పాకిస్తాన్ జాతి పిత జిన్నా, రష్యా విప్లవ నాయకుడు లెనిన్‌లు తిలక్ గురించి ఏమన్నారంటే...

లోకమాన్య బాలగంగాధర తిలక్‌

ఫొటో సోర్స్, Lokamany Tilak Vichar Manch, Pune

ఫొటో క్యాప్షన్, లోకమాన్య బాలగంగాధర తిలక్‌

భారత-పాకిస్థాన్‌ దేశాల మధ్య సంబంధాలు మరోసారి చీకటి గుహలోకి వెళ్లిపోయాయి. ఈ గుహలో ఎక్కడా కాంతి కనిపించడం లేదు. అంటే ఈ సంబంధాలు సమీప భవిష్యత్తులో మెరుగుపడతాయన్న ఆశలేదు.

భారతదేశాన్ని బహు సంస్కృతుల లౌకికరాజ్యం నుంచి హిందురాజ్యంగా మార్చే ప్రయత్నాలు క్రమంగా జరుగుతున్నాయి. ఈ సమయంలో మన స్వాతంత్ర్యవీరులను ఒక్కసారి స్మరించుకుంటే హిందూ-ముస్లింల మధ్య ఐక్యతకు, భారత-పాకిస్థాన్‌ల మధ్య స్నేహానికి ఒక కొత్త మార్గం కనిపించే అవకాశం ఉంది.

భారత స్వాతంత్ర్య సమరానికి తన దూరదృష్టితో దిశానిర్దేశం చేసినవారు లోకమాన్య బాలగంగాధర తిలక్ (1856-1920). భారతదేశంలో మహాత్మాగాంధీ శకం ప్రారంభానికి ముందు ఆయనే అతి పెద్ద కాంగ్రెస్‌ నాయకుడు.

శ్యామ్యుల్‌ మాంటెగ్‌ 1917 నుంచి 1922 వరకు భారత విదేశాంగ కార్యదర్శిగా పని చేశారు. అప్పటి భారత రాజకీయాలలో తిలక్‌ ప్రాభవాన్ని స్వయంగా చూసిన ఆయన "ఈ రోజుల్లో తిలక్‌ కంటే శక్తిమంతమైన వ్యక్తి భారతదేశంలో మరొకరు లేరు" అని అన్నారు.

బాలగంగాధర తిలక్‌ 1920 ఆగస్టు 1న అనారోగ్యంతో బొంబాయి(ముంబై)లో మరణించారు. అప్పటికి ఆయన వయసు 64 సంవత్సరాలు. ఆయన అంత్యక్రియలకు పదిలక్షలమందికి పైగా ప్రజలు హాజరయ్యారు. ఈ హృదయ విదారక ఘటనపై మహాత్మాగాంధీ "ఒక మహా వ్యక్తిత్వం మనకు దూరమైంది. సింహం గొంతు మూగవోయింది. తిలక్‌లాగా ఇంత తాదాత్మ్యంతో, ఆవేశంతో మరెవరూ స్వరాజ్య ఉద్యమాన్ని ముందుకు నడిపించలేరు ''అని తన పత్రిక 'యంగ్ ఇండియా'లో రాశారు.

తిలక్‌కు మనఃపూర్వక నివాళులు అర్పించిన ఆయన శిష్యుడు మహ్మద్‌ అలీ జిన్నా, తిలక్‌ దేశానికి ఒక సైనికుడిలా సేవ చేశారని, హిందూ ముస్లిం ఐక్యతను కాపాడటంలో ఆయన కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ఆయన వల్లే 1916నాటి లక్నో ఒప్పందం సాధ్యమైందని అన్నారు.

భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమకాలంలో జరిగిన రెండు ప్రధాన ఘటనలు హిందూ-ముస్లింల మధ్య ఐక్యతకు మైలురాళ్లుగా చెబుతారు. అందులో మొదటిది 1857నాటి మొదటి స్వాతంత్ర్య సంగ్రామం. ఈ యుద్దంలో పెషావర్‌ నుంచి ఢాకా వరకు హిందూ-ముస్లింలు భుజం భుజం కలిపి బ్రిటీష్‌ పాలనకు వ్యతిరేకంగా పోరాడారు.

ఇక రెండో ఘటన లక్నోలో కాంగ్రెస్-ముస్లిం లీగ్ మధ్య జరిగిన ఒప్పందం. ఈ ఒప్పందం 1916లో కుదిరింది. ఆ ఒప్పందానికి రూపశిల్పులు తిలక్,జిన్నా. ఈ ఒప్పందాన్ని పరిపూర్ణంగా అనుసరిచినట్లయితే బహుశా స్వాతంత్య్ర సంగ్రామ ఫలితం భిన్నంగా, ఇంకా మెరుగ్గా ఉండేది.

బాంబే హైకోర్టులో లోకమాన్య తిలక్‌ చివరిసారిగా మాట్లాడిన మాటలు

ఫొటో సోర్స్, Lokamany Tilak Vichar Manch, Pune

ఫొటో క్యాప్షన్, బాంబే హైకోర్టులో లోకమాన్య తిలక్‌ చివరిసారిగా మాట్లాడిన మాటలు

సింహం గర్జించిన వేళ

రెండు అరెస్టులతో తిలక్ భారతీయుల హృదయ స్పందనగా మారారు. ఆయన ఈ దేశపు అతి గొప్ప ప్రజాస్వామ్యవాదిగా అవతరించారు. 1897లో ఆయన మొదటిసారి అరెస్ట్‌ అయ్యారు. అప్పుడు ఏడాదిన్నరపాటు జైలు జీవితం గడిపారు.

1908లో ఆయన రెండోసారి అరెస్టయ్యారు.ఆరు సంవత్సరాల శిక్ష విధించి బర్మాలోని మాండలే జైలుకు పంపింది బ్రిటీష్‌ ప్రభుత్వం. తిలక్‌కు శిక్షను కార్మికవర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. బొంబాయి (ముంబై)లో కార్మికులు మొట్టమొదటి రాజకీయ సమ్మెను నిర్వహించారు.

తిలక్‌ శిక్షకు వ్యతిరేకంగా హిందు, ముస్లిం మతాలలోని అన్నివర్గాలు బొంబాయి నగరాన్ని ఆరు రోజులపాటు స్తంభింపజేశాయి. ఏడాది శిక్షకు ఒకరోజు చొప్పున ఆరేళ్ల శిక్షకు ఆరు రోజులపాటు నగరాన్ని బంద్‌ చేశారు. ఆ తర్వాత బ్రిటీష్‌ ప్రభుత్వం ఆయనపై దేశద్రోహం కేసు పెట్టింది.

1916లో మూడవసారి ఆయనపై దేశద్రోహం కేసు పెట్టినప్పుడు యువన్యాయవాది, భారత రాజకీయాలలో అప్పుడే ఎదుగుతున్న యువనేత మొహమ్మద్ అలీ జిన్నా ఆయనకు అనుకూలంగా వాదించారు. "స్వాతంత్ర్యం నా జన్మహక్కు, దాన్ని నేను సాధించి తీరతాను" అని బొంబయి హైకోర్టులో తిలక్‌ సింహగర్జన చేశారు.

మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా అని శిక్ష విధించడానికి ముందు న్యాయమూర్తి తిలక్‌ను అడిగినప్పుడు "జ్యూరీ నిర్ణయం తప్పని నేను చెప్పాలనుకుంటున్నాను. నేను నిర్దోషిని. ప్రజలు, దేశంకంటే నాకు ఏదీ ఎక్కువ కాదు. వారి యోగ క్షేమాలు ఆ భగవంతుడి చేతిలో ఉన్నాయి. నేను బయట ఉండటంకన్నా జైలులో ఉంటేనే ప్రజల ఆకాంక్షలు నెరవేరతాయని ఆ భగవంతుడు భావిస్తే నేను జైలులోనే ఉంటాను'' అని ఆయన అన్నారు.

