విస్కీ టేస్ట్ దాని వయసు ముదురుతున్న కొద్దీ పెరుగుతుందంటారు... ఏమిటీ 'ఏజింగ్' మహిమ?

విస్కీ గ్లాస్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, వరికూటి రామకృష్ణ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

'విస్కీ ముదురుదైతే ఆ కిక్కే వేరు...'

టేబుల్ కాస్త దూరంగానే ఉన్నా మాటలైతే నాకు స్పష్టంగానే వినిపించాయ్.

తాగే మందులో ముదురు, లేత ఏమిటి? పిచ్చి కాకపోతే అనుకుంటూ మనోడు స్టడీగా ఉన్నాడో లేదో ఓ లుక్కేశా. గురుడు, నార్మల్‌గానే కనిపించాడు.

ఆ తరువాత రెండు మూడేళ్లకు అనుకుంటా, వేలంలో విస్కీ బాటిల్‌ను రూ.50 లక్షలకో 60 లక్షలకో ఎవరో కొన్నారనే వార్తను చూశా.

అరె! లక్షలు పోసి కొనేందుకు అందులో అంతగా ఏముందబ్బా అనుకుంటూ ఆ వార్తను కాస్త చదివితే అర్థమైంది... ఆ విస్కీని 30, 40 ఏళ్ల కిందట తయారు చేశారని.

అప్పుడే తెలిసింది 'ముదురు' అంటే ఏమిటో... ముదురు విస్కీకి ఉన్న విలువ ఏమిటో...

వయసు పెరిగే కొద్దీ విస్కీ రుచి పెరుగుతుందంట. అందుకే విస్కీ ఎంత పాతదైతే రేటు అంత ఎక్కువ.

వైట్ విస్కీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తయారు చేసినప్పుడు విస్కీ చూడటానికి నీళ్ల మాదిరిగానే ఉంటుంది.

పాతబడే కొద్దీ విస్కీ రుచి ఎలా పెరుగుతుంది?

తొలిసారి విస్కీని చూసినప్పుడు దానికి ఆ గోల్డ్ కలర్ ఎలా వచ్చిందా అనుకుంటూ ఆశ్చర్యపోయేవాడిని. అచ్చం బెల్లం నీళ్ల మాదిరిగానో తేనెలాగానో అనిపించేది. కానీ విస్కీని తయారు చేసినప్పుడు ఎటువంటి రంగు ఉండదనే విషయం తరువాత తెలిసింది. దాన్నే వైట్ విస్కీ అంటారు. చూడటానికి నీళ్ల మాదిరిగానే కనిపిస్తుంది.

ఇక రుచి కూడా అంతే. ఏ గింజలతో తయారు చేస్తారో దాదాపుగా అదే రుచి ఉంటుంది. అంటే బార్లీతో తయారు చేస్తే ఆ విస్కీకి బార్లీ మాల్ట్ రుచి వస్తుంది. తయారు చేసిన వెంటనే విస్కీని తాగొచ్చు. కాకపోతే విస్కీ ప్రేమికులు మెచ్చే రుచి, స్మూత్‌నెస్ అప్పుడు దానికి ఉండవు.

కానీ, ఇదే విస్కీ ఓ పదేళ్ల తరువాత బంగారు రంగులోకి మారడంతోపాటు ఒక ప్రత్యేకమైన రుచిని సంతరించుకుంటుంది. మరి ఇది ఎలా సాధ్యం?

బంగారు రంగులో ఉన్న విస్కీ

ఫొటో సోర్స్, Getty Images

రెండు కీలకమైన విషయాలు

ఒకటి... విస్కీని నిల్వ చేసేందుకు వాడే చెక్క పీపా

రెండు... చెక్క పీపాను ఉంచే గది వాతావరణం

ఇలా చెక్క పీపాల్లో విస్కీ నిల్వ ఉన్న కాలంలో దాని రుచి, రంగు, స్మూత్‌నెస్ మారిపోతుంది. ఇలా నిల్వ ఉంచడాన్నే ఏజింగ్ అంటారు.

ఓక్ బ్యారెల్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఓక్‌తో తయారు చేసిన ఇటువంటి బ్యారెల్స్‌లో విస్కీని నిల్వ చేస్తారు.

