ఇథియోపియా అంతర్యుద్ధం: ‘‘అమ్మాయిలపై అత్యాచారాలే ఈ యుద్ధంలో ఆయుధాలు’’

ప్రతీకాత్మక చిత్రం

ఇథియోపియాలో 16 నెలలుగా కొనసాగుతున్న అంతర్యుద్ధం ఆపేందుకు ఒప్పందం కుదిరింది. దీంతో ఉత్తర టిగ్రేలో కరువుతో అలమటిస్తున్న కొన్ని వేల మంది ప్రజలకు సహాయం అందించేందుకు అవకాశం దొరికింది. టిగ్రే ప్రాంతంలో అనేక దారుణాలు చోటు చేసుకున్నాయి. ఈ యుద్ధంలో 'అత్యాచారాలను ఆయుధంగా' వాడుతున్నారని మానవ హక్కుల సంఘాలు కూడా ఆరోపించాయి. టిగ్రే పరిసర ప్రాంతాల్లో ఉన్న అంహారాలో ఈ యుద్ధానికి ప్రభావితమైన మహిళలతో బీబీసీ ప్రతినిధి కల్కిదాన్ ఇబెల్తాల్ మాట్లాడారు.

ఈ కథనంలో కొన్ని అంశాలు పాఠకులను కలచివేయవచ్చు.

టిగ్రేలో ముందుకు కదులుతున్న తిరుగుబాటు సేనలను దాటుకుంటూ ఒక నెల రోజుల తర్వాత జెమ్‌జెమ్ కుటుంబం ఇంటికి చేరి పెద్ద తప్పు చేసింది.

అంహారా ప్రాంతంలోని చిన్న పట్టణానికి చెందిన జెమ్ జెమ్ (పేరు మార్చాం). తన భర్త, పసిబిడ్డతో కలిసి గత ఆగస్టులో తమను తాము రక్షించుకునేందుకు పారిపోయారు. వారొక గ్రామం చేరుకున్నారు. అప్పటికి టిగ్రేలో యుద్ధం మొదలయి 9 నెలలు కావస్తోంది.

టిగ్రే పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ (టీపిఎల్‌ఎఫ్) సేనలు ప్రభుత్వ సేనల నుంచి భూభాగాన్ని స్వాధీనం చేసుకోవడంతో ఈ సంక్షోభం నాటకీయమైన మలుపులు తిరిగింది. ఇదే ప్రాంతంలో జెమ్‌జెమ్ స్వస్థలం కూడా ఉంది.

గ్రామంలో నిత్యావసరాలు నిండుకోవడంతో ఆమె కుటుంబం తిరిగి ఇంటికి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది. కానీ, పట్టణంలోకి తిరిగి వెళుతుండగా, వారు టిగ్రే తిరుగుబాటుదారులను ఎదుర్కోవలసి వచ్చింది.

ఆమె భర్తను సైన్యం నుంచి బయటకు వచ్చిన లేదా స్థానిక సేనల సభ్యుడనుకుని ఆయనను ప్రశ్నించడం మొదలుపెట్టారు. కానీ, ఆయనొక నిర్మాణ రంగ కార్మికుడు.

టిగ్రే సైనికులు వారిని రోడ్డు పక్కనే ఉన్న ఇంట్లోకి లాక్కుని వెళ్లి వారిని తీవ్రంగా కొట్టి, ఆమె బిడ్డ ఎదురుగానే ఆమెపై అత్యాచారం చేసినట్లు తెలిపారు. ఆ దారుణాన్ని ఆపడానికి ప్రయత్నించిన ఆమె భర్తను కాల్చి చంపారు.

వీడియో క్యాప్షన్, ఇక్కడున్న పిల్లల్లో 40 శాతం మంది ఆకలితో అల్లాడుతున్నారు

"నా కొడుకు బిగ్గరగా ఏడవడం నాకింకా గుర్తుంది" అని ఆమె చెప్పారు. ఇదంతా సెప్టెంబరు 26, 2021లో జరిగింది.

"ఎక్కడ చూసినా రక్తమే. నేను శ్వాస అయితే తీసుకుంటున్నాను కానీ, నేను బ్రతికున్నానని చెప్పలేను. రక్తస్రావం అవుతోంది. కాళ్ళు చచ్చుబడిపోయాయి. నేను నా బిడ్డను కూడా పట్టుకోలేకపోయాను" అని చెప్పారు.

ఆమె శరీరమంతా గాయాల వల్ల ఏర్పడిన మచ్చలు కనిపిస్తున్నాయి.

