పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానానికి విపక్షాలు సన్నద్ధం, విపక్షాల ప్రయత్నాల్లో బలమెంత?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, శుమాలిలా జాఫ్రీ
- హోదా, బీబీసీ న్యూస్, ఇస్లామాబాద్
పాకిస్తాన్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. అక్కడ ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానానికి విపక్షాలు సిద్ధమవుతున్నాయి.
ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, అవకతవకలకు పాల్పడుతోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
విపక్షాల విమర్శలకు కళ్లెం వేసేందుకు ఇమ్రాన్ ఖాన్ వెంటనే విద్యుత్, పెట్రోల్ ధరలను తగ్గించారు.
ప్రతిపక్షాల రాజకీయ దాడి నుంచి ఇమ్రాన్ ఖాన్ తన ప్రభుత్వాన్ని కాపాడుకోగలరా? అనేదే ఇప్పుడు ఎదురవుతోన్న ప్రశ్న.

ఫొటో సోర్స్, Getty Images
ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో అల్పాదాయ వర్గాలు నివసించే ప్రాంతంలోని తన దుకాణంలో పండ్లను సర్దుతున్నారు షహజాద్.
రోజులో చాలా భాగం గడిచిపోయింది. వినియోగదారుల కోసం ఆయన వేచి చూస్తున్నారు. కానీ చాలా తక్కువ సంఖ్యలో వినియోగదారులు వస్తున్నారు.
''గతంలో వ్యాపారం ఎప్పుడూ ఇలా మందగించలేదు. రోడ్డు పక్కన వాహనాలు ఆపి ప్రజలు పండ్లు కొనడానికి వచ్చేవారు. కానీ ఇప్పుడు ధరలు చాలా పెరిగిపోయాయి. చాలామందికి అందుబాటులో లేకుండా పోయాయి'' అని షహజాద్ చెప్పారు.
షహజాద్ ఒకప్పుడు ఇమ్రాన్ ఖాన్‌కు గట్టి మద్దతుదారు. ఆయనకు ఓటు కూడా వేశారు. కానీ ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్‌పై ఆయన అభిప్రాయం మారిపోయింది.
''నేను పాకిస్తాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పీటీఐ)కి ఓటు వేశాను. ఇమ్రాన్ ఖాన్‌పై మాకు చాలా ఆశలు ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు చూడండి. ఇక్కడ బతకడం కష్టమై పోయింది. అధికారంలోకి రాకముందు తాను పేదలకు అండగా ఉంటానని చెప్పుకున్నారు. మాలో ఆశలు కల్పించారు. కానీ ఆయన మాకు ఏమీ చేయలేదు'' అని షహజాద్ చెప్పుకొచ్చారు.
విపక్షాల అవిశ్వాస తీర్మానం
పాకిస్తాన్‌లో ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరింది. దీంతో పాటే ఇమ్రాన్ ఖాన్ ప్రజాదరణ కూడా ఊగిసలాడుతోంది.
ఇమ్రాన్‌ఖాన్‌ను అధికారం నుంచి దింపేందుకు అవిశ్వాస తీర్మానం పెడతామని ప్రతిపక్షాలు చెప్పాయి. ప్రతిపక్ష పార్టీల కూటమి పాకిస్తాన్ డెమోక్రాటిక్ మూమెంట్ (పీడీఎం) దీనికి నాయకత్వం వహిస్తోంది.
''అక్రమ పాలకునిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు పీడీఎం కూటమి పార్టీలన్నీ అంగీకరించాయి'' అని కొన్ని వారాల క్రితం లాహోర్‌లో జరిగిన సమావేశం తర్వాత పీడీఎం చీఫ్ మౌలానా ఫజ్లూర్ రెహమాన్ ప్రకటించారు.
''దీని కోసం సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్న అన్ని పార్టీలను సంప్రదిస్తాం. ప్రజలపై దయ చూపాలని, ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం మానుకోవాలని వారిని అభ్యర్థిస్తాం'' అని ఆయన అన్నారు.
