శ్రీలంక సంక్షోభం: చైనాతో దూరం పెరగడం భారత్‌కు కలిసొస్తుందా

ఫొటో సోర్స్, @DrSJaishankar
- రచయిత, అపూర్వ కృష్ణ
- హోదా, బీబీసీ ప్రతినిధి
శ్రీలంకతో, భారత్‌కు ఎన్నో ఏళ్ల సంబంధం ఉంది. సుమారు రెండున్నర వేల సంవత్సరాల క్రితం, అశోకుడు తన కుమారుడు మహేంద్ర, కుమార్తె సంఘమిత్రలను బౌద్ధమత ప్రచారం కోసం శ్రీలంక పంపాడు. అక్కడి రాజు వారి బోధనలకు ప్రభావితుడై బౌద్ధమతాన్ని స్వీకరించాడు. నేడు శ్రీలంక జనాభాలో 70 శాతానికి పైగా ప్రజలు బుద్ధుడిని ఆరాధిస్తారు.
రెండు దేశాలూ చాలాకాలం బ్రిటిష్ పాలన కింద ఉన్నాయి. 1947లో భారత్‌కు, ఆ తరువాత ఒక ఏడాదికి శ్రీలంకకు స్వతంత్రం లభించింది. ప్రస్తుతం ఇరు దేశాలూ 75 సంవత్సరాల స్వతంత్ర దినోత్సవాలు జరుపుకుంటున్నాయి.
స్వాతంత్ర్యం తరువాత, 1980లలో శ్రీలంక అతిపెద్ద సంక్షోభాన్ని చవిచూసింది. అక్కడ ఉన్న తమిళ మైనారిటీలు తమకు ప్రత్యేక దేశం కావాలంటూ చేసిన డిమాండ్ హింసాత్మక రూపం దాల్చడంతో అంతర్యుద్ధం చెలరేగింది. అది పాతిక సంవత్సరాలకు పైగా కొనసాగింది.
ఆ సమయంలో భారత్, శ్రీలంకకు సహాయం అందించింది. తమిళ వేర్పాటువాద సంస్థ ఎల్‌టీటీఈని నిరాయుధులను చేసేందుకు భారత శాంతి పరిరక్షక దళం (ఐపీకేఎఫ్) 1987 జూలైలో ఉత్తర శ్రీలంకలో అడుగు పెట్టింది. అయితే, ఈ దళాన్ని పంపించడంపై అనేక ప్రశ్నలు ఉన్నాయి.
1987 జూలై 30న అప్పటి భారత ప్రధాని రాజీవ్ గాంధీ కొలంబో అధ్యక్ష నివాసంలో గార్డ్ ఆఫ్ హానర్ తీసుకుంటుండగా, శ్రీలంక నావికుడు రైఫిల్ బట్‌తో ఆయనపై దాడి చేశారు. రాజీవ్ గాంధీకి స్వల్ప గాయాలయ్యాయి.
1991 మే 21న తమిళ వేర్పాటువాదులు రాజీవ్ గాంధీని హత్య చేశారు. అప్పటికి భారతదేశంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ తరుపున ప్రచారానికి తమిళనాడు వెళ్లారు రాజీవ్ గాంధీ. శ్రీపెరూంబుదూర్‌లోని ఒక సభలో రాజీవ్ గాంధీపై తమిళ వేర్పాటువాదులు ఆత్మాహుతి దాడి చేశారు.
అప్పటికి ప్రతిపక్ష నేతగా ఉన్న రాజీవ్ గాంధీ హత్యకు గురికాకపోయి ఉంటే మళ్లీ ప్రధాని అయి ఉండేవారని విశ్లేషకులు అంటారు.
తరువాతి దశాబ్దంలో శ్రీలంక ప్రభుత్వం దూకుడు ప్రచారాన్ని ప్రారంభించింది. ఫలితంగా ఎల్‌టీటీఈ ఓడిపోవడంతో 2009లో అంతర్యుద్ధం ముగిసింది.
యుద్ధం చివరి సంవత్సరాల నుంచి, ముగిసిన తరువాత ఈ 13 సంవత్సరాలలో భారత, శ్రీలంకల మధ్య సంబంధాలల్లో హెచ్చుతగ్గులు ఉంటూనే ఉన్నాయి.
