పాకిస్తాన్‌లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం కూలిపోతే, ఆ తర్వాత ఏం జరుగుతుంది

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, అబిద్ హుస్సేన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ తన రాజకీయ ప్రస్థానంలో అత్యంత క్లిష్టమైన దశను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం ఆయనకు ఊపిరి తీసుకోనివ్వడం లేదు.
ఈ రోజు నుంచే అవిశ్వాస తీర్మానంపై పాక్ పార్లమెంటులో చర్చ మొదలైంది.
ఇటీవల కాలంలో పాక్ రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన అధికారిక పాకిస్తాన్ తహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ సంకీర్ణం నుంచి ఒక్కొక్కటిగా పార్టీలు బయటకు వస్తున్నాయి. ఎంపీల సంఖ్యను గమనిస్తే నేషనల్ అసెంబ్లీలో ప్రతిపక్షాలదే పైచేయిగా కనిపిస్తోంది.
అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే 342 మంది సభ్యులున్న నేషనల్ అసెంబ్లీలో 172 మంది ఎంపీల మద్దతు అవసరం. అయితే, ముత్తహిదా ఖ్వామీ మూవ్‌మెంట్ (పీక్యూఎం-పీ) సభ్యులతో కలిపి మొత్తంగా విపక్ష ఎంపీల సంఖ్య ప్రస్తుతం 175కు పెరిగింది.
ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్‌కు మద్దతు ఇస్తున్న ఎంపీల సంఖ్య 164గా ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
2018 జులైలో అధికారంలోకి వచ్చిన ఇమ్రాన్ ఖాన్.. అవినీతిని కూకటివేళ్లతో పెకలిస్తానని, ఆర్థిక వ్యవస్థను గాడినపెడతానని హామీ ఇచ్చారు. అయితే, ఈ రెండింటి పరిస్థితి ప్రస్తుతం అలానే ఉంది.
గత ఆదివారం ఇస్లామాబాద్‌లో ఆయన భారీ ర్యాలీ నిర్వహించారు. దీని ద్వారా తనకు ఇంకా ప్రజాదరణ ఎక్కువగానే ఉన్నట్లు నిరూపించే ప్రయత్నాన్ని ఆయన చేశారు.
విపక్షాలపై విమర్శలు చేయడంతోపాటు ఓ లేఖ గురించి కూడా ర్యాలీలో ఇమ్రాన్ ఖాన్ మాట్లాడారు.
తనకు వ్యతిరేకంగా విదేశాలు కుట్ర పన్నుతున్నాయనే ఆధారాలు ఈ లేఖలో ఉన్నాయని ఆయన అన్నారు. అయితే, ఈ లేఖను ఆయన ప్రజల ముందు ఉంచలేదు.

ఫొటో సోర్స్, EPA
సైన్యంతో విభేదాలే కారణమా?
తనపై వ్యతిరేకత విషయంలో విదేశాల పేరును ఇమ్రాన్ ఖాన్ ప్రస్తావించాల్సిన అవసరం లేదు. విపరీతంగా పెరుగుతున్న ధరలు, విదేశీ అప్పులను తగ్గించే విషయంలో ప్రజల మద్దతును ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం కోల్పోయింది.
ఈ విషయంపై బీబీసీతో వాషింగ్టన్‌కు చెందిన అట్లాంటిక్ కౌన్సిల్ డైరెక్టర్ ఉజైర్ యూనుస్ మాట్లాడుతూ.. ‘‘ద్రవ్యోల్బణం వైపు ఒకసారి చూడండి. జనవరి 2020 నుంచి మార్చి 2022 మధ్య భారత్‌లో ద్రవ్యోల్బణ రేటు 7 శాతంగా ఉంది. కానీ, పాకిస్తాన్‌లో ఇది 23 శాతం’’ అని అన్నారు.
మరోవైపు సైన్యంతో ఆయనకున్న విభేదాలు కూడా ఆయన పతనానికి ఒక కారణం. ఇమ్రాన్ ఖాన్ అధికారంలోకి రావడానికి కూడా ఈ సైన్యమే కారణం అని అన్నారు.
గత ఏడాది అక్టోబరు నుంచి ఇమ్రాన్, సైన్యం మధ్య సంబంధాలు క్షీణించాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పాకిస్తాన్‌లో శక్తిమంతమైన గూఢచర్య సంస్థ ఐఎస్ఐ కొత్త అధిపతి నియామకం విషయంలో తొలుత ఇమ్రాన్ విముఖత వ్యక్తంచేశారు.
పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యం మధ్య విడదీయరాని బంధముందని రాజకీయ విశ్లేషకురాలు అరీఫా నూర్ వ్యాఖ్యానించారు. 1947 నుంచి ఇప్పటివరకు సగం కాలాన్ని ఇక్కడ సైన్యమే నేరుగా పాలించిందని ఆమె అన్నారు.
అయితే, ఐఎస్ఐ అధిపతిగా జనరల్ ఫైజ్ హమీద్‌ను నియమించే విషయంలో సైన్యం, ఇమ్రాన్ ప్రభుత్వం మధ్య విభేదాలు వచ్చినట్లు కనిపిస్తున్నాయని నూర్ వివరించారు.

ఫొటో సోర్స్, Reuters
నూర్ వాదనతో సింగపూర్‌కు చెందిన రాజకీయ విశ్లేషకుడు అబ్దుల్ బాసిత్ కూడా ఏకీభవించారు. సమస్య అంతా ఇమ్రాన్ ఖాన్ తీరు వల్లే వచ్చిందని బాసిత్ అన్నారు.
‘‘ఇదివరకు ఐఎస్ఐ అధిపతి నియామకం లాంటి విషయాలు తెరవెనుక జరిగేవి. అయితే, వీటిని ఇమ్రాన్ మీడియా ముందుకు తీసుకొచ్చి పెద్ద తప్పు చేశారు’’అని బాసిత్ అన్నారు.
‘‘ఇప్పుడు సైన్యం గీసిన ఎర్ర గీతను ఇమ్రాన్ ఖాన్ దాటేశారు. చివరకు ఐఎస్ఐ అధిపతి నియామకానికి ఇమ్రాన్ అంగీకరించినప్పటికీ.. అప్పటికే పరిస్థితులు చాలావరకు వెళ్లిపోయాయి’’అని బాసిత్ వివరించారు.
అయితే, సైన్యంతో తనకు విభేదాలు ఉన్నాయన్న వార్తలను ఇమ్రాన్ ఖండిస్తున్నారు.

ఫొటో సోర్స్, EPA
ప్రస్తుతం అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఓటమి తప్పేలా కనిపించడం లేదు. పీటీఐలోని తిరుగుబాటు నేతలు పార్టీకి అనుకూలంగా ఓటు వేసినప్పటికీ.. ఆయనకు ఆధిక్యం దక్కకపోవచ్చు. తిరుగుబాటు ఎంపీల సభ్యత్వాన్ని రద్దు చేయాలని ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లింది. వారి ఓట్లను లెక్కించకపోతే తమ ప్రభుత్వం గట్టెక్కుతుందని భావిస్తోంది.
మరోవైపు పాకిస్తాన్ క్యాబినెట్ మంత్రులు.. తమ సంకీర్ణంలోని పార్టీలతో చర్చలు జరుపుతున్నారు.
తమ సంకీర్ణంలోని పార్టీలను కలిసికట్టుగా ఉంచడంలో ఇమ్రాన్ ఖాన్ విఫలమయ్యారని యూనుస్ వ్యాఖ్యానించారు. ఒకవేళ ప్రస్తుత అవిశ్వాస తీర్మానం నుంచి గట్టెక్కినా.. ప్రభుత్వం గడ్డు పరిస్థితిని ఎదుర్కోక తప్పదని ఆయన అన్నారు.
‘‘నాకు తెలిసినంత వరకు ఆయన ఎన్నికలకు వెళ్లడమే మంచిది. ఒకవేళ ప్రస్తుత అవిశ్వాస తీర్మానం నుంచి ఆయన బయటపడినప్పటికీ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడంపై ఆయన మీద విపరీతమైన ఒత్తిడి ఉంటుంది’’అని యూనుస్ అన్నారు.
అయితే, ఇమ్రాన్ ఖాన్ ఈ అవిశ్వాస తీర్మానాన్ని దాటుకు వచ్చే అవకాశం చాలా తక్కువని అబ్దుల్ బాసిత్ అన్నారు.
