పాకిస్తాన్‌లో రాజకీయ సంక్షోభం, శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం, భారత్‌కు రెండువైపులా అశాంతి... భయపడాలా, వద్దా?

ఫొటో సోర్స్, GETTY IMAGES/EPA/TWITTER
- రచయిత, జుబేర్ అహ్మద్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఇరుగు పొరుగు అంతా సవ్యంగా ఉంటేనే మన ఇంట్లో కూడా ప్రశాంతత ఉంటుంది. ఇప్పుడు ఇండియాకు రెండు వైపులా అశాంతి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటు శ్రీలంక, అటు పాకిస్తాన్ లలో ప్రభుత్వాలు గాలిలో వేలాడుతున్నాయి. మరి ఈ రెండు దేశాల పరిస్థితులకు భారతదేశం కంగారు పడాలా?
తప్పదంటున్నారు నిపుణులు. శ్రీలంక, పాకిస్తాన్‌లలో కొనసాగుతున్న సంక్షోభం భారత్‌పై ప్రభావం చూపుతుందని వారు అంచనా వేస్తున్నారు.
శ్రీలంక సంక్షోభం- భారతదేశం
శ్రీలంక లో ఏదైనా సంక్షోభం లేదా హింస జరిగినప్పుడు, అక్కడి తమిళ జనాభా పెద్ద ఎత్తున తమిళనాడుకు వలస వస్తుండటం గమనించవచ్చు. శ్రీలంకలో దశాబ్దాలుగా జరిగిన అంతర్యుద్ధం కారణంగా లక్షల మంది తమిళం మాట్లాడే ప్రజలు ఇండియాకు వచ్చినట్లు చూశాం.
ప్రస్తుతం శ్రీలంకలో యుద్ధ పరిస్థితులు లేకపోయినా, తీవ్ర నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభం కారణంగా మరోసారి తమిళులు భారతదేశం బాటపట్టారు.
తమిళనాడులో ఆందోళన
ఇది తమిళనాడుకు నిజంగా ఆందోళన కలిగించే అంశం. మార్చి 22న రామేశ్వరం తీరానికి రెండు బృందాలుగా శ్రీలంక తమిళులు చేరుకున్నారు. అయితే ఎంతమంది శరణార్ధులు లంక నుంచి భారతదేశంలోకి ప్రవేశించారనే దానిపై భారత ప్రభుత్వం అధికారికంగా ఏమీ ప్రకటించలేదు.
కానీ శ్రీలంకలో పరిస్థితిని బట్టి చూస్తే భారత్‌కు వచ్చే శరణార్థుల సంఖ్య పెరుగుతుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
లంకలో విదేశీ మారక ద్రవ్యానికి తీవ్ర కొరత ఉంది. 5100 కోట్ల డాలర్ల ( సుమారు రూ.3,876,000,000,000 ) విదేశీ రుణాన్ని చెల్లించేందుకు ఆ దేశం నానా కష్టాలు పడాల్సి వస్తోంది.
ద్రవ్యోల్బణం, విద్యుత్ కోతలతో పాటు, ఆహారం, ఇంధనం, ఇతర నిత్యావసరాల విషయంలో శ్రీలంక తీవ్ర కొరతను ఎదుర్కొంటోంది. ప్రజలలో అశాంతి, సామూహిక నిరసనల దృష్ట్యా శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్ష శుక్రవారం దేశంలో ఎమర్జెన్సీ విధించారు.

ఫొటో సోర్స్, Getty Images
సహాయానికి భారత్ వాగ్దానం
శ్రీలంక ఆర్థిక, ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి, ఆయిల్‌తో పాటు ఆహారం, ఔషధాలను కొనుగోలు చేయడానికి భారతదేశం 150 కోట్ల డాలర్లు (రూ. 114,000,000,000 ) పైగా ఆర్థిక సహాయం అందించింది.
