పాకిస్తాన్ ముస్లిం మత బోధకుడు డాక్టర్ ఇస్రార్ ప్రసంగాల వల్లే యూదులను నిర్బంధించారా... యూట్యూబ్ ఆయన చానెల్‌ను ఎందుకు తొలగించింది?

డాక్టర్ ఇస్రార్
    • రచయిత, రియాజ్ సుహైల్
    • హోదా, బీబీసీ ఉర్దూ.కామ్, కరాచీ

ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్... తంజీమ్-ఎ-ఇస్లామీ సంస్థ వ్యవస్థాపకుడు, ఇస్లామీ స్కాలర్ దివంగత ఇస్రార్ అహ్మద్‌కు చెందిన చానెల్‌ను ఆపేసింది.

విద్వేష ప్రసంగాలకు సంబంధించిన పాలసీని ఉల్లంఘించినందుకు గానూ డాక్టర్ ఇస్రార్ అహ్మద్ చానెళ్లను తొలిగించినట్లు యూదులకు చెందిన వార పత్రిక 'ద జ్యూస్ క్రానికల్'కు యూట్యూబ్ చెప్పింది.

'ద జ్యూస్ క్రానికల్' ప్రకారం, విద్వేషాలను రెచ్చగొట్టే మెటీరియల్‌ గురించి గత జూన్ నెల నుంచి యూట్యూబ్ వెతుకుతోంది. అంతకంటే ముందు అలాంటి చానెళ్లను తొలగించడంలో విఫలమవ్వడమే కాకుండా కనీసం వాటి గురించి కూడా యూట్యూబ్ స్పందించలేదని ఆ మ్యాగజీన్ పేర్కొంది.

అమెరికాలోని యూదుల ప్రార్థనా స్థలాల్లో ప్రజలను బందీలుగా పట్టుకున్ననిందితుడు, డాక్టర్ ఇస్రార్ అహ్మద్ వీడియోలను చూసేవారని 'ద జ్యూస్ క్రానికల్' చెప్పింది.

గత ఏడాది జనవరి నెలలో మలిక్ ఫైజల్ అక్రమ్ అనే వ్యక్తి, టెక్సాస్‌ ప్రావిన్సు కోలివల్ ప్రాంతంలోని యూదుల ప్రార్థనా స్థలం నుంచి నలుగురు వ్యక్తులను నిర్బంధించారు. 10 గంటల తర్వాత ఎఫ్‌బీఐ పోలీసులు ఆయనను కాల్చివేసి బంధీలను సురక్షితంగా కాపాడారు.

మలిక్ ఫైజల్ సంబంధీకులు బ్రిటన్‌లోని బ్లాక్‌బర్న్ నగరానికి చెందినవారు. మలిక్ ఫైజల్, యూట్యూబ్‌లో డాక్టర్ ఇస్రార్ అహ్మద్ వీడియోలను చూసేవారని ఆయన కుటుంబీకులు చెప్పినట్లు 'ద జ్యూస్ క్రానికల్' తెలిపింది.

అమెరికాలో నలుగురు వ్యక్తులను మలిక్ ఫైజల్ అక్రమ్ నిర్బంధించారు
ఫొటో క్యాప్షన్, అమెరికాలో నలుగురు వ్యక్తులను మలిక్ ఫైజల్ అక్రమ్ నిర్బంధించారు

'ఈ నిషేధం ఇస్లామోఫోబియాను ప్రతిబింబిస్తోంది'

తంజీమ్-ఎ-ఇస్లామీ సంస్థ అధిపతి షుజావుద్దీన్ షేక్, చానెళ్ల తొలిగింపు గురించి మాట్లాడారు. డాక్టర్ ఇస్రార్ చానెళ్లపై నిషేధం వేయడం అంటే ఇస్లామోఫోబియా ఏ స్థాయికి చేరిందో అర్థం అవుతుంది అని అన్నారు. ''లక్షలాది మంది సబ్‌స్క్రైబర్లు, కోట్లాది మంది వీక్షకులు ఉన్న ప్రపంచ ప్రఖ్యాత చానెల్ అది. ఇస్లాం వ్యతిరేకుల దృష్టి ఆ చానెల్‌పై పడింది'' అని వ్యాఖ్యానించారు.