ఓక్ చేసే మ్యాజిక్

మాములుగా ఓక్ చెట్ల నుంచి తయారు చేసిన బ్యారెల్స్‌లో ఎక్కువగా విస్కీని నిల్వ ఉంచుతారు. నిల్వ చేసే ముందు బ్యారెల్స్‌ లోపల కాల్చడం లేదా వేడి చేస్తారు. కాల్చడం వల్ల లోపల ఏర్పడే నల్లని పొర, విస్కీని ఫిల్టర్ చేస్తుంది. అనవసరమైన ఫ్లేవర్స్‌ను తొలగిస్తుంది. ఫ్రెష్ విస్కీ తాగేందుకు చాలా హార్ష్‌గా ఉంటుంది. విస్కీలోని ఆ హార్ష్‌నెస్‌ను ఓక్ బ్యారెల్ తగ్గించి స్మూత్‌నెస్‌ను పెంచుతుంది. అంటే విస్కీలో ఉండే ఘాటు, మంటను తగ్గిస్తుంది.

ఇక బ్యారెల్ బయట ఉండే వాతావరణం కూడా ముఖ్యమే. బయట ఉండే వేడి, చల్లదనం ఆధారంగానే విస్కీలో ఉండే నీళ్లు, ఆల్కాహాల్ శాతం మారిపోతుంది. వేడి ఎక్కువగా ఉంటే నీళ్ల శాతం తగ్గి ఆల్కాహాల్ శాతం పెరుగుతుంది. చల్లగా ఉంటే నీళ్ల శాతం పెరిగి ఆల్కాహాల్ శాతం తగ్గుతుంది. కాబట్టి సరైన ఉష్ణోగ్రత ఉండేలా చూడటం ఎంతో ముఖ్యం. ఒక్క డిగ్రీ తేడా వచ్చినా అనుకున్న రుచి రాకుండా పోతుంది.

కాలుతున్న ఓక్ బ్యారెల్స్‌

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, లోపల బ్లాక్ కోటింగ్ వచ్చేలా ఓక్ బ్యారెల్స్‌ను కాల్చుతారు.

ఓక్ ఉడ్‌లో కంటికి కనిపించని అతి స్మూక్ష రంధ్రాలుంటాయి. ఈ రంధ్రాల ద్వారా లోపలకు బయటకు ప్రవహించే గాలి వల్ల, బ్యారెల్ గోడలు విస్కీని పీల్చుకోవడం, తిరిగి వదలడం చేస్తుంటాయి. అలాగే చాలా తక్కువ మొత్తంలో ఆక్సిజన్‌ కూడా లోపలకు వస్తుంది. ఆక్సిజన్ వల్ల కొన్ని రకాల రసాయినిక చర్యలు జరుగుతాయి. అంటే కొత్త సమ్మేళనాలు(కాంపౌండ్స్) ఏర్పడి ఫ్రూటీ, క్రీమీ, ఫ్లోరల్ వంటి రుచులను తయారు చేస్తాయి.

అమెరికా బర్బన్ విస్కీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అమెరికా బర్బన్ విస్కీ

వెనీలా... కోకోనట్ ఫ్లేవర్...

బ్యారెల్‌లో ఉన్న విస్కీలో ఓక్ ఉడ్‌లోని రసాలు కలవడం వల్ల అందులో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. నిల్వ ఉండే క్రమంలో ఉడ్‌లోని రకరకాల సుగర్లను విస్కీ పీల్చుకుంటుంది. తద్వారా వెనీలా, కోకోనట్ వంటి ఫ్లేవర్స్‌ను విస్కీ సంతరించుకుంటుంది.

అమెరికాలో పెరిగిన ఓక్ చెట్లతో తయారు చేసిన బ్యారెల్స్‌లో నిల్వ ఉంచితే కోకోనట్ ఫ్లేవర్ అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఓక్ చెట్లు ఎక్కడ పెరిగాయనేదాని మీద కూడా ఆధారపడి విస్కీ రుచి మారుతుంది. యూరప్‌లో పెరిగిన ఓక్ చెట్లలో టానిన్స్ ఎక్కువగా ఉంటాయి. టానిన్స్ ఎక్కువగా ఉంటే విస్కీ హాట్‌నెస్ పెరుగుతుంది.

