పశువుల పాకల్లోకి టెక్నాలజీ.. ఆవు పాల దిగుబడిని ఈ కృత్రిమ మేథ ఎలా పెంచుతుంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, క్రిస్ బారన్యూక్
- హోదా, బిజినెస్ టెక్నాలజీ రిపోర్టర్
పాలు తీసే షెడ్డు నుంచి బయటికొచ్చిన 2073వ నంబరు ఆవు అక్కడే ఉన్న ఒక కెమెరా ముందు వెళ్తున్నప్పుడు ఆ ఆవును గుర్తుపట్టిన కంప్యూటర్ దాని ప్రతి అడుగునీ గమనిస్తోంది.
అయితే, ఆ కెమెరాలో కొన్ని సెకన్లే కనిపించిన ఆవు నడకతీరులో ఏదో సరిగా లేదు. అయితే, ఆ ఆవు దానిని దాచడానికి ప్రయత్నిస్తోంది.
దాని నడకతీరులో తేడా ఉన్నట్లు బహుశా ఎవ్వరూ గుర్తించలేకపోవచ్చు కానీ, దానిని మెషిన్ కనిపెట్టింది.
"నిజంగా, ఆవులు నిద్రపోతున్నపుడు, అవి తింటున్నపుడు వాటిని మనుషులు చూసుకునే విధానాన్ని మేం పూర్తిగా మార్చాలనుకుంటున్నాం" అని కేటిల్ ఐ సంస్థ కో ఫౌండర్ టెర్రీ కేనింగ్ అంటున్నారు.
ఆయన సంస్థ రూపొందించిన ఒక టెక్నాలజీ ద్వారా ఆటోమేటిగ్గా పశువులు కుంటబోయేది ముందే గుర్తించగలుగుతున్నారు. ప్రస్తుతానికి ఈ టెక్నాలజీ పాల షెడ్డుకే పరిమితమైనా, దీనిని ఇప్పటికే కొన్ని డెయిరీ ఫాంలలో పరిచయం చేశారు. అమెరికా, బ్రిటన్లో దాదాపు 20 వేల ఆవులను ఈ టెక్నాలజీ ద్వారా గమనిస్తున్నారు.
పొలాల్లో రకరకాల కారణాలతో ఆటోమేషన్‌ను ప్రవేశపెడుతున్నారు. కూలీల కొరతను తీర్చడం వాటిలో ముఖ్యమైనది. అయితే ఈ కొత్త టెక్నాలజీ పశువుల సంక్షేమం మెరుగుపరిచి, ఉద్గారాలను కూడా తగ్గిస్తోందని కేనింగ్ చెబుతున్నారు.

ఫొటో సోర్స్, CATTLEEYE
"ఒక ఫాంలో ఆవుల కుంటితనాన్ని పది శాతమైనా తగ్గించగల్గితే, మా లెక్కల ప్రకారం ఏడాదికి ఒక ఆవు నుంచి అర టన్ను కార్బన్ ఉద్గారాలను తగ్గించవచ్చు" అంటారు కేనింగ్ వివరించారు.
గాయాలు, ఇన్ఫెక్షన్ల వల్ల ఆవులకు కుంటితనం వస్తే, వాటికి చాలా నొప్పి ఉండే అవకాశం ఉంది. అలాంటి ఆవులు తక్కువ పాలు ఇస్తాయి. వాటికి చికిత్స అందకపోతే చివరకు ఎందుకూ పనికిరానివని ఆ ఆవులను పక్కన పెట్టేస్తారు.
అయితే కేటిల్ ఐ టెక్నాలజీ ఎంత కచ్చితత్వంతో పనిచేయగలదో పరిశీలించేందుకు లివర్ పూల్ యూనివర్సిటీ పరిశోధకులు దీనిని మూడు పశువుల పాకల్లో పరీక్షిస్తున్నారు.
కేటిల్ ఐ టెక్నాలజీ సాయంతో పశువుల పాకల్లో హై లెవెల్ ఆటోమేటెడ్ సర్వైలెన్స్ చేపడుతున్నారు. ఆవుల ఆరోగ్య స్థితి ట్రాక్ చేయడానికి మూకాల్ సెన్సర్ల లాంటి ఇతర పరికరాలు ఉపయోగిస్తున్నారు.
వీటిని ఆవు తోకకు పెట్టి పట్టీ వేస్తారు. అవి ఆవులు దూడకు జన్మనివ్వబోతున్న సమయంలో దాని గురించి సూచిస్తాయి. ఆవు తోకలో కదలికలను బట్టి సెన్సర్లు ఆ లక్షణాలను గుర్తిస్తాయి.