అవిశ్వాస తీర్మానం ప్రకటించిన తర్వాత విపక్ష పార్టీలు.. పీటీఐ ప్రభుత్వానికి మద్దతిస్తోన్న సంకీర్ణ మిత్రపక్షాలను సంప్రదించడం ప్రారంభించాయి.
నిజానికి అవిశ్వాస తీర్మానం ఆమోదం పొందడానికి అవసరమైన ఓట్లు ప్రతిపక్ష పార్టీల వద్ద లేవు. అందుకే ప్రభుత్వ మిత్ర పక్షాలను తమవైపు తిప్పుకునేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి.
పాకిస్తాన్ రాజ్యాంగం ప్రకారం అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించడానికి సాధారణ మెజారిటీ సరిపోతుంది.
పాకిస్తాన్ పార్లమెంట్‌లో 342 ఎంపీ సీట్లున్నాయి. అవిశ్వాస తీర్మానం ఆమోదం పొందడానికి 172 మంది ఎంపీలు ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా ఓటు వేస్తే సరిపోతుంది.
అధికార ఇమ్రాన్‌ఖాన్ పార్టీ వద్ద 155 ఓట్లు ఉన్నాయి. మిత్రపక్షాలతో కలిసి ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
కొనసాగుతోన్న నిరసనలు
ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి పాకిస్తాన్ ముస్లిం లీగ్ ఖైద్-ఎ-అజమ్ (పీఎంఎల్-క్యు), ముత్తాహిదా క్వామీ మూమెంట్ (ఎంక్యుఎం) పార్టీలు ప్రధాన మిత్రపక్షాలు.
ఈ రెండు పార్టీలు కూడా గతంలో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై బహిరంగంగానే తమ అసంతృప్తిని వెళ్లగక్కాయి. ప్రభుత్వంలో తమకు తగిన హక్కులు, సరైన ప్రాధాన్యత దక్కట్లేదని ఆ పార్టీలు అన్నాయి.
అవిశ్వాస తీర్మానాన్ని విజయవంతం చేసేందుకు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తోన్న ఇతర పార్టీలను తమకు అనుకూలంగా మలుచుకోవడం మినహా ప్రతిపక్షాలకు మరో మార్గం లేదు. అందుకే మిగతా పార్టీలు ఇప్పుడు కింగ్ మేకర్లుగా మారాయి.
పీఎంఎల్-ఎన్ నేత షాబాజ్ షరీఫ్ 14 ఏళ్ల తర్వాత పీఎంఎల్-క్యు నాయకత్వాన్ని కలిశారు.
అయితే ప్రభుత్వంలో ఉన్న మిత్రపక్షాలు అయోమయంలో ఉన్నాయి. వారి వైపు నుంచి ఇంకా ఎలాంటి స్పష్టమైన సంకేతాలు లేవు.
ఓవైపు పాలక ప్రభుత్వంతోనే కలిసి సాగుతామని ఇమ్రాన్ ఖాన్‌కు హామీ ఇస్తున్నాయి. మరోవైపు విపక్ష పార్టీలకు మిశ్రమ సంకేతాలను కూడా పంపిస్తున్నాయి.
గతంలో పీడీఎం నుంచి పాకిస్తాన్ పీపుల్స్ పార్టీని తొలగించారు. కానీ ఇప్పుడు మళ్లీ దాన్ని ఫ్రంట్‌లో చేర్చారు.
ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం తప్పుకోవాలన్న డిమాండ్‌తో బిలావల్ భుట్టో కరాచీ నుంచి ర్యాలీ చేపట్టారు. ఆయన 10 రోజుల తర్వాత ఇస్లామాబాద్‌ను చేరుకున్నారు.
''ఇమ్రాన్ ఖాన్ ప్రధాని పదవి నుంచి తప్పుకోవాలి లేదా మేమే ఆయనను అధికారం నుంచి తొలగిస్తాం'' అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, ANI
ప్రభుత్వ నిర్లక్ష్యమా?