గత వారం శ్రీలంకలో మూడు రోజుల పర్యటన సందర్భంగా, భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ శ్రీలంక ప్రభుత్వానికి సహాయం కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. జైశంకర్ తన పర్యటనలో శ్రీలంక ఆర్థిక మంత్రి బాసిల్ రాజపక్ష తో కూడా చర్చలు జరిపారు.
అయితే ఏప్రిల్ 4న అధ్యక్షుడు గోటబయ రాజపక్ష తన సోదరుడు, ఆర్థిక మంత్రి బాసిల్ రాజపక్ష ను తొలగించారు.
శ్రీలంక నుంచి అందుతున్న నివేదికల ప్రకారం ఆ దేశంలో ప్రస్తుతం 100 కోట్ల డాలర్ల( రూ.76,000,000,000) రుణాన్ని కోరుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
శ్రీలంక తాజా స్థితి
అధ్యక్షుడు గోటబయ రాజపక్ష ఆర్థిక మంత్రిగా అలీ సబ్రీని నియమించారు. ఆదివారం రాత్రి వరకు, అలీ సబ్రీ దేశ న్యాయ మంత్రిత్వ శాఖ బాధ్యతలను నిర్వహించారు.
పదవి నుండి తప్పుకోవడానికి ముందు వరకు బాసిల్ రాజపక్ష అంతర్జాతీయ ద్రవ్య నిధి నుండి బెయిల్ అవుట్ ప్యాకేజ్ పొందడం కోసం అమెరికాను సందర్శించే ఆలోచనలో ఉన్నారు.
దేశంలోని అధికార శ్రీలంక పొదుజన పెరమున (ఎస్ఎల్‌పీపీ) సంకీర్ణంలో బాసిల్ పాత్ర పై ఆగ్రహం వ్యక్తమైంది. గత నెల, బాసిల్‌ను బహిరంగంగా విమర్శించినందుకు మహింద రాజపక్ష మంత్రివర్గంలోని ఇద్దరు మంత్రులను తొలగించారు.
మహింద రాజపక్ష కేబినెట్‌లోని మొత్తం 26 మంది మంత్రులు ఆదివారం రాత్రి తమ పదవులకు రాజీనామా చేశారు. మరోవైపు శ్రీలంక సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ అజిత్ నివార్డ్ కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఐఎంఎఫ్ నుంచి ఉపశమన ప్యాకేజీని పొందే అంశంపై మొండి వైఖరి కారణంగా అజిత్ నివార్డ్ తీవ్ర విమర్శలను ఎదుర్కోవలసి వచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
భారత్-శ్రీలంక వాణిజ్యం
విద్యుత్ కోతల సంక్షోభాన్ని తగ్గించడానికి భారతదేశం కూడా 40,000 మెట్రిక్ టన్నుల డీజిల్‌ను శ్రీలంకకు పంపింది. ఇవి కాకుండా భారతదేశం త్వరలో 40,000 టన్నుల బియ్యాన్ని కూడా పంపుతోంది. భారతదేశపు ట్రాన్స్-షిప్‌మెంట్‌లో 60 శాతం కొలంబో నౌకాశ్రయం ద్వారా జరుగుతోంది.
శ్రీలంక అతిపెద్ద వాణిజ్య భాగస్వాములలో భారతదేశం ఒకటి. లంక నుండి పెద్ద సంఖ్యలో పర్యాటకులు భారతదేశానికి వస్తుంటారు. భారతదేశం లంకకు ఏటా 5 బిలియన్ డాలర్ల( సుమారు రూ.380,000,000,000) ఎగుమతులు నిర్వహిస్తుంది. ఇది మొత్తం దేశపు ఎగుమతుల్లో 1.3 శాతం.
దేశంలో పర్యాటకం, రియల్ ఎస్టేట్, తయారీ, కమ్యూనికేషన్, పెట్రోలియం రిటైల్ మొదలైన రంగాలలో కూడా భారతదేశం పెట్టుబడులు పెట్టింది. శ్రీలంకలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అతిపెద్ద వనరులలో భారతదేశం ఒకటి. ఇండియాకు చెందిన కొన్ని పెద్ద కంపెనీలు కూడా శ్రీలంకలో పెట్టుబడులు పెట్టాయి.
