ఇథియోపియా: ‘ఇక్కడ లీటర్ పెట్రోల్ రూ.759.. గుర్రపు బగ్గీలే పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్.. మాంసం తినడం లగ్జరీ’

ఫొటో సోర్స్, AFP
ఉత్తర టిగ్రేలో కరువుతో అలమటిస్తున్న కొన్ని వేల మంది ప్రజలకు సహాయం అందించేందుకు వీలుగా గత వారం ఒప్పందం జరిగింది.
దీంతో ఇథియోపియాలో గత 17 నెలలుగా కొనసాగుతున్న అంతర్యుద్ధం ముగుస్తుందనే ఆశ కలిగింది. ఈ ప్రాంతంలో ప్రజలకు మానవతా సహాయం అందించేందుకు వీలుగా ఇథియోపియా ప్రభుత్వానికి తిరుగుబాటుదారులకు మధ్య ఒప్పందం కుదిరింది.
ఈ ప్రాంతంలో తిరుగుబాటు కొనసాగుతుండటంతో గత కొన్ని నెలలుగా వీరికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.
దీంతో, కొన్ని లక్షల మంది కనీస అవసరాలైన ఆహారం, నిత్యావసర సరుకులు అందక సతమతమయ్యారు.
టిగ్రే రాజధాని మెకెల్లీ నివాసి ఆ ప్రాంతంలో జీవితం ఎలా ఉందో బీబీసీకి వివరించారు. ఈ ప్రాంతం టీపీఎల్‌ఎఫ్ తిరుగుబాటుదారుల అధీనంలో ఉంది.
‘కొర్రలు కూడా కొనుక్కోలేకపోతున్నాం’
రోజు గడవడానికి నిత్యావసరాలను సమకూర్చుకోవడం కూడా ఆందోళనగానే ఉండేది.
ఇద్దరు పిల్లల తండ్రిగా నా కుటుంబాన్ని పోషించుకోలేకపోవడం నా గుండె పగిలేలా చేస్తుంది. బ్యాంకులు కూడా మూసివేయడంతో అకౌంట్లలో ఉన్న డబ్బును కూడా వాడుకునే అవకాశముండేది కాదు. ఇలాంటి సమస్యను చాలా మంది ఎదుర్కొన్నారు.
నాకు గత ఏడాది జూన్ నుంచి అకౌంట్ వాడే అవకాశం లేకుండా పోయింది. వేరే దారి లేక ఆహారాన్ని కొనేందుకు స్నేహితులు, బంధువుల నుంచి అప్పులు తీసుకోవడం మొదలుపెట్టాను.
విదేశాల్లో ఉన్న బంధువులు సహాయం చేసేందుకు ముందుకొచ్చినా కూడా ఫోన్ లైన్‌లు, ఇంటర్నెట్ లేకపోవడంతో, ఆ డబ్బును తెప్పించుకునే వీలుండేది కాదు.
మరో వైపు ఆహార సరుకుల ధరలు ఆకాశాన్నంటాయి.
స్థానికంగా ప్రజలు ప్రధానంగా తినే కొర్రలు, గోధుమ పిండి, మిరియాలు, వంటనూనె లాంటివి కొనడం కూడా కష్టంగా ఉండేది.
ఒక సంవత్సరం క్రితం 80 డాలర్లు (రూ. 6079) ఖరీదు ఉన్న 100 కేజీల కొర్రల ధర ప్రస్తుతం 146 డాలర్లకు (రూ. 11,000) పెరిగింది.
కొనుక్కోగలిగే స్థోమత ఉన్నవారు చిన్న మొత్తంలో కొర్రలు కొనుక్కుని చవకగా దొరికే జొన్నలు, గోధుమలతో కలిపి రొట్టెలు చేసుకుంటున్నారు. ఇక్కడ ప్రజలకు ఇది ప్రధాన ఆహారం.
కానీ, ఇక్కడ చాలా మంది కొర్రలు కొనుక్కోగలిగే స్థితిలో లేరు.

‘మాంసం తినడం లగ్జరీ లైఫ్’
మా ఇంటి ప్రాంగణంలోనే కాయగూరలను పెంచుకోవాలని చూస్తున్నాం. అయితే, మొక్కలు పెంచడానికి కూడా నీటి సమస్య ఉంది.
