యలు తీసుకోలేదు. మెమోగేట్ కుంభకోణం, స్విస్ అకౌంట్లలో అవినీతి డబ్బులు తదితర వివాదాలు ఆయనను చుట్టుముట్టాయి. కానీ, కేవలం అయిదేళ్ల పదవీ కాలాన్ని పూర్తిచేయడంపైనే ఆయన దృష్టి కేంద్రీకరించారు. దీన్ని ఆయన రాజకీయ విజయంగా చెప్పుకోవచ్చు.

ఆసిఫ్ అలీ జర్దారీ

ఫొటో సోర్స్, AFP

సయ్యద్ రజా గిలానీ సమయంలో

తొలిసారి పాకిస్తాన్ చరిత్రలో అయిదేళ్లపాటు కొనసాగిన రాజకీయ ప్రభుత్వంగా జర్దారీ ప్రభుత్వం రికార్డు సృష్టించింది. అయితే, ఆయన అధ్యక్ష పదవిలో కొనసాగారు.

ఆయన ప్రధానమంత్రి పదవిలో కూర్చోబెట్టిన సయ్యద్ యూసఫ్ రజా గిలానీ మాత్రం పదవీ కాలాన్ని పూర్తి చేయలేకపోయారు. ప్రధానమంత్రులను నచ్చినట్లుగా మారుస్తూ అన్ని విషయాల్లోనూ జర్దారీ నిర్ణయాలు తీసుకునేవారు.

అభివృద్ధి విషయానికి వస్తే, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి ఇది ఎదురుదెబ్బ లాంటిది. దేశ ఉత్పత్తి పడిపోయింది. విద్యుత్ సరఫరాలో కొరత ఏర్పడింది. కానీ, జర్దారీ మాత్రం ఎలాగోలా తన పదవీ కాలాన్ని మాత్రం పూర్తి చేసుకోగలిగారు.

బెనజీర్ భుట్టో

ఫొటో సోర్స్, AFP

సైనిక నియంతలు

వ్యక్తిగత లక్ష్యాలు లేదా ప్రభుత్వ లక్ష్యాలు.. రెండింటినీ జర్దారీ నెరవేర్చుకోగలిగారు. కానీ, తర్వాత తరాలకు ఆయన ఆదర్శంగా నిలవలేకపోయారు.

ఆయన తర్వాత వచ్చిన నవాజ్ షరీఫ్‌ అవినీతి ఆరోపణలతో పదవీచ్యుతుడయ్యారు. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ కూడా ఒకరకమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు.

పాకిస్తాన్‌ చరిత్రను పరిశీలిస్తే, ఇక్కడి ప్రభుత్వాలు ఎప్పుడు ఎలా కూలిపోతాయో చెప్పలేని పరిస్థితి. భారీ మెజారిటీతో గెలిచిన నవాజ్ షరీఫ్ ప్రభుత్వం కావొచ్చు, లేదా అత్తెసరు మెజారిటీతో ఏర్పాటైన ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం కావొచ్చు... అన్నింటి పరిస్థితి ఇదే.

ఇక్కడ తొలి ప్రధానమంత్రి లియాఖత్ అలీ ఖాన్‌ హత్యకు గురయ్యారు. దీంతో ఆయన ఐదేళ్ల పదవీ కాలం పూర్తికాలేదు. ఈ పంథా అలా కొనసాగుతూ వచ్చింది.

1947 నుంచి ఇప్పటివరకు పాకిస్తాన్‌లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నాలుగు ప్రభుత్వాలను సైనిక నియంతలు కూలదోశారు. ఇద్దరు ప్రధానులను న్యాయవ్యవస్థ బర్తరఫ్ చేసింది. మరో నాయకుడికి కోర్టు ఉరిశిక్ష కూడా విధించింది.

ఆసిఫ్ అలీ జర్దారీ

ఫొటో సోర్స్, FAROOQ NAEEM

అదే సులువు

పాకిస్తాన్‌లో ప్రజల మద్దుతుతో ఎన్నికైన నాయకులను పదవి నుంచి తప్పించడం చాలా తేలిక.

కొన్నిసార్లు న్యాయవ్యవస్థ మరికొన్నిసార్లు సైన్యం, ఇంకొన్నిసార్లు గవర్నర్ జనరల్స్.. ప్రధానమంత్రులకు వెన్నుపోటు పొడిచారు.

ఇప్పుడు మాత్రం ఇమ్రాన్ ఖాన్‌ను సైన్యం లేదా న్యాయవ్యవస్థకు బదులుగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన రాజకీయ నాయకులే పదవి నుంచి దించేస్తున్నారు.

ఇమ్రాన్ ఖాన్ చాలా తప్పులు చేశారు. వీటిలో కొన్ని తెలిసి, మరికొన్ని తెలియక చేశారు.

