పాకిస్తాన్‌లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఉంటుందా, ఊడుతుందా

ఫొటో సోర్స్, GOVERNMENT OF PAKISTAN
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. ఇమ్రాన్ ఖాన్‌కు "రోజులు దగ్గరపడ్డాయని", "సొంత వర్గంలోని నాయకులే ఆయనతో విసిగిపోయారని" ప్రతిపక్షాలు అంటున్నాయి.
అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కునేందుకు పాక్ ప్రధాని కూడా సమాయత్తమవుతున్నారు. బుధవారం, ఇమ్రాన్ ఖాన్ తన మిత్రపక్షమైన ఎంక్యూఎం-పి ప్రధాన కార్యాలయానికి (కరాచీ) వెళ్లారు.
మంగళవారం ప్రతిపక్ష పార్టీల నాయకులంతా కలిసి నేషనల్ అసెంబ్లీ (పార్లమెంటు) సెక్రటేరియట్‌లో ప్రధానిపై అవిశ్వాస తీర్మానాన్ని సమర్పించారు. దీనిపై పార్లమెంటు సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ మేరకు, ప్రతిపక్ష నాయకులు షాబాజ్ షరీఫ్, ఆసిఫ్ అలీ జర్దారీ, జేయూఐఎఫ్ చీఫ్, పీడీఎం అధ్యక్షుడు మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ సంయుక్తంగా ఇస్లామాబాద్‌లో విలేఖరుల సమావేశం నిర్వహించారు.
నేషనల్ అసెంబ్లీ అంటే పార్లమెంటులో 172 మందికి పైగా సభ్యులు అవిశ్వాస తీర్మానంపై ఓటు వేయాల్సి ఉంటుందని, అందుకు తగ్గ మద్దతు తమకు ఉందని తెలిపారు.
"ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని మేం స్వాగతిస్తున్నాం. మేం దాన్ని ఎదుర్కుంటాం" అని రాజకీయ వ్యవహారాలపై ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ప్రత్యేక సహాయకుడు షాబాజ్ గిల్ అన్నారు.

ఫొటో సోర్స్, PMLN
'ఇది దేశ ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయం'
ప్రతిపక్ష నేత షాబాజ్ షరీఫ్ విలేఖరుల సమావేశంతో మాట్లాడుతూ, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, జేయూఐ, ముస్లిం లీగ్-ఎన్ సహా ప్రతిపక్షాలన్నీ ముందురోజు సమావేశమై, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలనే నిర్ణయం తీసుకున్నాయని తెలిపారు.
"అన్ని పార్టీలు తమ సభ్యుల సంతకాలు తీసుకున్నాయి, కానీ దాన్ని గోప్యంగా ఉంచారు" అని ఆయన చెప్పారు.
"దాదాపు నాలుగేళ్ల పాలనలో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం.. దేశంలో ఆర్థిక, సామాజిక రంగాల్లో సాధించిన ప్రగతికి ఒక్క ఉదాహరణ కూడా లేదని" అందుకే అవిశ్వాసం పెట్టాల్సిన అవసరం వచ్చిందని అన్నారు.
"అన్నిటికన్నా ముఖ్యంగా ద్రవ్యోల్బణం, నిరుద్యోగం ప్రధాన సమస్యలుగా మారాయి. ఆపై, విపరీతంగా రుణాలు తీసుకుని దేశంలోని 22 కోట్ల ప్రజల జీవితాలను పణంగా పెట్టారు. ఆ రుణాలకు తగ్గ అభివృద్ధి కూడా ఎక్కడా కనిపించట్లేదు. వారికి ఒక్కటే పని. పాత ప్లకార్డులు తీసి కొత్తవి పెట్టడం" అని షాబాజ్ షరీఫ్ అన్నారు.
దేశ ప్రయోజనాల కోసమే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టామని ఆయన అన్నారు.
'అవిశ్వాస తీర్మానం వీగితే, నేను చెప్పినవన్నీ ఒప్పుకుంటారా?'
అసెంబ్లీ నిబంధనల ప్రకారం, నేషనల్ అసెంబ్లీ స్పీకర్ అవిశ్వాస తీర్మానంపై మూడు నుంచి ఏడు రోజుల లోపు ఓటింగ్ నిర్వహించాల్సి ఉంటుంది.
నేషనల్ అసెంబ్లీలో తమకు 200 మంది సభ్యుల మద్దతు ఉందని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఈ తీర్మానం నెగ్గాలంటే కనీసం 172 ఓట్లు కావాలి.
ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాసం ప్రకటించాలన్న చర్చలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి గానీ, కార్యరూపం దాల్చడానికి ఇంత సమయం పట్టింది.
కొన్ని రోజుల క్రితం, పంజాబ్ ప్రాంతంలోని మిలేసిలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ, అవిశ్వాస తీర్మానానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
"అవిశ్వాస తీర్మానం వీగిపోతే, పర్యవసానాలను ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలు సిద్ధంగా ఉన్నాయా?" అని ఆయన ప్రశ్నించారు.
పాకిస్తాన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 95 ప్రకారం, నేషనల్ అసెంబ్లీలో ప్రధానిపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చు. ఇందుకోసం, నేషనల్ అసెంబ్లీ సభ్యుల్లో కనీసం 20 శాతం పార్లమెంటు సెక్రటేరియట్‌కు లిఖితపూర్వక ప్రతిపాదన సమర్పించాలి.
దీని తరువాత, ఈ ప్రతిపాదనపై ఓటింగ్ జరుగుతుంది. మెజారిటీ ఓట్లు అవిశ్వాస తీర్మానానికి వస్తే, ప్రధాని తన పదవిలో కొనసాగలేరు.

