పాకిస్తాన్: ‘కలలో దైవ దూషణ చేసిందంటూ యువతి గొంతు కోసి చంపేశారు’

దైవ దూషణ పేరుతో పాకిస్తాన్‌లో మహిళ హత్య

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అజీజుల్లా ఖాన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

గమనిక: ఈ కథనంలో మీ మనసును కలవరపరిచే విషయాలు ఉండొచ్చు.

పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సులోని పశ్చిమ జిల్లా డేరా ఇస్మాయిల్ ఖాన్‌ పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం, దైవ దూషణ పేరుతో ముగ్గురు మహిళలు ఒక యువ మహిళా టీచర్‌ను హత్య చేశారు. మదర్సా తలుపుల వెనుక దాక్కుని ఆమెపై దాడి చేసి హత్యకు పాల్పడ్డారు.

తన కలలో దైవ దూషణ చేసిందని ఆ యువతిపై కోపం పెంచుకున్న ఓ మహిళ, తన బంధువులైన ముగ్గురు మహిళల చేత ఈ హత్య చేయించినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు చెప్పారు.

ఈ సంఘటన మంగళవారం ఉదయం డేరా ఇస్మాయిల్ ఖాన్‌లోని అంజుమాబాద్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు ఆ ముగ్గురు మహిళా నిందితులను అరెస్టు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలి మేనమామ ఫిర్యాదు మేరకు నమోదైన కేసు ప్రాథమిక సమాచారం ప్రకారం మంగళవారం ఉదయం 7 గంటలకు ఈ హత్య జరిగింది.

బాధితురాలు దైవ దూషణకు పాల్పడినట్లు ఓ మహిళ కలగన్నారని, ఆ మహిళే తమతో ఈ హత్య చేయించినట్లు నిందితులు ప్రాథమిక విచారణలో చెప్పారని డీపీఓ ఇస్లాంఖాన్ తెలిపారు.

''ఈ ఘటన నిజంగానే కలలో దైవ దూషణ కారణంగా జరిగిందా లేక మరేదైనా కారణంతో జరిగిందా అనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నాం'' అని ఇస్లాంఖాన్ వెల్లడించారు.

వీడియో క్యాప్షన్, పాకిస్తాన్‌లో కొన్నేళ్లలో పార్శీలంటూ ఎవరూ మిగలరా?

'మదర్సా గేటు పక్కన ఒంటినిండా రక్తంతో నా మేనకోడలు కనిపించింది'

''నాకు ఈ సమాచారం అందిన వెంటనే అక్కడికి వెళ్లాను. మదర్సా గేటు పక్కన ఒంటినిండా రక్తంతో నా మేనకోడలు కనిపించింది. ఆమెను గొంతు కోసి చంపారు'' అని బాధితురాలి మేనమామ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పారు.

''నా మేనకోడలు ఎప్పటిలాగే రిక్షాలో మదర్సాకు చేరుకుంది. అప్పటికే మదర్సా యూనిఫాంలో ఉన్న కొందరు మహిళలు పదునైన ఆయుధాలతో నా మేనకోడలిపై దాడి చేసి చంపినట్లు తెలిసింది'' అని ఆయన వెల్లడించారు. ఈ ఘటనకు ప్రత్యక్షసాక్షులు కూడా ఉన్నారని ఆయన అన్నారు.

పాకిస్తాన్

ఫొటో సోర్స్, Getty Images

బాధితురాలికి, నిందితులకు శత్రుత్వం ఉన్నట్లు తమకు ఎలాంటి సమాచారం లేదని చనిపోయిన మహిళ మేనమామ చెప్పినట్లు పోలీసులు చెప్పారు. బాధితురాలి తండ్రి, సోదరుడు విదేశాల్లో ఉంటున్నారని, అందుకే ఆమె మామ తమకు ఫిర్యాదు చేశారని పోలీసు అధికారులు బీబీసీకి తెలిపారు.

చనిపోయిన యువతి ఇక్కడ రెండేళ్ల నుంచి టీచర్‌గా పని చేస్తున్నారని మదర్సాకు మేనేజర్‌గా పని చేస్తున్న మౌలానా షఫీవుల్లా బీబీసీతో చెప్పారు. నిందితులు మరో మదర్సా విద్యార్థులు, ఉపాధ్యాయులేనని మౌలానా షఫీవుల్లా పేర్కొన్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుల్లో ఇద్దరు అక్కచెల్లెళ్లు కాగా, మూడో వ్యక్తి వారి బంధువు. ముగ్గురిలో ఒకరు టీచర్‌గా పని చేస్తున్నారు.

ఇస్లాం మతం

ఫొటో సోర్స్, Getty Images

హత్యకు మతం రంగు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ హత్యకు దైవదూషణ కారణంగా చెబుతున్నారు. అయితే, దైవదూషణను ధృవీకరించడానికి ప్రత్యక్షసాక్షులు ఎవరూ లేరు. దైవదూషణ వాదనను మదర్సా మేనేజర్ మౌలానా షఫీయుల్లా ఖండించారు.

డేరా ఇస్మాయిల్ ఖాన్ నగరం, దాని పరిసర ప్రాంతాల్లో అనేకసార్లు హింసాత్మక ఘటనలు జరిగాయి. నగరంలో కొంతకాలంగా టార్గెట్‌ హత్య ఘటనలు కూడా ఎక్కువయ్యాయి. ఈ ఘటనకు ఒక రోజు ముందు, కులాచి ప్రాంతంలో ఒక పోలీసు అధికారిని ఆయన ఇంటి దగ్గరే కాల్చిచంపారని షఫియుల్లా చెప్పారు.

వీడియో క్యాప్షన్, పాకిస్తాన్‌లో హిందూ యువతుల బలవంతపు మతమార్పిడి

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)