పుడింగ్ మింక్ పబ్‌: హైదరాబాద్‌ పార్టీలో డ్రగ్స్ కలకలం.. ఎవరెవరు ఆ పార్టీలో ఉన్నారు?

హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసు స్టేషన్
    • రచయిత, సురేఖ అబ్బూరి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్ పుడింగ్ మింక్ పబ్‌లో వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం రాత్రి సోదాలు నిర్వహించారు.

తెల్లవారుజామున సుమారు 3 గంటలు దాటిన తర్వాత కూడా పబ్ నడుపుతుండటంతో అక్కడున్న దాదాపు 144 మందిని అదుపులోకి తీసుకున్నారు.

అయితే, పార్టీలో పాల్గొన్న కొంతమంది డ్రగ్స్ కూడా తీసుకున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో హోటల్ సీసీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు.

5 చిన్న ప్యాకెట్ల కొకైన్ వైట్ పౌడర్ తమకు లభ్యమైందని పోలీసులు వెల్లడించారు. పబ్‌కి మేనేజర్ అయిన అనిల్ కుమార్ బార్ కౌంటర్ దగ్గర ఉన్నారని, అతని చేతుల్లో ఈ ప్లాస్టిక్ బ్యాగులు, స్ట్రాలు దొరికాయని పోలీసులు వివరించారు.

పబ్ యాజమాన్యం కస్టమర్స్ కోసం ఒక ప్రత్యేకమైన యాప్ తయారుచేసిందని పోలీసులు వెల్లడించారు. ఈ యాప్ ద్వారా కస్టమర్లకి కోడ్ ఇస్తున్నారని, ఆ కోడ్ సాయంతోనే లోపలకు అనుమతిస్తున్నారు అని పేర్కొన్నారు.

వీడియో క్యాప్షన్, సినిమా, డ్రగ్స్, సెక్స్, మీడియా - వీక్లీ షో విత్ జీఎస్

మీడియాలో ప్రముఖుల పేర్లు

అయితే, ఈ వార్తకు సంబంధించి మీడియాలో కొందరు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకుల పిల్లల పేర్లు చక్కర్లు కొడుతున్నాయి .

మరోవైపు రాడిసన్ హోటల్‌లో పోలీసులు తనిఖీలు నిర్వహించినప్పుడు అక్కడ ఉన్నవారి పేర్ల జాబితా ఒకటి కూడా బయటకు వచ్చింది. అయితే దానిని ఎవరు లీక్ చేశారు అన్న దానిపై కూడా సందేహం ఉంది.

నటుడు నాగబాబు కుమార్తె నీహారిక, కాంగ్రెస్ నేత అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు, సింగర్, బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్ కూడా అక్కడ ఉన్నారు అని ప్రచారం జరిగింది.

దానిపై నాగబాబు ఒక వీడియో విడుదల చేస్తూ.. తన కూతురు నీహారిక అక్కడ ఉన్న మాట వాస్తవమే కానీ, తను ఎలాంటి తప్పు చేయలేదు అని నాగబాబు వివరణ ఇచ్చారు. అలానే పోలీసులు కూడా నీహారిక తప్పు ఏమి లేదు అని చెప్పారని నాగబాబు ఆ వీడియోలో అన్నారు.

మరో వైపు కాంగ్రెస్ నేత అంజన్ కుమార్ యాదవ్ కూడా ఈ విషయం పై స్పందిస్తూ.. "నా కొడుకు బర్త్ డే పార్టీకి వెళ్లాడు. ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్తే అభాండాలు వేస్తున్నారు. నిజానిజాలు తేల్చాలి. మా కుటుంబం అలాంటిది కాదు. సిటీలో ఉన్న అన్ని పబ్‌లను క్లోజ్ చేయాలి. అసలు మద్యపాన నిషేధం చేయాలి. డ్రగ్స్ ఎలా వస్తున్నాయో విచారణ చేయాలి" అని చెప్పారు.

పుడింగ్ మింక్ పబ్‌

ఫొటో సోర్స్, UGC

''గల్లా అశోక్‌కు దీనితో సంబంధం లేదు''

మరోవైపు, గల్లా అశోక్‌కు ఈ కేసుకు ఎలాంటి సంబంధంలేదని ఆయన కుటుంబం ఓ ప్రకటన విడుదల చేసింది. "నిన్న రాత్రి హైదరాబాద్‌లోని ఓ పబ్ పై పోలీసులు జరిపిన రైడ్‌లో గల్లా అశోక్ పేరు కూడా జత చేసి కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేస్తున్నాయి. ఈ వ్యవహారంలో గల్లా అశోక్‌కి ఎలాంటి సంబంధం లేదు. దయచేసి ఇలాంటి నిరాధారమైన వార్తలని మీడియాలో ప్రసారం చెయొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం" అని చెప్పారు .

మీడియాలో తన పేరు ప్రచారం చేస్తున్నారని నటి హేమ ఆవేదన వ్యక్తం చేశారు.

వీడియో క్యాప్షన్, పంజాబ్‌లో డ్రగ్స్ సమస్యకు ఫుట్‌బాల్‌తో సమాధానం

సీఐపై వేటు

మరోవైపు డ్రగ్స్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న కారణంగా బంజారాహిల్స్ సీఐ శివచంద్రను సస్పెండ్ చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్.. బంజారాహిల్స్ సీఐగా నాగేశ్వర్ రావుని నియమించారు . డ్రగ్ ఆపరేషన్‌లో, టాస్క్ ఫోర్స్‌లో ఆరు ఏళ్లుగా నాగేశ్వర్ రావు పనిచేస్తున్నారు.

అలానే పోలీసులు స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌ను ల్యాబ్‌కు పంపారు. వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సాంకేతిక ఆధారాలను కూడా సేకరిస్తున్నారు.

ఈ కేసును వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్, బంజారాహిల్స్ పోలీసులతో కలిసి నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేపడుతున్నారు.

అసలు ఎవరెవరు ఆ సమయంలో పబ్‌లో ఉన్నారు? తెల్లవారుజామున వరకు పబ్ నడిపే పర్మిషన్ ఉందా? డ్రగ్స్ ఎక్కడ నుంచి వచ్చాయి? వీటిని ఎవరు తీసుకున్నారు? లాంటి ప్రశ్నలకు ఇంకా కచ్చితమైన సమాచారం రావాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)