గుజరాత్: కొత్తగా వచ్చిన పశు నియంత్రణ బిల్లు వివాదం ఏంటి... పశువుల యజమానులు ఎందుకు ఆగ్రహిస్తున్నారు?

ఆవులు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జయదీప్ వసంత్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఆరు గంటల సుదీర్ఘ చర్చ తరువాత, గుజరాత్ శాసనసభ 'పట్టణ ప్రాంతాలలో పశు నియంత్రణ బిల్లు (2022)' ను ఆమోదించింది. రోడ్లపై విచ్చలవిడిగా తిరిగే పశువుల సమస్యను పరిష్కరించేందుకు ఈ బిల్లును ప్రవేశపెట్టారు.

కొత్త బిల్లు ప్రకారం, మున్సిపల్‌, పట్టణ ప్రాంతాల్లో పశువులకు తప్పనిసరిగా ట్యాగ్ తగిలించాలి. అంతే కాకుండా, వాటిని రోడ్లపై విచ్చలవిడిగా వదిలేసే యజమానులపై చర్యలు తీసుకుంటారు.

అయితే, కాంగ్రెస్ అసెంబ్లీలో ఈ బిల్లును వ్యతిరేకించింది. కొందరు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఇందులోని కొన్ని నిబంధనల పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మల్ధారీ సామాజిక వర్గానికి చెందినవారు ఈ చట్టాన్ని "నల్ల చట్టం"గా పేర్కొన్నారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా పలు ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.

సూరత్, రాజ్‌కోట్, అహ్మదాబాద్ తదితర ప్రాంతాల్లో దీనికి వ్యతిరేకంగా పిటీషన్లు వేశారు. రాబోయే రోజుల్లో ఈ చట్టానికి వ్యతిరేకంగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

రోడ్లపై విచ్చలవిడిగా సంచరించే పశువుల సమస్యపై జనవరి-ఫిబ్రవరి నెలల్లో గుజరాత్ హై కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్) దాఖలైంది.

ఈ సమస్యను అరికట్టేందుకు బడ్జెట్ సెషన్‌లో చట్టం తెస్తామని గుజరాత్ ప్రభుత్వం ఈ పిటీషన్‌పై విచారణ సమయంలో హామీ ఇచ్చింది.

గుజరాత్‌లో దాదాపు 50 లక్షల మంది మాల్ధారీలు (పశువుల యజమానులు) ఉన్నారని అంచనా. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, ఇప్పుడు వీరి అసంతృప్తులను విస్మరించడం పాలక బీజేపీకి కష్టమే.

ఆవులు

ఫొటో సోర్స్, Getty Images

బిల్లుపై అభ్యంతరాలేమిటి?

బడ్జెట్ సమావేశాల చివరి రోజు గురువారం సాయంత్రం 6 గంటల సమయంలో గుజరాత్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వినోద్‌భాయ్ మోర్దియా అసెంబ్లీలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు.

"పట్టణ ప్రాంతాల్లో రోడ్లపై ఆవులు, ఎద్దులు, గేదెలు, మేకలు వంటి జంతువులు సంచరిస్తున్నాయి. వీటివల్ల రద్దీ, ప్రమాదాలు పెరుగుతున్నాయి. వాటిని అరికట్టేందుకు ఈ బిల్లును ప్రవేశపెడుతున్నాం" అని చెప్పారు.

బిల్లులోని కొన్ని నిబంధనలు:

  • చట్టం అమలులోకి వచ్చిన దగ్గర నుంచి 15 రోజులలోగా పశువులకు లైసెన్సులు పొందాలి.
  • లైసెన్స్ అందరికీ కనిపించేటట్టు పెట్టాలి. విధుల్లో ఉన్న అధికారి పశువుల కొట్టాన్ని తనిఖీ చేయగలిగేలా లైసెన్స్ బయటకి కనిపించాలి.
  • అన్ని పశువులకు ట్యాగింగ్ తప్పనిసరి.
  • ట్యాగ్ లేని పశువులను జప్తు చేసి, రూ.50,000 జరిమానా విధిస్తారు. అది చెల్లించిన తరువాతే వాటిని విడుదల చేస్తారు.
  • పశువులు రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో విచ్చలవిడిగా సంచరించకుండా చూడాల్సిన బాధ్యత యజమానిదే.
  • పశువులకు ట్యాగ్ తగిలించని యజమానులకు జైలు శిక్ష లేదా రూ. 10,000 జరిమానా
  • పశువులను జప్తు చేసే బృందంపై ఎవరైనా దాడి చేసినా లేదా వారి కార్యకలాపాలకు ఆటంకం కలిగించినా ఒక సంవత్సరం జైలు శిక్ష, రూ. 50,000 జరిమానా.
  • పశువులు మొదటిసారి పట్టుబడితే యజమానికి రూ. 5000 జరిమానా. రెండోసారి పట్టుబడితే రూ. 10,000, మూడోసారి రూ. 15,000 జరిమానా విధిస్తారు. మూడోసారి ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేస్తారు.
  • ప్రజారోగ్యంపై ప్రభావం చూపని విధంగా చనిపోయిన జంతువులను పూడ్చిపెట్టాలి.