‘‘శాసనపరమైన కార్యక్రమాల విషయంలోనూ ప్రభుత్వానికి చాలా అవరోధాలు ఎదురవుతాయి. అందుకే ఆరు నెలల్లోనే ఎన్నికలు నిర్వహించే సూచనలు కనిపిస్తున్నాయి’’అని ఆయన అన్నారు.
మరోవైపు ప్రధానమంత్రిగా తను సాధించిన విజయాల విషయంలో ప్రతిపక్షాలు తనకు క్రెడిట్ ఇవ్వడానికి బదులు.. తనను గద్దె దించడానికి ప్రయత్నిస్తున్నాయని ఇమ్రాన్ అంటున్నారు.
కోవిడ్-19 కేసులను తగ్గించడంలో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం మెరుగ్గా పనిచేసిందని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. 22 కోట్ల మంది ప్రజలున్న పాక్‌లో 15 లక్షల కేసులు మాత్రమే నమోదయ్యాయి. 30 వేల మంది మరణించారు. భారత్‌తో పోలిస్తే, ఈ కేసులు, మరణాలు చాలా తక్కువ.
పంజాబ్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సుల్లో ఇమ్రాన్ ఖాన్ ప్రవేశపెట్టిన ఆరోగ్య పథకాలు కూడా మెరుగ్గా పనిచేశాయని ఆరిఫా నూర్ అన్నారు.
‘‘వీటిని చూపిస్తూ ఇమ్రాన్ ఖాన్ ఎన్నికలకు వెళ్లొచ్చు. దీంతో ఆయనకు కొంతవరకు మేలు జరగొచ్చు’’అని నూర్ అన్నారు.
ప్రతిపక్షాల ప్రణాళిక ఏమిటి?
ఇమ్రాన్ ఖాన్‌ను గద్దె దించడం ద్వారా ప్రతిపక్షాలు ఏం సాధిస్తాయి?
ప్రస్తుతం పాక్ ఎదుర్కొంటున్న ఆర్థిక, సామాజిక సమస్యలను ప్రతిపక్షాలు పరిష్కరించగలవా?
‘‘ప్రస్తుతం ప్రతిపక్షాలు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాయి. ఏదైనా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దాన్ని గద్దె దించడానికి విపక్షాలు ప్రయత్నించడం ఇక్కడ సర్వసాధారణం’’అని నూర్ అన్నారు.
ప్రస్తుతం ప్రభుత్వాన్ని గద్దె దించడమే విపక్షాల లక్ష్యమని బాసిత్ అన్నారు.
‘‘ఇమ్రాన్ ప్రభుత్వం కూలిన తర్వాత ఏం చేయాలో విపక్షాల దగ్గర ఎలాంటి ప్రణాళికా లేదు. తర్వాత ఏడాది లేదా ఏడాదిన్నర ఇక్కడ రాజకీయ అస్థిరత్వం నెలకొంటుంది’’అని ఆయన వివరించారు.
మరోవైపు ఇమ్రాన్ ఖాన్‌ను గద్దె దించడం తప్పా ప్రతిపక్షాల దగ్గర వేరే ప్రణాళికేదీ లేదని యూనుస్ కూడా అంగీకరించారు.
‘‘ఒకవేళ ప్రతిపక్షాలు అధికారంలోకి వస్తే, చాలా ప్రజావ్యతిరేక కార్యక్రమాలను చేపడతాయి. పాక్ ప్రజలు దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదు’’అని ఆయన అన్నారు.
‘‘ఇప్పుడు ఎవరు గెలుస్తారన్నది ముఖ్యం కాదు. ఎందుకంటే అతిమంగా ఓడిపోయేది పాక్ ప్రజలే’’అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్: ఇమ్రాన్ ఖాన్‌కు ప్రతిపక్షానికీ మధ్య జరుగుతున్న యుద్ధంలో సైన్యం ఎటు వైపు?
- యుక్రెయిన్ మీద యుద్ధానికి రష్యాకు ఎంత ఖర్చవుతోంది?
- లేపాక్షి ఆలయాన్ని కట్టించిన వ్యక్తి కళ్లను విజయనగర రాజు పొడిపించేశారా?
- చైనా: పగలంతా ఆఫీసులో పని.. రాత్రి అక్కడే స్లీపింగ్ బ్యాగ్‌లో నిద్ర
- ఒక అనాథ ప్రపంచ కుబేరుడు ఎలా అయ్యారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













