స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ: ‘ఇక్కడ కోర్సు చేస్తే ఏదో ఒక ఉపాధి దొరకడం ఖాయం.. పెద్దగా చదువుకోని గ్రామీణ యువతకు ఇది మంచి అవకాశం’

ఫొటో సోర్స్, cipet
- రచయిత, నాగ సుందరి
- హోదా, బీబీసీ కోసం
నిరుద్యోగులకు ఉచిత శిక్షణ, ఆ వెంటనే ఉపాధి చూపించి గ్రామీణ యువత అభివృద్ధే లక్ష్యంగా స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ పని చేస్తోంది.
పలు స్కీముల ద్వారా వివిధ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను యువతకు కల్పిస్తోంది.
గ్రామీణ యువతీ, యువకులలో సాంకేతిక నైపుణ్యం, కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, విలువలు పెంపొందించేందుకు కృషి చేస్తోంది.
ఉచిత శిక్షణ
యువతకు ఈ సంస్థ అందిస్తున్న వివిధ స్కీముల్లో 'దీనదయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన' (డిడియు-జికెవై) ఒకటి. ఈ ట్రైనింగ్ పూర్తయిన వెంటనే శిక్షణ పొందిన వారికి ఉపాధిని కూడా చూపిస్తారు.
2015 నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ పథకం కింద శిక్షణ పొందిన యువతలో 70శాతం మంది పలు ప్రముఖ ప్రైవేటు, పబ్లిక్ సంస్థల్లో ఉద్యోగాలు పొందారు.

ఫొటో సోర్స్, ugc
కొందరు కుటీర పరిశ్రమలు, చిన్నతరహా పరిశ్రమలు పెట్టుకుని స్వయం ఉపాధితో జీవనం సాగిస్తున్నారు. ఈ శిక్షణను పూర్తిగా ఉచితంగా అందిస్తారు.
ఈ స్కీం కింద మొత్తం ఎనిమిది కోర్సుల్లో అంటే బేసిక్ ఆటోమోటివ్ సర్వీసింగ్, పర్సనల్ ఎలక్ట్రానిక్ డివైసెస్ రిపేరింగ్, మెయింటెనెన్స్, డొమెస్టిక్ ఎలక్ట్రీషియన్, కుట్టుమిషన్ శిక్షణ, టాలీ బోధిస్తూ అకౌంట్స్ అసిస్టెంట్ శిక్షణ, డీటీపీ, ప్రింట్ పబ్లిషింగ్ అసిస్టెంట్, కంప్యూటర్ హార్డ్ వేర్, సోలార్ ఎలక్ట్రిక్ సిస్టమ్ ఇన్‌స్టాలర్, సర్వీస్ ప్రొవైడర్లలో కూడా శిక్షణను అందిస్తున్నారు.
ట్రైనింగ్ సమయంలో సంబంధిత కోర్సుల్లో శిక్షణ ఇవ్వడంతోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్, యోగా, మెడిటేషన్ వంటి వాటిని కూడా నేర్పుతారు.
ఉచిత బోర్డింగ్, లాడ్జింగ్‌లతో పాటు ఉచితంగా శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తారు.
మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యువబుల్ ఎనర్జీ శాఖ కూడా నేషనల్ లెవల్ ట్రైనర్‌గా ఈ సంస్థతో కలిసి ఉచిత శిక్షణ సేవలు అందిస్తోంది.
ఈ శాఖ అందించే స్కీములో ఎలక్ట్రికల్ టెక్నీషియన్స్‌కు స్మాల్ సోలార్ సిస్టమ్స్ ఇన్స్టలేషన్, రిపైరింగ్, మెయింటెనెన్స్‌లో శిక్షణ ఇస్తారు.
రామానంద తీర్థ గ్రామీణ సంస్థకు సంబంధించిన మరో పార్టనర్ ఇనిస్టిట్యూట్ 'నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్'(ఎన్ఐఎంఎస్ఎంఇ) (సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు). ఇది హైదరాబాద్‌లో ఉంది.
2009 నుంచి ఇది 'అసిస్టెన్స్ టు ట్రైనింగ్ పార్టనర్స్' (ఎటిటిపి) కింద ఎంటర్ప్రెన్యూర్షిప్, స్కిల్ డెవలెప్మెంట్ ప్రోగ్రాములను (ఇఎస్డిపి) అందిస్తోంది. ఈ స్కీము కింద ఏసీ, రిఫ్రిజిరేటర్, వాటర్ కూలర్ రిపేరింగ్, టు వీలర్ మెయింటెనెన్స్, రిపైరింగ్, కంప్యూటర్ హార్డ్‌వేర్ నెట్‌వర్కింగ్, మొబైల్ రిపేరింగ్, వెబ్ డిజైనింగ్, కంప్యూటర్ అకౌంటింగ్, మోటర్ వైండింగ్, పంప్ సెట్ రిపేరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్ వంటి కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత ఉపాధి చూపిస్తారు.
ఇవే కాకుండా మానవ వనరుల మంత్రిత్వ శాఖకు చెందిన 'నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రూరల్ ఇనిస్టిట్యూట్స్ '(ఎన్సీఆర్ఐ) శాఖ స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రాములను అందిస్తోంది. ఫ్యాషన్ డిజైనింగ్, ఎలక్ట్రీషియన్ ట్రేడ్, జర్దోజి, ఆరి వర్క్, క్విల్ట్ ఆర్టికల్స్, ఫ్యాన్సీ బ్యాగ్స్ మేకింగ్, గార్మెంట్ మేకింగ్, ఎంబ్రాయిడరీ వంటి వాటిల్లో ఉచిత శిక్షణను అందిస్తుంది.

