ఆంధ్రప్రదేశ్: వైఎస్ జగన్ మద్యం అమ్మకాలపై ఎప్పుడేమన్నారు?

ఫొటో సోర్స్, APCM/FB
- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగారెడ్డి గూడెంలో సంభవించిన వరుస మరణాలతో ఆంధ్రప్రదేశ్ రాజకీయం కల్తీ సారా, మద్యం అమ్మకాల చుట్టూ తిరుగుతోంది. కొంతకాలంగా మద్యం నియంత్రణ, అమ్మకాలు, నిషేధం అనే అంశాలపై అధికార, ప్రతిపక్షాల మధ్య వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఈ వాదనలకు ఇటీవల అసెంబ్లీ కూడా వేదికైంది.
దేశంలో ఎక్కడా దొరకని బ్రాండ్లను ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ నాయకులే తయారు చేస్తూ, రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్ గా మార్చేశారని టీడీపీ ఆరోపిస్తోంది.
మద్యంపై వచ్చే ఆదాయన్ని క్రమంగా తగ్గిస్తూ, మద్య నిషేధాన్ని అమలు చేస్తామని చెప్పిన వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం, మద్యం ఆదాయాన్ని విపరీతంగా పెంచిందని ఆరోపించింది. ఇది 2014లో రూ.11 వేల కోట్లు ఉంటే 2022 మార్చి నాటికి రూ. 24 వేల కోట్లకు చేరిందని విమర్శించింది.
మద్యం అమ్మకాలు, అనుమతులు, వీటికి కారకులు ఎవరో తెలుసునంటూ ముఖ్యమంత్రి జగన్ మార్చి 23న అసెంబ్లీలో టీడీపీపై విమర్శలు చేశారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తగ్గించేందుకే మద్యంపై ప్రతిపక్షం అనవసర ప్రచారం చేస్తోందని ఆయన విమర్శించారు.
మద్యంపై వచ్చిన ఆదాయాన్ని తగ్గేలా చేసి, రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు గండి కొట్టాలని చూస్తోందని సీఎం వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, I & PR
ఈ నేపథ్యంలో ఏపీలో మద్యం అమ్మకాలు, పాలక ప్రతిపక్షాల పరస్పర విమర్శలపై చర్చ జరుగుతోంది. మద్యంపై జగన్ వివిధ సందర్భాల్లో చేసిన వ్యాఖ్యల వీడియోలు మళ్లీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సందర్భంగా, జగన్ ప్రతిపక్ష నేతగా, ముఖ్యమంత్రిగా మద్య నిషేధంపై ఎప్పుడు ఏమన్నారో ఈ కథనంలో చూద్దాం.
1. 2015 డిసెంబర్ 8వ తేదీన విజయవాడ కృష్ణలంక బార్లో కల్తీ మద్యం తాగిన ఘటనలో ఆరుగురు మరణించారు, పదుల సంఖ్యలో తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. ప్రతిపక్షనేత హోదాలో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని అప్పటి ప్రతిపక్ష నాయకుడు జగన్ పరామర్శించి మీడియాతో మాట్లాడారు.
"చంద్రబాబు నాయుడుగారి ప్రభుత్వం పోతుంది. రెండేళ్లకో, మూడేళ్లకో మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ప్రజల ప్రభుత్వం ముందుకు వస్తుంది. మన ప్రభుత్వంలో అయితే పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని గట్టిగా చెప్తా ఉన్నాను. మద్యం తాగాలంటే ఫైవ్ స్టార్ హోటల్ మాత్రం పర్మిషన్ ఇస్తే పర్వాలేదు. బాగా డబ్బులున్నవాడో, సూటుబూటు వేసుకున్నవాడే ఆ ఫైవ్ స్టార్ హోటళ్లో తాగి పడిపోయినా ఇబ్బదేంలే. కానీ ఇంత విచ్చలవిడిగా మద్యాన్ని తాగిస్తే... పిల్లలంతా చదువుకుంటా ఉన్నారు. పిల్లల చదువులూ దారి తప్పుతున్నాయి. పదో తరగతి పాసవతానే పిల్లోడు మద్యం షాపు వైపు చూస్తా ఉన్నాడు. ఒక పక్క ఊర్లో పిల్లలు చదువుకుంటా ఉన్నారు, ఎదురుగా మద్యం షాపు కనిపిస్తా ఉంది. రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు. రాష్ట్రంలో ఫైవ్ స్టార్స్ హాటల్స్ లో తప్ప మిగతా చోట్ల ఎక్కడ కూడా మద్యం పూర్తిగా లేకుండా చేస్తామని గట్టిగా చెప్తావున్నా" అని అన్నారు. ఆ వ్యాఖ్యలను ఈ వీడియోలో చూడవచ్చు.