ఫొటో సోర్స్, CATTLEEYE
అయితే ఇంకా చాలా ఫామ్స్ ఈ టెక్నాలజీకి అందిపుచ్చుకోవాల్సి ఉంది. గ్రామీణ విస్కాన్సిన్ ప్రాంతంలో డాక్టర్ సారా లాయిడ్, తన భర్తతో కలిసి 400 ఆవులున్న డెయిరీ ఫాం నిర్వహిస్తున్నారు. ఇక్కడ వారు ఉత్పత్తి చేసే పాలను జున్ను తయారీకి ఉపయోగిస్తున్నారు.
"మాకొచ్చే పాల ధరతో ఈ టెక్నాలజీ ఖర్చులను మే భరించలేం. నా భర్త నెల్సన్ మెషిన్లపై ఆధారపడడం కంటే, కష్టాన్నే నమ్ముకుని పనిచేయాలనుకుంటారు. టెక్నాలజీకి నెల్సన్ వ్యతిరేకం కాదు. కానీ, ఏఐ ఆధారిత సిస్టమ్స్ మీద పెట్టుబడి పెట్టడం వల్ల లాభాలుంటాయని మాకు అనిపించడం లేదు" అని ఆమె చెప్పారు.
అయితే, వీరికి భిన్నంగా ఆలోచించి పశువుల పాకల్లో ఆర్టిఫీషియన్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీకి ఎంత ప్రాధాన్యం ఉందో అర్థం చేసుకుని దాన్ని ఉపయోగించిన వారు కూడా చాలా మందే ఉన్నారు.

ఫొటో సోర్స్, SARAH LLOYD
అయితే నడకలో కుంటడం లాంటి లోపాన్ని దాచడానికే ఆవులు సహజంగా ప్రయత్నిస్తాయని, అవి అలా కుంటడం తొలి దశల్లోనే టెక్నాలజీ సాయంతో గుర్తించగలిగితే పాడి రైతులకు ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
మరోవైపు RSPCA వంటి జంతువుల చారిటీ ఈ పశువుల మానిటరింగ్ టెక్నాలజీని స్వాగతిస్తోంది. పశువులు కుంటడం మనుషులు ముందే గుర్తించడం చాలా కష్టం అని, అందుకే ఇలాంటి సిస్టమ్స్ ద్వారా అవి నడిచే పద్ధతిని మరింత కచ్చితత్వంతో గుర్తించగలమని చెప్పింది.
కానీ, ఇవి ఆధునిక సాంకేతికతలు కావడం వల్ల వాటి ప్రామాణికత ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంటుందని, ప్రామాణికమైన పునరుత్పాదక పద్ధతులను ఉపయోగించి సాధారణ మొబిలిటీ స్కోరింగ్‌ను రీప్లేస్ చేయలేమని ఈ సంస్థ చెబుతోంది.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మన పశువుల పాకల్లో కీలక పాత్ర పోషిస్తుంది. కానీ, అది ఎంతవరకు, ఇది నిజంగా జంతువుల పరిస్థితిని మెరుగుపరుస్తుందా అనేది ఇంక స్పష్టం కావడం లేదు.
"నేను రోబోటిక్స్‌కు మారిన ఎన్నో గోదాములు, డైరీ ఫాంలలో ఉన్నాను. అక్కడ ఆవులు ఫ్రెండ్లీగా ఉన్నాయి. మనం వాటితో కలిసి నడవచ్చు. అవి ఉద్వేగానికి గురవడం అస్సలు ఉండదు" అని నార్త్ కరోలినా స్టేట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జాక్ బ్రిట్ చెప్పారు. చాలా ఫార్మ్ టెక్ కంపెనీలు ఆయన్ను సంప్రదిస్తుంటాయి.

ఫొటో సోర్స్, THE GRANT COMPANY
అయితే, వీటిలో అన్నీ హైటెక్ కావు. పాలు తీసే షెడ్ నుంచి ఆవులు వచ్చిపోయేటపుడు అవి నడిచే కాంక్రీట్ మీద గాడులు పెట్టడం ద్వారా వాటి నడకలో స్థిరత్వం పెంచవచ్చని, అవి కుంటే అవకాశాలను తగ్గించవచ్చని ఆయన చెప్పారు.
అయితే మరో 50 ఏళ్లలో పశువు పాకల్లో మనుషుల అవసరం 90 శాతం తగ్గిపోతుందని ఆయన అంచనా వేస్తున్నారు.
కానీ, దీనిని డాక్టర్ లాయిడ్ అంగీకరించడం లేదు. పశువుల పాకల్లో పనిచేయడానికి మనుషులు దొరడం కష్టమవుతోందని ఆమె అంగీకరించినా, మెషిన్లు ఉపయోగించనని ఆమె చెబుతున్నారు.
"నా ఫామ్‌లో మెషిన్లు ఉపయోగించడానికి బదులు, అక్కడ పనిచేయడానికి, దాని ద్వారా జీవనోపాధి పొందడానికి నేను మరింత మంది మనుషులను పెట్టుకోడానికే ప్రయత్నిస్తా" అన్నారు.
"మన సమాజంలో ఆర్థిక జీవితం, సామాజిక జీవితం కోసం అది చాలా ముఖ్యం" అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













