ఆన్‌లైన్‌లో నకిలీ ‘రామసేతు వంతెన రాళ్లు’.. 20 గ్రాముల రాయి రూ.5,000.. నీళ్లలో వేస్తే పైకి తేలుతున్న ఈ రాళ్లు ఏంటి?

రామసేతు
    • రచయిత, ప్రభుపాద ఆనందన్
    • హోదా, బీబీసీ కోసం

అరుదైన పగడపు దిబ్బల రాళ్లను ‘‘రామసేతు’’ రాళ్ల పేరుతో రూ.ఐదు వేలకు ఓ వెబ్‌సైట్ విక్రయానికి పెట్టింది. దీనిపై తమిళనాడు అటవీ విభాగం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తోంది.

పగడపు దిబ్బల రాళ్లను విక్రయించడంపై తమిళనాడు ప్రభుత్వం నిషేధం విధించింది.

రామనాథపురం జిల్లాకు పొడవైన తీర ప్రాంతముంది. గల్ఫ్ ఆఫ్ మన్నార్, పాక్ జలసంధి తదితర ప్రాంతాల్లో పగడపు దిబ్బలు కనిపిస్తాయి.

ఈ పగడపు దిబ్బలు 500కుపైగా జీవజాతులకు నిలయం. సముద్రపు తాబేళ్లు, సీహార్స్‌లు, సీకౌ తదితర జీవులను మనం వీటిలో చూడొచ్చు.

అరుదైన ఈ పగడపు దిబ్బలను చేపలు కూడా ఆవాసంగా చేసుకుంటాయి. అయితే, ఇక్కడ లభించే రాళ్లను విక్రయించేందుకు సేకరించడంతో వీటి మనుగడే ప్రమాదంలో పడుతోంది. దీంతో ఈ రాళ్ల విక్రయాలపై తమిళనాడు ప్రభుత్వం నిషేధం విధించింది.

ఈ పగడపు దిబ్బలను కాపాడేందుకు, వీటిని అభివృద్ధి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. కృత్రిమ పగడపు దిబ్బలను కూడా సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయి.

రామసేతు

అవి రామసేతు పగడపు దిబ్బలేనా?

ఆధ్యాత్మిక క్షేత్రాల్లో రామేశ్వరం కూడా ఒకటి. ఇక్కడకు రోజూ వేల మంది భక్తులు వస్తుంటారు.

రామేశ్వరంతోపాటు చుట్టుపక్కల ఉండే ప్రాంతాలకూ భక్తులు వెళ్తుంటారు. అలా వచ్చే భక్తులకు రామసేతు పగడపు రాళ్లు అంటూ కొందరు రాళ్లను విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారు. నీళ్లలో వేస్తే పైకి తేలుతున్నాయని కూడా ఫొటోలు పెడుతున్నారు.

అయితే, ఇప్పటికే ఆంక్షలు అమలులోవున్న ఈ రాళ్లను తాము విక్రయిస్తామంటూ కొందరు ఆన్‌లైన్‌లో ప్రకటనలు పెడుతున్నారు. వీటిలో ఇవి రామసేతు రాళ్లని, రూ.5,000కు విక్రయిస్తామని చెబుతున్నారు.

రామసేతు

ఈ రాళ్లను విక్రయానికి పెట్టే సంస్థకు తాము నోటీసులు పంపినట్లు రామనాథపురం జిల్లా అటవీ విభాగం అధికారులు తెలిపారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని వివరించారు.

‘‘నిషేధం విధించిన వస్తువులను ఆన్‌లైన్‌లో ప్రజలు కొనుగోలు చేయకూడదు’’అని బీబీసీ తమిళ్‌తో రామనాథపురం ఫారెస్ట్ రేంజర్ వెంకటేశ్ చెప్పారు.

‘‘ఆ రాళ్లను విక్రయించేవారిపై వైల్డ్‌లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్-1972 కింద కేసులు నమోదుచేసి దర్యాప్తు చేపడతాం. నేరం రుజువైతే వారికి మూడు నుంచి ఐదేళ్ల వరకు శిక్ష పడే అవకాశముంది’’అని ఆయన వివరించారు.