గత రెండు దశాబ్దాలలో ఈ రెండు దేశాల మధ్య బలమైన సంబంధాలు ఏర్పడకపోవడానికి ముఖ్య కారణం చైనా.

ఫొటో సోర్స్, Reuters
చైనాతో స్నేహం
గడిచిన ఇరవై సంవత్సరాలలో శ్రీలంకలోని ప్రభుత్వాలు చైనాతో మంచి సంబంధాలు కొనసాగించాయి.
శ్రీలంక, తమ దేశంలోని పెద్ద పెద్ద ప్రాజెక్టుల కోసం చైనా సహాయం అర్థించింది. చాలా వాటిల్లో చైనా పెట్టుబడులు పెట్టింది.
అయితే, సహాయం అందిస్తున్న సాకుతో చైనా, శ్రీలంకను అప్పుల ఊబిలోకి దింపుతోందనే విమర్శలూ ఉన్నాయి.
నిజంగానే, శ్రీలంక ఇప్పుడు పూర్తిగా మునిగిపోయింది. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. దీనికి కారణం చైనా మాత్రమే కాకపోయినప్పటికీ, అక్కడి ప్రభుత్వ నిర్వహణలోపం, పెద్ద పెద్ద ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను తలకెత్తుకోవడం, జనాదరణ పొందేందుకు ప్రత్యేక విధానాల అమలు వంటి ఎన్నో కారణాలు ఉన్నాయి.
ఈ కష్ట సమయంలో పాత నేస్తం భారత్ సహాయం అందించడం, మరోవైపు, నమ్ముకున్న చైనా మొండి చేయి చూపించడం కూడా కనిపిస్తోంది.
దీన్నిబట్టి, భారత్, శ్రీలంకల మధ్య సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి ఈ సంక్షోభం ఒక అవకాశం ఇస్తోందని అనుకోవచ్చా?
శ్రీలంక భారీ స్థాయిల్లో అప్పుల్లో కూరుకుపోయింది. దానికి ఇప్పుడు సహాయం కావాలి. శ్రీలంక సెంట్రల్ బ్యాంక్ నుంచి రాయిటర్స్ వార్తా సంస్థ సేకరించిన డేటా పరిశీలిస్తే సమస్య ఎంత తీవ్రమైనదో అర్థమవుతుంది.
ఆ వివరాల ప్రకారం, శ్రీలంక ఈ ఏడాదిలో 7 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 52,916 కోట్లు) రుణాలు చెల్లించాలి. కానీ, దాని విదేశీ మారక ద్రవ్య నిల్వలు కేవలం 2.3 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 17,386 కోట్లు) ఉన్నాయి.

ఫొటో సోర్స్, AFP
శ్రీలంక సహాయం కోసం చైనా, భారత్‌ల వైపు చూసింది. చైనా చూపు తిప్పేసుకుందిగానీ, భారత్ చేయందించింది.
చైనా చాలా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుందని దిల్లీలోని జవహర్‌లాల్ యూనివర్సిటీలో సెంటర్ ఫర్ సౌత్ ఆసియన్ స్టడీస్ ప్రొఫెసర్ పీ సహదేవన్ అన్నారు.
"ముందు పాత బకాయిల లెక్కలు తేల్చుకోవాలని చూస్తోంది చైనా. ఆ మొత్తం చాలా ఎక్కువ. చైనా చాలా తెలివిగా వ్యవహరిస్తోంది. అందుకే ఈసారి సాయం చేయడానికి ముందుకు రాలేదు" అని ఆయన అన్నారు.
ఇది భారత్‌కు అందివచ్చిన అవకాశమని నిపుణులు భావిస్తున్నారు.
భారత్‌కు అందివచ్చిన అవకాశం
శ్రీలంకలో భారత్‌ను వ్యతిరేకించే ఒక వర్గం ఉందని మనోహర్ పారికర్ ఇనిస్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలిసిస్ (ఐడీఎస్ఏ)లో శ్రీలంక వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న అసోసియేట్ ఫెలో డాక్టర్ గుల్బిన్ సుల్తానా అభిప్రాయపడ్డారు.
"భారత్ కన్నా చైనా తమకు మంచి నేస్తమని నిరూపించేందుకు ఈ వర్గం ప్రయత్నిస్తుంటుంది. ఎందుకంటే వారి దృష్టిలో చైనా తమ రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోదు. సామాన్య ప్రజల్లో కొందరికి ఇలాంటి అభిప్రాయం ఉంది. ఇప్పుడు ఆ అపోహ తొలగిపోయింది. అది నిజం కాదని వారికి అర్థమైంది" అని ఆమె అన్నారు.
