పాకిస్తాన్: ఎన్నికలకు సిద్ధం కావాలని ప్రజలకు పిలుపునిచ్చిన ప్రధాని ఇమ్రాన్

పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్

ఫొటో సోర్స్, WAKIL KOHSAR/ GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్

పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్... దేశ పార్లమెంట్‌ను రద్దు చేయాల్సిందిగా అధ్యక్షుడికి సిఫారసు చేసినట్లు చెప్పారు.

అంతకుముందు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని డిప్యూటీ స్పీకర్ ఖాసీం ఖాన్ సూరి తోసిపుచ్చారు.

నిజానికి ఆదివారం పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగాల్సి ఉంది. ఓటింగ్‌లో పాల్గొనేందుకు నేషనల్ అసెంబ్లీకి వస్తున్న సభ్యుల సంఖ్య పెరుగుతోందని, కానీ ఇంకా ఇమ్రాన్ ఖాన్ రాలేదని బీబీసీ ప్రతినిధి హుమేరా కంవాల్ తెలిపారు.

హుమేరా చెప్పినదాని ప్రకారం పార్లమెంట్‌లో చాలా సీట్లు ఖాళీగానే ఉన్నాయి.

పాకిస్తాన్ పార్లమెంట్
ఫొటో క్యాప్షన్, పాకిస్తాన్ పార్లమెంట్

అయితే, ఓటింగ్ ప్రారంభాని కంటే ముందే డిప్యూటీ స్పీకర్... అవిశ్వాస తీర్మానాన్ని రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ తిరస్కరించారు. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 5ను ఉల్లంఘిస్తుందని ఆయన పేర్కొన్నారు.

దీని తర్వాత ఇమ్రాన్ ఖాన్ జాతినుద్దేశించి మాట్లాడారు.

ఈ సందర్భంగా పార్లమెంట్‌ను రద్దు చేయాల్సిందిగా దేశాధ్యక్షునిగా లేఖ రాశానని ఆయన తెలిపారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలకు వెళతామని అన్నారు. ప్రజలంతా ఎన్నికలకు సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. దేశ ప్రధానిని నిర్ణయించే హక్కు ప్రజలకు తప్ప మరెవరికీ లేదని అన్నారు.

''అవిశ్వాస తీర్మానాన్ని తోసిపుచ్చడం పట్ల స్పీకర్‌కు ప్రజలందరి తరఫున నేను కృతజ్ఞతలు తెలుపుతున్నా. నిన్నటి నుంచి అందరూ ఆందోళన చెందుతున్నారు. వారందరికీ నేను భయపడొద్దని చెప్పాలనుకున్నా. ఈరోజు స్పీకర్, తనకున్న రాజ్యాంగ అధికారాన్ని ఉపయోగించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత పార్లమెంట్‌ను రద్దు చేయాలనే నిర్ణయాన్ని నేను అధ్యక్షుడి చేతిలో పెట్టాను'' అని ఆయన చెప్పారు.

ఇమ్రాన్ ఖాన్‌

ఫొటో సోర్స్, GHULAM RASOOL

పార్లమెంట్ స్పీకర్‌పై కూడా అవిశ్వాస తీర్మానం సమర్పించిన ప్రతిపక్షం

ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానం ఓటింగ్‌కు ముందు నేషనల్ అసెంబ్లీ స్పీకర్ అసద్ ఖైజర్‌పై కూడా ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని సమర్పించాయి.

జాతీయ అసెంబ్లీలోని 100 మందికి పైగా సభ్యుల ఈ తీర్మానంపై సంతకాలు చేశారు.

నిబంధనల ప్రకారం, జాతీయ అసెంబ్లీ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం సమర్పిస్తే, ఆయన సెషన్‌కు అధ్యక్షత వహించలేరు, వాయిదా వేయలేరు.

దీంతో పార్లమెంటు డిప్యూటీ స్పీకర్ ఖాసిం ఖాన్ సూరి సభకు అధ్యక్షత వహించారు.

పాకిస్తాన్ లో వేగంగా మారిన పరిణామాలు

పాకిస్తాన్ పార్లమెంట్ సెషన్ మార్చి 28న ప్రారంభమైంది. సెషన్ సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి.

ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని ప్రతిపక్ష నేత షాబాజ్ షరీఫ్ అభ్యర్థించారు. దీనికి అనుకూలంగా దిగువ సభకు చెందిన 161 మంది ఎంపీలు ఓట్లు వచ్చాయి.

అనంతరం ఈ తీర్మానంపై చర్చను మార్చి 31న ప్రారంభిస్తామని సభ డిప్యూటీ స్పీకర్ ఖాసీం ఖాన్ సూరి ప్రకటించారు. ఏప్రిల్ 3న ఓటింగ్ జరుగుతుందని చెప్పారు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)