1917 రష్యన్ విప్లవ నాయకుడు వ్లాదిమిర్‌ లెనిన్ తిలక్‌కు శిక్షపట్ల తీవ్రంగా స్పందించారు. "బ్రిటిష్‌ తోడేళ్ళు భారత ప్రజాస్వామ్య నేత తిలక్‌ను శిక్షించాయి. భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యం నాశనం కాబోతోందని ఆయన నిరూపిస్తారు" అని లెనిన్‌ అన్నారు.

తిలక్‌కున్న అసంఖ్యాక అభిమానులలో మౌలానా హస్రత్ మోహని కూడా ఒకరు. ఆయన ప్రసిద్ధ స్వాతంత్ర్య సమరయోధుడు, ఉర్దూ కవి. ఇంక్విలాబ్ జిందాబాద్ నినాదాన్ని తొలిసారిగా ఇచ్చింది ఆయనే. తిలక్‌ను తన గురువుగా భావించేవారాయన. 1908లో తిలక్ జైలుకు వెళ్లినప్పుడు ఆయన్ను కీర్తిస్తూ గజల్ రాశారు.

బాలగంగాధర తిలక్‌

ఫొటో సోర్స్, Lokamany Tilak Vichar Manch, Pune

ఫొటో క్యాప్షన్, బాలగంగాధర తిలక్‌

తిలక్ ముస్లిం వ్యతిరేకా? కానే కాదు!

కొంతమంది చరిత్రకారులు తిలక్‌ వారసత్వాన్ని తప్పుగా చూపించడానికి ప్రయత్నించడం దురదృష్టకరం. ఆయనను హిందూ జాతీయవాదని, కాబట్టి ముస్లిం వ్యతిరేకి అని చెప్పే ప్రయత్నం చేశారు.

గణేష్, శివాజీ ఉత్సవాలను నిర్వహించడం ద్వారా హిందూ పునరుజ్జీవనానికి ప్రయత్నించారని ఈ చరిత్రకారులు అంటున్నారు. కానీ స్వరాజ్య ఉద్యమాన్ని సామాన్యుల దగ్గరకు చేర్చడానికి ఆయన వీటిని ఉపయోగించుకున్నారన్నది చాలామంది విస్మరిస్తున్నారు.

పుణెలో ముస్లింలతో కలిసి తిలక్‌ మొహర్రం ఊరేగింపులో కూడా పాల్గొన్నారని చాలామంది మర్చిపోతున్నారు. స్వాతంత్ర్య ఉద్యమానికి నాయకుడిగా ఉన్నకాలంలో భారత విముక్తికి, భవిష్యత్తుకు హిందూ-ముస్లింల మధ్య ఐక్యత అవసరమని తిలక్‌ నమ్మేవారు. భారతీయ జాతీయవాదంలో అందరికీ షేర్‌ ఉందని ఆయన పదే పదే చెప్పేవారు. అంటే హిందువులు, ముస్లింలకు ఇందులో సమానమైన స్థానం ఉందని ఆయన భావన. ఈ హిందూ-ముస్లిం జాతీయవాదం భారతదేశాన్ని 'హిందూ దేశంగా', పాకిస్తాన్‌ను 'ఇస్లామిక్ దేశంగా' మార్చాలని వాదించేవారికి ద్వేషాన్ని వ్యాప్తి చేసే సాధనంగా మారింది.

ఖిలాఫత్ ఉద్యమ నాయకులు మౌలానా షౌకత్ అలీ, ఆయన సోదరుడు మహమ్మద్‌ అలీ జోహార్‌లు తిలక్‌ను ఎప్పుడూ గౌరవించేవారు. "నా సోదరుడికి, నాకు లోకమాన్య తిలక్ రాజకీయ పార్టీతో సంబంధం ఉందని నేను ఒక్కసారికాదు, వందలసార్లు చెప్పగలను " అని షౌకత్‌ అలీ అనేవారు.

