చైనా డిజిటల్ గూఢచర్యం... వేల మంది భారతీయులు నిఘా నీడలో ఉన్నారా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సల్మాన్ రావి
- హోదా, బీబీసీ ప్రతినిధి
చైనాకు గూఢచర్యం ఎవరు చేస్తున్నారు? ఈ విషయం ప్రపంచవ్యాప్తంగా భద్రత, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు సవాలుగా మారింది. భారతదేశానికి కూడా ఇది తెలుసుకోవడం చాలా అవసరం.
షెంజెన్‌కు చెందిన సమాచార సాంకేతిక కంపెనీ జెన్‌హువా..సుమారు 10,000 మంది భారతీయులపై డిజిటల్ నిఘా పెట్టిందన్న ఆరోపణలున్నాయని 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్స్' పత్రిక ప్రచురించింది. ఈ కంపెనీకి చైనా ప్రభుత్వంతో ముఖ్యంగా చైనా కమ్యూనిస్ట్ పార్టీతో సంబంధాలున్నాయని కూడా పేర్కొంది.
భారత రాష్ట్రపతి, ప్రధాని మోదీతో సహా అనేకమంది కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు, సోనియా గాంధీతోసహా చాలామంది ప్రతిపక్ష నాయకులు, మూడు సైన్యాల అధిపతులు, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌తో సహ ముఖ్య న్యాయమూర్తులు, అనేకమంది పారిశ్రామికవేత్తలపై ఈ కంపెనీ నిఘా పెట్టిందని తెలిపింది.
ఈ విషయమై ఇండియన్ ఎక్స్‌ప్రెస్స్ పత్రిక, చైనా కంపెనీని సంప్రదించడానికి ప్రయత్నించగా, ఆ కంపెనీ తన వెబ్‌సైట్ మూసివేసింది.
జెన్‌హువా డాటా ఇంఫర్మేషన్ టెక్నాలజీ, ఒక్క భారతదేశంలో మాత్రమే కాకుండా బ్రిటన్, ఆస్ట్రేలియాలలో కూడా ప్రముఖ వ్యక్తులు, ప్రభుత్వ ఉన్నతాధికారుల డాటా బేస్‌ను తయారుచేసింది.
లండన్‌నుంచి విడుదలయ్యే 'డైలీ మెయిల్' పత్రిక ప్రచురించిన కథనం ప్రకారం..ఈ కంపెనీ యూకే క్వీన్, ప్రధాన మంత్రితో సహా 40 వేలమంది ప్రముఖుల డాటా బేస్ తయారుచేసింది.
ఆస్ట్రేలియాకు చెందిన ఏబీసీ న్యూస్ కథనం ప్రకారం…జెన్‌హువా డాటా కంపెనీ ఆస్ట్రేలియాలో 35 వేల మంది పౌరుల డాటా సేకరించింది. ఇందులో ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రముఖులు కూడా ఉన్నారు.
అమెరికా మీడియాలో కూడా ఈ అంశం గురించి కొన్ని కథనాలు వెలువడ్డాయి.

ఫొటో సోర్స్, Reuters
డిజిటల్ గూఢచర్యం
బీజేపీ ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనంపై స్పందిస్తూ.."డాటా రక్షణ, గోప్యత అనేవి ఇంక ఎంత మాత్రం అకడమిక్ అంశాలు కావు. చైనా చేస్తున్న పనితో మనం డిజిటల్ గూఢచర్య కాలానికి వచ్చేశాం" అని అన్నారు.
ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు నిర్వహించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా ట్వీట్ చేస్తూ "ఇంత ముఖ్యమైన విషయం గురించి మోదీ ప్రభుత్వానికి తెలుసా? వారికి ఈ చైనా గూఢచర్యంపై ఎలాంటి సమాచారం అందలేదా? భారత ప్రభుత్వం మన వ్యూహాత్మక ప్రయోజనాలను కాపాడడంలో మళ్లీ మళ్లీ ఎందుకు విఫలమవుతోంది? ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడకుండా ఉండేందుకు చైనాకు స్పష్టమైన సందేశం పంపాల్సిన అవసరం ఉంది" అని అన్నారు.
"గత రెండేళ్లల్లో ఈ సంస్థ సేకరించిన డాటా ఉపయోగించి చైనా, భారత ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేసే ప్రయత్నాలేమైనా చేసిందా? ఈ విషయంపై దర్యాప్తు చేసి..అలాంటిదేమీ జరగలేదని ప్రభుత్వం, దేశానికి భరోసా ఇవ్వగలదా?" అని అడిగారు.
దీని తరువాత అనేక దేశాలు, చదువు కోసం తమ దేశానికి వస్తున్న చైనా విద్యార్థులపై సందేహాలు వెలిబుచ్చాయి. ఎందుకంటే వివిధ దేశాలనుంచీ సమాచారం సేకరించేందుకు చైనా అనేకమంది నిపుణులను ఆ దేశాలకు పంపిస్తోంది అని రిపోర్ట్‌లో తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
చైనా పౌరులకు సవాలు
ఇటీవలే దిల్లీలోని అబ్సర్వర్ రిసెర్చ్ ఫౌండేషన్ (ఓఆర్ఎఫ్) ఈ అంశంపై పరిశోధన చేసింది. 2017లో చైనా 'నేషనల్ ఇంటెలిజెన్స్ లా"ను తీసుకు వచ్చిందనీ, అందులో ఆర్టికల్ 7, 14 ల ప్రకారం అవసరమయినప్పుడు చైనా సంస్థలు, పౌరులు కూడా ప్రభుత్వ ఇంటెలిజెన్స్ ఏజెన్సీల కోసం పనిచెయ్యాల్సి ఉంటుందని పేర్కొన్నది.