ఇవే కాకుండా, అంటువ్యాధులు వ్యాపించినప్పుడు పశువులను వేరే ప్రాంతాలకు తరలించడానికి కూడా నిబంధనలు ఉన్నాయి.

ఇతర చట్టాల కింద కూడా ఇలాంటివే నిబంధనలు ఉన్నాయి. నాలుగేళ్ల క్రితం గుజరాత్‌లో గుర్రాలకు గ్లాండర్ వ్యాధి సోకినప్పుడు, అది వ్యాపించకుండా వాటికి ఇంజక్షన్ ద్వారా అనాయాస మరణాన్ని అందించారు.

కొత్త చట్టంలోని నిబంధనలు అహ్మదాబాద్, రాజ్‌కోట్, వడోదర, సూరత్, గాంధీనగర్, జునాగఢ్, జామ్‌నగర్, భావ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లతో పాటు 156 మునిసిపాలిటీల పరిధిలో వర్తిస్తాయి.

అసెంబ్లీలో ఈ బిల్లుపై చర్చ సందర్భంగా, జరిమానాగా పెట్టిన మొత్తాలు చాలా ఎక్కువ అని, వాటిని తగ్గించాలని గుజరాత్ మాజీ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ పట్టుబట్టారు. ప్రతిపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆయనకు వత్తాసు పలికారు.

వీడియో క్యాప్షన్, ఆవు పేడతో మురుగునీరు ఇలా శుద్ధి చేయొచ్చు

'మల్ధారీలకు కష్టం'

మల్ధారీ కమ్యూనిటీ ఈ బిల్లు పట్ల చాలా కోపంగా ఉంది. దీని "నల్ల చట్టం" అని పిలుస్తూ నిరసనలు చేపడుతున్నారు.

శుక్రవారం అహ్మదాబాద్‌లోని బాపునగర్‌లో మల్ధార్ ఏక్తా సమితి నేతృత్వంలో నినాదాలు చేస్తూ ఈ బిల్లును తగులబెట్టారు.

"విచ్చలవిడిగా సంచరించే పశువులు సామాన్యులకు అసౌకర్యం కలిగిస్తాయని, ప్రమాదాలకు కారణమవుతాయనే ఆందోళన మాకూ ఉంది. వాటిపై చర్యలు తీసుకోవడానికి మేం వ్యతిరేకం కాదు. అయితే, ఇలాంటి చట్టాలను రూపొందించే ముందు ప్రభుత్వం ప్రాక్టికల్ సమస్యలను కూడా పరిగణించాలి.

2021లో 38 గ్రామాలు అహ్మదాబాద్ నగరంలో విలీనమయ్యాయి. నగర పరిధిలోకి వచ్చాయిగానీ, ఆ గ్రామాలు ఇంకా అలాగే ఉన్నాయి. అక్కడ చాలామంది పశువుల కాపరులు ఉన్నారు. వారంతా ఇబ్బందుల్లో పడతారు. రాత్రికి రాత్రే కొత్త ఏర్పాట్లు ఎక్కడ చేసుకుంటారు?" అని మల్ధార్ ఏక్తా సమితి చైర్మన్ నాగ్జీభాయ్ దేశాయ్ అన్నారు.

