శ్రీలంక: కేంద్ర మంత్రివర్గం అంతా రాజీనామా చేశాక పరిస్థితి ఎలా ఉంది, ప్రజలు ఏమంటున్నారు?

శ్రీలంక

ఫొటో సోర్స్, Reuters

శ్రీలంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభం తలెత్తడంతో నిరసనలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో ఆదివారం శ్రీలంక కేంద్ర మంత్రివర్గం అంతా రాజీనామా చేసింది. అధ్యక్షుడు గోటాబయ రాజపక్ష సోమవారం నలుగురు కొత్త మంత్రలను నియమించారు. పూర్తి క్యాబినెట్ కొలువుదీరే వరకు పార్లమెంటు కార్యక్రమాలు కొనసాగేలా చూసేందుకు ఈ నియామకాలు జరిపినట్లు ఆయన వివరించారు.

ఆదివారం రాత్రి మొత్తం 26 మంది కేబినెట్‌ మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. కానీ, ప్రధాని మహింద రాజపక్ష, అధ్యక్షుడు గోటాబయ రాజపక్ష రాజీనామా చేయలేదు.

రాజపక్ష కుటుంబం కూడా రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఆదివారం, అనేక మంది నిరసనకారులు కర్ఫ్యూను ఉల్లంఘించి పలు నగరాల్లో వీధుల్లోకి వచ్చారు.

1948లో బ్రిటన్ నుంచి స్వతంత్రం పొందిన తరువాత ఇప్పటివరకు ఈ దేశం ఇంత తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోలేదు.

చమురు దిగుమతులకు వినియోగించే విదేశీ మారకద్రవ్యం క్షీణించడంతో ఈ సంక్షోభం ఏర్పడిందని అంటున్నారు.

దేశంలో కరంట్ కోతలు, ఆహారం, మందులు, చమురు కొరత ఏర్పడడంతో ప్రజాగ్రహం తారాస్థాయికి చేరుకుంది.

శ్రీలంక

ఫొటో సోర్స్, Reuters

రాజీనామాకు కారణం?

విద్యాశాఖ మంత్రి, సభాపక్ష నేత దినేష్ గుణవర్ధనే ఆదివారం విలేఖరులతో మాట్లాడుతూ, కేంద్ర మంత్రులు తమ రాజీనామాను ప్రధానమంత్రి మహింద రాజపక్షకు అందించారని చెప్పారు. ఈ మూకుమ్మడి రాజీనామాలకు కారణాలేమీ తెలుపలేదు.

ప్రధాని సోమవారం తన సోదరుడు, దేశాధ్యక్షుడైన గోటాబయ రాజపక్షను కలవనున్నట్లు ఆయన తెలిపారు.

"దేశంలో పరిస్థితి గురించి వివరంగా చర్చించాం. ప్రస్తుతం నెలకొన్న చమురు, ఇంధన సంక్షోభానికి త్వరలోనే పరిష్కారం వస్తుంది" అని గుణవర్ధనే చెప్పారు.

రాజీనామా చేసిన మంత్రుల్లో ప్రధాని కుమారుడు నమల్ రాజపక్ష కూడా ఉన్నారు.

"నా రాజీనామా గురించి అధ్యక్షుడి సెక్రటరీకి సమాచారం అందించాను. ప్రజలకు, ప్రభుత్వానికి సుస్థిరత సాధించే దిశలో రాష్ట్రపతి, ప్రధాని తీసుకునే నిర్ణయాలకు ఇది సాయపడుతుందని ఆశిస్తున్నా" అంటూ నమల్ ట్వీట్ చేశారు.

ఆదివారం, దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రజలు కర్ఫ్యూను ఉల్లంఘిస్తూ వీధుల్లోకి వచ్చారు.

ప్రజలు రోడ్లు, పార్కులు, రైళ్లు లేదా సముద్ర తీరాలకు వెళ్లకూడదని శ్రీలంక ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ప్రత్యేక అనుమతితో మాత్రమే ఆ ప్రాంతాలకు వెళ్లవచ్చు.

ఇది కాకుండా, ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా వెబ్‌సైట్‌లపై కూడా నిషేధం విధించింది.

దేశంలో సుస్థిరత సాధిస్తామని, ప్రభుత్వ పాలనను బలోపేతం చేస్తామని గత ఎన్నికల్లో వాగ్దానం చేశారు రాజపక్ష. దాంతో, 2019 ఎన్నికల్లో పూర్తి మెజారిటీతో తిరిగి అధికారంలోకి వచ్చారు.

ప్రస్తుత నిరసన ప్రదర్శనలు చూస్తుంటే రాజపక్షకు ప్రజాదరణ గణనీయంగా తగ్గిపోయినట్టు కనిపిస్తోంది.

