ఎత్నా కోయిల్: తుపాకీ ఎక్కుపెట్టి రైళ్లను ఆపిన ఐరిష్ రిపబ్లికన్ ఆర్మీ మహిళా గూఢచారి కథ

కార్లో కౌంటీలోని డకెట్స్ గ్రోవ్‌లో ఐఆర్ఏ శిక్షణా శిబిరంలో రైఫిల్ ప్రాక్టీస్‌ చేస్తున్న ఎత్నా కోయిల్ (మధ్యలో)

ఫొటో సోర్స్, UCD ARCHIVES/EITHNE COYLE O’DONNELL PAPERS/P61/9

ఫొటో క్యాప్షన్, కార్లో కౌంటీలోని డకెట్స్ గ్రోవ్‌లో ఐఆర్ఏ శిక్షణా శిబిరంలో రైఫిల్ ప్రాక్టీస్‌ చేస్తున్న ఎత్నా కోయిల్ (మధ్యలో)
    • రచయిత, ఐమియర్ ఫ్లానగన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఆమె జైలు నుంచి రెండుసార్లు తప్పించుకున్నారు. పలుమార్లు అరెస్ట్ అయ్యారు. తుపాకీ ఎక్కుపెట్టి రైళ్లను ఆపి వార్తల్లోకెక్కిన సందర్భాలు కోకొల్లలు.

ఒక శతాబ్దం క్రితం, తన సమకాలీనులు ఆశ్చర్యపోయేలా, కొండొకొచో భయపడేలా ఎన్నో సాహసాలు చేశారు. ఆమె పేరు ఎత్నా కోయిల్. ఐరిష్ రిపబ్లిక్‌కు చెందిన ఉద్యమకారిణి.

డోనెగల్‌కు చెందిన ఎత్నా కోయిల్, ఐర్లండ్ స్వాతంత్ర్య పోరాటంలోనే కాక, తరువాత వచ్చిన ఐరిష్ అంతర్యుద్ధం సందర్భంగా అనేక దాడులలో పాల్గొన్నారు. కానీ, ఐర్లండ్ విప్లవోద్యమ కాలంలో ఆమె పాత్ర, మొత్తంగా మహిళల పాత్ర కూడా పురుషాధిక్యం మాటున కనిపించకుండా పోయింది.

కోయిల్ కథ ప్రపంచానికి విస్తృతంగా తెలియకపోవడానికి ఒక ముఖ్య కారణం నిస్సందేహంగా పురుషాధిక్యమే. అయితే, అనేక సందర్భాల్లో ఆమె పట్టుబడకుండా తప్పించుకోవడానికి కారణం కూడా ఆమె ఒక స్త్రీ కావడమే.

1921లో జైల్లో నిర్బంధించినప్పుడు, "నువ్వు ఒక మహిళ కావడం వల్లే అనుమానాలను తప్పించుకోగలిగావు" అని ఒక న్యాయవాది అన్నారని కోయిల్ గుర్తు చేసుకున్నారు.

ఏది ఏమైనా, ఐరిష్ రిపబ్లికన్ ఆర్మీ (ఐఆర్ఏ)లో పురుషులకు ఏ మాత్రం తీసిపోకుండా ఎన్నో కష్టాలకోర్చి, అనేక సాహసాలు చేశారు కోయిల్.

డకెట్స్ గ్రోవ్‌లో ఆయుధాల శిక్షణ సమయంలో మే బుర్కే, ఎత్నా కోయిల్, లిండా కెర్న్స్

ఫొటో సోర్స్, THE JOHN SWEENEY COLLECTION/DUCKETTSGROVE.IE

ఫొటో క్యాప్షన్, డకెట్స్ గ్రోవ్‌లో ఆయుధాల శిక్షణ సమయంలో మే బుర్కే, ఎత్నా కోయిల్, లిండా కెర్న్స్

తొలినాళ్లలో..

1914లో అంటే 17 సంవత్సరాల వయసులో మహిళల నేతృత్వంలో ఏర్పడిన పారామిలిటరీ సంస్థ 'కుమన్ నా ఎంబాన్' (ఉమెన్స్ కౌన్సిల్)లో కోయిల్ సభ్యురాలయ్యారు.