ఇటీవలి సంవత్సరాలలో శ్రీలంక, చైనా మధ్య సహకారం పెరిగింది. చైనా శ్రీలంకలో అనేక పెద్ద ప్రాజెక్టులలో పెట్టుబడులుపెట్టింది. అయితే తాజాగా శ్రీలంకలో నెలకొన్న సంక్షోభంలో చైనా సాయం కనిపించడం లేదు.

ఫొటో సోర్స్, EUROPANEWSWIRE/GADO/GETTY IMAGES
పాకిస్తాన్ సంక్షోభం- భారత్ పై ప్రభావం
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రధాని నరేంద్ర మోదీపైనా, ఆయన ప్రభుత్వం పైనా ఇటీవల తీవ్ర విమర్శలు చేశారు. కానీ 2021 నుంచి సరిహద్దులో ఉద్రిక్తతల కారణంగా రెండు దేశాల మధ్య సంబంధాలు కనిష్ట స్థాయికి చేరుకున్నాయి.
భారత రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, కశ్మీర్‌లో కాల్పుల విరమణ కోసం పాకిస్తాన్ సైన్యం ఇస్లామాబాద్‌లోని కొత్త ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది.
పాకిస్తాన్ ప్రస్తుతం రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పార్లమెంట్ రద్దు తర్వాత మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలు ఈ చర్యను దేశద్రోహమని ఆరోపించాయి. ''నన్ను పదవి నుంచి తప్పించేందుకు ప్రతిపక్షాలు అమెరికాతో కలిసి కుట్రపన్నాయి'' అని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు.
యుక్రెయిన్ పై రష్యా దాడిని ఇమ్రాన్ ఖాన్ ఖండించలేదు. అయితే యుక్రెయిన్ యుద్ధంలో అమెరికా పక్షం వహించాలని పాక్ సైన్యం కోరుకుంటోంది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ అంశం పాకిస్తాన్, అమెరికా మధ్య సంబంధాలను ప్రభావితం చేయడమే కాకుండా, పాకిస్తాన్ పశ్చిమ దేశాల నుండి దౌత్యపరంగా ఏకాకి అవుతున్నట్లుగా కనిపిస్తోంది.
''పాకిస్తాన్ ను దౌత్యపరంగా ఏకాకిని చేయాల్సిన అవసరం ఇప్పుడు భారతదేశానికి లేదు. పాకిస్తాన్ ఆ పనిని తనంత తానే చేసుకుంది'' అని బీబీసీ హిందీ ట్విటర్ స్పేస్ ప్రోగ్రామ్ విశ్లేషకులు స్వస్తిరావు అన్నారు.
ఇవి కూడా చదవండి:
- డ్రగ్స్ తీసుకుంటే ఏమవుతుంది, ఎందుకు వాటి కోసం కొందరు పిచ్చెక్కిపోతారు?
- ముస్లిం అమ్మాయి కాబట్టి హిందూ ఆలయాల్లో భరతనాట్యం చేయొద్దన్నారు
- యుక్రెయిన్ యుద్ధం: ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బయలుదేరారు... దారిలోనే రష్యా సైనికుల కాల్పుల్లో చనిపోయారు
- పాకిస్తాన్: ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని ఆసిఫ్ అలీ జర్దారీ ఫార్ములా కాపాడగలదా?
- ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 4 నుంచి 26 జిల్లాలు... పునర్విభజనలో 5 ఆసక్తికర అంశాలు
- పాకిస్తాన్: ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని ఆసిఫ్ అలీ జర్దారీ ఫార్ములా కాపాడగలదా?
- సూర్య కాశీభట్ల: నిజజీవితంలోనూ సెరెబ్రల్ పాల్సీ ఉన్న ఈ మహేశ్‌బాబు ఫ్యాన్‌కు బాలీవుడ్ సినిమాలో నటించే అవకాశం ఎలా వచ్చింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