వీడియో క్యాప్షన్, ‘శ్రీలంకలో ఉంటే బతకలేం.. అందుకే భారత్‌కు వచ్చాం’

దేశంలో పరిస్థితి ఎలా ఉంది?

కొలంబోలో ఉన్న బీబీసీ ప్రతినిధి రజినీ వైద్యనాథన్ ఆదివారం నాడు ప్రతిపక్ష నాయకుడు సజిత్ ప్రేమదాసను కలిశారు.

నగరంలోని ఇండిపెండెన్స్ స్క్వేర్‌ కట్టడంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ప్రేమదాసతో పాటు ఇతర పార్టీ సభ్యులను పోలీసులు అడ్డుకున్నారు.

కర్ఫ్యూ విధించడం, సోషల్ మీడియా నిషేధం నియంతృత్వాన్ని, నిరంకుశ పాలనను తలపిస్తోందని ప్రేమదాస అన్నారు.

కర్ఫ్యూను ఉల్లంఘించి వీధుల్లో నిరసనలకు దిగిన పలువురితో రజని మాట్లాడారు. వారిలో సుచిత్ర ఒకరు. తనకు 15 నెలల కొడుకు ఉన్నాడని చెబుతూ, కరెంటు కోతలతో రోజురోజుకూ ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయో ఆమె వివరించారు.

"కరెంట్ లేకపోతే ఫ్యాన్లు పనిచేయవు. ఈ ఎండలు, ఉక్కపోతతో పిల్లలు పడుకోవట్లేదు. మాకు నిద్ర ఉండట్లేదు" అని సుచిత్ర చెప్పారు. కొలొంబోలో వందలాది విద్యార్థులు కూడా నిరసనలకు దిగారు.

"నా హక్కులు హరిస్తున్నారు. నాకు చాలా కోపంగా ఉంది. అందుకే బయటికొచ్చాను. కర్ఫ్యూ ఎందుకు విధించారు? ఇదా మాకు భద్రత కల్పించడమంటే? ఈ చర్యలకు అర్థం లేదు" అని అంజలి వందుర్గాలా అనే విద్యార్థి అన్నారు.

తొలిసారిగా తాను వీధుల్లోకి వచ్చి నిరసనల్లో పాల్గొంటున్నానని ఫ్రీలాన్స్ అడ్వర్టైజింగ్ కాపీ రైటర్ సత్సర చెప్పారు.

"నేను ఒక ఫ్రీలాన్సర్‌ని. గ్యాస్ లేదు, కరెంటు లేదు. అందువల్ల నేను డబ్బు సంపాదించలేకపోతున్నాను. నేను పూర్తిగా మునిగిపోయాను" అని సత్సర అన్నారు.

వీడియో క్యాప్షన్, శ్రీలంక: ఎమర్జెన్సీ విధించడానికి ముందు ఏం జరిగింది?

ఇబ్బందుల్లో ప్రజలు

చమురు, వంటగ్యాస్ కోసం ప్రజలు పెద్ద పెద్ద క్యూలు కడుతున్నారు. గంటల తరబడి కరంట్ కోతలు ఎదుర్కొంటున్నారు.

సామూహిక నిరసనలు వెల్లువెత్తడంతో శ్రీలంక ప్రభుత్వం దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. దీని కింద, భద్రతా దళాలకు ప్రజలను అరెస్ట్ చేసే విస్తృత అధికారాలు లభిస్తాయి.

జనవరిలో భారతదేశం శ్రీలంకకు కొంత ఆర్థిక సహాయాన్ని అందించింది. అది కొంతవరకు ఉపశమనం కలిగించినప్పటికీ ఆ దేశంలో పరిస్థితులు రానురాను దిగజారిపోయాయి.

ఒకవైపు అధ్యక్షుడు రాజపక్ష రాజీనామా చేయాలనే డిమాండ్ వినిపిస్తుండగా, మరోవైపు ఆల్ పార్టీ క్యాబినెట్ ఏర్పాటు చేయాలనే స్వరం వినిపిస్తోంది.

అయితే, కొత్త మంత్రివర్గంలో చోటు కోరుకోవడం లేదని ప్రధాన ప్రతిపక్షం సూచించింది.

కాగా, ప్రధాని రాజపక్ష తమ ప్రభుత్వ చర్యలను సమర్థించుకున్నారు. ప్రస్తుత ఆర్థిక సంక్షోభానికి విదేశీ మారక ద్రవ్యం తరిగిపోవడం కారణం కాదని, కోవిడ్ మహమ్మారి కారణంగా ఈ పరిస్థితి తలెత్తిందని, ఇది పర్యాటక రంగంపై గణనీయమైన ప్రభావాన్ని చూపించిందని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)