స్కాచ్ విస్కీ

ఫొటో సోర్స్, Getty Images

అమెరికా బర్బన్‌ కోసం కొత్తగా తయారు చేసిన ఓక్ బ్యారెల్స్‌ను వాడతారు. బర్బన్ నింపేముందు బ్యారెల్స్ లోపల బాగా కాలుస్తారు. బర్బన్ ఖాళీ చేసిన బ్యారెల్స్‌ను స్కాట్లాండ్‌లోని విస్కీ తయారీ కంపెనీలు కొనుగోలు చేస్తుంటాయి. అంటే స్కాచ్ విస్కీ కోసం కొత్త ఓక్ బ్యారెల్స్‌ను వినియోగించరు. అప్పటికే వాడేసిన బ్యారెల్స్‌ను ఉపయోగిస్తారు.

బర్బన్, షెర్రీ, వైన్ వంటి వాటిని ఏజింగ్ చేయడం వల్ల ఓక్ బ్యారెల్స్‌ వాటి ఫ్లేవర్‌ను కొంత తీసుకుంటాయి. తిరిగి ఆ బ్యారెల్స్‌లో స్కాచ్ విస్కీని నిల్వ చేయడం వల్ల ఓక్, బర్బన్, షెర్రీల ఫ్లేవర్స్ కలిసి స్కాచ్ విస్కీకి సరికొత్త రుచిని ఇస్తాయి.

బ్యారెల్‌లోని విస్కీని పరిశీలిస్తున్న వ్యక్తి

ఫొటో సోర్స్, Getty Images

ఎంత కాలం నిల్వ ఉండాలి?

మాములుగా అయితే రెండు మూడేళ్లు నిల్వ ఉన్న తరువాత కూడా విస్కీని తాగొచ్చు. అయితే సరైన రుచి, వాసన, ఫ్లేవర్, టెక్చర్, స్మూత్‌నెస్ రావాలంటే ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉంచాలన్నది నిపుణుల మాట. ఆల్కాహాల్ నిపుణుడు క్యాంపర్ ఇంగ్లిష్ ప్రకారం, అమెరికా బర్బన్ అయితే 4 నుంచి 9 ఏళ్లు అనేది మంచి కాలం.

స్కాట్లాండ్‌లో అయితే మంచి విస్కీ తయారు కావడానికి 10-18 ఏళ్లు పడుతుంది. అమెరికా ఓక్‌తో పోలిస్తే యూరప్‌లోని ఓక్ ఉడ్‌కు సాంద్రత ఎక్కువగా ఉంటుంది. తద్వారా బ్యారెల్‌లోని విస్కీకి ఆక్సిజన్ సరఫరా చాలా తక్కువగా నెమ్మదిగా జరుగుతుంది. అందువల్ల స్కాట్లాండ్‌లో ఏజింగ్ ప్రాసెస్‌ అనేది ఎక్కువ సమయం తీసుకుంటుంది.

12 కోట్లు పలికిన 1926 నాటి విస్కీ

ఫొటో సోర్స్, Sothebys.com

ఫొటో క్యాప్షన్, 1926లో తయారు చేసిన ఈ విస్కీ బాటిల్ వేలంలో రూ.12 కోట్లకు పైగా పలికింది.

ఓల్డ్ ఈజ్ గోల్డ్

వయసు ముదిరిన విస్కీ నిజంగానే గోల్డ్ వంటిదే. అత్యంత ఖరీదైన విస్కీగా గిన్నిస్ రికార్డ్ ఉన్న 'ద మెకలాన్ ఫైన్ అండ్ రేర్-1926' ధర 18,11,250 డాలర్లు. 1926లో తయారు చేసిన దీన్ని 2019లో అక్టోబరు 24న వేలం వేసినప్పుడు పలికిన ధర ఇది. మన రూపాయల్లో చెప్పాలంటే రూ.12 కోట్లకు పైనే.

వీడియో క్యాప్షన్, సీసీ కెమెరా నిఘా లేని రోజుల్లో ఓ డిస్టిలరీని ఎలా కాపాడారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)