నవంబరు 2020లో కొన్ని రోజుల పాటు ఉద్రిక్తతలు సాగిన తర్వాత మూడు దశాబ్దాల పాటు ఇథియోపియా రాజకీయాలపై ఆధిపత్యం వహించిన టీపీఎల్‌ఎఫ్‌కు ప్రభుత్వానికి మధ్య యుద్ధం మొదలయింది.

ఈ యుద్ధంలో కొన్ని వేల మంది పౌరులు మరణించారు. కొన్ని లక్షల మందికి మానవతా సహాయం అవసరం ఉంది. సహాయక చర్యలను ప్రభుత్వం అడ్డుకుంటోందనే ఆరోపణలు వచ్చాయి.

యుద్ధంలో పాల్గొన్న అన్ని వర్గాల వారు హత్యలు చేసి, లైంగిక వేధింపులకు పాల్పడి ప్రజలను బెదిరించారు.

ఇథియోపియా సేనలు టిగ్రేలో మహిళలు, అమ్మాయిలను లక్ష్యంగా చేసుకుని అత్యాచారాలు, లైంగిక వేధింపులకు పాల్పడ్డారని మానవ హక్కుల సంస్థ అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆరోపించింది.

"ఎన్నటికీ మానని గాయాలు చేసేందుకు అత్యాచారాన్ని యుద్ధంలో ఆయుధంగా వాడారు" అని అమ్నెస్టీ సెక్రెటరీ జనరల్ ఆగ్నెస్ కల్లామార్డ్ అన్నారు. టీపీఎల్‌ఎఫ్ ఫైటర్లు దొంగతనాలు, దోపిడీలతో పాటు మహిళల పై అత్యాచారాలు కూడా చేశారని ఆరోపించింది. "ఇవి యుద్ధ నేరాలు మాత్రమే కాదు. మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన నేరాలు" అని కల్లామార్డ్ అన్నారు.

దీని గురించి సమాధానం చెప్పేందుకు బీబీసీ టీపీఎల్‌ఎఫ్‌ను సంప్రదించింది. కానీ, వారి నుంచి ఎటువంటి సమాధానం లభించలేదు.

టీపీఎల్‌ఎఫ్ అమ్నెస్టీ నివేదికను ప్రశ్నించింది. కానీ, ఈ పోరాటంలో పాల్గొన్న వారు చేసిన దారుణాల పై విచారణ జరపాలని అమ్నెస్టీ ఇచ్చిన పిలుపును తర్వాత సమర్ధించింది.

యుద్ధ ట్యాంకులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, యుద్ధ ట్యాంకులు

కొన్ని వేల మంది మహిళలు, అమ్మాయిలు తమ పై లైంగిక వేధింపులు చోటు చేసుకున్నట్లు చెప్పారు. అయితే, నిజానికి అధికారికంగా నమోదైన నేరాల సంఖ్య కంటే ఇక్కడ చోటు చేసుకున్న నేరాల సంఖ్య మరింత ఎక్కువగా ఉండవచ్చని యూఎన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నియమించిన కమిటీలోని నిపుణులు అంచనా వేశారు.

టిగ్రేలో యుద్ధం మొదలైన తొలి 8నెలల్లో ఒక్క టిగ్రేలోనే 2200 కేసులు నమోదు కాగా, అంహారాలో 940 కేసులు నమోదయ్యాయి.

గత ఏడాది అక్టోబరు నుంచి డిసెంబరు మధ్యలో ఆరు వారాల పాటు కంబోల్చా అనే పారిశ్రామిక పట్టణం టిగ్రే సేనల అధీనంలో ఉంది.

కనీసం 35 మంది అమ్మాయిలు, మహిళలను లైంగికంగా వేధించినట్లు అధికారులకు చెప్పారు.

అందులో నలుగురిని బీబీసీ కలిసింది.

చాలా మంది తమకు జరిగిన అన్యాయం గురించి నోరు విప్పలేదని ఫాతిమా చెప్పింది.

టిగ్రే సేనలు ఆ పట్టణాన్ని ఆధీనంలోకి తీసుకునే సమయానికి ఆమె ఒక బార్ లో వెయిట్రెస్ గా పని చేస్తోంది.

"వాళ్ళు మధ్యాహ్నం రెండు గంటలకు బార్‌లో ప్రవేశించారు. తలుపులు మూసివేయమని ఆదేశించారు. తర్వాత బార్ తెరిచి మద్యం సెర్వ్ చేయమన్నారు" అని ఆమె చెప్పారు.

సాయంత్రం కొంత మంది సైనికులు తిరిగి బార్‌కి వచ్చారు. ఫాతిమా యజమాని తలుపులు తెరవడానికి నిరాకరించినప్పుడు, సైనికులు తుపాకులతో పేల్చి యజమానిని గాయపరిచినట్లు చెప్పారు.