మేము వారానికి సరిపోయే 200 లీటర్ల నీటి బ్యారెల్‌ను కొనుక్కునేవాళ్ళం. కానీ, ఇప్పుడు అది కొనుక్కోవడం కూడా కష్టంగానే ఉంది. ప్రస్తుతానికి బావి నీరు తెచ్చుకుంటున్నాం.
పిల్లలకు కొత్త బట్టలు, షూలు కొనడం, మాంసం తినడం లాంటివి విలాసాలుగా మారాయి.
కొళాయి నీరు, విద్యుత్ కూడా రోజులో అప్పుడప్పుడూ వస్తూ, పోతూ ఉంటాయి. ఒక్కొక్కసారి రోజంతా కూడా ఉండవు.
చాలా మందికి పనులు లేవు. మెకెల్లీలో అద్దెలు చెల్లించుకోలేక, సరుకులు లేక చాలా షాపులు, వ్యాపార కేంద్రాలు మూతపడ్డాయి.

చాలా మంది తిండి కోసం కార్లు, ఫర్నీచర్, నగలు లాంటివి చవకగా అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సుమారు రూ. 4800 ఉండే 21 కేరట్ల బంగారం ఉంగరాన్ని రూ. 911 కు అమ్మాల్సి వచ్చింది. రూ. 12,15,928 ఖరీదు చేసే కారు రూ. 5,31,968కి అమ్మాల్సి వచ్చేది.
ఒక్కొక్కసారి చాలా మంది దగ్గర అమ్మడానికి కూడా వస్తువులు లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో చాలా మంది అడుక్కునే స్థితికి చేరారు. వీధుల్లో భిక్షగాళ్లు ఎక్కువయ్యారు. అందులో చాలా మంది పిల్లలతో ఉన్న తల్లులు కూడా ఉన్నారు.
ఔషధాల కొరత
తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ఔషధాలు లేక చనిపోయే పరిస్థితి వచ్చింది.
హెచ్ ఐవి లాంటి వ్యాధులతో బాధపడేవారికి ఇచ్చే యాంటీ రెట్రో వైరల్ ఔషధ సరఫరా కూడా ఆగింది.
పెళ్లిళ్లు, మతపరమైన విందులు జ్ఞాపకాల్లోంచి ఎప్పుడో చెరిగిపోయాయి.
స్కూళ్లు తెరవక ముందు నేను రోజూ ఆలస్యంగా నిద్రపోయేవాడిని.
నేను రాత్రంతా మెలకువగా ఉండి వార్తలను వినడం, చదవడం లాంటి పనులు చేసేవాడిని.
అయితే, తాజా వార్తలు మాత్రం లభించేవి కాదు.
నాకు ఇంటర్నెట్ సౌకర్యం ఉండేది కాదు. నేను రోజు వారీ జరుగుతున్న విషయాల గురించి రోడ్ల పై వ్యాపారం చేసే చిన్న వ్యాపారులు దగ్గరకు వెళ్లి వారు చెప్పే విషయాన్ని రికార్డు చేసి వీడియో, ఆడియో క్లిప్‌లను చేసి రూ.15లకు అమ్మేవాడిని.
మిగిలిన సమయాల్లో నేను పుస్తకాలు చదవడం, పొరుగువారితో మాట్లాడటం లేదా నడకకు వెళ్ళేవాడిని.
పెట్రోల్ స్థోమతకు మించిన ఖరీదు
మా అబ్బాయి స్కూలుకు వెళ్లడం మొదలుపెట్టాడు. నేను రోజుకు 9000 నుంచి 12000 అడుగులు నడుస్తున్నట్లు నా ఫోన్ లో ఉన్న వాకింగ్ యాప్ చెబుతోంది.