హోమ్ రూల్ సంక్షోభ సమయంలో ఐరిష్ వలంటీర్లకు సహాయం చేసేందుకు ఈ సంస్థను స్థాపించారు. ఈ వలంటీర్లలో చాలామంది తరువాత ఏర్పడిన ఐరిష్ రిప్లబ్లికన్ ఆర్మీ (ఐఆర్ఏ)లో పదవులు పొందారు.

కోయిల్ 1917లో ‘కుమన్ నా ఎంబాన్‌’లో చేరారు. తరువాత, ఆ సంస్థకు ప్రెసిడెంట్ అయ్యారు. పదిహేను సంవత్సరాలపాటు ఆమె ఆ పదవిలో కొనసాగారు.

ఐర్లండ్ విప్లవోద్యమ కాలంలో అతి కొద్దిమంది మహిళలు మాత్రమే నేరుగా సాయుధ పోరాటంలో పాలుపంచుకొన్నారు.

మిగతా వారంతా ఆయుధాలను రవాణా చేయడం, ఐఆర్ఏ లక్ష్యాలపై నిఘా పెట్టడం, ఆహారం, ఆశ్రయం, నిధులను సేకరించడం మొదలైన విషయాల్లోనే పురుషులకు అండగా నిలిచారు.

కాగా, తుపాకులతో సాయుధ పోరాటంలోకి దిగిన అతికొద్దిమందిలో కోయిల్ కూడా ఒకరు. అంతే కాకుండా, పోరాటంలో తన పాత్ర గురించి 1952లో ఐరిష్ బ్యూరో ఆఫ్ మిలిటరీ హిస్టరీతో ఆమె మాట్లాడారు.

‘కుమన్ నా ఎంబాన్‌’లో సభ్యత్వం

20 సంవత్సరాల వయస్సులో కోయిల్, డోనెగల్ కౌంటీలోని ఫాల్‌కారాగ్‌లో తన ఇంటికి సమీపంలో ఉన్న ‘కుమన్ నా ఎంబాన్’ శాఖలో చేరారు. తరువాత, ఐర్లండ్ అంతటా కొత్త శాఖలు ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర పోషించారు.

మహిళలను అనుమానించి, సోదా చేసే లేదా అరెస్ట్ చేసే అవకాశాలు తక్కువ. అందువల్ల తుపాకులు, ఐఆర్ఏ సామాగ్రిని దాచిపెట్టే బాధ్యతను మహిళలకు అప్పజెప్పేవారు.

1920ల ప్రారంభంలో అంటే స్వతంత్ర పోరాటం ప్రారంభమై అప్పటికే ఏడాది దాటింది.. ఐఆర్ఏ తరపున గూఢచర్యం చేయడానికి కోయిల్‌ను రోస్‌కామన్ కౌంటీకి పంపించారు.

"శత్రు దళాల కదలికలు, వివిధ కేంద్రాలలో వారి పనితీరు, బలం, పద్ధతులు, గస్తీ తిరిగే సమయాలు.. వీటన్నిటిపై నిఘా పెడుతూ, సమాచారాన్ని అందజేయడమే నా పని" అని కోయిల్ చెప్పారు.

అధికారికంగా, కోయిల్ ఐరిష్ భాష నేర్పించే ఉపాధ్యాయురాలిగా పనిచేసేవారు. అయితే, క్లాసుల పేరుతో తరచూ ఐఆర్ఏ సమావేశాలు జరుగుతూ ఉండేవని ఆమె అంగీకరించారు.

ఐఆర్ఏ ఆపరేషన్లకు ఉపయోగపడే విధంగా మిలటరీ భవనాల నమూనా చిత్రపటాలను గీసి ఇచ్చేవారు కోయిల్.

అలాంటి ఆపరేషన్‌లలో చెప్పుకోదగ్గవి బీచ్‌వుడ్ బ్యారక్స్ మీద చేసిన దాడి, 1920 అక్టోబర్‌లో ఫోర్ మైల్ హౌస్ దగ్గర చేసిన మెరుపుదాడి. దీనిలో కనీసం నలుగురు రాయల్ ఐరిష్ కాన్‌స్టేబులరీ (ఆర్ఐసీ) అధికారులు మరణించారు.