ఫొటో సోర్స్, https://www.srtri.com/
ఈ సంస్థ ప్రధానంగా స్కిల్ డెవలెప్మెంట్ ప్రోగ్రాముల మీద దృష్టి పెడుతోంది. గ్రామీణ యువతను సాధికారులను చేయడం ద్వారా దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతోంది.
స్వల్ప కాల శిక్షణా కోర్సుల ద్వారా సాంకేతిక పరిజ్ఞానం, స్కిల్ డెవలెప్మెంట్ ప్రోగ్రాములలో శిక్షణ ఇచ్చి పనిలో మంచి నైపుణ్యాన్ని సాధించేలా యువతను తీర్చిదిద్దుతోంది.
వస్త్రాలు, ఆటోమోటివ్, ఆహార రంగం, క్యాపిటల్ గూడ్స్, నిర్మాణం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రోసెసింగ్, ఐటీ, ఐటీఇఎస్, సోలార్ ఎనర్జీ తదితర రంగాలకు చెందిన కోర్సులలో శిక్షణను అందిస్తోంది.
యువతకు స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాములను అందించడంలో భాగంగా ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలతో, విభాగాలతో సంబంధాలను రామానందతీర్థ గ్రామీణ సంస్థ కలిగి ఉంది.
ఉదాహరణకు మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్, నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ యూత్ సర్వీసెస్, మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవలబుల్ ఎనర్జీ ఇలా పలు శాఖలతో సంబంధాలను రామానంద తీర్థ గ్రామీణ సంస్థ కలిగి ఉంది.
అలాగే శిక్షణ పూర్తిచేసుకున్న యువతీయువకులకు ఉద్యోగాల కల్పన కోసం పలు ప్రముఖ పారిశ్రామిక సంస్థలు అంటే టీవీఎస్ మోటార్ కంపెనీ లిమిటెడ్, మైక్రోమాటిక్ మెషీన్ టూల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి వాటితో టైఅప్స్ పెట్టుకుంది.
వివిధ కోర్సుల్లో శిక్షణ ఇచ్చేందుకు పలు స్వచ్ఛంద సంస్థలతో కూడా రామానందతీర్థ గ్రామీణ సంస్థ సంబంధాలు కలిగి ఉంది.
ప్రతీ సంవత్సరం ఆరువేల మందికి పైగా యువతీయువకులకు వివిధ విభాగాల్లో శిక్షణనందించి ఉపాధి కల్పిస్తోంది.
నిరుద్యోగ గ్రామీణ యువతకు చేయూతనందించడానికి కృషిచేస్తోంది.
పది, ఇంటర్ చదివిన 18 నుంచి 35 సంవత్సరాల వయసు ఉండే యువతీయువకులు సంస్థ అందించే స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణలో చేరవచ్చు.
తమ విద్యార్హతల ఒరిజినల్ సర్టిఫికేట్లు, పాస్‌పోర్టు సైజు ఫోటోలు, ఆధార్ కార్డు, రేషన్ కార్డులను అభ్యర్థులు తమతో పాటు తీసుకురావాలి.
ఉచిత భోజనం, వసతి సౌకర్యాలతో పాటు ఉచిత శిక్షణ కూడా వీరికి అందిస్తారు. శిక్షణానంతరం ఉపాధి అవకాశాలను కల్పిస్తారు. కోర్సుల శిక్షణకు సంబంధించి పత్రికా ప్రకటన ఇస్తారు.

