పాకిస్తాన్‌లో దేశద్రోహం అంటే ఏంటి, ఇమ్రాన్ ఖాన్ దేశద్రోహి అని నిరూపణ అయితే ఏం శిక్ష విధిస్తారు?

ఇమ్రాన్ ఖాన్ దేశ ద్రోహానికి పాల్పడ్డారని ప్రతిపక్షాలు ఆరోపించాయి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇమ్రాన్ ఖాన్ దేశ ద్రోహానికి పాల్పడ్డారని ప్రతిపక్షాలు ఆరోపించాయి

ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ పై ప్రతిపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానం రాజ్యాంగ విరుద్ధమని నేషనల్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఖాసిం సూరి ఆదివారం తిరస్కరించారు. అయితే, ఈ నిర్ణయం రాజ్యాంగ ఉల్లంఘన అని ప్రతిపక్షాలు ఆరోపించాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 6 ప్రకారం వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.

అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరించిన ఖాసీం సూరి ‘‘అవిశ్వాస తీర్మానం రాజ్యాంగానికి, దేశ సార్వభౌమాధికారానికి, స్వాతంత్య్రానికి విరుద్ధం, ఈ తీర్మానాన్ని రద్దు చేస్తూ రూలింగ్ ఇస్తున్నాను’’ అంటూ సభా కార్యకలాపాలను వాయిదా వేశారు.

విపక్షాల అవిశ్వాస తీర్మానం బయటి శక్తుల మద్దతుతో ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర అని, అది విఫలమైందని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.

అయితే, ప్రతిపక్ష నాయకుడు షాబాజ్ షరీఫ్ మాత్రం స్పీకర్ ఖాసిం సూరి, ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ల చర్యలను "తీవ్రమైన రాజద్రోహం"గా అభివర్ణించారు. ఈ ఇద్దరి పై పాకిస్తాన్ రాజ్యాంగంలోని "ఆర్టికల్ 6" ప్రకారం చర్యలు తీసుకోవాలని, వీరు కచ్చితంగా దేశద్రోహానికి పాల్పడ్డారని అన్నారు.

పాకిస్తాన్ రాజ్యాంగం దృష్టిలో దేశద్రోహం అంటే ఏమిటి, ఎవరు దేశద్రోహి అవుతారు అని తెలుసుకోవడానికి బీబీసీ ప్రయత్నించింది. దేశద్రోహాన్ని ఎవరు నిర్ణయిస్తారు, దేశద్రోహిపై చర్య తీసుకునే హక్కు రాజ్యాంగం ఎవరికి ఇస్తుంది, ఈ ప్రక్రియ ఎలా జరుగుతుంది ?

ఇమ్రాన్ ఖాన్

ఫొటో సోర్స్, GHULAM RASOOL

ఫొటో క్యాప్షన్, ఇమ్రాన్ ఖాన్

దేశద్రోహి ఎవరు?

పాకిస్తాన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 6 ప్రకారం

"బలాన్ని ఉపయోగించడం ద్వారా లేదా ఏదైనా రాజ్యాంగ విరుద్ధమైన మార్గాల ద్వారా పాకిస్తాన్ రాజ్యాంగాన్ని రద్దు చేయడం, సస్పెండ్ చేయడం లేదా తాత్కాలికంగా నిలిపివేయడం వంటి చర్యలకు పాల్పడిన, అలా చేయడానికి ప్రయత్నించిన లేదా అలా చేసే కుట్రలో పాలుపంచుకున్న ప్రతి వ్యక్తి దేశద్రోహి''

ఇది ఆ దేశపు రాజ్యాంగానికి 18వ సవరణ తర్వాత వచ్చిన కొత్త నిర్వచనం.

"దేశద్రోహం అనే పదాన్ని మొదట 1973 రాజ్యాంగంలో ఉపయోగించారు. అయితే, ఆ సమయంలో పద్దెనిమిదవ సవరణ తర్వాత దేశద్రోహం అనే భావనకు అర్ధాన్ని మార్చారు'' అని న్యాయ నిపుణుడు జాఫర్ అన్నారు.

"ఏ వ్యక్తి అయినా రాజ్యాంగాన్ని రద్దు చేయడం లేదా తాత్కాలికంగా రద్దు చేయడం లేదా అలాంటి చర్యలకు పాల్పడిన వ్యక్తులకు మద్దతు ఇవ్వడం దేశద్రోహం అవుతుంది" అంటూ అదనంగా కొన్ని చర్యలను దీనికి జోడించారు.