2. జగన్ నాయకత్వంలోని వైసీపీ 2019 సాధారణ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. ఆయన 2019 మే 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతకు ముందు తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానిని, ఇతర ప్రముఖులను ఆహ్వానించేందుకు దిల్లీ వెళ్లారు. ఆ సందర్భంలో అంటే 2019, మే 26వ తేదీన దిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో, వైసీపీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన మద్యపాన నిషేధంపై మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ....
"మద్యపాన నిషేధానికి సంబంధించి నేను చాలా క్లియర్ గా చెప్పాను. క్రమంగా చేస్తాం. దశల వారీ పద్దతుల్లో చేస్తామనే చెప్పాం. దానికి కట్టుబడి ఉన్నాం. ఒకే సారి ఆదాయాన్ని పూర్తిగా తీసేయలేని పరిస్థితుల్లో ఉన్నాం. కానీ ఆదాయాన్ని క్రమంగా తగ్గిస్తాం. ఒక పక్క అవగాహన తీసుకుని రావాలి. మరో వైపు పునరావాస కేంద్రాలను పెంచాలి. ఇవి చేసుకుంటూ పోయి... 2024 ఎలక్షన్స్ సమయానికి మాత్రం కచ్చితంగా మద్యాన్ని ఫైవ్ స్టార్ హాటల్స్‌కు మాత్రమే పరిమితం చేసిన తర్వాతే నేను ఓట్లు అడుగుతాను. అది మాత్రం కచ్చితంగా చెప్తా ఉన్నాను. మేనిఫెస్టోలో కూడా కరెక్టుగా ఇదే చెప్పాను. వచ్చిన వెంటనే ఒకే దఫాలో చేస్తానని చెప్పలేదు. మేనిఫెస్టోని నేను ఖురాన్, బైబిల్, భగవద్గీతగా భావిస్తాను" అన్నారు. ఈ వ్యాఖ్యలను ఈ వీడియోలో చూడవచ్చు.

3. 2019 డిసెంబర్ రెండోవారంలో జరిగిన అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో కూడా ముఖ్యమంత్రి జగన్ మద్య నిషేధంపై మాట్లాడారు. మద్యంతో మనిషి రాక్షసులుగా మారిపోతారని, అందుకే మద్య నిషేధంపై తమ ప్రభుత్వం చాలా సీరియస్ ఉందన్నారు. అప్పుడు జగన్ ఏమన్నారంటే...
"మనిషి తన విచక్షణ మద్యం తాగినప్పుడు కోల్పోతాడు. అతనికి మరికొందరు జత అవుతారు. వారంతా అలా మద్యం సేవిస్తున్న సందర్భంగా వారి ఆలోచనలు మారి రాక్షసులుగా తయారవుతారు. అందుకే, ఇటువంటి పరిస్థితులు ఆపడం కోసమే మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే పర్మిట్ రూమ్స్ అన్నింటిని రద్దు చేసింది. మద్యం తాగితే మనుషులు మృగాలవుతారు, ఆ పరిస్థితి ఉండకూడదనే మద్యాన్ని ఒక పద్ధతి ప్రకారం నియంత్రించే కార్యక్రమం చేస్తున్నాం. గ్రామాల్లో 43,000 బెల్ట్ షాపులను రద్దు చేశాం" అన్నారు. ఆ వ్యాఖ్యలను ఈ వీడియోలో చూడవచ్చు.
4. మార్చి 23 2022న మద్యం అంశంపై అసెంబ్లీలో జగన్ సుదీర్ఘంగా ప్రసంగించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న బ్రాండ్లు చంద్రబాబు హయాంలో అనుమతి పొందినవేనని, అలాగే, వాటిలో చాలా టీడీపీ నాయకులవేనని చెప్తూ, సభలో స్లైడ్స్ ప్రదర్శించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తగ్గించేందుకే మద్యంపై ప్రతిపక్షం అనవసర ప్రచారం చేస్తోందని విమర్శించారు.
"రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని తగ్గించడానికే దుష్ప్రచారం చేస్తోంది. మద్యం ద్వారా రాష్ట్రానికి ఎలాంటి డబ్బులూ రాకూడదనే చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. డబ్బులు వచ్చాయంటే అక్క చెల్లెమ్మలకు జగన్ మంచి చేస్తాడు. ఆ మంచి జరగకూడదు. రాష్ట్రానికి డబ్బులు రాకూడదు. అప్పులు పుట్టకూడదనే మద్యంలో హానికారక పదార్థాలున్నాయంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు" అని సీఎం జగన్ అసెంబ్లీలో విమర్శించారు. ఈ వీడియోలో ఆ వ్యాఖ్యలను చూడవచ్చు.