"ఈ దాడి అత్యంత హేయమైనదని" వ్యాఖ్యానిస్తూ, మరణించిన పోలీసు అధికారుల గౌరవార్థం కోర్టులు త్వరగా మూసివేస్తున్నమని అప్పట్లో స్థానిక న్యాయాధికారులు ప్రకటించారు.

1933లో కౌంటీ లౌత్‌లోని డుండాల్క్‌లో ఓ ర్యాలీలో ప్రసంగిస్తున్న ఎత్నా కోయిల్

ఫొటో సోర్స్, UCD ARCHIVES/EITHNE COYLE O’DONNELL PAPERS/P61/9

ఫొటో క్యాప్షన్, 1933లో కౌంటీ లౌత్‌లోని డుండాల్క్‌లో ఓ ర్యాలీలో ప్రసంగిస్తున్న ఎత్నా కోయిల్

'మీరు నాకు విసుగు తెప్పిస్తున్నారు '

కోయిల్ గీసిన రోస్‌కామన్ బ్యారక్స్ (మిలటరీ భవనాలు) నమూనా చిత్రపటాలు పోలీసులకు దొరికాయి. దాంతో ఆమెను అదే భవనంలోని ఒక గదిలో బంధించి ఉంచారు.

తనను మాటలతో వేధించారని, ఐఆర్ఏ సభ్యుల పేర్లు బయటపెట్టకపోతే తుపాకీతో కాల్చి చంపేస్తామని బెదిరించారని.. కానీ, తాను ఏమాత్రం భయపడకుండా పోలీసు అధికారులకు ఎదురుతిరిగానని కోయిల్ తెలిపారు.

"అక్కడ కూర్చున్న ఒకాయన ఓ కోడి ఈకలు పీకి మంటల్లో వేస్తున్నారు. బహుశా దాన్ని ఎక్కడి నుంచో ఎత్తుకొచ్చుంటారు. ఆ వాసన భరించలేకుండా ఉంది. నన్ను చూసి 'మీ షిన్ ఫెయినర్స్ (ఐఆర్ఏ సభ్యులు) నాకు చాలా విసుగు తెప్పిస్తున్నారు' అన్నారు. ఆ కోడి తింటే అంతకన్నా విసుగు వస్తుంది. అనారోగ్యం పాలవుతారు అని చెప్పాను."

బ్యారక్స్ ప్లాన్‌ తన దగ్గర పెట్టుకున్నందుకు, కుమన్ నా ఎంబాన్ కార్యకలాపాలతో సంబంధం ఉన్నందువల్ల కోయిల్‌పై కేసు మోపారు. 1921 ఫిబ్రవరిలో ఆ కేసు విచారణకు వచ్చింది.

"విచారణ జరుగుతున్నంతసేపు నేను ఒక వార్తాపత్రిక చదువుకుంటూ నిల్చున్నాను. నేను న్యాయస్థానాన్ని గుర్తించనని జడ్జికి ఐరిష్ భాషలో చెప్పాను" అని ఆమె వెల్లడించారు.

కోయిల్‌కు ఏడాదిపాటు జైలు శిక్ష విధించారు. డబ్లిన్ మౌంట్‌జాయ్ జైల్లో నిర్బంధించారు. అయితే, హాలోవిన్ రాత్రి కోయిల్, ముగ్గురు తోటి ఖైదీలతో కలిసి తప్పించుకుని పారిపోయారు.

తాడు నిచ్చెన సహాయంతో..

జైలు అధికారి ఏమరుపాటుగా ఉన్నప్పుడు, ఖైదీలు జైలుగది తాళాలు దొంగిలించి మైనంతో వాటికి నకలు తయారుచేశారు. జైల్లో ఖైదీని కలుసుకోవడానికి వచ్చే మరో వ్యక్తికి ఆ నకలును అందించి అదే తరహా తాళంచెవిని తయారు చేయించారు.