ప్రతిపక్ష పార్టీల ప్రకటన తమపై ప్రభావం చూపబోదని ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వం చెబుతోంది.
''ఇమ్రాన్ ప్రభుత్వాన్ని తొలగించేందుకు విపక్షాలు ప్రయత్నించడం ఇది 13వ సారి. ఇలాంటి బెదిరింపులకు మేం భయపడం'' అని బీబీసీతో సమాచార శాఖ మంత్రి ఫవాద్ చౌదరి అన్నారు.
విపక్షాల ప్రకటన తర్వాత ఇమ్రాన్ ఖాన్ సహా పీటీఐ నాయకత్వం, మిత్ర పక్షాల మద్దతును కూడగట్టే ప్రయత్నాలను తీవ్రతరం చేసింది.
అంతే కాకుండా విపరీతంగా పెరిగిపోతున్న ద్రవ్యోల్బణంతో సతమతమవుతోన్న ప్రజలకు రిలీఫ్ ప్యాకేజీని కూడా ప్రకటించారు.
కరెంటు, పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గిస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు. దీనితో పాటు సాంఘిక సంక్షేమ పథకం 'ఎహ్‌సాస్' కింద మరిన్ని రాయితీలు ఇస్తామని హామీ ఇచ్చారు.
ప్రభుత్వం దారుణంగా విఫలమైందని ప్రముఖ మీడియా సంస్థ 'డాన్' కాలమిస్ట్ అరిఫా నూర్ అన్నారు.
"ఈ పోరాటంలో ప్రతిపక్షాలు గెలిచేలా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరు చూస్తుంటే విపక్షాలే గెలుస్తాయనే భావన ప్రజల్లో కలుగుతోంది. విపక్షాలు కేవలం గాల్లోకి బాణాలు వేయట్లేదు. వారు లక్ష్యాన్ని చేధించడంలో సఫలమయ్యేలా ఉన్నారు'' అని అరిఫా చెప్పారు.

ఫిరాయింపుదారులకు ఏమవుతుంది?
రాజ్యాంగంలోని ఆర్టికల్ 63 ప్రకారం, ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం నాలుగు ప్రాథమిక ప్రశ్నలను సుప్రీం కోర్టు ముందుంచింది.
''ఫిరాయింపుదారులు పార్లమెంటరీ సీట్లను కొల్లగొట్టగలరా? పార్టీ మారిన వారిపై అనర్హత వేటు వేస్తే వచ్చే ఎన్నికల్లో వారు పోటీ చేసే అవకాశం ఉంటుందా? ఉండదా?
ఆర్టికల్ 63-ఎ ప్రకారం, ఫార్టీ ఫిరాయించిన ఎంపీ పార్లమెంటు సభ్యత్వానికి జీవితకాలం అనర్హులు అవుతారా? ఒక ఎంపీ, తన పార్టీ విధానానికి వ్యతిరేకంగా ఓటు వేస్తే చెల్లుబాటు అవుతుందా?'' అనే ప్రశ్నల్ని సుప్రీం కోర్టు ముందు ఉంచింది.
అయితే విపక్షాల డిమాండ్ మేరకు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు వీలుగా మార్చి 25న పార్లమెంట్ సమావేశానికి స్పీకర్ పిలుపునిచ్చారు.
అయితే స్పీకర్ నిర్ణయంపై విపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఇది రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చిన 14 రోజుల్లో పార్లమెంట్‌ను సమావేశ పరచాల్సి ఉంటుందని ప్రతిపక్షాలు పేర్కొన్నాయి. ఈ అంశాన్ని కోర్టు ముందుకు తీసుకెళ్లాయి.

ఫొటో సోర్స్, AFP
పరస్పర విరుద్ధ ప్రయోజనాలు
ఇక పాకిస్తాన్ ఆర్మీ, ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం మధ్య సంబంధాలు మునుపటిలా ఉండవని చాలా మంది నిపుణులు నమ్ముతున్నారు. ముఖ్యంగా ఐఎస్ఐ డీజీ నామినేషన్‌ను ఇమ్రాన్ ఖాన్ తిరస్కరించినప్పటి నుంచి ఈ అంశం మరింతగా చర్చల్లో నిలిచింది.