అవి హిందూ ముస్లింల ఐక్యత అత్యున్నత స్థితిలో ఉన్న రోజులు. తిలక్‌ అంత్యక్రియల తర్వాత ఆయన చితాభస్మాన్ని ప్రత్యేక రైలు ద్వారా ఆయన స్వస్థలమైన పుణె తీసుకువచ్చారు. తర్వాత దాన్ని భారీ ఎత్తున నగరంలో ఊరేగించారు. ఆ ఊరేగింపు ఒక మసీదు ముందు ఆగింది. అక్కడున్న ముస్లింలు తమ ప్రియతమ నాయకుడికి నివాళులు అర్పించి హిందూ- ముస్లిం ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు.

1892 పుణెలో జరిగిన మొహర్రం ర్యాలీలో పాల్గొన్న తిలక్‌ (చిత్రంలో తిలక్‌ కిందవైపు కనిపిస్తారు)

ఫొటో సోర్స్, Lokamany Tilak Vichar Manch, Pune

ఫొటో క్యాప్షన్, 1892 పుణెలో జరిగిన మొహర్రం ర్యాలీలో పాల్గొన్న తిలక్‌ (చిత్రంలో తిలక్‌ కిందవైపు కనిపిస్తారు)

హిందూ-ముస్లిం ఐక్యతావాది జిన్నా

ఒక జాతియోద్యమకారుడిగానే కాదు, హిందూ-ముస్లిం ఐక్యతను కూడా కోరేవారు జిన్నా. పాకిస్థాన్‌ వ్యవస్థాపకుడైన ఆయన, ఏకకాలంలో కాంగ్రెస్‌, ముస్లింలీగ్‌ రెండింటిలోనూ సభ్యుడిగా ఉండేవారంటే నమ్మశక్యంగా అనిపించకపోవచ్చు.

1896లో జిన్నా కాంగ్రెస్‌లో చేరారు. 1913లో ముస్లిం లీగ్‌లో సభ్యుడయ్యారు. దేశస్వాతంత్ర్యం అనే ఉమ్మడి లక్ష్యం కోసం పోరాడుతున్న రెండు రాజకీయ పార్టీల మధ్య తనను తాను వంతెనగా భావించేవారు జిన్నా. కాంగ్రెస్‌ ఉదారవాద నాయకుడైన గోపాలకృష్ణ గోఖలే జిన్నాకు రాజకీయ గురువు. కాంగ్రెస్‌లో గోఖలే తిలక్‌ వర్గంలో ఉండేవారు.

జిన్నాను "హిందూ-ముస్లిం ఐక్యతా రాయబారి'' అని సంబోధించేవారు గోఖలే. "మాకొక ముస్లిం గోఖలే కావాలి" అని జిన్నా కూడా అనేవారు. అందువల్ల తిలక్, జిన్నా చారిత్రక లక్నో ఒప్పందానికి రూపశిల్పులు కావడం పెద్దగా ఆశ్చర్యం కలిగించదు. తిలక్, జిన్నా సృష్టించిన వాతావరణం కారణంగానే కాంగ్రెస్, ముస్లింలీగ్ వార్షిక సమావేశాలు డిసెంబర్ 1916లో ఒకే సమయంలో జరిగాయి. ఈ సమావేశాలలో ముస్లింలకు ప్రత్యేక ప్రాతినిధ్యం ఏర్పాటు చేయడానికి రెండు పార్టీలు అంగీకరించాయి. జిన్నా డిమాండ్లకు తగినంత ప్రాముఖ్యత లభించింది .