వీడియో క్యాప్షన్, ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానం.. ఆదివారం ఓటింగ్... ఏం జరగనుంది?
పాకిస్తాన్

ఫొటో సోర్స్, Getty Images

ఏది రాజద్రోహం కాదు ?

రాజ్యాంగం ప్రకారం జాతీయ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించే వ్యక్తి దేశద్రోహి కారు. ఇది ''జాతీయ భద్రత'' కిందకు వస్తుంది. ఇందులో అనేక నిబంధనలున్నాయి.

సైన్యంలో తిరుగుబాటును ప్రేరేపించడం, శాంతిభద్రతల సమస్యను సృష్టించడం, శత్రుదేశంతో చేతులు కలిపి కుట్ర చేయడం వంటివి ఇందులో ఉన్నాయి.

"ఇవన్నీ రాజ్యాంగాన్ని రద్దు చేసే స్థాయికి చేరే వరకు రాజ్యాంగంలోని 6వ అధికరణను ప్రయోగించలేం'' అని జాఫర్ వెల్లడించారు.

న్యాయ నిపుణుడు బాబర్ సత్తార్ కూడా ఇదే మాట చెప్పారు. దేశద్రోహం అనే రాజ్యాంగ భావన రాజ్యాంగాన్ని సస్పెండ్ చేయడంతో ముడిపడి ఉందని ఆయన బీబీసీతో అన్నారు.

అంటే, రాజ్యాంగాన్ని సస్పెండ్ చేసినా లేదా రద్దు చేసినా అది దేశద్రోహమే. 1973లో దేశద్రోహం అనే భావనను రాజ్యాంగంలో చేర్చారు. ఎందుకంటే అంతకు ముందు సైనిక ప్రభుత్వాలు తరచూ వచ్చేవి.

దేశద్రోహ చర్యను ఏ కోర్టు నిర్ధారించరాదు అనే నిబంధన కూడా ఇందులో ఉంది.

"దేశద్రోహం అనే మాటను రాజ్యాంగంలో చాలా జాగ్రత్తగా ఉపయోగించారు. ఎవరైనా ఒక సంస్థకు వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడినట్లయితే, అది దేశద్రోహానికి సమానం అని తరచు అనుకుంటాం. కానీ అది నిజం కాదు''

ముషారఫ్ కూడా దేశద్రోహం కేసు ఎదుర్కొన్నారు

ఫొటో సోర్స్, AFP

దేశద్రోహిగా ఎవరు ప్రకటిస్తారు?

రాజద్రోహాన్ని నిర్ణయించడం, చర్యలు తీసుకోవడంలో ఫెడరల్ ప్రభుత్వానికి మాత్రమే హక్కు ఉందన్న వాదనను జాఫర్, సత్తార్ లు అంగీకరిస్తున్నారు.

దేశద్రోహంపై చర్యలను హోంమంత్రి ప్రారంభించవచ్చని, అయితే తుది నిర్ణయం మాత్రం ప్రధానమంత్రి, మంత్రివర్గం తీసుకుంటుందని జాఫర్ స్పష్టం చేశారు.

దేశద్రోహ విచారణ ప్రక్రియను వివరిస్తూ ''1973లో రాజ్యాంగంలో దేశద్రోహం అనే భావనను ప్రవేశపెట్టిన తర్వాత ఒక చట్టం రూపొందించారు. ఒక వ్యక్తి దేశద్రోహానికి పాల్పడ్డారా లేదా అనేది ఫెడరల్ ప్రభుత్వం నిర్ణయిస్తుంది'' అని బాబర్ సత్తార్ అన్నారు. ఆ తర్వాత దీనిపై విచారణకు ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేస్తారని ఆయన తెలిపారు.

"మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌పై విచారణలో మేం ఇదే గమనించాం'' అని ఆయన వెల్లడించారు.

ఇది క్రిమినల్ కేసని, ఇందులో మరణశిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం ఉందని బాబర్ సత్తార్ చెప్పారు. ''సాక్ష్యాలను నిరూపించే బాధ్యత కూడా నిందలు మోపుతున్న వారిపై అంటే ప్రభుత్వంపై ఉంటుంది" అని ఆయన అన్నారు.

వీడియో క్యాప్షన్, 75 ఏళ్లలో ఒక్క పాకిస్తాన్‌ ప్రధాని కూడా ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకోలేదు, ఎందుకు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)