మొబైల్ ఫోన్లలో తీసిన కొన్ని ఫోటోలను బీబీసీ చూసింది.

ఆమెపై కూడా ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారని చెప్పారు. ఆ మరుసటి రోజు మరో ముగ్గురు ఆమె పై అత్యాచారం జరిపినట్లు తెలిపారు.

బార్ లో పని చేస్తున్న మరో ముగ్గురి పై కూడా అత్యాచారం చేసినట్లు తెలిపారు.

ఈ దాడి తర్వాత ఆమె కంబోల్చా వదిలిపెట్టి, దగ్గర్లో ఉన్న పర్వత ప్రాంతాలకు వెళ్లిపోయారు.

"జరిగిన విషయాన్ని నేనెప్పటికీ మర్చిపోలేను"

ప్రభుత్వ సేనలు తిరుగుబాటు దారులను అంహారా నుంచి తిప్పి పంపిన తర్వాత ఫాతిమా తిరిగి పట్టణానికి తిరిగి వచ్చారు.

"నాకేమి జరిగిందో నేనెప్పటికీ మర్చిపోలేను" అని ఆమె బీబీసీకి చెప్పారు.

స్కూలు గోడల పై టీపీఎల్‌ఎఫ్ గీసిన గ్రాఫిటీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, స్కూలు గోడల పై టీపీఎల్‌ఎఫ్ గీసిన గ్రాఫిటీ

మరో మహిళ కూడా ఏడుస్తూ టిగ్రే ఫైటర్లు ఆమెపై కూడా అత్యాచారం జరిపినట్లు తెలిపారు.

"కొన్ని సార్లు ఆ ఘటన కలలో వస్తూ ఉంటుంది. ఒత్తిడికి గురవుతూ ఉండటం వల్ల అలా జరుగుతూ ఉండవచ్చు" అని ఆమె తల దించుకుంటూ చెప్పారు.

యూనిసెఫ్ సహాయంతో నడుస్తున్న మానసిక నిపుణుల బృందంలో డయానా వొండిము సభ్యురాలిగా ఉన్నారు. ఆమె కంబోల్చాలో లైంగిక వేధింపులకు గురైన బాధితులకు సహాయం చేస్తున్నారు.

అత్యాచారానికి గురైన బాధితులతో పాటు శారీరక వేధింపులకు గురైన లేదా దాడులను ప్రత్యక్షంగా చూసిన మహిళలు, అమ్మాయిలకు కూడా ఆమె సహాయం అందిస్తున్నారు.

"ఇక్కడ అన్ని వయసులకు, సామాజిక వర్గాలకు చెందిన బాధితులు ఉన్నారు" ఈ దాడుల వల్ల వాళ్లెప్పుడూ భయంతోనే ఉంటారు. ఇతరులను అనుమాన దృష్టితోనే చూస్తారు. ఒంటరిగా ఉండేందుకు చూస్తారు" అని ఆమె చెప్పారు.

ఈ ఆలోచనతోనే, జెమ్‌జెమ్ కూడా రెండవ సారి కూడా ఇంటిని వదిలిపెట్టి పారిపోయారు. ఆమె నిర్వాసితుల శిబిరానికి వెళ్లారు.

ఆమెకు ఏమైందో చెప్పేందుకు ఆమె చాలా రోజుల వరకు గొంతును విప్పలేకపోయినట్లు చెప్పారు.

"నాకు కన్నీళ్లు కూడా మిగలలేదు. కొన్ని రోజుల తర్వాత ఏడ్వగలిగాను" అని అన్నారు.

ఆమె తిరిగి కొత్తగా జీవితాన్ని మొదలుపెట్టాలని ఆశిస్తున్నారు. ఆమె లైంగిక వేధింపులకు గురైన బాధితులతో స్నేహం చేశారు. అత్యాచారానికి గురైన ఇద్దరు అక్కాచెల్లెళ్లను స్నేహితురాళ్లుగా చేసుకున్నారు.

ఆమె ఆందోళన అంతా ఆమె కొడుకు గురించే. కానీ, ఆ బిడ్డే ఆమెకు ఓదార్పు కూడా.

"కనీసం నాతో వాడైనా ఉన్నాడు" అని ఆమె అన్నారు. వారి జీవితాలు యుద్ధం మిగిల్చిన భయాలతో నిండిపోయి ఉన్నాయి.

ఈ కథనంలో బాధితుల పేర్లను మార్చాం.

వీడియో క్యాప్షన్, ఇథియోపియాలో టిగ్రే తిరుబాటుదారులు పైచేయి సాధించారా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)