మైనారిటీ అయినప్పటికీ, ఇంపీరియల్, ప్రావిన్షియల్ శాసనసభలలో జనాభా నిష్పత్తి ప్రకారం ముస్లింలకు ఎక్కువ ప్రాతినిధ్యం ఇవ్వడానికి అంగీకరించారు. అదే విధంగా ఈ ఒప్పందం ముస్లింలు లేని రాష్ట్రాలైన పంజాబ్, బెంగాల్‌వంటి ప్రాంతాలలో ముస్లిమేతరులకు తగిన ప్రాతినిధ్యం కల్పించింది. ముస్లిమేతరులకు తగినంత సీట్లు ఇవ్వడానికి, ముస్లింల సీట్లు కూడా తగ్గించారు. ఈ ఒప్పందం కారణంగా, ముస్లింలకు ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో మూడో స్థానం కల్పించారు.

పండిట్ మదన్‌మోహన్ మాలవీయవంటి కాంగ్రెస్‌ హిందూ నాయకులు తిలక్‌ను వ్యతిరేకించారు. ముస్లింలకు ప్రత్యేక ఎలక్టోరేట్‌లు కల్పించడమంటే అది దేశవ్యతిరేక, ప్రజాస్వామ్య వ్యతిరేక వ్యవస్థకు మద్దతు ఇవ్వడమేనని అనేవారు. తిలక్ ముస్లింలకు లొంగిపోయారని ఆయన ఒకసారి అన్నారు. అయినా తిలక్‌ తన వైఖరికి గట్టిగా కట్టుబడి ఉండి హిందూ-ముస్లిం ఒప్పందంపై వచ్చిన అన్ని విమర్శలను ఎదుర్కొన్నారు.

హిందువులకు ఎక్కువగానే సీట్లు దక్కాయని, శాసనసభలలో ముస్లింలకన్నా హిందువులు ఎక్కువ సంఖ్యలోనే ఉంటారని, జనాభా నిష్పత్తి ప్రకారం వారికి కేటాయింపులు జరిగాయని, వారిని ప్రోత్సహిస్తే ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొంటారని తిలక్‌ అనేవారు. ముస్లింల సహాయం లేకుండా దేశం ప్రస్తుతం ఉన్న భరించలేని స్థితి నుంచి బయటపడలేమని ఆయన వాదించేవారు.

మహ్మద్‌ అలీ జిన్నా ఇంటి నుంచి బైటికి వస్తున్న మహాత్మాగాంధీ

ఫొటో సోర్స్, HULTON ARCHIVE

ఫొటో క్యాప్షన్, మహ్మద్‌ అలీ జిన్నా ఇంటి నుంచి బైటికి వస్తున్న మహాత్మాగాంధీ

బ్రిటీష్‌, హిందూ, ముస్లిం అనే త్రిభుజాకార యుద్ధం నుంచి బ్రిటీష్‌ వారు ఒకవైపు, హిందూ ముస్లింలు ఒకవైపు అన్న యుద్ధంగా మార్చాలని తిలక్‌ భావించేవారు. అందుకే ముస్లింల పట్ల ఉదారంగా, సహృదయతో వ్యవహరించాలని ఆయన అభిప్రాయపడేవారు. ఎంతయినా వారు కూడా భారతీయులే కదా అని అనేవారు.

తిలక్‌ ఆలోచనలను జిన్నా సమర్ధించేవారు. లక్నోలో జరిగిన ముస్లిం లీగ్ సమావేశంలో జిన్నా తనను తాను 'చిత్తశుద్ధిగల కాంగ్రెస్ సభ్యుడిని' అని ప్రకటించుకున్నారు జిన్నా. "మతపరమైన నినాదాలకు ఎటువంటి అనుబంధం లేని కాంగ్రెస్ సభ్యుడి''గా చెప్పుకున్నారు. భారతదేశంలోని రెండు పెద్ద వర్గాల మధ్య ఐక్యతను జిన్నా గట్టిగా కోరుకునేవారు. 'హిందూ-ముస్లింల పరస్పర ప్రయోజనాల కోసం ఇద్దరి మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండాలి' అని జిన్నా అభిప్రాయపడేవారు.