ఈ పదవికి లెఫ్టినెంట్ జనరల్ నదీమ్ అంజుమ్‌ను నియమించడంలో ఇమ్రాన్ ఖాన్ ఆలస్యం చేయడంతో సైన్యానికి, ఆయనకు మధ్య విబేధాలు పెరిగినట్లు ప్రచారం ప్రారంభమైంది. నదీమ్ అంజుమ్‌ను స్వయంగా సైన్యమే సిఫార్సు చేసింది.
ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్తాన్‌లో ఇమ్రాన్ ఖాన్ పాపులారిటీ మసకబారింది. సైన్యంతో కూడా ఆయన సంబంధాలు సరిగా లేనట్లు కనిపిస్తోంది. ఆయనపై దాడికి ఇదే సరైన సమయంగా విపక్షాలు భావిస్తున్నాయి.
''అయితే ప్రతిపక్ష పార్టీల్లో ఐక్యత లేదు. వారికి ఒక ఎజెండా, వ్యూహం లేదు. అందరికీ సొంత ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ప్రయోజనాలు ఒకదానితో ఒకటి ముడిపడట్లేదు'' అని రాజకీయ శాస్త్ర నిపుణుడు సల్మాన్ ఖాన్ అన్నారు.
''అవిశ్వాస తీర్మానం గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. ఇదంతా ప్రజలకు చూపించుకోవడం కోసమే. చిత్తశుద్ధిగా విపక్షాలు ప్రయత్నించడం లేదు. కానీ దీనిపై మీడియాలో జోరుగా ప్రచారం మాత్రం సాగుతోంది'' అని ఆయన అభిప్రాయపడ్డారు.
అరిఫా నూర్ కూడా దీన్ని అంగీకరించారు.
''అవిశ్వాస తీర్మానంపై సందడి గరిష్ట స్థాయికి చేరింది. కానీ లోపల జరిగేదంతా అయోమయంగా ఉంది. ఈ అవిశ్వాస తీర్మానంలో ఎవరిని లక్ష్యంగా చేసుకున్నారు? దీనికి మద్దతుగా ఎవరు ఓటు వేస్తారు? దీని తర్వాత ఏం జరుగనుంది? ఇలాంటి ప్రశ్నలు అడిగినప్పుడు దానిపై కనిపించే ఉత్సాహం అంతా నీరుగారిపోతుంది'' అని ఆమె అన్నారు.
పాకిస్తాన్ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం చాలా కష్టమని ఆమె నమ్ముతున్నారు. కరోనా వైరస్ వేరియంట్ల కంటే పాక్ రాజకీయాలు అనిశ్చితంగా ఉంటాయని ఆమె అన్నారు.
ఇవి కూడా చదవండి:
- గుజరాత్: భగవద్గీతను పాఠ్యాంశంగా పెట్టడం ద్వారా ప్రభుత్వం ఏం కోరుకుంటోంది?
- రష్యన్ బిలియనీర్లకు లండన్ ఎలా స్వర్గధామంగా మారింది, ఆస్తులు లాక్కుంటే ఓలిగార్క్‌లు ఏం చేస్తున్నారు?
- యుక్రెయిన్ యుద్ధం: మరియుపూల్ నగరం రష్యాకు ఎందుకంత కీలకం? 4 ముఖ్య కారణాలు ఇవే..
- బంగ్లాదేశ్ ఇస్కాన్ టెంపుల్: 200 ఏళ్ల పురాతన హిందూ ఆలయంపై దాడి, అసలు కథ ఏంటి?
- ‘కశ్మీర్ ఫైల్స్ కాదు.. అభివృద్ధి ఫైల్స్ మీద చర్చ చేయాలి.. ఈడీ, బీడీ బెదిరింపులకు ఈడ ఎవడూ భయపడడు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