ఫొటో సోర్స్, https://www.srtri.com/
గ్రామీణ యువతకు వరం
పెద్దగా చదువుకోని గ్రామీణ యువతీయువకులకు వివిధ కోర్సుల్లో శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది ఈ సంస్థ.
పదవ తరగతి చదివి ఇక్కడకు వస్తే చాలు ఏదో ఒక ఉపాధి దొరుకుతుందనే భరోసాను యువతీ యువకుల్లో కలుగజేస్తోంది. ఉపాధి విద్యాలయంగా పేరుపొందుతోంది.
ప్రతి సంవత్సరం పదివేల మంది యువతీ యువకులకు స్కిల్ డెవలప్‌మెంట్లో శిక్షణను అందిస్తోంది. మూడు నెలల స్వల్ప వ్యవధితో పలు కోర్సులలో శిక్షణను అందిస్తోంది.
స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ ఎక్కడుంది?
స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ 1995లో ఏర్పాటయింది. అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు దీన్ని ప్రారంభించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ సంస్థ అప్పట్లో విద్యాశాఖ ఆధ్వర్యంలో నడిచేది.
తర్వాత కొంతకాలానికి పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని గ్రామీణాభివృద్ధి విభాగానికి మార్చారు. రాష్ట్ర విభజన అనంతరం ఈ సంస్థను ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలోని పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ నిర్వహిస్తోంది.
తొలుత హైదరాబాద్‌లోని జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాంగణంలో ఇది మొదలైంది. తర్వాత 1999 నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలోని జలాల్పూర్‌లో వంద ఎకరాల విస్తీర్ణంలో ఈ సంస్థ తన సేవలను ప్రారంభించింది.
వివిధ సాంకేతిక కోర్సుల్లో శిక్షణ, నైపుణ్యం పెంపుదల కోసం అత్యున్నత సాంకేతిక మౌలిక సదుపాయాలతో వేల కొద్దీ గ్రామీణ యువతీయువకులకు పలు కోర్సుల్లో ఉచిత శిక్షణ అందిస్తోంది. ఉపాధిని కల్పిస్తోంది. ఇప్పటి వరకూ దాదాపు లక్షమందికి పైగా యువతకు ఉపాధి అవకాశాలను కల్పించింది.

ఫొటో సోర్స్, facebook/SkillIndiaOfficial
ఎందరో వృద్ధిలోకి వస్తున్నారు...
''మాది ప్రభుత్వ సంస్థ. తెలంగాణాలోని అన్ని జిల్లాల నుంచి గ్రామీణ యువత ఇక్కడకు వస్తారు. వీరిలో చాలామంది పది, ఇంటర్ చదివిన వారే. డిగ్రీ పాసయినవారు కూడా ఇక్కడ మేం ఇచ్చే వివిధ కోర్సుల్లో చేరతారు".
వీరికి శిక్షణ ఉచితం, తర్వాత ఉపాధి కూడా మేమే చూపిస్తాం. శిక్షణానంతరం కొందరు స్వయం ఉపాధిని చేపడుతున్నారు. పేద, వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన యువత మేం ఇచ్చిన శిక్షణతో మంచి జీతంతో ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు. వివిధ కోర్సులు చేసిన వీరికి ఉద్యోగం దొరకదనే భయం లేదు. ఉపాధి లేని స్థితి నుంచి సొంతగా తమ కాళ్ల మీద తాము ఆర్థికంగా వీళ్లు నిలబడగలుగుతున్నారు.
టెక్స్‌టైల్స్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ వంటివి నేర్చుకున్న వాళ్లు సొంతంగా సంపాదించుకుంటూ నిలదొక్కుకుంటున్నారు. ఎంఎస్ ఆఫీస్, డీటీపీ, హార్డ్‌వేర్ వంటివి చేసిన వాళ్లు పలు ప్రైవేటు సంస్థల్లో ఉపాధి పొందుతున్నారు.
ఎలక్ట్రికల్, మోటర్ వైండింగ్ వంటివి చేసిన వాళ్లు నిర్మాణ రంగంలో స్థిరపడి మంచి వేతనం పొంతున్నారు. కష్టపడి పనిచేసుకునే వారికి మేం ఇచ్చే మూడు నెలల కోర్సులు ఆర్థికంగా సుస్థిరంగా నిలబడేట్లు చేస్తాయి" అని రామనందతీర్థ గ్రామీణ సంస్థ డైరెక్టర్ డా.ఎన్. కిషోర్ రెడ్డి చెప్పారు.
వివరాలకు:
ఫోన్: 08685-205013; మొబైల్: 9849729476
ఈమెయిల్: [email protected]
వెబ్‌సైట్: https://www.srtri.com/
ఇవి కూడా చదవండి:
- వ్లాదిమిర్ పుతిన్: ‘అమెరికా చేసిన అత్యంత దారుణమైన పొరపాటును ఆయుధంగా ఎలా మార్చుకున్నారు?’
- క్రెడిట్ కార్డు తీసుకునే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి
- ‘అమ్మవారు’ (చికెన్ పాక్స్) వస్తే ఏం చేయాలి, ఏం చేయకూడదు?
- బిర్యానీ తింటే వీర్యకణాలు తగ్గిపోయి, నపుంసకత్వం వస్తుందా? ఈ ప్రచారంలో నిజమెంత?
- Zero Debt: అప్పు చేయకపోవడం కూడా తప్పేనా? చేస్తే ఎంత చేయాలి, ఎలా చేయాలి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