జైలు సిబ్బంది దృష్టిని మరల్చడానికి ఇతర ఖైదీలు ఫుట్‌బాల్ మ్యాచ్‌ను నిర్వహించారు. అదే సమయంలో కోయిల్ బృందం ఒక తాడు నిచ్చెన సహాయంతో జైలు గోడలు దూకి తప్పించుకున్నారు.

తరువాత కోయిల్‌ను కార్లో కౌంటీలోని డకెట్స్ గ్రోవ్‌లో ఐఆర్ఏ శిక్షణా శిబిరానికి భద్రంగా చేర్చారు. 1921 డిసెంబర్‌లో ఆంగ్లో-ఐరిష్ ఒప్పందం కుదిరే వరకూ ఆమె అక్కడే తలదాచుకున్నారు.

అయితే, చాలామంది మిలిటెంట్ రిపబ్లికన్ల లాగే ఆమె కూడా ఈ శాంతి ఒప్పందాన్ని వ్యతిరేకించారు. ఇది, బ్రిటన్ ప్రతిపాదించిన ఐర్లండ్ విభజననే బలపరచించన్నది ఆమె వాదన.

"ఆమె డోనెగల్‌కు చెందిన వ్యక్తి. బహుశా, అల్‌స్టర్ ప్రాంతంపై ఉన్న ప్రశ్నలు ఆమెకు చాలా దగ్గర సంబంధం ఉన్నవి" అని రచయిత, చరిత్రకారులు మార్గరెట్ వార్డ్ అన్నారు. వార్డ్ 1970లలో కోయిల్‌ను కలిశారు.

శాంతి ఒప్పందానికి వ్యతిరేకంగా ఓటు వేసిన తరువాత, నార్త్ ఐర్లండ్ ప్రజలకు సంఘీభావం తెలుపుతూ బెల్‌ఫాస్ట్ బహిష్కరణను తిరిగి అమలులోకి తీసుకురావడమే కుమన్ నా ఎంబాన్ వ్యూహం అని వార్డ్ వివరించారు.

ఉత్తర ఐర్లండ్‌లో వస్తువుల ఎగుమతులకు అంతరాయం కలిగించడం ద్వారా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడమే ఈ బహిష్కరణ లక్ష్యం. ఇందులో కోయిల్ చురుకుగా పాల్గొన్నారు.

ఎత్నా కోయిల్

ఫొటో సోర్స్, UCD ARCHIVES/EITHNE COYLE O’DONNELL PAPERS/P61/21

ఫొటో క్యాప్షన్, ఎత్నా కోయిల్

తుపాకీ ఎక్కుపెట్టి రైళ్లను ఆపి....

1922లో టైరోన్ కౌంటీలో స్ట్రాబేన్‌లోని ఒక హోటల్లో ఉంటూ ఉత్తర ఐర్లండ్ వార్తాపత్రికలను మోసుకెళ్తున్న ఒక రైలును కోయిల్ అడ్డగించారు.

"నా దగ్గర ఒక పాత తుపాకీ ఉంది. దానికి ట్రిగ్గర్ లేదు. కానీ అది చేయాల్సిన పని చేసింది. రైలు ఆపడానికి పనికొచ్చింది. ఆ రైలు మోసుకొచ్చిన మొత్తం వార్తాపత్రికలన్నీ కాల్చేసి, బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి నా హోటల్‌కి తిరిగి వెళ్లిపోయాను" అని ఆమె వెల్లడించారు.

తరువాత కొన్ని వారాల పాటు కోయిల్ ఇలాగే తుపాకీ గురిపెట్టి ఉత్తర ఐర్లండ్ రైళ్లను ఆపేవారు. ప్లాట్‌ఫారంపైనే వార్తాపత్రికలన్నీ కాల్చేసేవారు.

"ఐర్లండ్‌లో లేదా మూవీ-ల్యాండ్‌లో మాత్రమే ఒక సన్నని ఆడమనిషి రైలును చేత్తో ఆపగలరు" అని ఒకసారి ఆ సంఘటనను ప్రత్యక్షంగా చూసిన డైలీ మెయిల్ కరస్పాండెంట్ రాశారు.