గత కొంతకాలంగా శ్రీలంకకు అవసరమైన సహాయన్ని అందిస్తోంది భారత్.
భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ గతవారం శ్రీలంకలో పర్యటించి సహాయం అందించారు. ఏడు దేశాలు భాగస్వామ్యం పంచుకుంటున్న అంతర్జాతీయ సంస్థ బిమ్‌స్టెక్ (BIMSTEC) అయిదవ సమావేశంలో పాల్గొనేందుకు మంత్రి అక్కడకు వెళ్లారు.
2022 ప్రారంభం నుంచి భారతదేశం శ్రీలంకకు 2.4 బిలియన్ డాలర్ల సహాయాన్ని పంపింది. తమ దేశంలో నిత్యావసర వస్తువుల కొరతను అధిగమించేందుకు మరో 1.5 బిలియన్ డాలర్లను పంపాలని చైనా, భారత్‌ను శ్రీలంక కోరింది.
కాగా, ప్రస్తుతం శ్రీలంక ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని ఒకటో, రెండో దేశాలు తీర్చలేవని, దానికి అంతర్జాతీయ ద్రవ్యనిధి సహాయం అందించాలని విశ్లేషకులు భావిస్తున్నారు. శ్రీలంక అందుకు ప్రయత్నిస్తోంది కూడా.
"భారత్‌పై ఎక్కువ కాలం ఆధారపడడం కష్టం. ఎందుకంటే భారత్‌కు కూడా చాలా పని ఉంది. మరో 1.5 బిలియన్ డాలర్లను భారత్ పంపించిందే అనుకున్నాం. కానీ, ఇలా ఎంతకాలం కొనసాగుతుంది?" అని ప్రొఫెసర్ పీ సహదేవన్ అన్నారు.
అయితే, ఈ కష్ట సమయంలో భారత్ అందించిన స్నేహ హస్తాన్ని శ్రీలంక గుర్తించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పర్యటనకు ముందు శ్రీలంక విదేశాంగ మంత్రి జీఎల్ పెయిరిస్ ఫిబ్రవరిలో భారత్‌లో మూడు రోజులు పర్యటించారు. తరువాత మార్చిలో అప్పటి శ్రీలంక ఆర్థిక మంత్రి బాసిల్ రాజపక్ష కూడా భారత్‌లో పర్యటించారు.
జీఎల్ పెయిరిస్ భారత్ పర్యటన సందర్భంగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో మాట్లాడుతూ, భారత్, శ్రీలంకల మధ్య సంబంధాలు ఉన్నత స్థాయిలో ఉన్నాయని, చైనా గురించి తమ దేశంలో వినిపిస్తున్న ఆందోళనలు గతానికి చెందినవని అన్నారు.
గతంలో శ్రీలంకలోని పలు ప్రాజెక్టులపై భారత్ ఆసక్తి కనబర్చింది. కానీ, అవేమీ ముందుకు సాగలేదు. ఇప్పుడు ఈ ఇరు దేశాల మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యం వల్ల అవి కూడా కార్యరూపం దాల్చవచ్చు.
"ట్రింకోమలీ ఆయిల్ ట్యాంక్ ఫామ్ వంటి అనేక ప్రాజెక్టులలో భారతదేశం ఎంఓయూలపై సంతకాలు చేసింది. కానీ, కొన్నిసార్లు స్థానిక నిరసనల పేరుతో, కొన్నిసార్లు వేరే సాకులతో అవి వాయిదా పడుతూ వచ్చాయి. కానీ డిసెంబర్ తరువాత అంటే భారతదేశం, శ్రీలంకకు సహాయం అందించే దిశగా చర్యలు ప్రారంభించిన తరువాత, ఆ దేశంలో నిలిచిపోయిన ఇలాంటి అనేక ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తోంది అక్కడి ప్రభుత్వం" అని డాక్టర్ గుల్బీన్ సుల్తానా అన్నారు.