ఓఆర్ఎఫ్‌లోని స్ట్రాటజిక్ స్టడీస్ ప్రోగ్రాం అధిపతి హర్ష పంత్ బీబీసీతో మాట్లాడుతూ..."ఈ విషయం బయటికొచ్చిన తరువాత ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలూ చైనా పౌరులను అనుమానంగా చూస్తున్నాయి. ఇప్పటికే అమెరికా, చైనా విద్యార్థులు, పరిశోధకులపై అనేక ఆంక్షలు విధించింది" అని తెలిపారు.
ఈ విషయంలో చైనా మొట్టమొదట తనని తాను కాపాడుకునే ప్రయత్నాలు చేస్తుందని, అక్కడి ప్రభుత్వ అనుమతి లేకుండా ఏ చైనా వెబ్సైట్ తెరుచుకునే అవకాశం లేదని ఆయన అన్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) లో వస్తున్న పురోగతి కూడా సైబర్ స్పేస్‌లో డాటా సేకరించడానికి ఉపయోగపడుతోందని పంత్ తెలిపారు.
ఇది ఒక ప్రత్యేకమైన వృత్తి కాదు. కొందరు మాత్రమే చేసే పని కాదు. చైనాలోని ప్రతీ పౌరుడూ తాము సేకరించిన సమాచారాన్ని ప్రభుత్వానికి అందించాలని చైనా ప్రభుత్వం ఆశిస్తోంది. దీనివలన విదేశాల్లో చదువుకోవాలని ఆశ పడుతున్న చైనా విద్యార్థులకు నష్టం కలగొచ్చు.
చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ, తమ ఆధీనంలో ఉన్న స్ట్రాటజిక్ సపోర్ట్ ఫోర్స్‌ను అన్ని దిశలనుంచీ డాటా సేకరించే పనిలో పెట్టిందని వారి పరిశోధనా పత్రంలో వివరించారు.
దీనివలన భారతదేశానికి పెద్ద నష్టం వాటిల్లకపోవచ్చు కానీ భారత ప్రభుత్వం ఈ విషయాన్ని తేలికగా తీసుకోవట్లేదు. ఇటీవలే చైనాకు చెందిన అనేక మొబైల్ యాప్‌లను నిషేధించింది అని పంత్ అభిప్రాయపడ్డారు.

డాటా మైనింగ్
డేటా మైనింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక పెద్ద వ్యాపారం అయిపోయిందని సైబర్ సెక్యూరిటీ నిపుణుడు రక్షిత్ టండన్ చెప్పారు. ఇదంతా మొబైల్ యాప్‌లు, వెబ్సైట్ల ద్వారా నడుస్తుంది. ప్రజలకు సంబంధించిన వ్యక్తిగత సమాచారంతో ఈ వ్యాపారం చేస్తున్నారని ఆయన అన్నారు.
డాటా మైనింగ్‌కు సంబంధించి భారత ప్రభుత్వం కఠినమైన చట్టాలను తీసుకు రావలసిన సమయం వచ్చిందని టండన్ అన్నారు.
"ఇంటర్నెట్ ఉపయోగిస్తున్న భారతీయ పౌరుల సమాచారం ఎక్కడ నిల్వ అవుతోంది, ఎవరు నిల్వ చేస్తున్నారన్న దానిపై ఇప్పటివరకూ స్పష్టమైన సమాచారం లేదు" అని టండన్ తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు కృత్రిమ మేధస్సును ఎలా ఉపయోగిస్తున్నాయన్న అంశంపై అమెరికన్ థింక్ ట్యాంక్ కార్నెగీ గత ఏడాది ఒక నివేదిక విడుదల చేసింది.
ఈ నివేదిక ప్రకారం ఉదారవాద ప్రజాస్వామ్య దేశాలుగా పేరొందిన ప్రభుత్వాలు కృత్రిమ మేధస్సు ఆధారిత నిఘాకు పాలపడుతున్నాయి. అమెరికా, చైనా కంపెనీలు కనీసం 100 దేశాలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని విక్రయించాయి.
ఉదార ప్రజాస్వామ్య దేశాల కంటే ఎక్కువగా నిరంకుశ ప్రభుత్వాలు కృత్రిమ మేధస్సును మరిన్ని తప్పుడు పనులకు వినియోగించే అవకాశం ఉందని ఈ నివేదికలో పేర్కొన్నారు.
చైనా, రష్యా, సౌదీ అరేబియా వంటి దేశాలు తమ దేశ పౌరులపై నిఘా పెట్టడానికి కృత్రిమ మేధస్సుని వాడుతున్నాయి. కానీ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేసే పరిస్థితులు రావొచ్చని కార్నెగీ నివేదికలో తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- చైనా రక్షణ మంత్రితో రాజ్‌నాథ్ సింగ్ ఏం మాట్లాడారు?
- ఏడు నెలల గర్భంతో ఉన్న భార్యను తీసుకుని 1200 కిలోమీటర్లు స్కూటీపై ప్రయాణం
- మీడియా జడ్జి పాత్ర పోషించొచ్చా.. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అలాంటి కేసులివే
- కరెంట్ లేనప్పుడు సెల్‌ఫోన్ చార్జ్ చేయడమెలా?
- చైనా యాప్స్‌ను భారత్ బ్యాన్ చేసింది... తరువాత ఏంటి?
- చైనా యాప్స్ బ్యాన్‌తో అయోమయంలో పడిన టిక్‌టాక్ స్టార్ భవితవ్యం
- చైనా యాప్స్‌పై భారతీయుల ఆగ్రహం - ఎవరికి నష్టం? ఎవరికి లాభం?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