కాంగ్రెస్, ముస్లింలీగ్ ఒప్పందం, ముస్లిం లీగ్ సమావేశానికి తిలక్‌ను ఆహ్వానించడం ఐక్యతా వాతావరణాన్ని సృష్టించింది. ముస్లింలీగ్‌ సమావేశంలో ఆయనకు ఘనస్వాగతం లభించింది. ఈ సమావేశాన్ని ప్రత్యక్షంగా చూసిన ముక్తార్‌ అబ్బాస్‌ అన్సారీ ఈ వివరాలను వెల్లడించారు. ఆయన తరువాతి కాలంలో కాంగ్రెస్‌కు, ముస్లింలీగ్‌కు అధ్యక్షుడిగా పని చేశారు.

"తిలక్‌లో హిందూ ఆధిపత్యవాదం లేఏదు. కొంతమంది తిలక్‌ ఆలోచనా ధోరణిని తప్పుగా అర్ధం చేసుకున్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఇరువర్గాలు కలిసి మెలసి పోరాడాలని ఆయన కోరుకునేవారు'' అని అబ్సాస్‌ అన్సారీ అన్నారు.

मोहम्मद अली जिन्ना

ఫొటో సోర్స్, AFP

తిలక్-జిన్నాల భావనను పునరుద్ధరించాలి

ఆ తర్వాత జరిగిన ఘటనల్లో హిందు-ముస్లిం ఐక్యత, కాంగ్రెస్‌-ముస్లింలీగ్‌ పరస్పరం పరీక్షకు నిలవలేకపోవడం భారత స్వాతంత్ర్య సంగ్రామంలో అది పెద్ద విషాదం. దీనికి కారణం తిలక్‌ ఎక్కువకాలం జీవించి ఉండటకపోవడం. ఆయనే బతికుంటే తన ఆలోచనకు ఆచరణాత్మక రూపాన్ని ఇచ్చి ఉండేవారు.

మరోవైపు తనను కాంగ్రెస్‌ పార్టీ పక్కనబెడుతున్నట్లు జిన్నా భావించారు. చివరకు 1921లో ఆయన కాంగ్రెస్‌ నుంచి తప్పుకున్నారు. కాంగ్రెస్, ముస్లింలీగ్‌ల మధ్య పెరిగిన అపనమ్మకం 1947లో రక్తపాత విభజనకు దారితీసింది.

తిలక్, జిన్నా ఇద్దరూ ఈ రోజు జీవించి ఉంటే, భారతదేశం,పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం నెలకొన్న సంబంధాలను చూసి నిరాశకు గురయ్యేవారు. రెండుదేశాల ప్రజల మధ్య దూరాన్ని చూసి బాధపడేవారు.

ఈరోజు భారతదేశంగానీ, పాకిస్తాన్‌గానీ సద్భావన, సానుకూల ఆలోచనను చూపించడానికి సిద్ధంగా లేవు. వివాదాస్పద సమస్యలను పరిష్కరించుకోవడంలో రాజీపడటానికి ఇద్దరూ సిద్ధంగా లేరు.

రెండు దేశాల మధ్య విశ్వాసం లేకుండా కాశ్మీర్‌ వివాదం పరిష్కారమవుతుందా? ఇరుదేశాలు నిబద్ధత ప్రదర్శించకపోతే ఈ క్లిష్ట పరిస్థితి నుండి బయటపడగలమా ? భారత్, పాకిస్తాన్‌లు ఇలా శత్రువులుగానే కొనసాగుతాయా?

ఈ ప్రశ్నలకు సమాధానం తిలక్‌-జిన్నా నాడు సృష్టించిన స్ఫూర్తిని ఈరోజు కొనసాగించడంలో దొరుకుతుందని గుర్తు పెట్టుకోవాలి. హిందూ-ముస్లిం ఐక్యత, ఇండో-పాక్ సంబంధాలను మెరుగుపరచడం నేటి యుగపు అతిపెద్ద సవాళ్లలో ఒకటి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)