ఫొటో సోర్స్, @DrSJaishankar
టీ మార్కెట్‌లో భారత్‌కు అవకాశాలు
ఇదిలా ఉండగా, శ్రీలంకలో కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభం భారతదేశ టీ ఎగుమతిదారులకు ప్రయోజనకరంగా మారవచ్చని భారత్‌లోని టీ పరిశ్రమకు సంబంధించిన ప్రతినిధులు, నిపుణులు భావిస్తున్నారు.
అంతర్జాతీయ టీ మార్కెట్‌లో శ్రీలంక పెద్ద ప్లేయర్ అని, ప్రతి సంవత్సరం అక్కడ ఉత్పత్తి చేసే టీలో 97-98 శాతం విదేశీ మార్కెట్‌కు ఎగుమతి అవుతుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా వైస్ ప్రెసిడెంట్ కౌశిక్ దాస్ చెప్పారని పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది.
కౌశిక్ దాస్, పీటీఐతో మాట్లాడుతూ, "శ్రీలంక టీ ఉత్పత్తి భారీగా పడిపోయింది. ఇది అంతర్జాతీయ మార్కెట్‌పై ప్రభావం చూపుతుంది. మార్కెట్‌లో సప్లయి లోటు భర్తీ చేయడానికి భారతీయ ఎగుమతిదారులకు అవకాశాలు రావొచ్చు" అని అన్నారు.
ప్రస్తుత ఆర్థిక సంక్షోభం కారణంగా శ్రీలంక టీ ఉత్పత్తిలో 15 శాతం తరుగుదల ఉండవచ్చని భారత టీ ఎగుమతిదారుల సంఘం అధ్యక్షుడు అన్షుమన్ కనోరియా పీటీఐకి తెలిపారు.
ఇటీవల కొలంబో నుంచి తిరిగి వచ్చిన సౌత్ ఇండియా టీ ఎగుమతిదారుల సంఘం అధ్యక్షుడు దీపక్ షా మాట్లాడుతూ, శ్రీలంకలో రోజుకు 12-13 గంటలు కరెంటు ఉండడం లేదని, జనరేటర్లు నడపడానికి చమురు కూడా లేదని, ఇది టీ ఉత్పత్తిపై ప్రభావం చూపుతోందని చెప్పారు.
"దీని ప్రభావం టీ క్వాలిటీ మీద కూడా పడుతుంది. పైగా, అక్కడ వర్షాలు తక్కువ పడుతున్నాయి. దీనివలన టీ ఉత్పత్తి 20-25 శాతం తగ్గుతుందని అంచనా" అని ఆయన పీటీఐతో చెప్పారు.
పొరుగు దేశమైన శ్రీలంకలో అస్థిరత భారత్‌కు మంచిది కాదని డాక్టర్ గుల్బిన్ సుల్తానా అభిప్రాయపడ్డారు.
"ఇరుగు పొరుగు దేశాల్లో అస్థిరత ప్రభావం భారత్‌పై పడుతుంది. శ్రీలంకలో తీవ్ర సంక్షోభం కారణంగా అక్కడి నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు అక్రమ మార్గాల ద్వారా భారత తీర ప్రాంతాలకు చేరుకుంటున్నారని రిపోర్టులు వస్తున్నాయి. దీని ప్రభావం భారత రాజకీయ, ఆర్థిక పరిస్థితులపై పడుతుంది" అని ఆమె అన్నారు.
ఇవి కూడా చదవండి:
- రాహుల్ గాంధీకి తన ఆస్తి మొత్తం రాసిచ్చేసిన 79 ఏళ్ల పుష్ప ముంజియాల్ ఎవరు?
- వైఎస్ జగన్ కూడా ఎన్టీఆర్ బాటలోనే వెళ్తున్నారా? ఏపీలో క్యాబినెట్ మంత్రులందరి రాజీనామాలు తప్పవా?
- పాకిస్తాన్లో దేశద్రోహం అంటే ఏంటి, ఇమ్రాన్ ఖాన్ దేశద్రోహి అని నిరూపణ అయితే ఏం శిక్ష విధిస్తారు?
- డ్రగ్స్ కేసుల్లో ఇప్పటివరకు ఎవరినైనా శిక్షించారా, ఈ నేరాలకు ఎలాంటి శిక్షలు ఉంటాయి?
- విస్కీ టేస్ట్ దాని వయసు ముదురుతున్న కొద్దీ పెరుగుతుందంటారు... ఏమిటీ 'ఏజింగ్' మహిమ?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