నేను మా అబ్బాయిని స్కూలుకు దింపేందుకు రోజుకు 2 కిలోమీటర్లు నడిచి వెళుతున్నాను. నా భార్య స్కూలు నుంచి తీసుకుని వచ్చేందుకు, మధ్యాహ్నం భోజనం ఇచ్చేందుకు కూడా నడిచే వెళ్లి వస్తుంది. అంతకు ముందు నేను కారులో వెళ్ళేవాడిని. కానీ, అది గత 18 నెలలుగా వాడకుండా ఇంటి ముందు పార్క్ చేసి ఉంది. పెట్రోల్ కొనుక్కునే స్థోమత లేదు.
పెట్రోల్ కేవలం బ్లాక్ మార్కెట్ లోనే దొరుకుతోంది. అంతర్యుద్ధానికి ముందు రూ.31 ఉండే లీటర్ పెట్రోల్ ధర రూ.759కి పెరిగింది.
ట్యాక్సీ లేదా ఆటో తీసుకునే ప్రసక్తే లేదు. ఆటోలో వెళ్లాలంటే రూ.150 రూపాయిలు అవుతుంది. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ కోసం గుర్రం బగ్గీలను వాడుతున్నారు.

చాలా మంది సైకిళ్లను వాడటం మొదలుపెట్టారు. కానీ, సైకిళ్ళు కూడా ఖరీదు అయిపోయాయి.
ఈ గొడవ శాంతియుతంగా పరిష్కారం అవ్వాలని ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారు. గత వారంలో పోరాటం ముగుస్తుందని చేసిన ప్రకటన చాలా మందికి సంతోషాన్ని కలిగించింది.
క్షేత్ర స్థాయిలో ఈ ప్రకటన వల్ల తక్షణ మార్పేమీ చోటు చేసుకోలేదు. ఫస్ట్ ఎయిడ్ అందించే కాన్వాయ్ దారిలో ఉందని చెప్పారు.
బ్యాంకులు ఇంకా తెరుచుకోలేదు. చాలా మంది విసిగిపోయారు. ఈ ఒప్పందం ఒక బూటకపు హామీ అని చాలా మంది అంటున్నారు.
నేనింకా బ్రతికే ఉండటాన్ని గొప్పగా భావిస్తున్నాను. కనీసం నా కథను మీతో చెప్పగల్గుతున్నాను. కానీ, నా కంటే దారుణమైన పరిస్థితిలో ఉన్నవారెందరో ఉన్నారు. కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు.
అయితే, ప్రజలు మాత్రం ఒకరికొకరు సహకారం అందించుకోవడం మాత్రం కాస్త ఆశను కలిగిస్తోంది.
"ఒంటరిగా తినేవారు ఒంటరిగానే మరణిస్తారు" అనే నానుడి ఉంది. అందుకే, మేము ఒకరికొకరం సహకరించుకుంటూ ఉంటాం.
చాలా మంది రేపటికి ఆకలితో ఉంటామని తెలిసినా కూడా ఉన్నదాంట్లోనే ఇతరులతో కూడా పంచుకుంటారు. బ్రతుకు పోరాటాన్ని కలిసి ఈదడంలో చాలా సంఘీభావం ఉంటుంది.
భద్రతా కారణాల దృష్ట్యా మెకెల్లీ నివాసి పేరును బీబీసీ వెల్లడించలేదు.
ఇవి కూడా చదవండి:
- వాంగ్ యీ: చైనా విదేశాంగ మంత్రి భారత్‌లో ఎందుకు పర్యటిస్తున్నారు? రెండు దేశాలూ మళ్లీ దగ్గరవుతున్నాయా?
- లైంగికంగా వేధించే భర్త నుంచి భార్యకు ఇకపై న్యాయం లభిస్తుందా... కర్ణాటక హైకోర్టు తీర్పు ఏం చెబుతోంది?
- RRR చుట్టూ ఇంత సందడి ఎందుకు? ఎవరి నోటా విన్నా ఆ సినిమా మాటే వినిపించేలా ఎలా చేస్తారు?
- కిలో బియ్యం 200, ఉల్లిపాయలు 250, గోధుమ పిండి 220, పాలపొడి 1345.. అక్కడ బతకలేక భారత్‌కు వస్తున్న ప్రజలు
- చైనా: 132 మందితో వెళ్తున్న ఆ విమానం ఎలా కుప్పకూలింది... సాంకేతిక లోపమా, విద్రోహ చర్యా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