అయితే తమాషాగా, తన రైలు దాడులకు సంబంధించిన వార్తలు వచ్చిన వార్తాపత్రికలను మాత్రం కోయిల్ భద్రంగా దాచి ఉంచారు. తన రిపబ్లికన్ కార్యకలాపాలకు సాక్ష్యంగా వాటిని ఐరిష్ బ్యూరో ఆఫ్ మిలిటరీ హిస్టరీకి అందించారు.

1922 జూన్ నాటికి, రిపబ్లికన్ ఉద్యమం రెండుగా విడిపోయింది. ఆంగ్లో-ఐరిష్ ఒప్పందాన్ని సమర్థించేవారు ఒకవైపు, వ్యతిరేకించేవారు మరొకవైపు. దాంతో ఆ దేశంలో అంతర్యుద్ధం ప్రారంభమైంది.

ఒప్పందాన్ని వ్యతిరేకించిన సమూహంలో ఉంటూ, ఐఆర్ఏ విభాగాల మధ్య సామాగ్రిని చేరవేస్తూ ఉండేవారు కోయిల్. దాంతో, ఒప్పందాన్ని సమర్ధించేవారు ఆమెను లక్ష్యంగా చేసుకున్నారు. వీరంతా కొత్త స్వతంత్ర ఐరిష్ దేశం కావాలని కోరుకున్నవారు.

"ఫ్రీ స్టేట్ కోరుకున్నవారు అరెస్ట్ చేసిన మొట్టమొదటి మహిళను నేనే. అంతర్యుద్ధ సమయంలో ఓ డజనుసార్లు అయినా జైలుకు వెళ్లుంటాను" అన్నారామె.

మళ్లీ ఆమె మౌంట్‌జాయ్ జైలుకే వెళ్లారు. గతంలో ఆమె అక్కడినుంచే తప్పించుకున్నారు. అంతకుముందు అక్కడ ఉన్నప్పుడు జైలు పరిస్థితులు బాగోలేవని నిరాహార దీక్షలు, నిరసనలు చేశారు.

"అక్కడి పరిస్థితుల్లో మేమంతా ఎలా బతికి బట్ట కట్టామో ఆశ్చర్యమే!" గుర్తు చేసుకున్నారామె.

మరోసారి కోయిల్‌ను ఒక డబ్లిన్ వర్క్‌హౌస్‌లో బంధించారు. అక్కడినుంచి ఇతర ఖైదీలతో కలిసి తప్పించుకున్నారు. నిర్బంధం నుంచి తప్పించుకోవడం అది రెండోసారి.

కానీ, ఈసారి కోయిల్ బృందం విజయం సాధించలేకపోయింది. ఆ మర్నాడే ఫ్రీ స్టేట్ సైనికులకు ఒక రైల్వే స్టేషన్‌లో దొరికిపోయారు.

అక్కడి నుంచి అంతర్యుద్ధం ముగిసేవరకు కోయిల్ జైల్లోనే ఉన్నారు.

కుమన్ నా ఎంబాన్‌ ప్రెసిడెంట్‌గా...

మూడేళ్ల తరువాత 1926లో కుమన్ నా ఎంబాన్‌ ప్రెసిడెంట్‌గా కోయిల్ ఎన్నికయ్యారు. కుమన్ నా ఎంబాన్‌ను 'మహిళల ఐఆర్ఏ 'గా కూడా పిలిచేవారు.

అయితే అలా పిలవడం సరైనది కాదని మార్గరెట్ వార్డ్ అంటారు. ఎందుకంటే, మహిళల ఐఆర్ఏ అంటే వారంతా ఎక్కువ సైనిక పాత్ర పొషించారన్న అర్థం వస్తుంది. కానీ, అది నిజం కాదని ఆమె వివరించారు.

కుమన్ నా ఎంబాన్ స్థాపించడానికి ప్రధాన కారణం "ఐఆర్ఏ పురుషులకు మద్దతు ఇవ్వడమే". ఇందులో సాయుధ పోరాటానికి అవకాశం లేదు. నిధులను సేకరించడం, ఆహర సరఫరా, సామాగ్రిని చేరవేయడం లాంటి సహాయక చర్యలే చేపట్టేవారని వార్డ్ అన్నారు.