డాక్టర్ ఇస్రార్ చానెల్‌లో ఆసిఫ్ హమీద్ ఒక భాగస్వామి. ఆయన బీబీసీతో మాట్లాడారు. ''పబ్జీ గేమ్ చూసి బంధువులను చంపితే ఆ నేరాన్ని పబ్జీ గేమ్ తయారీదారులపై వేసినట్లుంది. హాలీవుడ్ సినిమా చూసి ఏదైనా చేస్తే, దాన్ని సినిమా తీసినవారికి ఆపాదించినట్లుగా కనబడుతోంది'' అని అన్నారు.

''డాక్టర్ ఇస్రార్ ప్రసంగాలు ఇప్పటివి కాదు, అవి చాలా ఏళ్ల నాటివి. ఆయన ఖురాన్, హదీస్ గురించి మాట్లాడేవారు. ఖురాన్‌లో పేర్కొన్న యూదుల గురించి చెప్పేవారు. ఆయన ఎప్పుడూ ఎవరినీ తప్పుదారి పట్టించేలా మాట్లాడలేదు. మా నిరసస కూడా శాంతిపూర్వకంగానే ఉంటుంది. చట్టాన్ని చేతిలోకి తీసుకునే ప్రతి చర్యను తంజీమ్-ఎ-ఇస్లామీ విమర్శిస్తుంది" అని ఆయన అన్నారు.

రంజాన్ సమయంలో డాక్టర్ ఇస్రార్ ప్రసంగాలను కేవలం పాకిస్తాన్‌లో మాత్రమే కాకుండా మొత్తం ప్రపంచం అంతటా వింటారని చెబుతున్న ఆసిఫ్, "ఇదే నెలలో చానెల్‌ను నిషేధించడం ఇస్లాంపై శత్రుత్వానికి నిదర్శనం. అతని సోషల్ మీడియా ఒక విభిన్న అభిప్రాయాల వేదిక. అందులో ఇస్లాంకు వ్యతిరేక మెటీరియల్ కూడా ఉంది. దానికి వ్యతిరేకంగా ఏమైనా చర్యలు తీసుకున్నారా?'' అని ప్రశ్నించారు.

యూట్యూబ్‌కు ఒక విధానం ఉందని, దానితో సంప్రదింపులు జరుపుతున్నామని ఆసిఫ్ హమీద్ చెప్పారు. 'మా వాదనలు మేం వినిపిస్తున్నాం. ఒకవేళ వారు చానెల్‌ను పునరుద్ధరించకపోతే, న్యాయ సహాయం తీసుకుంటాం'' అని ఆయన తెలిపారు.

యూట్యూబ్

ఫొటో సోర్స్, SOPA IMAGES

డాక్టర్ ఇస్రార్ అహ్మద్ ఎవరు?

డాక్టర్ ఇస్రార్ అహ్మద్, జమాత్-ఎ-ఇస్లామీ విద్యార్థి సంస్థతో తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఆ తర్వాత మత బోధకునిగా ఎదిగారు. భారత్‌లోని హరియాణా రాష్ట్రంలో 1932 ఏప్రిల్ 26న ఆయన జన్మించారు.

1954లో లాహోర్‌లోని కింగ్ ఎడ్వర్డ్ మెడికల్ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1965లో జామియా కరాచీ నుంచి ఇస్లామిక్ స్టడీస్ విభాగంలో మాస్టర్స్ చదివారు.

తంజీమ్-ఎ-ఇస్లామీ సంస్థ ప్రకారం, ఆయన విద్యార్థిగా ఉన్నప్పుడు అల్లామా ఇక్బాల్, మౌలానా అబుల్ ఆలా మౌదుదీల నుంచి ప్రేరణ పొందారు. కొంతకాలం ముస్లిం స్టూడెంట్స్ ఫెడరేషన్‌ కోసం పనిచేశారు. పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత ఇస్లామిక్ జమీయత్ తల్బా, జమాత్-ఎ-ఇస్లామీలలో చేరారు.