రామసేతు

20 గ్రాముల రాళ్లు.. రూ.5,000

ఈ రాళ్లను విక్రయిస్తున్నట్లు సమాచారం అందిన వెంటనే, రామనాథపురం అటవీ విభాగం అధికారులు ఆన్‌లైన్‌లో చెక్‌చేశారు.

దీంతో 20 గ్రాముల రామసేతు వంతెన రాయిని రూ.4,999కు విక్రయిస్తున్నట్లు ఓ ప్రకటన వారికి కనిపించింది.

వెంటనే అటవీ విభాగానికి చెందిన సైబర్ క్రైమ్ విభాగానికి దీనిపై సమాచారం అందించారు.

రామనాథపురం అటవీ విభాగం సమాచారంపై సంబంధింత ఆన్‌లైన్ వ్యాపారం నిర్వహించే వెబ్‌సైట్‌కు నోటీసులు పంపించారు.

అయితే, ప్రాథమిక దర్యాప్తులో సదరు కంపెనీ కోల్‌కతాకు చెందిన పగడపు దిబ్బల రాళ్లను విక్రయిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది.

దీంతో కోల్‌కతాలోని అటవీ విభాగం అధికారులకు తమిళనాడు అటవీ విభాగం అధికారులు సమాచారం అందించారు. త్వరలో పశ్చిమ బెంగాల్ అటవీ విభాగం అధికారులు దీనిపై దర్యాప్తు మొదలుపెట్టబోతున్నారు.

రామసేతు

నిషేధిత పక్షుల విక్రయాలు కూడా..

కేవలం నిషేధించిన పగడపు రాళ్లే కాదు.. విదేశీ పక్షులను కూడా ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టినట్లు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది.

ఇలా నిషేధించిన పక్షులు, ఇతర జీవుల అమ్మకాల ప్రటకనలు ఏవైనా కనిపిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని అటవీ విభాగం అధికారులు సూచించారు.

ఇలా ఆంక్షలు అమలులోనున్న వస్తువులను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయకూడదని వెంకటేశ్ సూచించారు.

ఈ విషయంపై జాతీయ స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

‘‘ఇళ్లలో పెంచుకునే చేపల ట్యాంకులను అలంకరించుకునేందుకు పగడపు దిబ్బల రాళ్లను కొనుగోలు చేస్తుంటారు. దీని కోసం కొందరు పగడపు దిబ్బల రాళ్లను అమ్మకానికి పెడుతున్నారు. ఇలాంటి చర్యల వల్ల పగడపు దిబ్బలకు చాలా నష్టం వాళ్లుతుంది’’అని సముద్రపు జీవులపై పరిశోధన చేపడుతున్న పాటెర్సన్ ఎడ్వర్డ్ చెప్పారు.

సముద్రం నుంచి పగడపు దిబ్బలను వేరుచేసినప్పుడు, వాటిపై ఆధారపడే చేపలు, ఇతర జీవులపై చాలా ప్రభావం పడుతుంది.

వీడియో క్యాప్షన్, పాకిస్తాన్‌లో భారత యాత్రికుల సందడి

కాలుష్యంతోనూ ప్రభావం

పర్యావరణ కాలుష్యం, భూమి వేడెక్కడం, వాతావరణ మార్పులు, విపరీతంగా చేపలను వేటాడటం లాంటి చర్యల వల్ల కూడా పగడపు దిబ్బలకు నష్టం వాళ్లుతోంది.

పగడపు దిబ్బలు ఎన్నో సముద్రపు జీవులకు ఆవాసంగా మారుతున్నాయని చాలా మందికి తెలియదు.

అలా అవగాహనలేని ప్రజలు వీటిని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తున్నారు. వీరి కోసం కొన్ని మాఫియా గ్యాంగ్‌లు కూడా పనిచేస్తున్నాయి. ఇవి దొంగతనంగా పగడపు దిబ్బల రాళ్లను సేకరిస్తున్నాయి.

అయితే, ప్రస్తుతం ఆన్‌లైన్‌లో రామసేతు వంతెన రాళ్లు అన్న పేరుతో అమ్ముతున్న పగడపు దిబ్బల రాళ్లు నిజమైన పగడపు దిబ్బల రాళ్లని కూడా చెప్పలేమని రామనాథపురం జిల్లా వైల్డ్‌లైఫ్ కన్జర్వేటర్ పగన్ జగదీశ్ సుధాకర్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)