ఫొటో సోర్స్, PML-N
ఎవరెవరికి ఎంతెంత మద్దతు ఉంది?
పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ లేదా పార్లమెంట్ వెబ్‌సైట్ ప్రకారం, అధికార పార్టీ పీటీఐకి, మిత్రపక్షాలు సహా 178 మంది సభ్యుల మద్దతు ఉంది.
వీరిలో పీటీఐకి నుంచి 155 మంది, ఎంక్యూఎం నుంచి ఏడుగురు, బీఏపీ నుంచి అయిదుగురు, ముస్లిం లీగ్ క్యూ నుంచి అయిదుగురు, జీడీఏ నుంచి ముగ్గురు, అవామీ ముస్లిం లీగ్ నుంచి ఒకరు సంకీర్ణ ప్రభుత్వంలో సభ్యులుగా ఉన్నారు.
మరోవైపు, ప్రతిపక్ష కూటమిలో 162 మంది సభ్యులు ఉన్నారు. ఈ కూటమిలో అతిపెద్ద పార్టీ ముస్లిం లీగ్-ఎన్‌కు చెందిన సభ్యులు 84 మంది, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీకి చెందినవారు 57 మంది, ముత్తాహిదా మజ్లిస్-ఎ-అమాల్‌కు నుంచి 15 మంది, బీఎన్‌పీకి చెందినవారు నలుగురు, అవామీ నేషనల్ పార్టీకి నుంచి ఒకరు ఉన్నారు. ఇది కాకుండా, ఈ ప్రతిపక్ష కూటమిలో ఇద్దరు స్వతంత్ర ఎంపీలు కూడా ఉన్నారు.
సంఖ్యాబలం చూస్తే, ప్రతిపక్ష కూటమికి మరో 10 మంది సభ్యులు మద్దతు ఇస్తే సరిపోతుంది. జమాతే ఇస్లామీ పార్టీ ప్రస్తుతానికి ఎవరికీ మద్దతు ప్రకటించలేదు.
అవిశ్వాస తీర్మానం గెలవడానికి ప్రతిపక్ష పార్టీలు, అధికార పార్టీ మిత్రపక్షాలను కూడా కలుస్తున్నాయి.
ముస్లిం లీగ్ క్యూ, ఎంక్యూఎం కాకుండా, జహంగీర్ తరీన్ గ్రూపును కూడా ప్రతిపక్ష కూటమి సంప్రదిస్తోంది. నేషనల్ అసెంబ్లీలో తమకు ఏడుగురు ఎంపీలు ఉన్నారని జహంగీర్ తరీన్ గ్రూపు పేర్కొంది.
అధికార పార్టీ, ప్రతిపక్ష కూటమి రెండూ గెలుపు మాదంటే మాదని అంటున్నాయి.
ఇవి కూడా చదవండి:
- ఏపీలో సినిమా టికెట్ల ధరల పెంపు: ‘రెండు నెలల్లో పేదలు ధనికులుగా మారారా?’
- యుక్రెయిన్ నుంచి బయటపడేందుకు అష్టకష్టాలు.. అయినా పెంపుడు కుక్కను వదలని కేరళ అమ్మాయి
- యుక్రెయిన్ సైన్యంలో చేరి రష్యాతో పోరాడుతున్న తమిళనాడు విద్యార్థి
- భావన మేనన్: లైంగిక దాడికి గురైన అయిదేళ్లకు గొంతు విప్పిన నటి, ఆమె ఏం చెప్పారంటే...
- మాచ్‌ఖండ్ విద్యుత్ ప్లాంట్ ఎప్పుడు ఎలా మొదలైంది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