జమాత్-ఎ-ఇస్లామీ సంస్థ ఎన్నికల రాజకీయాలు ప్రారంభించిన తర్వాత డాక్టర్ ఇస్రార్ అహ్మద్ దీనికి వ్యతిరేక అభిప్రాయాన్ని వినిపించారు. దాన్నుంచి బయటకు వచ్చారు. తర్వాత మిత్రులతో కలిసి తంజీమ్-ఎ-ఇస్లామీ సంస్థను స్థాపించారు.

1978లో పాకిస్తాన్ టెలివిజన్‌లోఆయన మతపరమైన కార్యక్రమాన్ని ప్రారంభించారు. తర్వాత ప్రైవేట్ టీవీ చానెళ్లు రావడంతో ఖురాన్ టీవీతో జతకట్టారు. 1981లో ఆయనకు పౌర పురస్కారమైన 'తమ్గా-ఎ-ఇంతియాజ్' అవార్డు లభించింది. 2002లో తంజీమ్-ఎ-ఇస్లామీ సంస్థ నాయకత్వాన్ని వదిలిపెట్టారు.

2010 ఏప్రిల్‌లో ఆయన మరణించారు.

డాక్టర్ ఇస్రార్

ఫొటో సోర్స్, DRISRAROFFICIAL

సామాజిక మాధ్యమాల్లో నిరసనలు

డాక్టర్ ఇస్రార్ అహ్మద్ యూట్యూబ్ చానెల్ ఆగిపోవడం పట్ల ట్విట్టర్‌లో 'అహ్మద్ చానెల్‌ను పునరుద్ధరించాలి', 'ఇస్లామోఫోబియా' అనే పదాలు ట్రెండ్ అవుతున్నాయి. ట్వీట్లలో యూట్యూబ్‌ను ట్యాగ్ చేస్తూ చానెల్‌ను పునరుద్ధరించండి అంటూ కోరుతున్నారు.

ఇంజినీర్ హరూన్ నజీర్ అనే పేరున్న ఖాతాదారుడు... ''ఎంత సిగ్గుమాలిన చర్య. ఇస్లామోఫోబియాకు ఇది నిజ రూపం'' అంటూ ట్వీట్ చేశారు.

జవ్వాద్ ఖాన్ అనే మరో వ్యక్తి ఇలా రాశారు. ''రంజాన్‌లో ప్రతీ ఒక్కరూ ఆయన గొంతు వినాలి అనుకుంటారు. డాక్టర్ ఇస్రార్ యూట్యూబ్ చానెల్‌ను పునరుద్ధరించండి'' అని కోరారు.

''29 లక్షల సబ్‌స్క్రైబర్లు ఉన్న డాక్టర్ ఇస్రార్ అహ్మద్ చానెల్‌ను యూట్యూబ్ నిషేధించింది. ఆయన ఒక మితవాది, అద్భుతమైన పండితుడు. ఆయన బోధనలను లక్షలాది మంది వింటారు. వీలైనంత త్వరగా యూట్యూబ్ ఆయన చానెల్‌ను పునరుద్ధరించాలి'' అని అసద్ సోలంగీ అనే యూజర్ ట్వీట్ చేశారు.

మొహమ్మద్ ఎహ్‌సాన్ రజా అనే వ్యక్తి కూడా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ''డాక్టర్ ఇస్రార్ అహ్మద్ ఒక మహాజ్ఞాని. నేను ఆయన ఉపన్యాసాలు విన్నప్పుడల్లా ప్రార్థన చేస్తాను. కేవలం ఒక్క నిమిషం వీడియోలోనే ఎంతో ఆధ్యాత్మికత ఉంటుంది'' అని రజా రాశారు.

వీడియో క్యాప్షన్, ఓఐసీలో భారత్ సభ్యత్వానికి పాకిస్తాన్ ఎందుకు అభ్యంతరం చెప్తోంది

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)