"గతంలో ప్రత్యేకంగా మల్ధారీ కాలనీ ఏర్పాటు చేశారు. ఆ ప్రయోగాలు ఫలించాయి. ప్రస్తుత ప్రభుత్వం కూడా అలాంటి ఏర్పాట్లు చేసి, అప్పుడు కొత్త చట్టాలు ప్రవేశపెట్టాలి" అని దేశాయ్ అభిప్రాయపడ్డారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యే, మల్ధారీ కమ్యూనిటీ నాయకుడు రఘు దేశాయ్ అసెంబ్లీలో మాట్లాడుతూ, "గుజరాత్‌లో దాదాపు 70 లక్షల మంది మాల్ధారీలు ఉన్నారు. వారిలో 70 శాతం పేదవారు, చదువుకోనివారు. ఈ బిల్లు పశువులను పెంచుకునే ప్రాథమిక హక్కును హరిస్తుంది. వారిని నిర్వాసితులను చేయడమే ఈ చట్టం ఉద్దేశం. మేం చూస్తూ ఊరుకోం. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతాం" అని అన్నారు.

ఆవులు

ఫొటో సోర్స్, Yawar Nazir

ప్రభుత్వానికి ఉన్న సమస్యలు

హిందువులకు ఆవులు పరమ పవిత్రమైనవి. చావు, పుట్టుకలకు, ఇతర పండుగులకు ఆవులకు తిండి పెట్టడం పుణ్యంగా భావిస్తారు.

కొంతమంది మల్ధారీలు తమ పశువులను దేవాలయాలు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో నిలబెడతారు. నమ్మకం ఉన్నవారు వాటికి మేత పెట్టి, పూజిస్తారని అలా చేస్తారు.

ఆవు పాలను ఇళ్లకు, నగరాల్లో పాల కేంద్రాలకు అందిస్తారు.

కొన్నిసార్లు పశువులను ఊరికే మేతకు వదిలేస్తారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు, నిర్ణీత ప్రదేశాల్లో మాత్రమే గడ్డి లేదా కలుపు మొక్కలను విక్రయించాలని కొత్త చట్టంలో నిబంధన పెట్టారు.

గుజరాత్ హైకోర్టులో వేసిన పబ్లిక్ లిటిగేషన్ కేసుపై విచారణ సందర్భంలో కొంతమంది న్యాయమూర్తులు పశువులను రోడ్లపై వదిలేసే విషయంలో తమ అనుభవాలను పంచుకున్నారు.

బడ్జెట్ సెషన్‌లో ప్రభుత్వం కొత్త బిల్లును ప్రవేశపెడుతుందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు.

చట్టం ఎంత మంచిదైనా దాన్ని సరిగా అమలు చేయకపోయకపోతే లాభం లేదని బెంచ్ పేర్కొంది. ఇప్పుడు కూడా చట్టబద్ధమైన నిబంధనలు కొన్ని ఉన్నాయి. కానీ, వాటిని అమలుచేయడం లేదని గుర్తుచేసింది.

మార్చి మొదటి వారంలో గుజరాత్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి కనుభాయ్ దేశాయ్ గోవుల పెంపకం, భద్రత కోసం కొంత నిధిని కేటాయించారు.

'ముఖ్య మంత్రి గౌ మాత పోషణ్ యోజన' కింద రూ. 500 కోట్లు ప్రకటించారు. గతంలో గోశాలలకు అర్బన్ ల్యాండ్ సీలింగ్ చట్టం నుంచి మినహాయింపు కూడా ఇచ్చారు.

ఇది కాకుండా అదనంగా రూ. 100 కోట్లు వీధి పశువులకు కేటాయించారు. ఆవులపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతులకు సుమారు రూ. 213 కోట్లు కేటాయించారు.

చర్చ సందర్భంగా, బీజేపీ కొత్త బిల్లును సమర్థించింది. విచ్చలవిడిగా రోడ్లపై తిరిగే పశువులను నియంత్రించేందుకు ఇది పనికొస్తుందని, చట్టాన్ని గౌరవించే పశువుల యజమానులకు ఏ విధమైన అసౌకర్యాన్నీ కలిగించదని పేర్కొన్నారు.

ఈ అంశాన్ని రాజకీయం చేయవద్దని గుజరాత్ లా అండ్ జస్టిస్ మంత్రి రాజేంద్ర త్రివేది కాంగ్రెస్‌ను కోరారు. ఈ సమస్యపై చర్య తీసుకోవాలని హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిందని కూడా తెలిపారు.

వీడియో క్యాప్షన్, కొండచిలువను దత్తత తీసుకున్న విశాఖ యువతి

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)