ఇమ్రాన్ ఖాన్ వైఖరి బట్టి ఆయన మంచి రాజకీయ నాయకుడు కారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తుంటారు. కానీ, డోనల్డ్ ట్రంప్ లాంటి నాయకులు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల్లో ఒకటైన అమెరికాకు నాయకుడిగా పనిచేశారు. ఆయనను కూడా పదవీచ్యుతిడిని చేసే ప్రయత్నాలు జరిగాయి. కానీ, చివరకు ప్రజలే ఓట్లతో ట్రంప్‌ను పదవి నుంచి తప్పించారు.

కానీ, పాకిస్తాన్‌లో ప్రజాస్వామ్యం అంతగా వేళ్లూనుకోలేదు. ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటైన మూడు, నాలుగేళ్లకే ఎవరో ఒకరు కూలదోసేస్తుంటారు.

ఇమ్రాన్ ఖాన్

ఫొటో సోర్స్, ANI

ఆర్థిక వనరుల కొరత

ప్రధానమంత్రిని పదవి నుంచి తప్పించడానికి బలమైన కారణాల్లో ఆర్థిక వనరుల కొరత ఒకటి. పరిమితమైన ఆర్థిక వనరుల కోసం భిన్న వర్గాల మధ్య జరిగే పోరాటం ప్రధాని పదవిని మరింత బలహీన పరుస్తోంది.

మాఫియా కావొచ్చు, రాజకీయ పార్టీలు కావొచ్చు.. లేదా ప్రభుత్వ సంస్థలు కావొచ్చు.. అందరూ సొంత ప్రయోజనాలకే వారు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆ తర్వాతే దేశ ప్రయోజనాలు.

ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం దేశవ్యాప్తంగా టెలికాం సేవలను కల్పించే ప్రాజెక్టులు తమకు కేటాయించకపోయినా లేదా తమకు సరిపడా నిధులు కేటాయించకపోయినా సంక్షోభానికి కారణమయ్యే పరిస్థితులను సృష్టిస్తారు.

దేశ ప్రయోజనాలు, చట్టాలు, నైతిక విలువలు కేవలం కాగితాలకు మాత్రమే పరిమితం అవుతున్నాయి.

వీడియో క్యాప్షన్, 75 ఏళ్లలో ఒక్క పాకిస్తాన్‌ ప్రధాని కూడా ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకోలేదు, ఎందుకు?

75ఏళ్లుగా..

పాకిస్తాన్ ఏర్పాటై ఇప్పటికి 75ఏళ్లు గడిచాయి. అయితే, ఇప్పటికీ జాతీయవాద భావన ఇక్కడ బలంగా వేళ్లూనుకోలేదు. ఇక్కడ ఎవరినీ మెరుగైన రాజకీయ నాయకుడని చెప్పలేని పరిస్థితి. ఎవరి బలహీనతలు వారికే ఉన్నాయి.

నవాజ్ షరీఫ్, ఇమ్రాన్ ఖాన్ లాంటి నాయకులు కూడా తమ స్వప్రయోజనాలనే చూసుకుంటున్నారని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తారు.

కొన్ని నెలల ముందు వరకు ఇమ్రాన్ ఖాన్ కూడా సైన్యం చెప్పిన మాటను శిరసావహించే వారు.

మాజీ ఐఎస్ఐ అధిపతులైన హమిద్ గుల్, షుజా పాషా లాంటి వారిని ఆయన తరచూ కలుస్తూ ఉండేవారు. అయితే, ఫైజ్ అహ్మద్‌ను ఐఎస్ఐ అధిపతి నియమించేగా విషయంలో సైన్యానికి ఆయన కోపం తెప్పించారు.

వీడియో క్యాప్షన్, పాకిస్తాన్‌లో హిందూ యువతి హత్య: ‘ప్రతిఘటించడంతో కాల్చి చంపారు’

రాజకీయ అస్థిరత

దేశం ఏర్పడి 75ఏళ్లు పూర్తయిన తర్వాత కూడా ప్రభుత్వ విధానాల్లో జోక్యం, రాజకీయాలతో ప్రయోగాలు లాంటివి కనిపించడం శోచనీయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యంగా దేశ ప్రయోజనాలు, ప్రజాస్వామ్యానికి రాజకీయ నాయకులు ప్రాధాన్యం ఇవ్వాలి. సుదీర్ఘ రాజకీయ అస్థిరత దేశానికి మంచికాదు. ముఖ్యంగా ఆర్థిక సంక్షోభంలోనున్న పాకిస్తాన్ లాంటి దేశాలకు ఇది అసలు మంచిదికాదు.

ప్రజాస్వామ్యమే దేశానికి అతిపెద్ద సమస్య అయితే, పరిష్కారం ‘‘మంచి ప్రజాస్వామ్యమే.’’

వీడియో క్యాప్షన్, ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానం.. ఆదివారం ఓటింగ్... ఏం జరగనుంది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)