ఊపందుకున్న మద్యం అమ్మకాలు
2020-21తో పోలిస్తే 2021-22లో అమ్మకాలు ఊపందుకున్నాయి. కోవిడ్ కారణంగా 2019-2020ల్లో మద్యం అమ్మకాలు కాస్త తగ్గినా, విడ్ నిబంధనలు సడలించిన తర్వాత మద్యం దుకాణాలు తెరవడంతో మళ్లీ అమ్మకాలు పెరిగాయి.
2020-21లో 1.91 కోట్ల ఎల్ఎంఎల్ (local made liquor), 57.97 లక్షల బీరు కేసులు అమ్ముడయ్యాయి. 2021-22 మార్చి 23 నాటికి 2.13 కోట్ల ఎల్ఎంఎల్, 71.99 లక్షల బీరు కేసుల అమ్మకాలు జరిగాయి.


మద్యనిషేధం... సంక్షేమ పథకాలకు నిధులు
ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు తాము అధికారంలోకి వస్తే ఫైవ్ స్టార్ హాటల్స్ మినహా పూర్తిగా మద్యనిషేధం చేస్తామన్న జగన్, అధికారంలోకి వచ్చిన తరువవాత మద్యంపై వస్తున్న ఆదాయాన్ని ఒకేసారి తగ్గించలేమని, క్రమంగా వాటి అమ్మకాలను నియంత్రిస్తూ 2024 నాటికి పూర్తిగా నిషేధాన్ని అమలు చేస్తామన్నారు.
తాజాగా మార్చి 23న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మద్యం ద్వారా రాష్ట్రానికి ఎలాంటి ఆదాయం రాకూడదనే చంద్రబాబు యత్నిస్తున్నారని, ఆ డబ్బులు వస్తే సంక్షేమ పథకాలకు ఉపయోగపడుతుందని, అందుకే మద్యంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని జగన్ విమర్శించారు.
అయితే, ఏ ప్రభుత్వమైనా ఆదాయాన్ని ఇచ్చే మద్యాన్ని నిషేధించే సాహసం చేయదని, అలాగనే దాన్నే నమ్ముకోవడం కూడా సరికాదని నిపుణులు అంటున్నారు.
‘‘ఒకేసారి మద్య నిషేధం చేయలేరు. కానీ, దానిపై వస్తున్న ఆదాయంతోనే ప్రభుత్వాన్ని నడుపుతామనడం కూడా సరైనది కాదు. మద్యంపై వస్తున్న ఆదాయంలో 5 నుంచి 10 శాతం మద్యం వలన కలిగే దుష్రభావాలపై అవగాహన, పునరావాస కేంద్రాలకు కేటాయించాలి. అలా క్రమంగా మద్యాన్ని నియంత్రించాలి. దాంతో పాటు విద్య, వైద్య రంగాలపై పెట్టుబడులు పెంచాలి. అంతే కానీ, మద్యం ద్వారా ఆదాయాన్ని పొందుతూ ఆ ఆదాయంతోనే సంక్షేమ పథకాలు కొనసాగిస్తే.. అది మరింత ప్రమాదకరంగా మారుతుంది" అని మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ బీబీసీతో చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ఫిలిప్పో ఆసెల్లా: ఈ బ్రిటన్ ప్రొఫెసర్‌ను భారత్‌లో ఎందుకు అడుగుపెట్టనివ్వలేదు? ఎయిర్పోర్ట్ నుంచే వెనక్కి ఎందుకు పంపించారు?
- భారత్‌లో హిందువులను మైనారిటీలుగా గుర్తించే అవకాశం ఉందా?
- రష్యాను ఎదుర్కోవడానికి యుక్రెయిన్‌కు అమెరికా ఏ ఏ ఆయుధాలు ఇచ్చిందంటే..?
- ‘వ్యభిచారంలోకి దింపడానికి వాళ్లు అందమైన అమ్మాయిల కోసం వెతుకుతున్నారు’
- బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ది ఇయర్ 2021 అవార్డు విజేత మీరాబాయి చాను
- Zero Mile: సున్నా మైలు రాయి ఎక్కడ ఉంది? భారతదేశానికి భౌగోళిక కేంద్ర బిందువు ఏది?
- ఇద్దరు బాయ్‌ఫ్రెండ్స్‌తో కలసి తల్లిని హత్య చేసిన 17 ఏళ్ల కూతురు.. ఏం జరిగిందంటే..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