"కానీ, క్రమంగా సాయుధ పోరాటంలో కూడా మహిళలు పాల్గొనడం ప్రారంభించారు. స్వతంత్ర పోరాటంలో, అంతర్యుద్ధ సమయంలో ఐఆర్ఏకు కుడిభుజంగా నిలిచారు" అని వార్డ్ అన్నారు.

అయితే, ఐర్లాండ్‌లో ఆనాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పారామిలిటరీ గ్రూపుకు మద్దతు ఇచ్చిన మొదటి మహిళా సంస్థ కుమన్ నా ఎంబన్ అనుకుంటే పొరపాటే.

కుమన్ నా ఎంబాన్ వ్యవస్థాపకులు తమ రాజకీయ ప్రత్యర్థులైన 'అల్‌స్టర్ వుమన్స్ యూనియనిస్ట్ కౌన్సిల్' (యూడబ్ల్యూయూసీ) నుంచి ఎలాంటి ప్రేరణ పొందారో కాల్ మెకార్తీ తన పుస్తకం 'కుమన్ నా ఎంబాన్ అండ్ ది ఐరిష్ రివల్యూషన్‌'లో వివరించారు.

హోమ్ రూల్‌ను వ్యతిరేకించేందుకు 1911లో యూడబ్ల్యూయూసీని ఏర్పాటు చేశారు. తరువాత, అది ఐర్లండ్‌లో అతిపెద్ద మహిళా రాజకీయ ఉద్యమంగా ఎదిగింది.

సహ ఉద్యమకారులతో ఎత్నా కోయిల్

ఫొటో సోర్స్, UCD ARCHIVES/EITHNE COYLE O'DONNELL PAPERS/P61/5

ఫొటో క్యాప్షన్, సహ ఉద్యమకారులతో ఎత్నా కోయిల్

కోయిల్ రాజీనామా

కుమన్ నా ఎంబాన్‌కు కోయిల్ ప్రెసిడెంట్ అయ్యే సమయానికి ఆ సంస్థ ప్రభావం తగ్గుముఖం పట్టింది. అంతర్యుద్ధంలో వీరి పక్షం ఓడిపోతూ ఉంది.

కోయిల్ వయసు 30ల చివర్లలో ఉన్నప్పుడు డోనెగల్ కౌంటీకి చెందిన ఐఆర్ఏ వ్యక్తి బెర్నార్డ్ ఓ డొనెల్‌ను వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు పుట్టారు.

అదే సమయంలో కుమన్ నా ఎంబాన్ నుంచి బయటకు వచ్చేందుకు కోయిల్ ప్రయత్నించారు. ఇంగ్లండ్‌లో మహిళల మీద, పిల్లల మీద ఐఆర్ఏ బాంబు దాడిని అంగీకరించలేనంటూ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా ఇచ్చేందుకు ప్రయత్నించారు.

అయితే, ఆమె రాజీనామాను పలుమార్లు తిరస్కరించారు. చివరికి 1941లో అంగీకరించారు.

1970లలో మార్గరెట్ వార్డ్, కోయిల్‌ను ఇంటర్వ్యూ చేశారు. ఐఆర్ఏ దాడులలో తన పాత్ర పట్ల ఆమె ఎలాంటి విచారం వ్యక్తం చేయలేదని వార్డ్ చెప్పారు.

1985లో కోయిల్ మరణించారు. ఆమె వ్యక్తిగత పత్రాలను ఆమె పిల్లలు యూనివర్సిటీ కాలేజ్ డబ్లిన్ ఆర్కైవ్స్‌కు అందించారు.

ఇమేజ్ క్రెడిట్స్:

అయిదు యూడీసీ చిత్రాలు ఎత్నా కోయిల్ ఓ డొనెల్ పత్రాల నుంచి సేకరించినవి. యూసీడీ ఆర్కైవ్స్ అనుమతితో ఇక్కడ ప్రచురిస్తున్నాం. (రిఫరెన్స్ కోడ్స్:P61/9; P61/21; P61/5).

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)